నైపిడావ్: మయన్మార్‌లోని యాగీ తుఫాను విలయం కొనసాగుతూనే ఉంది. దేశాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. వాటి ధాటికి ఇప్పటిదాకా ఏకంగా 236 మంది మృతి చెందారని ప్రభుత్వ సంస్థ గ్లోబల్ న్యూ లైట్ ఆఫ్ మయన్మార్ మంగళవారం వెల్లడించింది. ఈ సంఖ్య పెరగవచ్చని ఐరాస మానవతా వ్యవహారాల సమన్వయ కార్యాలయం (ఓసీహెచ్ ఏ) పేర్కొంది. ‘‘77 మంది గల్లంతయ్యారు. కనీసం 6 లక్షల మందికి పైగా వరదల బారిన పడ్డారు’’ అని ఒక ప్రకటనలో తెలిపింది.
దక్షిణ చైనా, వియత్నాం, లావోస్, మయన్మార్‌లో గత వారం భారీ వర్షాలు కురిశాయి. ఉత్తర వియత్నాంలో ఇప్పటికే వందలాది మంది మరణించినట్లు నిర్ధారించారు. మయన్మార్‌లో రాజధాని నైపిడావ్, సెంట్రల్ మాండలే, కయా, కయిన్, షాన్ స్టేట్స్ సహా కనీసం తొమ్మిది ప్రాంతాలు, రాష్ట్రాలను వరదలు ప్రభావితం చేశాయి. 2023లో మోచా తుఫాను వేళ అంతర్జాతీయ సాయాన్ని తిరస్కరించిన సైనిక పాలకులు ఇప్పుడు మాత్రం సాయానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
సైనిక ప్రభుత్వంతో సమస్య
ఆహారం, తాగునీరు, మందులు, బట్టలు, ఆశ్రయం మయన్మార్‌కు అత్యవసరమని ఓసీహెచ్‌ఏ పేర్కొంది. దెబ్బతిన్న రోడ్లు, వంతెనలు, అస్థిరమైన టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సహాయక చర్యలకు ఆటంకంగా మారాయని తెలిపింది. పొరుగు దేశాల సాయం బాధితులకు అందాలంటే సైన్యం పౌర సమాజంతో కలిసి పని చేయడం ముఖ్యమని అంతర్జాతీయ మానవ హక్కుల నిపుణుల స్వతంత్ర సమూహం ఏఎస్‌ఏసీ–ఎం తెలిపింది. కానీ మెజారిటీ ప్రజలకు సాయమందేలా చూడాలనే ఉద్దేశం సైనిక ప్రభుత్వానికి లేదని ఒక ప్రకటనలో ఆక్షేపించింది. సైన్యం దేశంలో మానవతా సంక్షోభాన్ని సృష్టించిందని, ప్రజలను గాలికొదిలి సొంత సైనిక, రాజకీయ ఎజెండాతో ముందుకు వెళ్తోందని ఆరోపించింది. నిధుల సమస్యతో కూడా సహాయక చర్యలు నత్తనడకన సాగుతున్నాయని ఓసీహెచ్‌ఏ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment