భారత్ మా ఫేస్బుక్
ఈ దేశం లేకుండా ప్రపంచంతో అనుసంధానం సాధ్యం కాదు
♦ భారత్‌లో మా వినియోగదారులు13 కోట్లు
♦ మెరుగైన విద్య కోసం ప్రత్యేక పాఠశాలలు ఇంటర్నెట్తో పేదరికాన్ని పారదోలవచ్చు
♦ క్యాండీక్రష్ రిక్వెస్ట్‌లకు త్వరలో చెక్ నెట్ న్యూట్రాలిటీకి మద్దతు
♦ ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ ఢిల్లీ ఐఐటీ విద్యార్థులతో మాటామంతీ
న్యూఢిల్లీ: ‘‘ప్రపంచంలోని ప్రతి ఒక్కరితో కనెక్ట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పుడు భారత్ లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భాగస్వామ్యం లేకుండా అది సాధ్యపడదు. ఫేస్బుక్ భారత ప్రజలతో మమేకం కావటం అత్యంత ప్రధానం. భారత దేశమే మా ‘ఫేస్ బుక్’. ప్రపంచంలో ఈ దేశమే మాకు పెద్ద మార్కెట్’’ అని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. భారత భూభాగంపై అడుగుపెట్టడం తనకు ఎంతో ఉత్కంఠ కలిగించిందని.. ఇక్కడ అంతులేని శక్తి దాగుందని మార్క్ భావోద్వేగంతో చెప్పారు. భారత పర్యటనలో భాగంగా బుధవారం ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ టౌన్హాల్లో వెయ్యిమందికి పైగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
విద్యార్థుల ప్రశ్నలకు జవాబులిచ్చారు. భారత్‌లో 13 కోట్ల మందికి పైగా ఫేస్బుక్ వినియోగదారులున్నారని, వీరిలో ఎక్కువమంది తమ అనుబంధ సంస్థ వాట్సప్‌కు కూడా కనెక్ట్ అయి ఉండటం అద్భుతమని అన్నారు... అయితే నాణేనికి మరోవైపు చూస్తే, భారత్‌లో ఇంకా చాలామందికి ఇంటర్నెట్ సదుపాయం లేదని ఆయన పేర్కొన్నారు. ఇంటర్నెట్ సదుపాయం ద్వారా విద్య, ఆరోగ్య సమాచారాలను తేలిగ్గా అందించటమే కాకుండా.. ఉద్యోగావకాశాలు కల్పించవచ్చని అన్నారు. తమ లక్ష్యం ఈ దిశగానే ముందుకు సాగుతోందన్నారు. ఇటీవల అఫ్ఘానిస్తాన్‌లో భూకంపం వచ్చినప్పుడు 30లక్షల మంది తాము సురక్షితంగా ఉన్నట్లు సందేశమివ్వటానికి ఫేస్బుక్ సరైన మాధ్యమంగా ఉపయోగపడిందన్నారు.
తప్పిపోయిన పిల్లలను అన్వేషించటానికి ఫేస్బుక్ ప్రత్యేకంగా కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతానికి అమెరికా, కెనడాలలో ఏఎంబీఈఆర్ అలర్ట్ పేరుతో ఫేస్బుక్లో ఫీచర్ నిర్వహిస్తున్నామన్నారు. ఎవరైనా పిల్లలు తప్పిపోయినప్పుడు వారి వివరాలు, ఫొటో, వార్త వంటివి పోస్ట్ చేస్తామని..ఈ చొరవ వల్ల పిల్లలు తొందరగా దొరికే అవకాశాలున్నాయన్నారు. ఇంటర్నెట్ యాక్సెస్‌తో పేద విద్యార్థులకు మెరుగైన విద్యను అందించేందుకు ఆఫ్రికాలో కొత్త తరహా పాఠశాలల కోసం పెట్టుబడులు పెడుతున్నామని.. త్వరలోనే భారత్‌లో కూడా ఈ పాఠశాలలను తీసుకువస్తామని జుకర్‌బర్గ్ అన్నారు.
భారత్ .. కీలక మార్కెట్...
ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ ప్రాజెక్టు ప్రస్తుతం 24 పైగా దేశాల్లో నిర్వహిస్తున్నామని, దీని వల్ల కోటిన్నర పైగా ప్రజలకు నెట్ అందుబాటులోకి వచ్చిందని జుకర్‌బర్గ్ వివరించారు. భారత్‌లోను 10 లక్షల మంది పైచిలుకు ప్రజలు తమ ప్రాజెక్టు ద్వారా నెట్‌ను వినియోగించగలుగుతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల మందికి ఇంటర్నెట్ను చేరువ చేయాలన్న తమ లక్ష్యంలో భారత్ పాత్ర చాలా కీలకమని వివరించారు.
ఆయన ఇంకా ఏమ న్నా రంటే..
ప్రపంచంలో అన్ని స్మారక భవనాలూ యుద్ధాల విజయ చిహ్నాలుగా నిర్మించినవే. తాజ్‌మహల్ ఒక్కటే ప్రేమకు ప్రతిరూపంగా నిర్మించింది. ఫొటోలలో చూసిన దానికంటే తాజ్‌మహల్ ఎంతో అందంగా ఉంది.
► రానున్న 5-10 సంవత్సరాలలో కంప్యూటర్లు ప్రపంచంలో తమ చుట్టూ ఉన్న వాటిని గుర్తిస్తాయి.. భాషల్ని మరింత మెరుగ్గా అనువదిస్తాయి.. అర్థం చేసుకుంటాయి. రానున్న కాలంలో ప్రధాన సమాచార మార్పిడి మాధ్యమంగా వీడియో మాత్రమే ఉంటుంది.
► త్వరలోనే మాకు కూతురు పుడుతుందని భావిస్తున్నాం. నేను, నా కుటుంబం అంతా అక్కడ ఉండి అమె తొలి అడుగులను చూడాలనుకుంటున్నాం.. ఇదే తరహాలో త్వరలోనే నిజ జీవితానికి సంబంధించిన 3డీ చిత్రాలను షేర్ చేసుకునే ప్రోగాంను డెవలప్ చేస్తున్నాం.
► పాఠశాలలు, ఆసుపత్రులు అందుబాటులో లేనిచోట మా టెక్నాలజీ ద్వారా సహాయం చేసేందుకు ప్రయత్నిస్తాం.
నెట్ న్యూట్రాలిటీకే మా ఓటు..
నెట్ న్యూట్రాలిటీకి తమ కంపెనీ కట్టుబడి ఉందని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ స్పష్టం చేశారు. అయితే, జీరో-రేటింగ్ ప్లాన్లు కూడా ఉండాల్సిందేనని అభిప్రాయపడ్డారు. నెట్ న్యూట్రాలిటీపై ఫేస్బుక్ వైఖరిపై వచ్చిన ప్రశ్నలపై స్పందిస్తూ.. ‘ఇది చాలా కీలకమైన సూత్రం. మేం ఈ నిబంధనను మా కార్యాలయంలో కూడా పాటిస్తాం. కొన్ని ప్రాథమిక సూత్రాలు పాటించే డెవలపర్లు ... దేన్నైనా స్వేచ్ఛగా రూపొందించేలా మా సొంత కార్యాలయంలో ఓపెన్ ప్లాట్‌ఫాం అందుబాటులో ఉంటుంది’ అని ఆయన చెప్పారు. అయితే, ప్రస్తుతం నెట్ న్యూట్రాలిటీ కోసం పట్టుబడుతున్న వారిలో చాలా మందికి ఇంటర్నెట్ అందుబాటులోనే ఉందని ఆయన చెప్పారు. కానీ, నెట్ అందుబాటులో లేని మిగతా వారి పరిస్థితి గురించి కూడా ఆలోచించాల్సిన నైతిక బాధ్యత అందరిపైనా ఉందన్నారు. దీంతో పాటు జీరో రేటింగ్ పథకాలు ఉండాలనీ ఆయన అన్నారు.
న్యూట్రాలిటీ ఇదీ.. ఇంటర్నెట్ వెబ్సైట్లను అందుబాటులో ఉంచడంలో ఏ కొన్నింటిపైనో పక్షపాతం చూపకుండా టెల్కోలు తటస్థంగా వ్యవహరించాలన్నది నెట్ న్యూట్రాలిటీ సూత్రం. నెట్‌ను అందరికీ అందుబాటులోకి తెచ్చే పేరుతో కొన్ని టెలికం కంపెనీల భాగస్వామ్యంతో ఫేస్బుక్ తలపెట్టిన ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ ప్రాజెక్టు ఈ సూత్రాన్ని ఉల్లంఘిస్తోందని విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
► ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తే ప్రతి పది మందిలో ఒకరికి ఉద్యోగావకాశం లభిస్తుంది. తద్వారా అతను పేదరికం నుంచి బయటపడతాడు. అతని జీవితం మెరుగుపడుతుంది. భారత్‌లో ఇందుకు అవకాశాలు చాలా ఉన్నాయి.
► {పపంచంలో 400 కోట్ల మందికి ఇంటర్నెట్ సదుపాయం లేదు. ఇందుకు ప్రధాన కారణాలు నెట్వర్క్ అందుబాటులోకి రాకపోవటం, చైతన్యం లేకపోవటం.
► మీరు తప్పులు చేశామని భయపడకండి. మంచి మీద దృష్టి పెట్టండి.. అది మీకు శక్తినిస్తుంది. మన విజయం ఇతరులకు సహాయపడటంలోనే ఉంది.
► క్యాండీ క్రష్ గేమ్ ఆడాలంటూ ఫేస్బుక్ ద్వారా వచ్చే ఇన్విటేషన్ల బారి నుంచి తప్పించుకోవటానికి త్వరలోనే పరిష్కారం వెతుకుతాం. దీనిపై కృషి చేయాలని మా ప్రోగ్రామ్ డెవలపర్లను కోరాను.