మీరు ఇక్కడకు బోట్లలో వచ్చారా?
తాను ఎన్నడూ చూడనంత అతి భారీ వర్షాన్ని చూసిన అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ.. ఢిల్లీలో పలు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉన్నా, తన పర్యటనలను చాలావరకు రద్దుచేసుకున్నారు. ఒక్క ఐఐటీలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమానికి మాత్రం కష్టమ్మీద ఆయన వెళ్లగలిగారు. మామూలుగా అయితే అందరినీ ఎలా ఉన్నారనో.. మిమ్మల్నందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉందనో పలకరిస్తారు. కానీ ఆయన మాత్రం.. ''మీరు ఇక్కడికి ఎలా వచ్చారు.. బోట్లలో వచ్చారా'' అని అడిగారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో రోడ్ల మీద పరిస్థితి చూసిన ఆయనకు ఈ అనుమానం వచ్చింది. జాన్ కెర్రీ ఆ ప్రశ్న అడగ్గానే ఒక్కసారిగా సమావేశం హాల్లో నవ్వులు విరబూశాయి.
అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేయడం భారత్, అమెరికా దేశాలకు మాత్రమే తెలిసిన విద్య అని జాన్ కెర్రీ చెప్పారు. ఆ తర్వాత ఆయన భారత - అమెరికా సంబంధాలు, ఉగ్రవాదాన్ని అణిచేయడం, వాణిజ్య సంబంధాలు.. ఇలా పలు అంశాలపై తన అభిప్రాయాలను విద్యార్థులతో పంచుకున్నారు. పలు దేశాలు బలప్రయోగంతోనే సమస్యలను పరిష్కరించాలని చూస్తున్నాయని... కానీ అమెరికా, భారత దేశాలు మాత్రం అంతర్జాతీయ నిబంధనలకు లోబడి వాటి ద్వారానే ముందుకు వెళ్తున్నాయని అన్నారు.
ఉగ్రవాదానికి మూలాలు ఏంటో వెలికితీయాలని, వేర్వేరు కారణాలను మనం అర్థం చేసుకోవాలని చెప్పారు. ఒక్కో దేశానికి, ప్రాంతానికి మధ్య కారణాలు వేర్వేరుగా ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే అవినీతిపై కూడా పోరాడి దాన్ని అరికట్టాలని ఐఐటీ విద్యార్థులకు సూచించారు. ఉగ్రవాదంపై పోరులో ఏ ఒక్క దేశం విజయం సాధించలేదని అమెరికా విదేశాంగ మంత్రి అన్నారు. భారత ప్రభుత్వం జీఎస్టీ బిల్లుతో పాటు కొత్త దివాలా చట్టాలను ఆమోదించిందని, విదేశీ పెట్టుబడుల నియంత్రణలలో మార్పులు చేసిందని.. వచ్చే సంవత్సరం భారతదేశం సంయుక్తంగా పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తుందని, దీనివల్ల భారతీయ వ్యాపారుల సత్తా అందరికీ తెలుస్తుందని ఆయన అన్నారు.