
రెండు రోజుల్లో 38 మంది మృతి
పట్నా: బిహార్‌లో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు, పిడుగుపాటు ఘటనలు 38 మందిని బలి తీసుకున్నాయి. బుధవారం 13 మంది చనిపోగా, గురువారం మరో 25 మంది మృత్యువాతపడ్డారు. వీరిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. పిడుగులు పడటంతోపాటు చెట్లు, ఇళ్లు, కరెంటు స్తంభాలు కూలిన ఘటనల్లో అత్యధికంగా నలందలో 18 మంది చనిపోయారు. సివాన్‌లో ఇద్దరు, దర్భంగా, బెగుసరాయ్, కటిహార్, భాగల్పూర్, జెహానాబాద్‌లలో ఒక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.
క్షతగాత్రులైన మరో 11 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం పిడుగులు పడిన ఘటనల్లో నాలుగు జిల్లాల్లో కలిపి 13 మంది చనిపోయారని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మృతుల కుటుంబాలకు సీఎం నితీశ్‌కుమార్ సానుభూతి తెలిపారు. రూ.4 లక్షల చొప్పున వీరి కుటుంబాలకు సాయం అందజేస్తామని ప్రకటించారు. బిహార్‌లో 38 జిల్లాలకుగాను 24 జిల్లాలకు యెల్లో అలర్ట్, 8 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ వాతావరణ శాఖ ప్రకటించింది. శుక్ర, శనివారాల్లో భారీ వర్షాలు కూడా కురిసే అవకాశముందని తెలిపింది.