వూహాన్‌లో షాపులోకి వెళ్లే ముందు చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్న వినియోగదారులు
బీజింగ్: చైనాలో కరోనా వైరస్ ధాటికి ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. రోజు రోజుకి కరోనా వైరస్ కాటేసిన వారి సంఖ్య పెరిగిపోతోంది. శరవేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తోంది. దగ్గు, జలుబుతో మొదలయ్యే లక్షణాలు సార్స్, న్యుమోనియా వంటి వ్యాధుల్లోకి దింపుతోంది. దీంతో ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటికి కరోనా వైరస్ సోకి 56 మంది ప్రాణాలు కోల్పోగా 2వేల కరోనా కేసులు నమోదైనట్టు చైనా సర్కార్ ప్రకటించింది.
వివిధ దేశాలకు విస్తరణ
చైనాలో వూహాన్ నగరంలో తొలిసారిగా బయటపడిన కరోనా వైరస్ మెల్లమెల్లగా అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, హాంగ్‌కాంగ్, మలేసియా, నేపాల్, సింగపూర్, దక్షిణ కొరియా, తైవాన్, థాయ్‌ల్యాండ్, వియత్నాం తదితర దేశాలకు వ్యాపించింది. పాకిస్తాన్‌కు కూడా ఈ వైరస్ విస్తరించినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనా నుంచి వచ్చిన నలుగురు పాకిస్తానీయులకి ముల్తానా, లాహోర్ నగరాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు చైనాలో ఉన్న అమెరికా పౌరులు, సిబ్బందిని వెనక్కి తీసుకురావడానికి ఆ దేశం ప్రత్యేక విమానాన్ని పంపింది. ఫ్రాన్స్ ప్రత్యేకంగా బస్సుల్ని ఏర్పాటు చేసి తమ దేశ పౌరుల్ని వెనక్కి తీసుకువచ్చేస్తోంది.
భారత్‌లోనూ భయాందోళనలు
చైనా నుంచి భారత్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాల్లో క్షుణ్నంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. దగ్గు, జలుబు ఉన్న వారిని ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డుల్లో ఉంచి చికిత్స నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరికీ ఈ వైరస్ సోకినట్టు అధికారికంగా వెల్లడి కాలేదు. చైనాలో ఉన్న భారతీయుల క్షేమ సమాచారాలు బీజింగ్‌లో భారత్ రాయబార కార్యాలయం నిరంతరం పర్యవేక్షిస్తున్నట్టుగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జై శంకర్ ఆదివారం ట్వీట్ చేశారు. ఈ వైరస్‌కి కేంద్రమైన వూహాన్ నగరంలో 250 మంది వరకు భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయి ఉన్నారు. వారికి ఎలాంటి సాయమైనా అందించడానికి భారత రాయబార కార్యాలయం హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
మాంసం విక్రయంపై నిషేధం
చైనాలో విస్తృతంగా మాంసాహారాన్ని వినియోగిస్తారు. అడవి జంతువుల్ని ఎక్కువగా చంపి తింటారు. కరోనా వైరస్ మొదట్లో సీఫుడ్ నుంచి వచ్చిందని భావించారు. కానీ తాజా పరిశోధనల్లో పాముల నుంచి ఇతర అడవి జంతువులకి సోకి వారి నుంచి మనుషులకి సోకినట్టు వెల్లడైంది. దీంతో అడవి జంతువుల మాంసం వ్యాపారాలపై చైనా ప్రభుత్వం తాత్కాలికంగా నిషేధం విధించింది.
వాక్సిన్ కనుగొనే ప్రయత్నాల్లో చైనా
కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ ఉండడంతో దానికి వాక్సిన్ కనుగొనడానికి శాస్త్రవేత్తలు విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇటీవల ఉన్నతాధికారుల సమావేశంలో కరోనా విస్తరణపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌కు చెందిన శాస్త్రవేత్తలు దీనికి వాక్సిన్ కనుగొనే దిశగా పరిశోధనలు చేస్తున్ట శాస్త్రవేత్త జూ వెంబో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment