Taliban militants attack
-
తాలిబాన్ దాడిలో 47 మంది పోలీసుల మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్‌లో పోలీసు బలగాలే లక్ష్యంగా తాలిబాన్ దాడులు ముమ్మరం చేశారు. గత రెండు రోజులుగా జరిపిన వేర్వేరు దాడుల్లో 47 మంది పోలీసులతో సహా మొత్తం 57 మందిని పొట్టనబెట్టుకున్నారు. దేశంలో అంతర్యుద్ధం సమసిపోయేందుకు మాస్కోలో చర్చలు ప్రారంభమైన తరుణంలోనే తాలిబాన్ రెచ్చిపోవడం గమనార్హం. ప్రావిన్షియల్ రాజధాని కుందుజ్ సెక్యూరిటీ పోస్ట్‌పై మంగళవారం వేకువజామున విరుచుకుపడ్డ తాలిబన్లు 23 మంది సైనికులు, ముగ్గురు పోలీసులు సహా 26 మందిని చంపేశారు. అంతకుముందు ఉత్తర బఘ్లాన్ ప్రావిన్స్ బఘ్లానీ మర్కాజీ జిల్లాలోని పోలీసు ఔట్‌పోస్ట్‌పై తాలిబన్లు జరిపిన దాడిలో 11 మంది పోలీసులతోపాటు మొత్తం 21 మంది చనిపోయారు. మరో ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. అదేవిధంగా ఉత్తర సమంగన్ ప్రావిన్సులో గ్రామ రక్షక దళానికి చెందిన 10 మందిని తాలిబన్లు చంపేశారు. అఫ్గానిస్తాన్‌లో అంతర్యుద్ధం సమసిపోయేందుకు తీసుకోవాల్సిన చర్యలపై రష్యా మధ్యవర్తిత్వంతో మాస్కోలో తాలిబాన్, అఫ్గాన్ ప్రముఖులు, ప్రతిపక్షాల నేతలు, గిరిజన పెద్దలతో సమావేశం ప్రారంభం కానుండగానే తాలిబాన్ ఈ దాడులకు తెగబడటం గమనార్హం. ఈ సమావేశానికి ప్రభుత్వానికి ఆహ్వానం అందలేదు. అయితే, దేశంలో శాంతి స్థాపన సాధనకు జరిగే ఎలాంటి ప్రయత్నమైనా అఫ్గాన్ ప్రభుత్వమే కేంద్రంగా ఉండాలని కీలక నేత అబ్దుల్లా అబ్దుల్లా పేర్కొన్నారు. -
అఫ్గాన్‌లో ఆత్మాహుతి దాడి: 19 మంది మృతి
కాబుల్: అఫ్గానిస్తాన్ వరుసగా రెండోరోజు రక్తమోడింది. జలాలాబాద్‌లో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 19 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. తాలిబన్ ఉగ్రవాదులు, భద్రతా దళాలు, పౌరులు లక్ష్యంగా రెండు రోజుల్లో రెండు దాడులు చోటుచేసుకున్నాయి. శనివారం నాటి దాడిలో కనీసం 36 మంది మృతిచెందారు. తాజా ఆత్మాహుతి దాడి కూడా ఐఎస్ పనే అని భావిస్తున్నారు. కాల్పుల విరమణ ఒప్పందంలో లేని ఐఎస్ గతంలో తాలిబన్లతో ఘర్షణ పడిన ఉదంతాలున్నాయి. ఐఎస్‌కు అనుబంధంగా పనిచేస్తున్న స్థానిక సంస్థకు జలాలాబాద్‌లో అధిక ప్రాబల్యం ఉంది. మరోవైపు, కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 9 రోజులు పొడిగిస్తున్నట్లు అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ చేసిన ప్రకటనను తాలిబన్ తోసిపుచ్చింది. ఆ ఒప్పందం ముగిసిందని, దాన్ని కొనసాగించే ఉద్దేశం తమకు లేదని తేల్చిచెప్పింది. -
బుర్ఖాలో ఉగ్రవాదులు.. అగ్రికల్చర్ వర్సిటీపై దాడి
పెషావర్ : తాలిబన్ ఉగ్రవాదుల దాడిని పాక్ సైన్యం తిప్పికొట్టింది. బుర్ఖాలో వచ్చిన ఉగ్రవాదులు శుక్రవారం వ్యవసాయ వర్సిటీలో నిర్దాక్షిణ్యంగా కాల్పులు చేపట్టారు. ఘటనలో 12 మంది మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఎదురుకాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులను పాక్ సైన్యం హతమార్చింది. బుర్ఖాలో మహిళలతో కలిసి ఉగ్రవాదులు కనిపించిన వారిపైనా బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ క్రమంలో ఓ బాంబు కూడా పేల్చినట్లు తెలుస్తోంది. అప్రమత్తమైన భద్రతాదళాలు క్యాంపస్‌ను చుట్టుముట్టి తమ ఆధీనంలోకి తీసుకుని ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ముగ్గురు ఉగ్రవాదులను మట్టుపెట్టినట్లు సైన్యం ప్రకటించింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి.. ప్రస్తుతం చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతా దళాలు సోదాలు చేపట్టాయి. ఐఎస్ఐ తమను లక్ష్యంగా చేసుకున్నందునే ఈ దాడికి పాల్పడినట్లు తాలిబన్ ప్రకటించుకుంది. కాగా, ఇద్ మిలాదున్ నబీ సందర్భంగా సెలవు రోజు కావటంతో రద్దీ తక్కువగా ఉందని అధికారులు చెబుతున్నారు. -
జైలుపై తాలిబాన్ దాడి..350 మంది ఖైదీల పరారీ
ఘజ్ని: అఫ్ఘానిస్తాన్‌లో ఓ జైలుపై తాలిబాన్ మిలిటెంట్లు దాడికి తెగబడి, వందలాది మంది ఖైదీలను విడిపించారు. ఘజ్ని నగరంలో సోమవారం వేకువజామున 2.30కి సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు జైలు ముందు కారు బాంబు పేల్చడంతో గేట్లు బద్దలయ్యాయి. 350 మందికిపైగా ఖైదీలు తప్పించుకున్నారు. ఈ ఘటనలో నలుగురు అఫ్ఘాన్ పోలీసు అధికారులు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. జైలు తమ అధీనంలో ఉందని, అమాయకులకు స్వేచ్ఛను కల్పించామని తాలిబాన్ ప్రతినిధి చెప్పాడు.