కాబూల్: అఫ్గానిస్తాన్‌లో పోలీసు బలగాలే లక్ష్యంగా తాలిబాన్ దాడులు ముమ్మరం చేశారు. గత రెండు రోజులుగా జరిపిన వేర్వేరు దాడుల్లో 47 మంది పోలీసులతో సహా మొత్తం 57 మందిని పొట్టనబెట్టుకున్నారు. దేశంలో అంతర్యుద్ధం సమసిపోయేందుకు మాస్కోలో చర్చలు ప్రారంభమైన తరుణంలోనే తాలిబాన్ రెచ్చిపోవడం గమనార్హం. ప్రావిన్షియల్ రాజధాని కుందుజ్ సెక్యూరిటీ పోస్ట్‌పై మంగళవారం వేకువజామున విరుచుకుపడ్డ తాలిబన్లు 23 మంది సైనికులు, ముగ్గురు పోలీసులు సహా 26 మందిని చంపేశారు.
అంతకుముందు ఉత్తర బఘ్లాన్ ప్రావిన్స్ బఘ్లానీ మర్కాజీ జిల్లాలోని పోలీసు ఔట్‌పోస్ట్‌పై తాలిబన్లు జరిపిన దాడిలో 11 మంది పోలీసులతోపాటు మొత్తం 21 మంది చనిపోయారు. మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. అదేవిధంగా ఉత్తర సమంగన్ ప్రావిన్సులో గ్రామ రక్షక దళానికి చెందిన 10 మందిని తాలిబన్లు చంపేశారు. అఫ్గానిస్తాన్‌లో అంతర్యుద్ధం సమసిపోయేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రష్యా మధ్యవర్తిత్వంతో మాస్కోలో తాలిబాన్, అఫ్గాన్ ప్రముఖులు, ప్రతిపక్షాల నేతలు, గిరిజన పెద్దలతో సమావేశం ప్రారంభం కానుండగానే తాలిబాన్ ఈ దాడులకు తెగబడటం గమనార్హం. ఈ సమావేశానికి ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదు. అయితే, దేశంలో శాంతి స్థాపన సాధనకు జరిగే ఎలాంటి ప్రయత్నమైనా అఫ్గాన్ ప్రభుత్వమే కేంద్రంగా ఉండాలని కీలక నేత అబ్దుల్లా అబ్దుల్లా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment