
తాలిబన్ పాలనలో నిర్బంధాలు
కాబూల్: రంజాన్ మాసంలో మసీదుకు వెళ్లని వారితోపాటు జుత్తు సరిగ్గా కట్ చేయించుకోని వారిని కూడా అఫ్గానిస్తాన్ తాలిబన్ పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. నిబంధనలకు అనుగుణంగా జుత్తు కత్తిరించని క్షురకులను సైతం కటకటాల వెనక్కి నెట్టేస్తున్నారు. ఇందుకు సంబంధించిన నియమ నిబంధనలను ప్రకటించిన ఆరు నెలల అనంతరం వాటిని పాటించని వారిపై తాలిబన్లు చర్యలు తీసుకుంటున్నట్లు ఐక్యరాజ్యసమితి గురువారం వెలువరించిన నివేదికలో పేర్కొంది.
పౌరులు దైనందిన జీవితంలో ముఖ్యంగా రవాణా, సంగీతం, షేవింగ్, వేడుకల సమయంలో ఎలా మెలగాలో నిర్దేశిస్తూ తాలిబన్ పాలకులు గతేడాది ఆగస్ట్‌లో నియమ నిబంధనలను ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో మహిళల స్వరం వినిపించరాదు, వారి ముఖాలు కనిపించరాదనేవి కూడా ఇందులో ఉన్నాయి. వీటిపై అప్పట్లోనే ఐరాస అభ్యంతరం తెలిపినా తాలిబన్లు పట్టించుకోలేదు.
ఆగస్ట్ తర్వాత అరెస్టయిన వారిలో సగం మంది ఇలా నిబంధనలు పాటించని వారేనని ఐరాస అఫ్గానిస్తాన్ మిషన్ పేర్కొంది. గడ్డం పొడవు, జుత్తు నిర్దేశించిన మేరకు లేకున్నా గడ్డం ట్రిమ్మింగ్ చేసిన క్షురకులను నైతిక విభాగం పోలీసులు నిర్బంధిస్తున్నారని తెలిపింది. ఇటువంటి అరెస్ట్‌లపై ఎలాంటి చట్టపరమైన ప్రక్రియలను అమలు చేయడం లేదని, ఇదంతా ఏకపక్షంగా సాగుతోందని పేర్కొంది.
రంజాన్ మాసంలో సామూహిక ప్రార్ధనలను తాలిబన్లు తప్పనిసరి చేశారు. నిఘా పెట్టిన నైతిక పోలీసులు సామూహిక ప్రార్థనల్లో పాలుపంచుకోని వారిని ఎలాంటి హెచ్చరికలు లేకుండానే అదుపులోకి తీసుకుంటున్నట్లు నివేదిక వెల్లడించింది.
ఇలాంటి చర్యలతో చిన్న వ్యాపారాలు, ప్రైవేట్ విద్యాసంస్థలు, హెయిర్ డ్రెస్సింగ్ సెంటర్లు, టైలర్లు, రెస్టారెంట్లు, వెడ్డింగ్ కేటరర్లకు పని దొరక్కుండా పోయిందని, ఆయా వ్యాపారాలు మూతబడే పరిస్థితికి చేరుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న సామాన్యుల జీవనం మరింత భారంగా మారిందని ఐరాస తెలిపింది.
మహిళలకు విద్య, ఉద్యోగావకాశాలు లేకుండా చేయడంతో అఫ్గానిస్తాన్ ఏడాదికి 14 బిలియన్ డాలర్ల మేర నష్టపోతోందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. అయితే, అఫ్గాన్ సమాజం, ప్రజలను సంస్కరించేందుకే ఇస్లామిక్ చట్టాలను అమలు చేస్తున్నామని తాలిబన్ నేత హైబతుల్లా అఖుంద్‌జాదా చెప్పుకుంటున్నారు. నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 3,300 మంది ఇన్‌స్పెక్టర్లను తాలిబన్ ప్రభుత్వం నియమించింది.