
రోమ్: ఉక్రెయిన్ సంక్షోభం ముగింపు దిశగా కీలక అడుగు పడిందా?. ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరిపేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమ్మతి తెలిపారా?. శుక్రవారం అమెరికా దౌత్యవేత్తతో జరిగిన చర్చల సారాంశం ఇదేనని తెలుస్తుండగా.. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఈ విషయంపై నేరుగా ప్రకటన చేయడం గమనార్హం.
పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల్లో(Pope Francis Funeral) పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోమ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒప్పందానికి చాలా దగ్గరగా పరిస్థితులు వచ్చాయని వ్యాఖ్యానించారు. ‘‘చర్చల్లో ఒక మంచి రోజు. రష్యా ఉక్రెయిన్‌లు నేరుగా సమావేశం అయ్యేందుకు అంగీకరించాయి. చాలావరకు అంశాలపై సానుకూలంగా రెండు దేశాలు స్పందించాయా’’ అని మీడియాతో ప్రకటించారాయన. ఆ తర్వాత ఇదే విషయాన్ని ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు.
మరోవైపు.. క్రెమ్లిన్(Kremlin) వర్గాలు తమ అధ్యక్షుడు పుతిన్, విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో అమెరికా దౌత్యవేత్త స్టీవ్ విట్కాఫ్‌తో జరిగిన చర్చ సానుకూలంగా జరిగిందని ప్రకటించింది. ఇదిలా ఉంటే.. శాంతి ఒప్పందానికి తాము సిద్ధమేనని, అయినప్పటికీ ఎట్టిపరిస్థితుల్లో క్రిమియాను వదులుకునేందుకు ఉక్రెయిన్ ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేదని ఆ దేశ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్‌స్కీ ప్రకటించారు. కానీ, శుక్రవారం టైమ్ మ్యాగజైన్ విడుదల చేసిన ట్రంప్ ఇంటర్వ్యూలో.. క్రిమియా రష్యాతోనే ఉంటుందని, జెలెన్‌స్కీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించడం గమనార్హం.
అమెరికన్ బిలియనీర్ అయిన స్టీవ్ విట్‌కాఫ్(Steve Witkoff).. ట్రంప్‌కు అత్యంత నమ్మకస్తుడు కూడా. అందుకే ఆయన్ని ఈ శాంతి చర్చల్లో మధ్యవర్తిత్వం కోసం ట్రంప్ ప్రయోగించారు. అయితే ఉక్రెయిన్‌ను రెచ్చగొట్టేలా ఆయన తరచూ వ్యాఖ్యలు చేస్తుండడం గమనార్హం.
ఇదిలా ఉంటే.. చర్చల్లో పురోగతి గనుక చోటు చేసుకుంటే తాను మధ్యవర్తిత్వం నుంచి తప్పుకుంటానంటూ ట్రంప్ గత కొంతకాలంగా చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఆయనకు చాలా బాధ్యతలు ఉన్నాయని.. ఈ సాగదీత వ్యవహారం ఇలాగే కొనసాగితే పెద్దన్న పాత్ర నుంచి ఆయన తప్పుకుంటారని వైట్‌హౌజ్ వర్గాలు కూడా ఈ విషయాన్ని ధృవీకరించాయి. ఈలోపే.. చర్చల్లో పురోగతి చోటు చేసుకుందన్న ప్రకటన వెలువడడం గమనార్హం.
2022 ఫిబ్రవరిలో రష్యా బలగాలు ఉక్రెయిన్ ఆక్రమణతో మొదలు పెట్టిన యుద్ధం.. నేటికీ కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధంలో ఇరువైపుల నుంచి వేల మంది మరణించగా.. ఆస్తి నష్టం ఊహించని స్థాయిలోనే జరిగింది. తాజాగా.. రష్యా కీవ్‌పై జరిపిన దాడుల్లో 12 మంది మరణించారు. ఈ కారణంగా పోప్ అంత్యక్రియలకు జెలెన్‌స్కీ హాజరు కాకపోవచ్చనే చర్చ నడుస్తోంది. మరోవైపు.. విట్‌కాఫ్‌తో పుతిన్ చర్చ జరగడానికి కొన్నిగంటల ముందే.. మాస్కో శివారులో కారు బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా జనరల్ యరోస్లావ్ మోస్కాలిక్ కన్నుమూయడం విశేషం. అయితే ఇది ఉక్రెయిన్ పనేనని రష్యా ఆరోపిస్తుండగా.. కీవ్ వర్గాలు ఇంతదాకా ఎలాంటి స్పందన చేయలేదు.
తాను అగ్రరాజ్య అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ఈ సంక్షోభానికి ముగింపు పలకాలని ట్రంప్ ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ఈ క్రమంలో ఇటు పుతిన్‌పై, అటు జెలెన్‌స్కీ తీరుపై(దాడులు కొనసాగిస్తుండడం.. చర్చలకు అడుగులు ముందుకు పడకుండా చేస్తుండడం) ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.