ఫ్లోరిడా : హెలెన్ తుఫాను సృష్టించిన బీభత్సం నుంచి బయటపడకముందే అమెరికాను మరో తుఫాను భయపెడుతోంది. ఫ్లోరిడా తీరం వైపు మిల్టన్ హరికేన్ దూసుకొస్తోంది. మిల్టన్ ఐదో కేటగిరీ హరికేన్‌గా బలపడిందని, అత్యంత శక్తిమంతమైన ఈ తుఫాను వల్ల ప్రాణహాని ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఫ్లోరిడా పశి్చమ తీరం వైపు కదులుతున్న మిల్టన్.. బుధవారం తీరం దాటే అవకాశం ఉంది.
తుఫాను ఉధృతితో బుధవారం తెల్లవారుజామునుంచే తీవ్రమైన గాలులు వీస్తాయని ఎన్‌హెచ్‌సీ హెచ్చరించింది. మిల్టన్ ఐదో కేటగిరీ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలను సురక్షిత స్థానాలకు తరలిస్తున్నారు. ఈ అతిపెద్ద తరలింపు ప్రయత్నానికి సిద్ధం కావాలని గవర్నర్ రాన్ డిసాంటిస్ ప్రజలను కోరారు. మిల్టన్ మార్గంలోని విమానాశ్రయాలు మూసివేశారు. తుఫాను హెచ్చరికలతో ప్రజలు తమ ఇళ్ల నుంచి ఒకేసారి బయటకు రావడంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి.
మిల్టన్ తుఫాను.. హరికేన్లను వర్గీకరించడానికి ఉపయోగించే సాఫిర్–సింప్సన్ స్కేలుపై మిల్టన్ ఐదో కేటగిరీగా నమోదైనది. ఈ తుఫాను సమయంలో గాలులు గంటకు 285 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని నేషనల్ హరికేన్ సెంటర్ (ఎన్‌హెచ్‌సీ) తెలిపింది. మొదట రెండో కేటగిరీలో ఉన్న తుఫాను కొన్ని గంటల్లోనే 5వ కేటగిరీకి మారింది. ఇంత వేగంగా తుఫాను బలపడటం నమ్మశక్యంగా లేదని ఫ్లోరిడా వాతావరణ నిపుణులు చెబుతున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంతా ఈ హరికేన్ బలపడిందంటున్నారు.
ఒక శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని తాకిన అత్యంత తీవ్రమైన తుఫాను ఇదే కావచ్చని చెబుతున్నారు. హరికేన్లు మూడో కేటగిరీ దాటితేనే తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టం జరుగుతుంది. గత నెలలో ఫ్లోరిడాను తాకిన హెలెన్ తుఫాను నాలుగో కేటగిరీకి చెందింది. గంటకు 225 కి.మీ. వేగంతో గాలులు వీయడంతో ఆస్తి నష్టం జరిగింది. దీని ధాటికి నార్త్ కరోలినా, సౌత్ కరోలినా, జార్జియా, ఫ్లోరిడా, టేనస్సీ, వర్జీనియాలో దాదాపు 230 మంది మరణించారు. ఇంకా మృతదేహాలను వెలికి తీస్తూనే ఉన్నారు. సాధారణం కంటే 2024 హరికేన్ సీజన్ తీవ్రంగా ఉందని నేషనల్ ఓషియానిక్ అటా్మస్ఫియరిక్ అసోసియేషన్ (ఎన్‌ఓఏఏ) అంచనా వేసింది. మానవుల వల్ల ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా సముద్ర మట్ట ఉష్ణోగ్రతలు పెరగడమే ఇందుకు కారణమని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment