deaths increased
-
మయన్మార్ వరదల్లో... 236 మంది మృతి
నైపిడావ్: మయన్మార్‌లోని యాగీ తుఫాను విలయం కొనసాగుతూనే ఉంది. దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వాటి ధాటికి ఇప్పటిదాకా ఏకంగా 236 మంది మృతి చెందారని ప్రభుత్వ సంస్థ గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ మంగళవారం వెల్లడించింది. ఈ సంఖ్య పెరగవచ్చని ఐరాస మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఓసీహెచ్ ఏ) పేర్కొంది. ‘‘77 మంది గల్లంతయ్యారు. కనీసం 6 లక్షల మందికి పైగా వరదల బారిన పడ్డారు’’ అని ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ చైనా, వియత్నాం, లావోస్, మయన్మార్‌లో గత వారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర వియత్నాంలో ఇప్పటికే వందలాది మంది మరణించినట్లు నిర్ధారించారు. మయన్మార్‌లో రాజధాని నైపిడావ్, సెంట్రల్ మాండలే, కయా, కయిన్, షాన్ స్టేట్స్ సహా కనీసం తొమ్మిది ప్రాంతాలు, రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేశాయి. 2023లో మోచా తుఫాను వేళ అంతర్జాతీయ సాయాన్ని తిరస్కరించిన సైనిక పాలకులు ఇప్పుడు మాత్రం సాయానికి విజ్ఞప్తి చేస్తున్నారు.సైనిక ప్రభుత్వంతో సమస్య ఆహారం, తాగునీరు, మందులు, బట్టలు, ఆశ్రయం మయన్మార్‌కు అత్యవసరమని ఓసీహెచ్ఏ పేర్కొంది. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, అస్థిరమైన టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని తెలిపింది. పొరుగు దేశాల సాయం బాధితులకు అందాలంటే సైన్యం పౌర సమాజంతో కలిసి పని చేయడం ముఖ్యమని అంతర్జాతీయ మానవ హక్కుల నిపుణుల స్వతంత్ర సమూహం ఏఎస్ఏసీ–ఎం తెలిపింది. కానీ మెజారిటీ ప్రజలకు సాయమందేలా చూడాలనే ఉద్దేశం సైనిక ప్రభుత్వానికి లేదని ఒక ప్రకటనలో ఆక్షేపించింది. సైన్యం దేశంలో మానవతా సంక్షోభాన్ని సృష్టించిందని, ప్రజలను గాలికొదిలి సొంత సైనిక, రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్తోందని ఆరోపించింది. నిధుల సమస్యతో కూడా సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయని ఓసీహెచ్ఏ పేర్కొంది. -
పేజర్లే బాంబులై...
బీరూట్: ఇజ్రాయెల్‌కు తమ ఆనుపానులు చిక్కొద్దనే ఉద్దేశంతో వాడుతున్న పేజర్లు చివరికి హెజ్బొల్లా మిలిటెంట్ల ప్రాణాలకే ముప్పు తెచి్చపెట్టాయి. మంగళవారం దేశంలో పలు ప్రాంతాల్లో వేలాది పేజర్లు ఉన్నపళాన పేలిపోయాయి. ఈ వింత పేలుళ్లలో కనీసం 2,800 మందికి పైగా గాయపడ్డారు. చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ‘‘కనీసం 200 మందికి పైగా ప్రాణాలతో పోరాడుతున్నారు. ఇప్పటిదాకా 9 మంది మృత్యువాత పడ్డారు’’ అని ఆరోగ్య మంత్రి ఫిరాస్ అబియద్ తెలిపారు. పేలుళ్లు జరిగిన ప్రాంతాలన్నీ హెజ్బొల్లా కంచుకోటలే. రాజధాని బీరూట్‌లో పలుచోట్ల జనం తమ చేతులు, ప్యాంటు జేబులు, బెల్టుల్లోని పేజర్లు పేలి గాయాలపాలవుతున్న వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. ఆస్పత్రుల్లో ఎ మర్జెన్సీ వార్డులన్నీ క్షతగాత్రులతో నిండిపోతున్నట్టు స్థానిక ఏపీ ఫొటోగ్రాఫర్లు తెలిపారు. ప్రధానంగా నడుము, కాళ్లకు గాయాలైనట్టు చెప్పారు. లెబనాన్‌లోని తమ రాయబారి కూడా పేజర్ పేలి గాయపడ్డ ట్టు ఇరాన్ ధ్రువీకరించింది. సిరియాలోనూ పేజర్ పేలుళ్లు జరిగాయి. ప్రతీకారం తప్పదు: హెజ్బొల్లా ఇది కచి్చతంగా ఇజ్రాయెల్ పనేనని హెజ్బొల్లా మండిపడింది. ప్రతీ కారం తప్పదంటూ ప్రకటన విడుదల చేసింది. మిలిటెంట్లు వాడుతున్న పేజర్లనే ఇజ్రాయెల్ వారిపైకి ఆయుధాలుగా మార్చి ప్రయోగించిందని ఏపీ అభిప్రాయపడింది. అత్యాధునిక టెక్నాలజీ సాయంతో అవి ఏకకాలంలో పేలేలా చేసిందని చెప్పుకొచి్చంది. దీనిపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. సెల్ ఫోన్లు వాడితే తమ కదలికలను ఇజ్రాయెల్ కనిపెడుతుందనే భయంతో వాటి వాడకాన్ని హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా గతంలోనే ఆదేశించారు. దాంతో కమ్యూనికేషన్ కోసం మిలిటెంట్లు పేజర్లు వాడుతున్నారు. ఆ క్రమంలో ఇటీవల కొనుగోలు చేసిన కొత్త బ్రాండ్ పేజర్లే పేలాయని హెజ్బొల్లా ప్రతినిధి చెప్పుకొచ్చారు. ‘‘అవి ముందుగా వేడెక్కాయి. కాసేపటికే పేలిపోయాయి. వాటిలోని లిథియం బ్యాటరీలే కొంపముంచినట్టున్నాయి’’ అంటూ వాపోయారు. శత్రువు పని పట్టడంలో ఆరితేరిన ఇజ్రాయెల్ గూఢచారి సంస్థ మొసాద్ ఇలా వినూత్నంగా ప్లాన్ చేసిందన్న వ్యాఖ్యలు విని్పస్తున్నాయి. -
బ్రెజిల్లో కూలిన విమానం.. 62 మంది మృత్యువాత!
సావో పౌలో: బ్రెజిల్‌లోని సావో పౌలో రాష్ట్రంలో శుక్రవారం విమానం కుప్పకూలిన ఘటనలో అందులోని మొత్తం 62 మంది ప్రయాణికులు చనిపోయారు. సావో పౌలో అంతర్జాతీయ విమానం వైపు వెళ్తున్న ఆ విమానం విన్హెడో నగరంలోని జనసమ్మర్ధం ఉన్న ప్రాంతంపై కూలింది. విమానం శిథిలాల నుంచి పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగ వెలువడుతున్న దృశ్యాలను టీవీలు ప్రసారం చేశాయి. ఓ విమానం నిట్టనిలువునా గిరికీలు తిరుగుతూ కూలడాన్ని, ఆ వెంటనే ఆ ప్రాంతంలో మంటలు ఎగసిపడటాన్ని చూపించాయి. ఘటనలో విమానంలో ఉన్న 58 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది మృతి చెంది ఉంటారని భావిస్తున్నట్లు బ్రెజిల్ అధ్యక్షుడు లులా డసిల్వా పేర్కొన్నారు. మృతులకు సంతాపంగా ఒక నిమిషం మౌనం పాటించాలని దేశ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ఫైర్ సిబ్బందితోపాటు మిలటరీ పోలీసులు, పౌర రక్షణ అధికారులు విన్హెడోని ఘటనా ప్రాంతంలో రక్షణ, సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
Wayanad Landslides: ఆగని మరణ మృదంగం
వయనాడ్(కేరళ): కనీవిని ఎరుగని పెను విషాదం నుంచి కేరళ ఇంకా తేరుకోలేదు. మరుభూమిలా మారిన తమ సొంత భూమి నుంచి బయటకు తీస్తున్న ఆప్తుల పార్ధివదేహాలను చూసిన బంధువులు, స్నేహితుల ఆక్రందనలతో ఆ ప్రాంతాలు మార్మోగుతున్నాయి. ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ కుగ్రామాల్లో ఇప్పటిదాకా మృతిచెందిన వారి సంఖ్య తాజాగా 289కి పెరిగింది. ఇంకా 200 మందికిపైగా స్థానికుల జాడ గల్లంతైంది. కాలంతోపోటీపడుతూ సైన్యం, ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్‌గార్డ్, పోలీసు, స్థానిక యంత్రాంగం ముమ్మర గాలింపు, సహాయక చర్యలు చేపడుతున్నారు. అయితే భీతావహంగా మారిన అక్కడి పరిసరాలు సహాయక చర్యలకు పెద్ద అవరోధంగా తయారయ్యాయి. కూలిన వంతెనలు, కొట్టుకుపోయిన రోడ్లు, కొట్టుకొచ్చిన పెద్దపెద్ద బండరాళ్లు, బురదమయమై నేల, కూలిన చెట్లు, వరద ప్రవాహం, భారీ వర్షం మధ్య సహాయక చర్యలు కొనసాగించడం అక్కడి బృందాలకు పెద్ద సవాల్‌గా మారింది. కాగా, ఇప్పటివరకు 91 శిబిరాలకు 9,328 మందిని తరలించామని కేరళ రెవిన్యూ మంత్రి కె.రాజన్ చెప్పారు. 225 మంది ఆస్పత్రుల్లో చేరగా 96 మందికి చికిత్స కొనసాగుతోంది.ఇది జాతి విపత్తు: రాహుల్గతంలో సొంత నియోజకవర్గమైన వయనాడ్‌లో జరిగిన ఈ ఘోర విపత్తు చూసి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చలించిపోయారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్, ప్రియాంకా గాంధీ కేరళకు వచ్చారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో వర్షంలోనే పర్యటించారు. తర్వాత మేప్పాడిలోని ఆస్పత్రుల్లో క్షతగాత్రులను, సహాయక శిబిరాల్లో బాధితుల బంధువులను కలిసి పరామర్శించారు. ‘‘ఇది వయనాడ్, కేరళలో భారీ విషాదం నింపింది. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందాల్సిందే. కుటుంబసభ్యులు, సొంతిళ్లను కోల్పోయిన స్థానికులను చూస్తుంటే మాటలు రావడం లేదు. సర్వం కోల్పోయిన వారిని ఎలా ఓదార్చాలో, వారికెలా ధైర్యం చెప్పాలో తెలీడం లేదు. ఇది జాతీయ విపత్తు’ అని రాహుల్ అన్నారు. ‘‘ ఇంతటి మహా విషాదాన్ని చూస్తుంటే మా నాన్న చనిపోయిన సందర్భం గుర్తొస్తోంది. అయితే వీళ్లు తమ నాన్నను మాత్రమే కాదు.. మొత్తం కుటుంబాన్నే కోల్పోయారు. నేను బాధపడుతున్నదానికంటే అంతులేని విషాదం వీరి జీవితాల్లో ఆవహించింది. వయనాడ్ బాధితులకు అందరూ అండగా నిలబడటం గర్వించాల్సిన విషయం. దేశ ప్రజలు బాధితులకు ఆపన్నహస్తం అందిస్తారు’ అని రాహుల్ అన్నారు.పారిపోదామనుకున్నా: వైద్యురాలి ఆవేదనధైర్యంగా పోస్ట్ మార్టమ్ చేసే వైద్యురాలు సైతం మృతదేహాలు ఛి ద్రమైన తీరు చూసి డాక్టర్ మనసు కకావికలమైన ఘటన వయనాడ్‌లోని స్థా నిక ఆస్పత్రిలో చోటు చేసుకుంది. ఇంతటి హృదయవిదారక దృశ్యాన్ని ఏనాడూ చూడలేదని బాధి తుల మృతదేహాలకు పోస్ట్ మార్టమ్ చేసిన ప్రభుత్వ వైద్యురాలు గద్గద స్వరంతో చెప్పారు. ‘‘ ఎన్నో రకాల పోస్ట్‌మార్టమ్‌లు చేశాగానీ ఇలాంటివి ఇదే మొదలు. ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న వైద్యులు శవపరీక్ష సమయంలో గుండెనిబ్బరంతో ఉంటారు. కానీ భారీ బండరాళ్లు పడిన ధాటికి దెబ్బతిన్న మృతదేహాలను చూశాక నాలో స్థైర్యం పోయింది. కొన్ని మృతదేహాలు పూర్తిగా చితికిపోయాయి. ఒకదానివెంట మరోటి తెస్తూనే ఉన్నారు. ఎక్కువ మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా రూపు కోల్పోయాయి. ఒక ఏడాది చిన్నారి మృతదేహం దారుణంగా దెబ్బతింది. ఇక నా వల్ల కాదు.. క్షతగాత్రుల సహాయక శిబిరానికి పారిపోదామనుకున్నా. కానీ ఇంకోదారిలేక వృత్తిధర్మం పాటిస్తూ 18 మృతదేహాలకు పోస్ట్‌మార్టమ్ చేశా. తర్వాత కేరళలోని వేర్వేరు ప్రాంతాల నుంచి సర్జన్లు వచ్చారు. రాత్రి 11.30కల్లా 93 పోస్ట్‌మార్టమ్‌లు పూర్తిచేశాం. ఈ ఘటనను జీవితంలో మర్చిపోను’ అని వైద్యురాలు తన అనుభవాన్ని చెప్పారు.కదిలొచ్చిన తల్లి హృదయంతల్లులను కోల్పోయిన పసిపిల్లలు పాల కోసం గుక్కపెట్టి ఏడుస్తున్న దృశ్యాలను చూసిన ఒక తల్లి అనుకున్న తడవుగా వయనాడ్‌కు పయనమైంది. నాలుగు నెలల బిడ్డకు తల్లి అయిన ఆమె విషాదవార్త తెలియగానే వయనాడ్‌కు భర్త, పిల్లలతో కలిసి బయల్దేరారు. సెంట్రల్ కేరళలోని ఇడుక్కి నుంచి వస్తున్న ఆమెను మీడియా పలకరించింది. ‘‘ నాకూ చంటిబిడ్డ ఉంది. తల్లిపాల కోసం బిడ్డపడే ఆరాటం నాకు తెలుసు. అందుకే నా చనుబాలు ఇచ్చి అక్కడి అనాథలైన పసిబిడ్డల ఆకలి తీరుస్తా’ అని ఆమె అన్నారు. కాగా, కేరళ బాధితులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ తన సంతాప సందేశం పంపించారు. అవిశ్రాంతంగా సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్మీని ఆయన అభినందించారు. -
Wayanad: బురద వరద ముంచేసింది
వయనాడ్ (కేరళ): ఘోర కలి. మాటలకందని విషాదం. కేరళ చరిత్రలో కనీ వినీ ఎరగని ప్రకృతి విలయం. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు కొండ ప్రాంతమైన వయనాడ్ జిల్లాలో మహోత్పాతానికి కారణమయ్యాయి. అక్కడి మెప్పడి ప్రాంతంపైకి మృత్యువు కొండచరియల రూపంలో ముంచుకొచి్చంది. సోమవారం అర్ధరాత్రి దాటాక ఆ ప్రాంతమంతటా భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వెల్లువెత్తిన బురద, ప్రవాహం ఊళ్లకు ఊళ్లనే ముంచెత్తాయి. గ్రామాలతో పాటు సహాయ శిబిరాలు కూడా బురద ప్రవాహంలో గల్లంతయ్యాయి. ఎటుచూసినా అంతులేని బురదే కప్పేసింది. దాంతో గాఢ నిద్రలో ఉన్న వందలాది మంది తప్పించుకునే అవకాశం కూడా లేక నిస్సహాయంగా శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. బురద, మట్టి దిబ్బల కింద సమాధైపోయారు. కళ్లు తిప్పుకోనివ్వనంత అందంగా ఉండే మెప్పడి ప్రాంతమంతా క్షణాల వ్యవధిలో శవాల దిబ్బగా మారిపోయింది. ఇప్పటిదాకా 123 మృతదేహాలను వెలికితీశారు. వాటిలో చాలావరకు సమీపంలోని నదుల్లోకి కొట్టొకొచ్చినవే. ఏ శవాన్ని చూసినా కాళ్లు చేతులు తెగిపోయి కని్పంచడం బీభత్స తీవ్రతను కళ్లకు కడుతోంది. ప్రమాద స్థలం పొడవునా నిండిపోయిన బురద ప్రవాహాన్ని, మట్టి దిబ్బలను తొలగిస్తే వందల్లో శవాలు బయట పడతాయని చెబుతున్నారు. మృతుల్లో స్థానికులతో పాటు ఉత్తరాది నుంచి పొట్ట చేత పట్టుకుని వచి్చన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారని భావిస్తున్నారు. సమీపంలోని టీ ఎస్టేట్‌లో పని చేస్తున్న 600 మంది వలస కూలీల జాడ తెలియడం లేదు. వారంతా విలయానికి బలై ఉంటారంటున్నారు. నడి రాత్రి ఘోర కలి... మెప్పడి ప్రాంతంలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కొండ ప్రాంతమంతా తడిసీ తడిసీ వదులుగా మారిపోయింది. అర్ధరాత్రి వేళ కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో వరద, బురద వెల్లువెత్తాయి. వాటి ప్రవాహ మార్గంలో ఉన్న ముండక్కై, చూరల్మల, అత్తమల, నూల్పుజ తదితర కుగ్రామాలు సమాధయ్యాయి. తొలుత సోమవారం అర్ధరాత్రి రెండు గంటల వేళ ముండక్కై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో సహాయక సిబ్బంది హుటాహుటిన స్పందించారు. బాధితులను సమీపంలోని చూరల్మల స్కూలు వద్ద సహాయక శిబిరాలకు తరలించారు. అనంతరం తెల్లవారుజామున నాలుగింటికి ఆ ప్రాంతమంతటా మళ్లీ భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో శిబిరాలతో పాటు పరిసర గ్రామాల్లోని ఇళ్లు, దుకాణాలన్నీ బురదలో కొట్టుకుపోయాయి. రోడ్లు, బ్రిడ్జిల వంటివన్నీ నామరూపాల్లేకుండా పోయాయి. దాంతో ఆ ప్రాంతాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో సహాయక బృందాలు అక్కడ కాలు పెట్టలేకపోతున్నాయి. అయితే బురదలో చిక్కుబడి ప్రాణాలతో ఉన్న పలువురిని సైన్యం, నేవీ సంయుక్త ఆపరేషన్ చేపట్టి హెలికాప్టర్ల ద్వారా కాపాడాయి. మెప్పడి ఆరోగ్య కేంద్రంలో స్థలాభవం కారణంగా మృతదేహాలను నేలపైనే వరుసగా పేరుస్తున్నారు. ఉత్పాతం నుంచి ప్రాణాలతో బయటపడ్డ వారంతా తలలు బాదుకుంటూ, హృదయ విదారకంగా రోదిస్తూ తమవారి శవాల కోసం వెదుక్కుంటున్నారు! నిర్వాసితులుగా మారిన వేలాదిమందిని సహాయక శిబిరాలకు తరలిస్తున్నారు. రంగంలోకి సైన్యం కేరళ ప్రభుత్వ యంత్రాంగంతో పాటు సైన్యం, జాతీయ విపత్తు దళం హుటాహుటిన రంగంలోకి దిగాయి. బురద, మట్టి దిబ్బల కింద ప్రాణాలతో ఉన్నవారిని కాపాడేందుకు శాయశక్తులా ప్రయతి్నస్తున్నారు. వారి ఆనవాలు పట్టేందుకు డాగ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. మోదీ దిగ్భ్రాంతి ఈ ఘోర విపత్తుపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వెలిబుచ్చారు. సీఎం పినరయి విజయన్‌తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. సహాయక చర్యలు తదితరాల్లో కేరళకు అన్నివిధాలా దన్నుగా నిలుస్తామని ప్రకటించారు. ఆయన బుధవారం కేరళ వెళ్లనున్నారు. మరోవైపు, మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడ్డవారికి రూ.50 వేల చొప్పున కేంద్రం పరిహారం ప్రకటించింది.ప్రాణం దక్కించుకున్న వృద్ధుడు వయనాడ్ విలయంలో వెల్లువెత్తిన బురద ప్రవాహంలో చిక్కిన ఓ వృద్ధుడు గంటల కొద్దీ ఒక పెద్ద బండరాయిని ఆధారంగా పట్టుకుని ప్రాణాలు నిలబెట్టుకున్నాడు. స్థానికులు అతని ఆర్తనాదాలు విని కూడా వరద ప్రవాహ తీవ్రత కారణంగా ఏమీ చేయలేకపోయారు. దాంతో వృద్ధుడు జోరు వానలో, వరద ప్రవాహం నడుమ గంటల పాటు బండరాయి చాటునే బిక్కుబిక్కుమంటూ గడిపాడు. చివరికి సహాయక బృందాలు చాలాసేపు శ్రమించి ఆయన్ను కాపాడాయి. ఆ వీడియో వైరల్‌గా మారింది.త్రుటిలో బయటపడ్డాం... కళ్లముందే సర్వస్వాన్నీ ముంచెత్తిన వరద, బురద బీభత్సం నుంచి పలువురు త్రుటిలో తప్పించుకున్నారు. ఆ భయానక అనుభవాన్ని గుర్తు చేసుకుంటూ వణికిపోయారు. ఓ వృద్ధ జంట తమ ఇంటి చుట్టూ బురద నీటి ప్రవాహం నెమ్మదిగా పెరుగుతుండటంతో వణికించే చలిని, జోరు వానను కూడా లెక్కచేయకుండా రాత్రి 11 గంటల వేళ కొండపై భాగానికి వెళ్లిపోయింది. కాసేపటికే వాళ్ల ఇల్లు నామరూపాల్లేకుండా పోయింది. ‘‘పొరుగింటాయనను రమ్మని బతిమాలాం. రాకుండా ప్రాణాలు పోగొట్టుకున్నాడు’’ అంటూ వాళ్లు వాపోయారు. ‘‘మా బంధువులైన దంపతులు పసిపాపను చంకనేసుకుని ప్రాణాల కోసం పరుగులు తీస్తూ నాతో ఫోన్లో మాట్లాడారు. వరద ప్రవాహం, బురద తమను ముంచెత్తుతున్నాయని చెప్పారు. కాసేపటికే ఫోన్ మూగబోయింది. వాళ్ల జాడా తెలియడం లేదు’’ అంటూ ఒక మహిళ రోదించింది.వయనాడ్‌కు రెడ్ అలర్ట్: న వయనాడ్‌తో పాటు కేరళలోని ఉత్తరాది జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. రెండు రోజులు అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.ఫోన్లలో ఆర్తనాదాలు బురద ప్రవాహంలో చిక్కుబడ్డ చాలామంది కాపాడాలంటూ అధికారులకు ఫోన్లు చేశారు. ప్రాణ భయంతో ఫోన్లోనే ఏడ్చేసిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. చానళ్లలో ప్రసారమవుతున్న ఆ సంభాషణలు, గ్రామాలన్నీ బురద కింద కప్పబడిపోయిన్న దృశ్యాలు అందరినీ కలచివేస్తున్నాయి. ఇది మాటలకందని విషాదమని సీఎం విజయన్ అన్నారు. ‘‘భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో మొత్తం ప్రాంతమంతా పెను విధ్వంసానికి లోనైంది. మృతుల్లో మహిళలు, చిన్నారులున్నారు. పలు శవాలు చెలియార్ నదిలో పొరుగున మలప్పురం జిల్లాలోకి కొట్టుకొచ్చాయి.నదే రెండుగా చీలింది విరిగిపడ్డ కొండచరియల ధాటికి స్థానిక ఇరువలింజిపుజ నది ఏకంగా రెండుగా చీలిపోయింది! అక్కడి వెల్లరిమల ప్రభుత్వ పాఠశాల పూర్తిగా సమాధైపోయిందని సీఎం విజయన్ చెప్పారు. -
బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ల హింస.. మరో 18 మంది మృతి
ఢాకా: ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్ల కోటాలో సంస్కరణలను కోరుతూ బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న ఆందోళనలు మరింత హింసాత్మకంగా మారాయి. గురువారం దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనల్లో మరో 18 మంది చనిపోగా 2,500 మంది వరకు గాయపడ్డారు. దీంతో, ఈ ఆందోళనల మృతుల సంఖ్య 25కు చేరింది. గురువారం ఆందోళనకారులు ఢాకాలో ప్రభుత్వ టీవీ కార్యాలయం ముందుభాగాన్ని ధ్వంసం చేశారు. పార్కు చేసిన వాహనాల్ని తగులబెట్టారు. దీంతో, ఉద్యోగులతోపాటు జర్నలిస్టులు లోపలే చిక్కుబడిపోయారు. ఢాకాతోపాటు ఇతర నగరాల్లో ఉన్న వర్సిటీల్లో వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు గురువారం కూడా కొనసాగాయి. ఆందోళనకారులు భద్రతా సిబ్బంది, అధికార పార్టీ అనుకూలురతో బాహాబాహీగా తలపడ్డారు. ఘర్షణల్లో 18 మంది చనిపోగా 2,500 మందికి పైగా గాయపడినట్లు డెయిలీ స్టార్ పత్రిక తెలిపింది. ఢాకాలోనే 9 మంది చనిపోయినట్లు పేర్కొంది. దాంతో రైళ్లతో పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపేశారు. -
Israel-Hamas war: 90 మంది దుర్మరణం
జెరుసలేం: గాజాలోని దక్షిణ ప్రాంత నగరం ఖాన్ యూనిస్‌పై శనివారం ఇజ్రాయెల్ ఆర్మీ మళ్లీ విరుచుకుపడింది. తాజా దాడుల్లో 90 మంది మృతి చెందగా కనీసం 300 మంది పాలస్తీనియన్లు క్షతగాత్రులయ్యారు. హమాస్ మిలటరీ విభాగం అధిపతి మహ్మద్ డెయిఫ్ లక్ష్యంగా ఈ దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. హమాస్ మరో ముఖ్య నేత రఫా సలామాను కూడా ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. ఈ దాడుల్లో వీరిద్దరూ చనిపోయిందీ లేనిదీ స్పష్టం చేయలేదు. ఫెన్సింగ్‌తో ఉన్న హమాస్ స్థావరంపై జరిపిన దాడిలో కొందరు మిలిటెంట్లు కూడా హతమైనట్లు ప్రకటించింది. అయితే, ఉత్తర రఫా– ఖాన్ యూనిస్ మధ్యలో ఇజ్రాయెల్ ఆర్మీ రక్షిత ప్రాంతంగా ప్రకటించిన మువాసిలోనే ఈ దాడి జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లక్షలాదిగా పాలస్తీనియన్లు తలదాచుకున్న మువాసిపైకి కనీసం ఏడు క్షిపణులు వచ్చి పడ్డాయని అంటున్నారు. ఆ ప్రాంతమంతా చెల్లాచెదురుగా పడిపోయిన మృతదేహాలు, కాలిపోయిన కార్లు, టెంట్లు, నల్లగా మసిబారిన గృహోపకరణాలు నిండిపోయి ఉన్నాయి. దాడి తీవ్రతకు చిన్నారుల శరీర భాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయని, తమ చేతులతోనే వాటిని ఏరుకోవాల్సి వచ్చిందని ఓ వ్యక్తి రోదిస్తూ తెలిపాడు. బాధితుల్ని కార్లు, గాడిదల బండ్లు, దుప్పట్లలో వేసుకుని సమీపంలోని నాసర్ ఆస్పత్రికి స్థానికులు తరలించారు. ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటనను హమాస్ ఖండించింది. అక్కడ డెయిఫ్ సహా తమ నేతలెవరూ లేరని స్పష్టం చేసింది. భయంకరమైన ఊచకోతను కప్పిపుచ్చుకునేందుకే ఇజ్రాయెల్ ఆర్మీ ఇలాంటి తప్పుడు ప్రకటనలు చేస్తోందని మండిపడింది. ఇజ్రాయెల్ చెబుతున్నదే నిజమైతే గత తొమ్మిది నెలల యుద్ధంలో సాధించిన కీలక విజయమవుతుందని పరిశీలకులు అంటున్నారు. అదే సమయంలో శాశ్వత కాల్పుల విరమణ, బందీల విడుదల లక్ష్యంగా అమెరికా మధ్యవర్తిత్వంతో సాగుతున్న చర్చలకు తాజా ఘటన అవరోధంగా మారుతుందని చెబుతున్నారు.ఎవరీ డెయిఫ్..?ఇజ్రాయెల్ మోస్ట్ వాంటెడ్ జాబితాలో హమాస్ మిలటరీ వి భాగం చీఫ్‌గా వ్యవహ రిస్తున్న డెయిఫ్ది మొదటి పేరు. గత రెండు దశాబ్దాల్లో ఇజ్రాయె ల్ నిఘా విభాగాలు పలుమార్లు చేసిన హత్యాయత్నాల నుంచి డెయిఫ్ త్రుటిలో తప్పించుకున్నాడు. అప్పట్లో గాయపడిన ఇతడు పక్షవాతం బారినపడుతున్నట్లుగా భావిస్తున్నారు. గతేడాది అక్టోబర్ ఏడో తేదీన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతంపై జరిపిన మెరుపుదాడికి సూత్రధారి డెయిఫే అని ఇజ్రాయెల్ అనుమానిస్తోంది. 30 ఏళ్ల వయస్సులో ఇతడి ఒకే ఒక్క ఫొటో తప్ప మరే ఆధారం ఇజ్రాయెల్ ఆర్మీ వద్ద లేదు. -
తమిళనాట 50కి చేరిన మద్యం మృతులు
సాక్షి, చెన్నై: తమిళనాడులోని కళ్లకురిచ్చి జిల్లాలో కల్తీ మద్యం తాగి చనిపోయిన వారి సంఖ్య పెరుగుతోంది. శుక్రవారం మరో 10 మంది చనిపోవడంతో మొత్తం మరణాలు 50కి చేరాయి. అలాగే, సారా తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్న మరో ఇద్దరు కూడా మరణించడంతో ఆ సంఖ్య 50ని దాటింది. అయితే, వీరి మరణంపై అధికారులు విచారణ చేపట్టారు. దీంతోపాటు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల్లో 30 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు కల్తీ సారా మరణాల ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం మద్రాసు హైకోర్టు విచారణ చేపట్టింది. దద్దరిల్లిన అసెంబ్లీ కళ్లకురిచ్చి ఉదంతంపై శుక్రవారం అసెంబ్లీ దద్దరిల్లింది. విపక్ష ఏఐఏడీఎంకే సభ్యులు నినాదాలు చేశారు. కల్తీ మద్యం తాగి 50 మంది వరకు మృతి చెందడంపై సభలో చర్చ చేపట్టాలని డిమాండ్ చేశారు. సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించారంటూ స్పీకర్ అప్పావు వారిని మార్షల్స్‌తో బయటకు పంపించి వేశారు. ఈ ఆందోళనల్లో ఏఐఏడీఎంకేలోని మాజీ సీఎం పన్నీరు సెల్వం వర్గం సభ్యులు పాల్గొనక పోవడం గమనార్హం. -
86కు చేరిన కాంగో పడవ మృతులు
కిన్షాసా: కాంగోలో పడవ మునిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య 86కు పెరిగింది. 271 మంది ప్రయాణికులతో కిక్కిరిసిన నాటు పడవ ఇంజన్ వైఫల్యంతో మంగళవారం నీట మునగడం తెలిసిందే. 185 మంది ఈదుతూ ఒడ్డుకు చేరుకుని ప్రాణాలు కాపాడుకున్నారు. దట్టమైన అటవులు, నదుల కారణంగా కాంగోలో రోడ్డు వ్యవస్థ సరిగా లేదు. జనం పడవ ప్రయాణాలకే మొగ్గుచూపుతారు. పడవ ప్రమాదాలు అక్కడ సర్వసాధారణం. ఫిబ్రవరిలోనూ నాటు పడవ మునిగి డజన్లకొద్దీ చనిపోయారు. -
Kuwait Building Fire: కువైట్‌లో భారీ అగ్నిప్రమాదం... 49 మంది దుర్మరణం
దుబాయ్: గల్ఫ్ దేశం కువైట్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారని సమాచారం. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కారి్మకులు నివసిస్తున్నారు. వివిధ దేశాల నుంచి వలస వచి్చన వీరంతా ఎన్బీటీసీ గ్రూప్ అనే నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. కారి్మకుల వసతి కోసం ఈ సంస్థ సదరు భవనాన్ని అద్దెకు తీసుకుంది. మృతులు 20 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని అరబ్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కారి్మకులు నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించారు.క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అగ్నిప్రమాదంలో చాలామంది భారతీయులు మరణించడంపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్ +965–65505246 ఏర్పాటు చేసింది. సహాయం, సమాచారం అవసరమైన వారు తమను సంప్రదించాలని సూచించింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించింది. కువైట్ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం(10 లక్షలు) ఉంటారు. కువైట్‌లోని మొత్తం కారి్మకుల్లో 30 శాతం మంది(దాదాపు 9 లక్షలు) భారతీయులే కావడం విశేషం. అగ్నిప్రమాదంలో మరణించినవారికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మాంగాఫ్ ప్రాంతంలోని ఘటనా స్థలాన్ని భారత రాయబారి ఆదర్శ్ స్వాయికా సందర్శించారు. గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించారు. తగిన సాయం అందిస్తామని భరోసా కలి్పంచారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో కువైట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా, మరికొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. యాజమాన్యం దురాశకు అమాయకులు బలి మాంగాఫ్ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్–యూసుఫ్ అల్–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కలి్పంచని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యంతోపాటు భవన యజమాని దురాశ వల్ల అమాయకులు బలయ్యారని ఆయన విమర్శించారు. ఒకే భవనంలో పెద్ద సంఖ్యలో కారి్మకులు నివసించడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అగ్నిప్రమాదానికి బాధ్యులుగా గుర్తించి పలువురు అధికారులను కువైట్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది.ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతిహుటాహుటిన కువైట్‌కు మంత్రి రాజవర్ధన్ సింగ్కువైట్ అగ్నిప్రమాదం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రమాదంలో ఆప్తులను కోల్పోయినవారికి సానుభూతి ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రారి్థస్తున్నట్లు చెప్పారు. కువైట్ భారత రాయబార కార్యాలయం సహాయక చర్యల్లో నిమగ్నమైందని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు. ఈ ఉదంతంపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష జరిపారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ప్రధాని ఆదేశాల మేరకు విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్ సింగ్ కువైట్‌కు బయలుదేరారు. సహాయ చర్యలను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తారు. మృతుల్లో మలయాళీలు ఎక్కువగా ఉన్నారన్న వార్తల నేపథ్యంలో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అప్రమత్తమయ్యారు. కేంద్రం వెంటనే తగిన సాయం అందించాలని, బాధితులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌కు లేఖ రాశారు. -
అమెరికాలో టోర్నడోల బీభత్సం
హూస్టన్: అమెరికాలో పలు ఓవైపు ఎండలు మండుతుంటే మరోవైపు టోర్నడోలు ప్రతాపం చూపుతున్నాయి. గాలుల తీవ్రతకు ఇళ్లు కూలడం, చెట్లు పడిపోవడం వంటి ఘటనల్లో 28 మందికి పైగా చనిపోయారు. వేలాదిగా ఇళ్లు నేల మట్టమయ్యాయి. టెక్సాస్, ఒక్లహామా, అర్కన్సాస్ సహా 16 రాష్ట్రాల్లో 6 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు టెక్సాస్, ఆస్టిన్, డాలస్, న్యూ మెక్సికో, ఒక్లహామా, అరిజోనా, కొలరాడో రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. ఇలినాయీ, మిస్సోరీ, కెంటకీ, టెన్నెస్సీల్లో తీవ్రమైన గాలి తుఫాన్లు వీస్తాయని చెబుతున్నారు. -
పపువా న్యూ గినియా విషాదం..
మెల్బోర్న్: దక్షిణ పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియా శుక్రవారం కొండచరియలు విరిగి పడిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంలో చోటుచేసుకున్న ఘటనలో 670 మంది వరకు చనిపోయి ఉంటారని మొదట ఐరాస విభాగం అంచనా వేసింది. అయితే, మట్టిదిబ్బల కింద రెండు వేలమందికి పైగానే గ్రామస్తులు సజీవ సమాధి అయి ఉంటారని పపువా న్యూ గినియా ప్రభుత్వం లెక్కగట్టింది. ఈ మేరకు ఐరాసకు సమాచారం పంపింది. ఈ విషాద సమయంలో తమను ఆదుకోవాలంటూ అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేసింది. అయితే, ఐరాస వలసల విభాగం మాత్రం నేలమట్టమైన 150 నివాసాలను పరిగణనలోకి తీసుకునే మృతుల సంఖ్య 670గా నిర్ణయించామని, ప్రభుత్వ గణాంకాలపై మాట్లాడబోమని తెలిపింది. మృతుల సంఖ్యను 2 వేలుగా ఏ ప్రాతిపదికన నిర్ణయించారని ప్రధాని జేమ్స్ మరాపేను మీడియా ప్రశ్నించగా ఆయన బదులివ్వలేదు. కాగా, దేశంలో దశాబ్దాలుగా జనగణన జరగలేదు. సైన్యం కాపలా మధ్య.. గ్రామంలోని 200 మీటర్ల ప్రాంతంలో ఉన్న నివాసాలను 6 నుంచి 8 మీటర్ల మేర భారీ రాళ్లు, చెట్లు, మట్టి భూస్థాపితం చేశాయి. స్థానికులే తమ వ్యవసాయ పరికరాలైన పార, గొడ్డలి వంటి వాటితో వాటిని తొలగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆరు మృతదేహాలను మాత్రమే వెలికి తీయగలిగారు. స్థానిక కాంట్రాక్టర్ పంపించిన బుల్డోజర్తో ఆదివారం నుంచి పని చేయిస్తున్నారు. -
పపువా న్యూ గినియా విషాదం.. మరణాలు 670కి పైనే..
మెల్బోర్న్: పసిఫిక్ ద్వీప దేశం పపువా న్యూ గినియాలో శుక్రవారం కొండచరియలు విరిగిపడి గ్రామాన్ని నేలమట్టం చేయడం తెల్సిందే. ఈ ఘటనలో మృతుల సంఖ్య 670కిపైనే అని ఐరాసకు చెందిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రేషన్(ఐవోఎం) ఆదివారం తెలిపింది. ఎంగా ప్రావిన్స్ అధికారులు, బాధిత యంబలి గ్రామస్తులు అందించిన సమాచారాన్ని బట్టి 150కిపైగా ఇళ్లు భూస్థాపితం కాగా వాటిలోని 670 మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు ఐవోఎం అంచనా వేసింది. క్షతగాత్రులు, గల్లంతైన వారి సంఖ్యలో స్పష్టత రాలేదని పేర్కొంది. ఆదివారం ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు స్థానిక అధికారులు చెప్పారు. మట్టి, బండరాళ్లు, చెట్లు మూడు నుంచి నాలుగు ఫుట్‌బాల్ మైదానాలంత విస్తీర్ణంలో 6 నుంచి 8 మీటర్ల లోతున గ్రామాన్ని భూస్థాపితం చేశాయని, లోపల చిక్కుకున్న వారు బతికి బట్టకట్టేందుకు అవకాశాలు తక్కువని ఐవోఎం అంటోంది. మరోవైపు స్థానిక గిరిజన తెగల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. శనివారం జరిగిన ఘర్షణలో ఎనిమిది మంది చనిపోయారు. దాంతో సహాయక సిబ్బంది, అత్యవసరాలను చేరవేయడానికి ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. -
కదులుతున్న బస్సులో మంటలు.. 9 మంది సజీవ దహనం
గురుగ్రామ్: కదులుతున్న బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు మహిళలు సహా తొమ్మిది మంది సజీవదహనం అయ్యారు. 17 మంది గాయపడ్డారు. హరియాణాలోని నుహ్ జిల్లా టౌరు సమీపంలో శని వారం వేకువజామున ఈ ఘోరం చోటుచేసుకుంది. పంజాబ్‌లోని హోషియార్పూర్, లూధియానా జిల్లాలకు చెందిన సుమారు 60 మందితో కూడిన బంధువర్గం మథుర, బృందావన్ తీర్థయాత్రకు వెళ్లి తిరిగివస్తోంది. వీరి బస్సులో కుండ్లి– మనేసర్– పల్వాల్(కేఎంపీ)ఎక్స్‌ప్రెస్ వేపై వెళ్తుండగా మంటలు చెలరేగాయి. రోడ్డుపై వెళ్తున్న పలువురు వాహన చోదకులు గమనించి డ్రైవర్‌ను హెచ్చరించారు. అతడు పట్టించుకోకపోవడంతో బస్సును వెంబడించారు. ఈలోగా బస్సులోపల మంటలు, పొగ వ్యాపించడంతో డ్రైవర్ బస్సును నిలిపివేసి పరారయ్యాడు. బస్సు మెయిన్ డోర్ తెరుచుకోకపోవడంతో ప్రయాణికులు కిటికీల నుంచి అతికష్టమ్మీద కిందికి దూకారు. అప్పటికే బస్సులోని 9 మంది ప్రాణాలు కోల్పోయారు. -
Pakistan: లోయలో పడిన బస్సు.. 17 మంది మృత్యువాత
కరాచీ: పాకిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. 38 మంది గాయపడ్డారు. సింధ్, బలోచిస్తోన్ ప్రావిన్స్‌ల సరిహద్దుల్లోని హుబ్ పట్టణ సమీపంలో బుధవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. సింధ్ ప్రావిన్స్‌లోని తట్టా పట్టణానికి చెందిన కొందరు బలోచిస్తాన్‌లోని హుబ్ పట్టణంలోని షా నూరానీ దర్గాకు బుధవారం మధ్యాహ్నం బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న బస్సు రాత్రి 8 గంటల సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. క్షతగాత్రులను అక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాచీ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మాస్కోలో మారణహోమం
మాస్కో/న్యూఢిల్లీ: రష్యా రాజధాని మాస్కోలో క్రాకస్ సిటీ హాల్లో చోటుచేసుకున్న మారణహోమంలో మృతుల సంఖ్య శనివారం 133కు పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి సంగీత కచేరి జరుగుతుండగా ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులు జరిపి అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడం తెలిసిందే. ఈ దారుణంలో 120 మందికి పైగా గాయపడ్డారు. వారిలో చాలామంది తీవ్ర గాయాలతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురు దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని రష్యా ఇన్వెస్టిగేటివ్ కమిటీ వెల్లడించింది. వారిని పారిపోతుండగా పశి్చమ రష్యాలోని బ్రియాన్‌స్‌్కలో ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోనే బంధించినట్లు తెలిపింది. సరిహద్దు దాటి ఉక్రెయిన్ చేరాలన్న పన్నాగాన్ని భగ్నం చేసినట్లు స్పష్టం చేసింది. ఈ దాడికి పాల్పడింది తామేనని అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్(ఖోరసాన్) ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధికారులు మాత్రం ఇది ముమ్మాటికీ ఉక్రెయిన్ ముష్కరుల పనేనని ఆరోపిస్తున్నారు. కాల్పులకు తెగబడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అమెరికా నిఘా వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. తాజా పరిణామాలపై రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ శనివారం రష్యా అధినేత పుతిన్‌తో సమావేశమయ్యారు. అనుమానితుల అరెస్టు తదితరాల గురించి తెలియజేశారు. రష్యాలో ఇటీవల జరిగిన జాతీయ ఎన్నికల్లో పుతిన్ మరోసారి ఘన విజయం సాధించి ఆరేళ్లపాటు అధికారం దక్కించుకున్నారు. కొన్ని రోజులకే మాస్కోలో భీకర దాడి జరగడం, 133 మంది మరణించడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. మోదీ దిగ్భ్రాంతి మాస్కో ఘోరకలిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ అమానుష దాడిని భారత్ ఖండిస్తోందని పేర్కొన్నారు. విపత్కర సమయంలో రష్యా ప్రజలకు అండగా ఉంటామంటూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ఉక్రెయిన్‌కు సంబంధం ఉంది: పుతిన్ కాల్పుల ఘటనతో ఉక్రెయిన్‌కు సంబంధం ఉందని పుతిన్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా భద్రతను పటిష్టం చేసినట్లు తెలిపారు. పట్టుబడిన దుండుగుల్లో నలుగురు వ్యక్తులు ఈ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని చెప్పారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్‌కు పారిపోయేందుకు ప్రయతి్నంచారని అన్నారు. మా పని కాదు: ఉక్రెయిన్ రష్యా కాల్పులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సలహాదారుడైన మైఖైలో పొదొలాయిక్ స్పందించారు. మాస్కో మారణహోమంతో తమకు సంబంధం లేదని తేలి్చచెప్పారు. ఉగ్రవాద పద్ధతులను పాటించే అలవాటు ఉక్రెయిన్‌కు లేదన్నారు. పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చేశారు ► కాల్పులు జరిగిన క్రాకస్ సిటీ హాల్ చాలా విశాలమైన కాంప్లెక్స్. ఇందులో మ్యూజిక్ హాల్‌తోపాటు షాపింగ్ సెంటర్ ఉంది. ► శుక్రవారం రాత్రి సంగీత కచేరి ప్రారంభం కావడానికి ముందు జనం సీట్లలో కూర్చున్నారు. మొత్తం 6,200 సీట్లూ నిండిపోయాయి. ► సంగీత కార్యక్రమం ప్రారంభం కాకముందే కాల్పుల మోత మొదలైనట్లు వీడియో ఫుటేజీని బట్టి తెలుస్తోంది. ► సైనిక దుస్తుల్లో వచి్చన ముష్కరులు అటోమేటిక్ రైఫిళ్లతో విరుచుకుపడ్డారు. ఉన్మాదుల్లాగా చెలరేగిపోయారు. జనంపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో గురిపెట్టి కాల్పులు జరిపారు. తూటా నుంచి రక్షణ కోసం పలువురు సీట్ల వెనుక దాక్కున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ► అరుపులు కేకలతో గందరగోళం నెలకొంది. చాలామంది బయటకు పరుగులు తీసేందుకు ప్రయతి్నంచారు. తొక్కిసలాట జరిగింది. హాల్ కిక్కిరిసి ఉండడంతో తప్పించుకునే వీల్లేకుండా పోయింది. మృతుల సంఖ్య భారీగా పెరిగింది. లోపలంతా పొగ అలుముకుంది. ► ముష్కరులు గ్రెనేడ్లు, బాంబులు కూడా వేసినట్టు రష్యా మీడియా వెల్లడించింది. కాల్పులు, పేలుళ్ల ధాటికి హాల్లో మంటలు రేగాయి. పైకప్పు కూలిపోయింది. అగి్నమాపక సిబ్బంది గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. క్రాకస్ సిటీ హాల్లో కాల్పులు జరుపుతున్న దుండగులు -
ఢాకాలో ఘోర అగ్ని ప్రమాదం
ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో గురువారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఏడంతస్తుల షాపింగ్ మాల్లో మంటలు చెలరేగి 46 మంది సజీవ దహనమయ్యారు. 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి గ్యాస్ లీకేజీయే కారణమని భావిస్తున్నారు. బైలీ రోడ్డు ప్రాంతంలోని గ్రీన్ కోజీ కాటేజీలో పలు రెస్టారెంట్లు, వస్త్ర దుకాణాలు ఉన్నాయి. ఈ భవనం మొదటి అంతస్తులోని రెస్టారెంట్లో రాత్రి 9.50 గంటల ప్రాంతంలో చెలరేగిన మంటలు పై అంతస్తులకు శరవేగంగా వ్యాపించాయి. దీంతో అందులోని వారంతా ప్రాణభయంతో పై అంతస్తులకు చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది సుమారు 75 మందిని నిచ్చెనల సాయంతో కిందికి దించారు. మంటలను అర్ధరాత్రి 12.30 గంటలకు అదుపులోకి తీసుకురాగలిగారు. ఘటనపై ప్రధాని షేక్ హసీనా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
World Health Organization: భారత్‌లో 9 లక్షల క్యాన్సర్ మరణాలు
న్యూఢిల్లీ: భారత్‌ను క్యాన్సర్ మహమ్మారి కబళిస్తున్న తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ తన తాజా గణాంకాల్లో వెల్లడించింది. ది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ గణాంకాల ప్రకారం 2022లో భారత్‌లో 14.1 లక్షల క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి. క్యాన్సర్ కారణంగా 9.1 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పురుషల్లో పెదవులు, నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు సర్వసాధారణమయ్యాయి. రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు మహిళల్లో ఎక్కువయ్యాయి. మొత్తం కొత్త కేసుల్లో 27 శాతం బ్రెస్ట్, 18 శాతం సెరి్వక్స్ యుటెరీ క్యాన్సర్లు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సోకి ఐదేళ్లుగా బాధపడుతున్న వారి సంఖ్య 5.3 కోట్లకు చేరిందని నివేదికలో పేర్కొన్నారు. -
Israel-Hamas War: అదే గాజా.. అదే దీన గాథ!
దెయిర్ అల్ బలాహా/ఖాన్ యూనిస్ (గాజా): అదే కల్లోలం. అవే దారుణ దృశ్యాలు. అందరి కంటా నిస్సహాయంగా నీటి ధారలు. ఇజ్రాయెల్ ప్రతీకార దాడుల ధాటికి గాజాలో మానవీయ సంక్షోభం తీవ్రతరమవుతోంది. ముఖ్యంగా ఆస్పత్రుల్లో ఎటు చూసినా మరణమృదంగం ప్రతిధ్వనిస్తోంది. గాజాలోని దాదాపు అన్ని ఆస్పత్రులనూ ఇజ్రాయెల్ సైన్యం చుట్టుముట్టి రోజుల తరబడి దిగ్బంధించడం తెలిసిందే. దాంతో కరెంటుతో పాటు కనీస సౌకర్యాలన్నీ దూరమై అవి నరకం చవిచూస్తున్నాయి. ఐసీయూలు, ఇంక్యుబేటర్లకు కూడా కరెంటు, ఆక్సిజన్ రోజులు దాటింది. వాటిల్లోని రోగులు, నవజాత శిశువులు నిస్సహాయంగా మృత్యువు కోసం ఎదురు చూస్తున్నారు! ఇప్పటిదాకా అరచేతులు అడ్డుపెట్టి అతి కష్టమ్మీద వారి ప్రాణాలు నిలుపుతూ వచ్చిన వైద్యులు కూడా క్రమంగా చేతులెత్తేస్తున్నారు. గాజాలో అతి పెద్దదైన అల్ షిఫాతో పాటు అన్ని ఆస్పత్రుల్లోనూ ఇదే దుస్థితి! షిఫా ఇంకెంతమాత్రమూ ఆస్పత్రిగా మిగల్లేదంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అదనోం గేబ్రెయేసస్ వాపోయారు. ‘‘ఈ దారుణంపై ప్రపంచం మౌనం వీడాల్సిన సమయమిది. కాల్పుల విరమణ తక్షణావసరం’’ అని పిలుపునిచ్చారు. చిన్నారులను కాపాడేందుకు... ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ నవజాత శిశువులను కాపాడుకునేందుకు అల్ షిఫా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది శాయశక్తులా ప్రయత్నిస్తున్న తీరు కంటతడి పెట్టిస్తున్నాయి. ఆక్సిజన్ సరఫరా తదితరాలన్నీ నిలిచిపోవడంతో చిన్నారులను ఇంక్యుబేటర్ల నుంచి తీసుకెళ్లి సిల్వర్ ఫాయిల్ తదితరాల్లో చుట్టబెట్టిన మంచాలపై ఒక్కచోటే పడుకోబెడుతున్నారు. పక్కన వేడినీటిని ఉంచి శరీర ఉష్ణోగ్రత తగ్గకుండా చూసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంధన రగడ ఇంక్యుబేటర్లను నడిపి చిన్నారులను కాపాడేందుకు అల్ షిఫా ఆస్పత్రికి 300 లీటర్ల ఇంధనం అందజేస్తే హమాస్ ఉగ్రవాదులు అడ్డుకున్నారని ఇజ్రాయెల్ సైన్యం ఆరోపించింది. కానీ అరగంటకు కూడా చాలని ఆ సాయంతో ఏం ప్రయోజనమని పాలస్తీనా ఆరోగ్య శాఖ మండిపడింది. ఇది క్రూర పరిహాసమంటూ దుయ్యబట్టింది. అల్ రంటిసి, అల్ నస్ర్ ఉత్తర గాజాలోని ఈ ఆస్పత్రుల నుంచి రోగులు తదితరులను హుటాహుటిన ఖాళీ చేయిస్తున్నారు. శుక్రవారానికే కొద్దిమంది రోగులు, వైద్య సిబ్బంది మినహా ఇవి దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అయితే వాటిలో సాధారణ పౌరులు వందలాదిగా తలదాచుకుంటున్నారు. ఇజ్రాయెల్ సైన్యం వీటిని పూర్తిగా తమ అదుపులోకి తీసుకుని వారందరినీ అక్కడినుంచి పంపించేస్తోంది. అల్ స్వెయిదీ లోపల కొద్ది మంది రోగులు, వైద్య సిబ్బంది ఉన్నారు. 500 మందికి పైగా శరణార్థులు తలదాచుకుంటున్నారు. శనివారం నాటి రాకెట్ దాడి ఆస్పత్రిని దాదాపుగా నేలమట్టం చేసింది. ఆదివారం రాత్రికల్లా ఇజ్రాయెల్ సైనికులు ఆస్పత్రిలోకి ప్రవేశించారు. ఇంకా మిగిలిన ఉన్న వారందరినీ ఖాళీ చేయించి బుల్డోజర్లతో ఆస్పత్రిని నేలమట్టం చేయించారు. అల్ షిఫా 700 పడకలతో గాజాలోనే అతి పెద్ద ఆస్పత్రి. కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ సైన్యం పూర్తిస్థాయిలో చుట్టుముట్టింది. దాంతో వైద్య సేవలన్నీ నిలిచిపోయాయి. కరెంటు లేదు. ఇంధనం, ఆహార సరఫరాలు తదితరాలన్నీ నిండుకున్నాయి. ఇక్కడ తలదాచుకున్న శరణార్థుల్లో అత్యధికులు పారిపోయారు. ఇంకో 2,500 మందికి పైగా ఆస్పత్రిలో ఉన్నట్టు సమాచారం. కానీ 20 వేలకు పైగా అక్కడ చిక్కుబడ్డట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ చెబుతోంది. 600 మందికి పైగా రోగులు, 500 మంది దాకా వైద్యులు, సిబ్బంది ఉన్నారు. వందలాది శవాలు ఆస్పత్రి ప్రాంగణంలో పడున్నట్టు చెబుతున్నారు! ఆది, సోమవారాల్లోనే 35 మంది రోగులు, ఐదుగురు చిన్నారులు చనిపోయినట్టు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో 36 మంది చిన్నారులు ఏ క్షణమైనా తుది శ్వాస విడిచేలా ఉన్నట్టు వైద్య వర్గాలను ఉటంకిస్తూ పేర్కొంది. అల్ ఖుద్స్ గాజాలో రెండో అతి పెద్ద ఆస్పత్రి. 500 మందికి పైగా రోగులు, 15 వేలకు పైగా శరణార్థులున్నారు. వీరిలో అత్యధికులు మహిళలే. ఆదివారానికే ఆస్పత్రిలో సేవలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. ఆహార నిల్వలన్నీ నిండుకున్నాయి. పరిసరాల్లోనే గాక ఆస్పత్రిపైకి కూడా భారీగా కాల్పులు జరుగుతున్నాయి. దాంతో ఇక్కడి ఐసీయూ వార్డు రోగులు ఒకట్రెండు రోజుల్లో నిస్సహాయంగా మృత్యువాత పడేలా ఉన్నారు! 6,000 మందికి పైగా శరణార్థులను ఇక్కణ్నుంచి దక్షిణాదికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అల్ అక్సా ఇక్కడ కూడా వందల సంఖ్యలో రోగులు, వైద్య సిబ్బంది, శరణార్థులున్నారు. రోగుల, ముఖ్యంగా 100 మందికి పైగా ఉన్న నవజాత శిశువుల సామూహిక మరణాలకు ఇంకెంతో సమయం పట్టదని సిబ్బంది చెబుతున్నారు. తూటాలు తరచూ ఆస్పత్రి లోనికి దూసుకొస్తున్నాయంటున్నారు. ఆస్పత్రిని సైన్యం చుట్టుముట్టింది. -
ఇజ్రాయెల్ గుప్పిట్లో గాజా
గాజా్రస్టిప్: హమాస్ మిలిటెంట్ల భరతం పట్టడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం ఉత్తర గాజాను పూర్తిగా చుట్టుముట్టింది. గాజా స్ట్రిప్‌లోని ఇతర ప్రాంతాలతో ఉత్తర గాజాకు సంబంధాలు తెగిపోయాయి. ఉత్తర గాజా మొత్తం దిగ్బంధంలో చిక్కుకుంది. గాజా స్ట్రిప్‌ను రెండు ముక్కలుగా విభజించామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఉత్తర గాజా ఇప్పుడు తమగుప్పిట్లో ఉందని పేర్కొంది. యుద్ధంలో ఇది చాలా ముఖ్యమైన దశ అని, ఇకపై కీలక దాడులు చేయబోతున్నామని తెలియజేసింది. గాజా సిటీలోకి అడుగుపెట్టడానికి ఇజ్రాయెల్ సేనలు ముందుకు కదులుతున్నాయి. సైన్యం ఆదివారం అర్ధరాత్రి నుంచి ఉత్తర గాజాపై నిప్పుల వాన కురిపించింది. వైమానిక దాడులు ఉధృతం చేసింది. 450 లక్ష్యాలను ఛేదించామని, మిలిటెంట్ల స్థావరాలను, సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. సీనియర్ మిలిటెంట్ జమాల్ మూసా హతమయ్యాడని వివరించింది. హమాస్ కాంపౌండ్ ఒకటి తమ అ«దీనంలోకి వచ్చిందని పేర్కొంది. మిలిటెంట్లకు సమీపంలోనే ఉన్నామని, అతిత్వరలో వారిపై మూకుమ్మడి దాడి ప్రారంభిస్తామని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెచ్ట్ వెల్లడించారు. హమాస్‌కు గాజా సిటీ ప్రధానమైన స్థావరం. మిలిటెంట్లు ఇక్కడ పటిష్టమైన సొరంగాల వ్యవస్థను నిర్మించుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆయుధ నిల్వలను సిద్ధం చేసుకున్నారు. గాజా సిటీ వీధుల్లో ఇజ్రాయెల్ సైనికులతో ముఖాముఖి తలపడేందుకు వారు సిద్ధమవుతున్నట్లు స్థానిక మీడియా తెలియజేసింది. ఒక్క రాత్రి 200 మంది బలి! గాజాపై ఆదివారం రాత్రి నుంచి ఉదయం వరకూ ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో దాదాపు 200 మంది మరణించారని గాజా సిటీలోని అల్–íÙఫా హాస్పిటల్ డైరెక్టర్ చెప్పారు. పెద్ద సంఖ్యలో మృతదేహాలు తమ ఆసుపత్రికి చేరుకున్నాయని తెలిపారు. చాలామంది క్షతగాత్రులు చికిత్స కోసం చేరారని వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. కాల్పుల విరమణకు ససేమిరా గాజాపై దాడులకు విరామం ఇవ్వాలని, పాలస్తీనియన్లకు మరింత మానవతా సాయం అందేలా చర్యలు తీసుకోవాలంటూ మిత్రదేశం అమెరికా చేసిన సూచనను ఇజ్రాయెల్ లెక్కచేయడం లేదు. కాల్పుల విరమణ పాటించాలంటూ జోర్డాన్, ఈజిప్టు తదితర అరబ్ దేశాలు పదేపదే విజ్ఞప్తి చేస్తున్నా పట్టించుకోవడం లేదు. హమాస్ చెరలో ఉన్న 240 మంది బందీలను విడుదల చేసే వరకూ గాజాపై దాడులు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహూ తేలి్చచెప్పారు. గాజాలో సంక్షోభం మరింత ముదిరే పరిస్థితి కనిపిస్తుండడంతో అరబ్ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. జోర్డాన్ సైనిక రవాణా విమానం సోమవారం ఉత్తర గాజాల్లో క్షతగాత్రులకు, రోగులుకు అవసరమైన ఔషధాలు, వైద్య పరికరాలను జార విడిచింది. మరోవైపు ఇజ్రాయెల్–లెబనాన్ సరిహద్దుల్లో ఘర్షణలు ఆగడం లేదు. ఇరాన్ అండదండలున్న హెజ్బొల్లా మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడులు సాగిస్తూనే ఉన్నారు. ఈ దాడులను ఇజ్రాయెల్ సైన్యం తిప్పికొడుతోంది. ఆదివారం రాత్రి ఇజ్రాయెల్ దాడుల్లో దక్షిణ లెబనాన్‌లో నలుగురు పౌరులు మరణించారు. 10,022 మంది పాలస్తీనియన్లు మృతి ఇజ్రాయెల్–హమాస్ మిలిటెంట్ల మధ్య యుద్ధం మొదలై నెల రోజులవుతోంది. ప్రాణనష్టం నానాటికీ పెరిగిపోతోంది. గాజాలో మృతుల సంఖ్య 10 వేలు దాటింది. ఇజ్రాయెల్ సైన్యం భూతల, వైమానిక దాడుల్లో ఇప్పటివరకు 10,022 మంది పాలస్తీనియన్లు మరణించారని గాజా ఆరోగ్య శాఖ సోమవారం ప్రకటించింది. మృతుల్లో 4,100 మంది చిన్నారులు, 2,600 మంది మహిళలు ఉన్నారని తెలియజేసింది. వైమానిక దాడుల్లోనే ఎక్కువ మంది చనిపోయినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ భూభాగం వైపు హమాస్ మిలిటెంట్లు ప్రయోగించిన రాకెట్లలో 500కుపైగా రాకెట్లు గాజాలోనే కూలిపోయాయని, వాటివల్ల పెద్ద సంఖ్యలో పాలస్తీనియన్లు మరణించారని ఇజ్రాయెల్ సైన్యం చెబుతోంది. డేర్ అల్–బాలహ్ పట్టణంలో సోమవారం ఉదయం ఓ ఆసుపత్రి సమీపంలోనే 66 మృతదేహాలను సామూహికంగా ఖననం చేశారు. ముగిసిన ఆంటోనీ బ్లింకెన్ పర్యటన అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మధ్యప్రాచ్యంలో పర్యటన ముగించుకొని స్వదేశానికి పయనమయ్యారు. ఆయన సోమవారం తుర్కియే రాజధాని అంకారాలో ఆ దేశ విదేశాంగ మంత్రి హకన్ ఫిడాన్‌తో సమావేశమయ్యారు. అమెరికాకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడారు. గాజాలో సంక్షోభాన్ని నివారించే ప్రక్రియ పురోగతిలో ఉందని చెప్పారు. గాజాపై దాడులకు విరామం ఇవ్వాలని ఇజ్రాయెల్‌కు మరోసారి సూచించారు. ఇజ్రాయెల్–హమాస్ సంఘర్షణకు తెరదించడం, బందీలను విడిపించడంతోపాటు గాజాలోని పాలస్తీనియన్లకు మానవతా సాయం అందేలా చర్యలు తీసుకొనే లక్ష్యంతో మధ్య ప్రాచ్యం చేరుకున్న బ్లింకెన్ పాక్షికంగానే విజయం సాధించారు. మధ్యప్రాచ్యం చేరుకున్న అమెరికా జలాంతర్గామి ఇజ్రాయెల్–హమాస్ మధ్య ఘర్షణ మరింత ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో అమెరికా తన గైడెడ్ మిస్సైల్ జలాంతర్గామిని మధ్యప్రాచ్యానికి పంపించింది. ఓహాయో క్లాస్ సబ్‌మెరైన్ తనకు కేటాయించిన ప్రాంతంలో అడుగుపెట్టిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈజిప్టు రాజధాని కైరోకు ఈశాన్య దిక్కున సూయెజ్ కెనాల్లో జలాంతర్గామి ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. తమ గైడెడ్ మిస్సైల్ జలాంతర్గాముల ఎక్కడ మకాం వేశాయన్నది అమెరికా సైన్యం ఇలా బహిరంగంగా ప్రకటించడం అత్యంత అరుదు. తమ మిత్రదేశమైన ఇజ్రాయెల్ జోలికి ఎవరూ రావొద్దన్న హెచ్చరికలు జారీ చేయడానికే అమెరికా తన జలాంతర్గామిని మధ్యప్రాచ్యానికి తరలించినట్లు తెలుస్తోంది. ఖాన్ యూనిస్‌లోని భవన శిథిలాల్లో బాధితుల కోసం అన్వేíÙస్తున్న ఓ పాలస్తీనా వాసి ఉద్వేగం రఫాలో శిథిలాల మధ్య చిన్నారులు -
Israel-Hamas war: గాజా రక్తసిక్తం
ఖాన్ యూనిస్/రఫా/జెరూసలేం: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం భీకర స్థాయిలో దాడులు కొనసాగిస్తోంది. భూతల దాడులతోపాటు వైమానిక దళం బాంబులు ప్రయోగిస్తోంది. గాజా రక్తసిక్తంగా మారుతోంది. హమాస్ మిలిటెంట్లతోపాటు వందలాది మంది సాధారణ ప్రజలు మృత్యువాత పడుతున్నారు. మృతుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గాజా సిటీ సమీపంలో జబాలియా శరణార్థి శిబిరంలోని అపార్టుమెంట్లపై ఇజ్రాయెల్ సైన్యం రెండో రోజు బుధవారం కూడా దాడులు సాగించింది. పలు భవనాలు నేలమట్టమయ్యాయి. క్షతగాత్రులుగా మారి రక్తమోడుతున్న మహిళలను, చిన్నపిల్లలను శిథిలాల నుంచి బయటకు తీసుకొస్తున్న దృశ్యాలు కనిపించాయి. జబాలియాలో సాధారణ నివాస గృహాల మధ్య ఏర్పాటు చేసిన హమాస్ కమాండ్ సెంటర్‌ను, మిలిటెంట్ల సొరంగాలను ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. ఇక్కడ హమాస్ కీలక కమాండర్‌తోపాటు చాలామంది మిలిటెంట్లు హతమయ్యారని ప్రకటించింది. సాధారణ ప్రజలు 50 మందికిపైగానే మరణించినట్లు, వందలాది మంది గాయాలపాలైనట్లు తెలుస్తోంది. శరణార్థి శిబిరంలో ఇజ్రాయెల్ వైమానిక దాడులను ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)తోపాటు పాకిస్తాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. హమాస్ చెరలో 240 మంది బందీలు ఇజ్రాయెల్ సైన్యం–హమాస్ మిలిటెంట్ల మధ్య ఘర్షణ మొదలై మూడు వారాలు దాటింది. ఇజ్రాయెల్ దాడుల్లో గాజాలో ఇప్పటిదాకా 8,700 మందికిపైగా పాలస్తీనియన్లు మరణించారని, 22,000 మంది గాయపడ్డారని గాజా ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లో 122 మంది పాలస్తీనియన్లు చనిపోయారని వెల్లడించింది. హమాస్ చెరలో దాదాపు 240 మంది బందీలుగా ఉన్నారు. ఇప్పటివరకు నలుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. బందీగా ఉన్న ఒక ఇజ్రాయెల్ మహిళా జవాన్‌ను ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు విడిపించాయి. 34 మంది జర్నలిస్టులు బలి ఇజ్రాయెల్–హమాస్ యుద్ధంలో 34 మంది జర్నలిస్టులు మరణించారని ‘రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్’ సంస్థ వెల్లడించింది. ఇరు పక్షాలూ యుద్ధ నేరాలకు పాల్పడుతున్నాయని ఆరోపించింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గాజాలో పాలస్తీనియన్ జర్నలిస్టులు దారుణ హత్యలకు గురవుతున్నారని, వీటిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ జరపాలని పేర్కొంది. సాధారణ ప్రజలు నివాసం ఉండే ప్రాంతాల్లో హమాస్ మిలిటెంట్లు మకాం వేస్తున్నారని, తద్వారా ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. గాజాలో భారత సంతతి ఇజ్రాయెల్ సైనికుడు మృతి గాజాలో హమాస్ మిలిటెంట్లతో జరుగుతున్న ఘర్షణలో భారత సంతతి ఇజ్రాయెల్ సైనికుడు హలెల్ సోలోమాన్ (20) బుధవారం మృతిచెందాడు. దక్షిణ ఇజ్రాయెల్‌లోని డొమోనా పట్టణానికి చెందిన సోలోమాన్ హమాస్ మిలిటెంట్లపై వీరోచితంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. అతడి మృతిపట్ల డిమోనా మేయర్ సంతాపం ప్రకటించారు. డిమోనా పట్టణాన్ని ‘లిటిల్ ఇండియా’గా పిలుస్తుంటారు. భారత్ నుంచి వలస వచి్చన యూదులు ఇక్కడ స్థిరపడ్డారు. గాజాలో మిలిటెంట్ల దాడుల్లో ఇప్పటివరకు 11 మంది ఇజ్రాయెల్ సైనికులు మృతిచెందారు. బుధవారం ఒక్కరోజే 9 మంది మరణించారు. ఇంటర్నెట్, ఫోన్ సేవలకు అంతరాయం గాజాలో ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ సేవలు బుధవారం కొన్ని గంటలపాటు నిలిచిపోయాయి. సాయంత్రానికల్లా పునరుద్ధరించారు. ఇంటర్నెట్, ఫోన్ల సేవలకు తరచూ అంతరాయం కలుగుతుండడం వల్ల సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని స్వచ్ఛంద సంస్థలు చెబుతున్నాయి. ఇజ్రాయెల్‌కు ఆహారం, ఇంధనం ఎగుమతులు ఆపేయండి గాజాలో సాధారణ పాలస్తీనియన్ల ప్రాణాలను బలిగొంటున్న ఇజ్రాయెల్‌కు తగిన బుద్ధి చెప్పాలని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అన్నారు. ఇజ్రాయెల్‌కు ఆహారం, ఇంధనం ఎగుమతులను తక్షణమే నిలిపివేయాలని బుధవారం ఆస్లామిక్ దేశాలకు పిలుపునిచ్చారు. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న నేరాలకు తక్షణమే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇజ్రాయెల్‌ను ఏకాకిని చేయాలని, ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని ఇస్లామిక్ దేశాలకు సూచించారు. -
Libya Floods: లిబియాలో ఊహకందని మహా విషాదం
డెర్నా: అస్థిర ప్రభుత్వాలు, సంక్షోభం, ఎవరికీ పట్టని ప్రజా సంక్షేమంతో సమస్యల వలయంలో చిక్కిన లిబియాపై ప్రకృతి కత్తి గట్టింది. ఊహించని వరదలు, వరద నీటి ధాటికి పేకమేడల్లా కుప్పకూలిన రెండు డ్యామ్‌లు.. వరద విలయాన్ని మరింత పెంచాయి. డ్యామ్‌ల నుంచి దూసుకొచ్చిన నీటిలో కొట్టుకుపోయి జలసమాధి అయిన వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం నాటి గణాంకాల ప్రకారం డెర్నా సిటీలో వరద మృతుల సంఖ్య ఏకంగా 5,100 దాటింది. ఇంకా వేలాది మంది జాడ గల్లంతయిందన్న కథనాలు చూస్తుంటే అక్కడి పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. వరద ఉధృతికి ఇళ్లుసహా సర్వం కోల్పోయి నిరాశ్రయులైన వారు వేలాదిగా ఉన్నారు. డెర్నా సిటీ తీరప్రాంతంలోని పర్వతాలు, లోయలతో నిండిన నగరం. వరదల కారణంగా చాలా రోడ్లు దెబ్బతిని సహాయక బృందాలు వరద ముంపు ప్రాంతాలకు చేరుకోలేని పరిస్థితి. దీంతో చాలా చోట్ల సహాయక చర్యలు మొదలేకాలేదు. అతికష్టం మీద కొన్ని బృందాలు చేరుకుని జలమయమైన ఇళ్లలో బాధితుల కోసం అన్వేషణ మొదలుపెట్టాయి. నేలమట్టమైన భవనాలు, శిథిలాల కింద వెతికే కొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. 30 వేలు దాటిన వలసలు వరద ధాటికి సర్వం కోల్పోవడంతో దాదాపు 30 వేల మంది స్థానికులు పొట్టచేత పట్టుకుని వేరే ప్రాంతాలకు వలసవెళ్లారని ఐక్యరాజ్యసమితికి చెందిన మైగ్రేషన్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఈ సంఖ్య 40,000కుపైనే ఉంటుందని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్ సొసైటీ లిబియా ప్రతినిధి తమెర్ రమదాన్ అంచనావేశారు. రెండు ప్రభుత్వాల మధ్య నలిగి.. తూర్పు ప్రాంతంలో ఒక ప్రభుత్వం, మరో దిశలో ఇంకో ప్రభుత్వాల నిర్లక్ష్య ఏలుబడిలో ఉన్న లిబియాలో మౌలిక వసతుల కల్పన అరణ్యరోదనే అయ్యింది. ‘నగరంలో ఉన్న ఏకైక శ్మశానానికి తరలించేందుకు మృతదేహాలను ఒక దగ్గరకు చేరుస్తాం. ఈ జల విలయంలో 11 మంది కుటుంబసభ్యులను కోల్పోయి గుండెలవిసేలా రోది స్తున్న ఒకాయనను ఓదార్చడం ఎవరి తరం కావట్లేదు’ అని సహాయక బృంద సభ్యుడొకరు చెప్పారు. ‘ నా కుటుంబం మొత్తాన్నీ కోల్పోయా. వరదల్లో మా వాళ్ల మృతదేహాలు సముద్రం ఒడ్డుకు కొట్టుకొచ్చాయి’ అని అబ్దల్లా అనే వ్యక్తి వాపోయారు. రోడ్లలో పేరుకుపోయిన బురదను తొలగించేందుకు బుల్డోజర్లుతో రెండు రోజులుగా నిరంతరంగా పనిచేయిస్తున్నారు. అప్పుడుగానీ అత్యవసర సరుకుల్ని తరలించలేని దుస్థితి. వేరే పట్టణాలకు మృతదేహాల తరలింపు సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించే పరిస్థితు లు డెర్నీ సిటీలో కరువవడంతో వందలాది మృతదేహా లను సమీపంలోని పట్టణాలకు తరలిస్తున్నారు. మరణించిన వారిలో 84 మంది ఈజిప్టువాసులూ ఉన్నారు. దక్షిణాన ఉన్న బెనీ సుయెఫ్ రాష్ట్రంలో ఎల్–షరీఫ్ గ్రామంలో డజన్లకొద్దీ ఈజిప్షియన్లు జలసమాధి అయ్యారు. డెర్నాలో భీతావహ దృశ్యం నగరంలో చాలా చోట్ల మృతదేహాలు కనపడుతు న్నాయి. బురదనీటిలో కూరుకుపోయి, వీధుల్లోకి కొట్టుకొచ్చి, సముద్ర తీరం వెంట.. ఇలా చాలా ప్రాంతాల్లో స్థానికులు విగతజీవులై కనిపించారు. ఒక్కసారిగా నీరు రావడంతో ఎటూ తప్పించుకోలేని నిస్సహాయక స్థితి. ‘నగరంలో ఏ ప్రాంతంలో సహాయం చేసేందుకు వెళ్లినా అక్కడ మాకు చిన్నారులు, మహిళల మృతదేహాలే కనిపిస్తున్నాయి’ అని బెంఘాజీకి చెందిన ఒక సహాయకుడు ఫోన్లో మీడియా సంస్థకు చెప్పారు. ‘సిటీ శివార్లలోని డ్యామ్ బద్దలైన శబ్దాలు మాకు వినిపించాయి. నగరం గుండా ప్రవహించే వాదీ డెర్నీ నదిలో ప్రవాహ ఉధృతి అమాంతం ఊహించనంతగా ఎగసి జనావాసాలను ముంచేసింది. ‘ డ్యామ్ బద్దలవడంతో ఏకంగా ఏడు మీటర్ల ఎత్తులో దూసుకొచ్చిన ప్రవాహం తన మార్గంలో అడ్డొచ్చిన అన్నింటినీ కూల్చేసింది’ అని లిబియాలో రెడ్ క్రాస్ కమిటీ ప్రతినిధి బృంద సారథి యాన్ ప్రైడెజ్ చెప్పారు. మధ్యధరా ప్రాంతంలో సన్నని తీరప్రాంతంలో పర్వత పాదాల చెంత ఈ నగరం ఉంది. పర్వతాల నుంచి వచ్చిన వరద నీరు నగరాన్ని ముంచేస్తూ తీరం వైపు కిందకు ఉరకలెత్తడంతో వరద తీవ్రత భయంకరంగా ఉంది. వరద ధాటికి దక్షిణం వైపు కేవలం రెండు రోడ్లు మాత్రమే మిగిలిపోయాయి. కూలిన వంతెనలు నగరం మధ్య భాగాన్ని రెండుగా చీల్చాయి. దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గాయపడిన ఏడు వేలకుపైగా స్థానికులను మైదానాల్లోని తాత్కాలిక వైద్యశాలల్లో చికిత్సనందిస్తున్నారని తూర్పు లిబియాలోని అంబులెన్స్, అత్యవసర కేంద్రం అధికార ప్రతినిధి ఒసామా అలీ చెప్పారు. -
శవాల దిబ్బగా మొరాకో
మర్రకేశ్: భూకంపం సృష్టించిన పెను విధ్వంసం, ప్రాణనష్టం మొరాకో వాసులను షాక్‌కు గురిచేసింది. ఈ ఉత్తర ఆఫ్రికా దేశంలో ఇంతటి తీవ్ర భూకంపం రావడం 120 ఏళ్లలో ఇదే మొదటిసారి. దేశంలోని మర్రకేశ్, మరో అయిదు ప్రావిన్స్‌ల్లో శుక్రవారం అర్ధరాత్రి రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ప్రజలు భయాందోళనలతో వీధుల్లో రెండో రోజూ చీకట్లోనే జాగారం చేశారు. సహాయక చర్యలను ప్రభుత్వ యంత్రాంగం ముమ్మరం చేసింది. శిథిలాలను తొలగిస్తుండటంతో ఆదివారం నాటికి మృతుల సంఖ్య 2,012కు చేరింది. క్షతగాత్రులైన మరో 2,059 మందిలో 1,404 మందికి పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు చెబుతున్నారు. భవనాల శిథిలాల కింద చిక్కుకుని ఉన్న వారిని గుర్తించి, కాపాడేందుకు ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించింది. సుదూరంగా కొండ ప్రాంతాల్లో ఉన్న పల్లెలకు సహాయక బృందాలు చేరడం కష్టంగా మారింది. అక్కడి మట్టిరోడ్లపై బండరాళ్లు పడిపోవడంతో టాక్సీలు, అంబులెన్సులు, రెడ్ క్రాస్ సిబ్బంది వాహనాలు ముందుకు వెళ్లడం కష్టంగా మారింది. దీంతో సహాయక చర్యలు నెమ్మదిగా సాగుతున్నాయి. అక్కడ జరిగిన నష్టం వివరాలు కూడా వెల్లడైతే మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు. ఈ విలయానికి తీవ్రంగా ప్రభావితమైన అల్ హౌజ్ ప్రావిన్స్‌లో మరణాలు అత్యధికంగా 1,293 నమోదయ్యాయి. ఆ తర్వాత టరౌడంట్ ప్రావిన్స్‌లో 452 మంది చనిపోయారు. అమెరికా, ఇజ్రాయెల్, అల్జీరియా, జర్మనీ, యూఏఈ, జోర్డాన్ తదితర దేశాలతోపాటు డాక్టర్స్ వితౌట్ బోర్డర్స్ వంటి సంస్థలు చేయూత అందించేందుకు ముందుకు వచ్చాయి. కళతప్పిన పర్యాటక పట్టణం అట్లాస్ పర్వతాల్లో ఉన్న పర్యాటక ప్రాంతం మౌలే బ్రహీం భూకంపం ధాటికి విలవిల్లాడింది. మూడువేల జనాభా కలిగిన ఈ చిన్న పట్టణవాసుల ప్రధాన ఆధారం వ్యవసాయం, పర్యాటకం. ఇక్కడి వందల ఏళ్లనాటి ఇటుకతో నిర్మించిన ఇళ్లు పర్యాటకులను ఆకట్టుకునేవి. భూకంపం తీవ్రతకు ఈ ఇళ్లు చాలా వరకు నామరూపాలు కోల్పోగా మిగిలినవి పాక్షికంగా ధ్వంసమయ్యాయి. దీంతో, జనం ఇళ్లలోకి వెళ్లేందుకు జంకుతున్నారు. పట్టణంలోని కూడలిలోనే భారీ టెంట్ వేసుకుని, అందులోనే ఉంటున్నారు. అర్ధరాత్రి వేళ ఇల్లంతా ఒక్కసారిగా కదులుతున్నట్లు అనిపించడంతో తమ కుటుంబసభ్యులంతా కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీశామని మౌలే బ్రహీంకు చెందిన హంజా లంఘానీ చెప్పాడు. బయటికి వెళ్లాక చూడగా తమ ఇంటితోపాటు పొరుగిల్లు కూడా పూర్తిగా నేలమట్టమయ్యాయన్నాడు. పొరుగింట్లో ఉండే తన చిన్ననాటి స్నేహితులు అయిదుగురూ ఆ శిథిలాల కింద పడి ప్రాణాలు కోల్పోయారని నిర్వేదంతో చెప్పాడు. భారతీయులంతా సురక్షితం భూకంపం నేపథ్యంలో మొరాకోలోని భారత దౌత్యకార్యాలయం స్పందించింది. దేశంలోని భారత పౌరులెవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించినట్లు తమకు సమాచారం లేదన్నారు. స్థానిక యంత్రాంగం సూచనలను ఎప్పటికప్పుడు పాటిస్తూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాల్సిందిగా సలహా ఇచ్చింది. అవసరమైన పక్షంలో తమ హెల్ప్‌లైన్ నంబర్ 212661297491కు కాల్ చేయాల్సిందిగా కోరింది. -
యూపీలో వేర్వేరు ప్రమాదాల్లో 18 మంది...
షాజహాన్‌పూర్: ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్, శ్రావస్తి జిల్లాల్లో శనివారం చోటుచేసుకున్న రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 18 మంది దుర్మరణం పాలయ్యారు. షాజహాన్‌పూర్ జిల్లా అజ్మత్‌పూర్‌కు చెందిన సుమారు 30 మంది గ్రామంలో జరిగే భాగవత కథ కార్యక్రమం కోసం నీటిని తెచ్చేందుకు గర్రా నదికి ట్రాక్టర్‌పై బయలుదేరారు. నిగోహి రోడ్డులో వంతెనపై వెళ్తుండగా అదుపుతప్పి ట్రాక్టర్ ట్రాలీ నదిలో పడిపోయింది. ఘటనలో 8 మంది చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 12 మంది ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన 24 మందిలో ఏడుగురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు అంటున్నారు. మృతుల కుటుంబాలకు సీఎం యోగి ఆదిత్యనాథ్ రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున సాయం ప్రకటించారు. మరో ఘటన..శ్రావస్తి, బలరాంపూర్ జిల్లాలకు చెందిన కొందరు పంజాబ్‌లోని లూధియానాలో పనులు చేసుకుంటున్నారు. బంధువు అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీరు ఎస్‌యూవీలో బయలుదేరారు. ఆ వాహనం శనివారం వేకువజామున శ్రావస్తి జిల్లా ఇకౌనా ప్రాంతంలో అదుపుతప్పి రోడ్డు పక్క చెట్టును ఢీకొని, గుంతలో పడిపోయింది. ఘటనలో 9 ఏళ్ల బాలుడు సహా ఆరుగురు చనిపోయారు. మరో 8 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. -
Turkey–Syria Earthquake: 24 వేలు దాటిన భూకంప మృతుల సంఖ్య
అంకారా/న్యూఢిల్లీ: తుర్కియే(టర్కీ), సిరియాలో భూకంప మృతుల సంఖ్య ఏకంగా 24,000 దాటింది. సహాయక చర్యలతోపాటు శిథిలాల తొలగింపు ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. భీకర భూకంపం సంభవించి 100 గంటలు గడిచిపోయింది. శిథిలాల కింద మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. కొందరు సజీవంగా బయటపడడం ఊరట కలిగిస్తోంది. తుర్కియేలో శిథిలాలను తొలగిస్తుండగా శుక్రవారం ఒక్కరోజే 100 మందికిపైగా బాధితులు ప్రాణాలతో బయటకు వచ్చారు. కొన్నిచోట్ల హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. తీవ్రమైన చలిలో ఆకలి బాధలతో ప్రాణాలు నిలుపుకొనేందుకు వారుపడిన కష్టాలు వర్ణనాతీతం. శిథిలాల కింద ఇరుక్కుపోయి, బయటపడే మార్గం లేక కేవలం మూత్రం తాగి ఆకలిదప్పులు తీర్చుకున్నామని బాధితులు చెబుతుండడం కన్నీరు పెట్టిస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. తుర్కియేలో అంత్యక్రియల కోసం తీసుకొస్తున్న మృతదేహాలతో ఇప్పటికే శ్మశానాలు కిక్కిరిసిపోతున్నాయి. చాలా సమయం వేచి చూడాల్సి వస్తోందని మృతుల బంధువులు చెబుతున్నారు. ఈ భూకంపం ‘ఈ శతాబ్దపు విపత్తు’ అని తుర్కియే అధ్యక్షుడు తయీఫ్ ఎర్డోగాన్ వ్యాఖ్యానించారు. భూకంపం వల్ల తీవ్రంగా నష్టపోయిన తుర్కియేకు దాదాపు 95 దేశాలు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అసద్, ఆయన భార్య అస్మా శుక్రవారం అలెప్పో యూనివర్సిటీ ఆసుపత్రిలో భూకంప మృతులను పరామర్శించారు. భూకంపం సంభవించినప్పటి నుంచి ఆయన బహిరంగంగా కనిపించడం ఇదే మొదటిసారి. 75,000 మంది నిరాశ్రయులు భూకంపం వల్ల తుర్కియేలో ఇప్పటిదాకా 18,900 మంది మరణించారని, దాదాపు 75,000 మంది గాయపడ్డారని తుర్కియే డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వెల్లడించింది. ఇళ్లు కూలిపోవడంతో 75,000 మందికిపైగా జనం నిరాశ్రయులైనట్లు అంచనా వేస్తున్నామని తెలిపింది. సిరియాలో భూకంపం కారణంగా 3,300 మందికిపైగా ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం ధ్రువీకరించింది. రెండు దేశాల్లో కలిపి ఇప్పటివరకు 22,000 మందికి పైగా బలైనట్లు తెలుస్తోంది. తుర్కియేలో 12,000 దాకా భవనాలు నేలమట్టం కావడమో లేక దెబ్బతినడమో జరిగిందని మంత్రి మురాత్ కరూమ్ చెప్పారు. తుర్కియే ప్రజలకు అండగా ఉంటాం: మోదీ ‘ఆపరేషన్ దోస్త్’లో భాగంగా తుర్కియేలో భూకంప ప్రభావిత ప్రాంతాల్లో మన దేశ సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం తెలిపారు. రిలీఫ్, రెస్క్యూ ఆపరేషన్లలో చురుగ్గా పాల్గొంటున్నాయని చెప్పారు. సాధ్యమైనంత ఎక్కువ మంది ప్రాణాలను, ఆస్తులను కాపాడడానికి మన బృందాలు కృషి చేస్తూనే ఉంటాయని ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సంక్షోభ సమయంలో తుర్కియే ప్రజలకు భారత్ పూర్తిస్థాయిలో అండగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు.