వివిధ ఘటనల్లో 14 మంది మృతి
మనీలా: ఫిలిప్పీన్స్‌ను ‘యాగి’తుపాను వణికిస్తోంది. పలుప్రాంతాలను వరదలు ముంచెత్తాయి. కొండచరియలు విరిగి పడిన ఘటనల్లో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. రాజధాని మనీలాలో మరికినా నది ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. మనీలాతోపాటు అత్యధిక జనసాంద్రత కలిగిన లుజాన్ ప్రాంతంలో అధికారులు ముందు జాగ్రత్తగా విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు.
క్వెజాన్ ప్రావిన్స్‌లోని ఇన్ఫాంటా పట్టణంలో ఈదురుగాలుల తీవ్రతకు నివాసాలు దెబ్బతిన్నాయి. రిజాల్ ప్రావిన్స్‌లోని అంటిపొలో సిటీలో ఇళ్లు కూలిన ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు నీట మునిగారు. సమర్ ప్రావిన్స్‌లోని సెబులో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నలుగురు చనిపోగా 10 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు. కామరిన్స్ సుర్ ప్రావిన్స్‌లోని నాగా నగరంలో వరద నీటిలో మరో ముగ్గురు చనిపోయారు.
మనీలాకు దక్షిణాన ఉన్న కావిట్ ప్రావిన్స్‌లో నివాస ప్రాంతాల్లోకి నడుములోతుకు పైగా వరద చేరడంతో యంత్రాంగం బోట్ల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. తుపాను కారణంగా పలు నౌకాశ్రయాల్లో 3,300 మంది ఫెర్రీ ప్రయాణికులు, సిబ్బంది చిక్కుబడి పోయారు. పలు దేశీయ విమాన సరీ్వసులను రద్దు చేశారు. మనీలాలోని నవోటాస్ పోర్టులో రెండు ఓడలు ఢీకొన్నాయి. అనంతరం ఒక ఓడ బలమైన గాలుల తీవ్రతకు వంతెనను ఢీకొనడంతో తీవ్రంగా దెబ్బతింది. ఓడలో మంటలు చెలరేగడంతో అందులోని సిబ్బందిని కాపాడారు.
పసిఫిక్ రింగ్‌ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఫిలిప్పీన్స్‌పై ఏటా 20కి పైగా తుపాన్లు ప్రభావం చూపిస్తుంటాయి. 2013లో సెంట్రల్ ఫిలిప్పీన్స్‌లో సంభవించిన భీకర తుపాను హయియాన్‌తో కనీసం 7,300 మంది చనిపోవడమో లేక గల్లంతవ్వడమో జరిగింది. మరో 50 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment