కుందుజ్: అఫ్గానిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి బదక్షన్ ప్రావిన్సులోని కోహిస్తాన్ జిల్లాలో ఉన్న ఓ బంగారు గనిలో కార్మికులు పనిచేస్తుండగా గోడ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ దుర్ఘటనలో దాదాపు 30 మంది ప్రాణాలు కోల్పోగా, ఏడుగురికి గాయాలయ్యాయి. ఈ విషయమై కోహిస్తాన్ గవర్నర్ మొహమ్మద్ రుస్తమ్ రఘీ మాట్లాడుతూ.. ఇక్కడి గ్రామస్తులు నదీతీరంలో బంగారం కోసం 200 అడుగుల లోతైన గనిని తవ్వారని తెలిపారు. అనంతరం లోపలకు దిగి తవ్వకాలు జరుపుతుండగా పైనున్న గోడ ఒక్కసారిగా విరిగిపడిపోయిందని వెల్లడించారు. మరింత లోతుగా గనిని తవ్వేందుకు గ్రామస్తులు యంత్రాన్ని ఉపయోగిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందన్నారు.
వీరంతా సాధారణ గ్రామీణులనీ, నిపుణులు కారని వ్యాఖ్యానించారు. ఈ గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా ఖనిజాలను తవ్వుతున్నారనీ, వీటిపై ప్రభుత్వ నియంత్రణ లేదని స్పష్టం చేశారు. ప్రమాదం గురించి తెలియగానే సహాయక బృందాలను పంపామన్నారు. క్షతగాత్రులను రక్షణశాఖ హెలికాప్టర్ల ద్వారా ఆసుపత్రులకు తరలించామని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముందన్నారు. ఈ ప్రమాదంలో చనిపోయినవారి కుటుంబాలకు 50,000 అఫ్గానీలు, క్షతగాత్రుల కుటుంబాలకు 10,000 అఫ్గానీలు నష్టపరిహారంగా అందిస్తామని ప్రకటించారు. అఫ్గానిస్తాన్ లో అక్రమ మైనింగ్‌అన్నది సర్వసాధారణం. తాలిబన్ ఉగ్రవాదులు ఆదాయం కోసం ప్రధానంగా మైనింగ్‌పైనే ఆధారపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment