
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందంపై అమెరికా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌లో యుద్ధం ఆపడం సాధ్యం కాకపోతే తమ ప్రయత్నాలు విరమించుకుంటామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉక్రెయిన్ (Ukraine) యుద్ధం ముగించడం సాధ్యంకాని పక్షంలో.. చర్చల ప్రయత్నాలు ఆపేసి అమెరికా తన దారి తాను చూసుకుంటుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తేల్చి చెప్పారు. ఈ యుద్ధాన్ని మేం ప్రారంభించలేదు. ఇన్నాళ్లూ కేవలం ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నాం. ఇది మా యుద్ధం కాదు కాబట్టి ముగించాలనుకుంటున్నాం అని మార్కో రూబియో అన్నారు.
ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఈ యుద్ధాన్ని ఓ ముగింపునకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. అలాగని నెలలు, సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉండబోరు. ఆయనకు ప్రపంచంలో ఇతర ప్రాధాన్యాలు కూడా ఉన్నాయి. చర్చల్లో గనుక పురోగతి కనిపించకపోతే ఆయన దీనిని వదిలేస్తానన్నారు అని రుబియో వెల్లడించారు.
తాజాగా ఐరోపా నేతలతో భేటీ సందర్భంగా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతి తొందరలోనే ఇది సాకారం కావచ్చని పేర్కొన్నారు. అమెరికా ఓ శాంతిఒప్పందం ముసాయిదా తయారుచేసి ఐరోపా నేతలకు వెల్లడించింది. వారినుంచి సానుకూల స్పందనలు వచ్చినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇక దీనినే మార్కో రూబియో రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌కు వెల్లడించారు.