కొలంబో/వాషింగ్టన్: ద్వీప దేశమైన శ్రీలంక మరోసారి నెత్తురోడింది. నిఘావర్గాల సమాచారంతో సోదాలు జరుపుతున్న భద్రతాబలగాలపై కాల్పులు జరిపిన ఉగ్రవాదులు, అనంతరం తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో ముగ్గురు ఆత్మాహుతి బాంబర్లు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన తన అత్యవసర అధికారాలతో ఉగ్రసంస్థలు నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే), జమాతే మిల్లతూ ఇబ్రహీం(జేఎంఐ)లపై నిషేధం విధించారు. ఏప్రిల్ 21న ఈస్టర్ రోజు చర్చిలు, హోటళ్లలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండలో 253 మంది చనిపోవడం తెల్సిందే.
ఎన్టీజే స్థావరంలో తనిఖీలు..
ఉగ్రవాదుల విషయమై నిఘావర్గాలు ఇచ్చిన పక్కా సమాచారంతో స్పెషల్ టాస్క్‌ఫోర్స్, ఆర్మీ సంయుక్త బలగాలు శుక్రవారం రాత్రి కల్మునయ్ పట్టణంలోని సైంతమురుతు ప్రాంతంలో ఎన్టీజే స్థావరంగా భావిస్తున్న ఓ ఇంటిని చుట్టుముట్టాయి. సైన్యం కదలికల్ని గుర్తించిన ఉగ్రవాదులు ఆయుధాలతో కాల్పులు ప్రారంభించారు. సైన్యం ఎదురుకాల్పులు జరిపింది. ఇరువర్గాల కాల్పుల్లో ఓ పౌరుడు చనిపోయాడు. ఓవైపు ఇరువర్గాల మధ్య కాల్పులు భీకరంగా కొనసాగుతుండగానే, ముగ్గురు ఉగ్రవాదులు భద్రతాబలగాలకు ప్రాణాలతో చిక్కకూడదన్న ఉద్దేశంతో తమనుతాము పేల్చేసుకున్నారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు చిన్నారులు సహా 15 మంది అక్కడికక్కడే చనిపోయారు. నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే)కు స్థావరంగా ఉన్న ఈ ఇంటిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, ఆత్మాహుతి కిట్లు, ఐసిస్ జెండాలు, ఆర్మీ దుస్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు చనిపోయినట్లు భావిస్తున్నామని పోలీస్ అధికార ప్రతినిధి ఒకరు చెప్పారు. గాయపడిన ముగ్గురు ఉగ్రవాదులకు ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. ఉగ్రదాడులపై విచారణలో శ్రీలంక అధికారులకు సహకరించేందుకు అమెరికా ముందుకొచ్చింది. తమ అధికారులతో ఓ బృందాన్ని కొలంబో పంపినట్లు ఎఫ్‌బీఐ చీఫ్
క్రిస్టోఫర్ రే తెలిపారు.
తమ పౌరులకు భారత్, అమెరికా సూచన
అత్యవసరమైతే తప్ప భారత పౌరులెవరూ శ్రీలంకకు ప్రయాణాలు పెట్టుకోవద్దని భారత విదేశాంగ శాఖ సూచించింది. ఒకవేళ అత్యవసరంగా వెళ్లాల్సివస్తే కొలంబోలోని భారత హైకమిషన్ కార్యాలయం, జాఫ్నా, హంబన్‌తోటలోని కాన్సులేట్లు, కండిలోని అసిస్టెంట్ హైకమిషన్‌ను సంప్రదించాలని చెప్పింది. మరోవైపు శ్రీలంక పర్యటనకు వెళ్లాలనుకునే అమెరికా పౌరులు తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని అగ్రరాజ్యం కోరింది. శ్రీలంకలో ఉగ్రదాడుల అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ శాఖ శనివారం లెవల్–3 ప్రయాణ సూచికను జారీచేసింది.
వారందరినీ చంపాలి
శ్రీలంకలో వరుసబాంబు పేలుళ్లు జరిగిన కొన్ని గంటలకే ఈ దాడులకు సూత్రధారిగా భావిస్తున్న జహ్రన్ హషీమ్ వీడియో సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టడం ప్రారంభించింది. ఇందులో శ్రీలంక యాసతో తమిళంలో హషీమ్ మాట్లాడుతూ.. ‘మతవిశ్వాసాలు, నమ్మకం ఆధారంగా మనుషులను మూడు రకాలుగా విభజించవచ్చు. వీరిలో ఒకరు ముస్లింలు. మరొకరు ముస్లింల అభిప్రాయాలను అంగీకరించేవారు. ఇక మూడోవర్గం ఉంది చూశారా.. వీళ్లందరిని చంపేయాలి. ఈ మాట చెప్పేందుకు చాలామంది భయపడతారు. ఈ వ్యాఖ్యలను ఉగ్రవాదంగా ముద్రవేస్తారు. ఇస్లాం సిద్ధాంతాలతో అంగీకరించని వాళ్లందరినీ చంపేయాలి’ అని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. మరోవైపు శ్రీలంక ఉగ్రదాడిని ఐసిస్ తమ పత్రికలో ‘ప్రత్యేక కథనం’గా ప్రచురించింది. కాగా, హషీమ్ విద్వేష ప్రసంగాలపై తాము ప్రభుత్వానికి 2015, 2018లో ఫిర్యాదు చేశామనీ, అయినా అధికారులు దీన్ని సీరియస్‌గా తీసుకోలేదని శ్రీలంక ముస్లిం మండలి ఉపాధ్యక్షుడు హిల్మే అహ్మద్ తెలిపారు. ఖురాన్ తరగతుల పేరుతో యువతకు విద్వేషం నూరిపోసిన హషీమ్, గౌతమబుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేసేలా యువతను ప్రేరేపించాడని విమర్శించారు.
తమిళనాడులోనే ఉగ్ర శిక్షణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులంతా తమిళనాడులో శిక్షణ పొందినట్లు ఆ దేశానికి చెందిన పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఎన్టీజేకు అధ్యక్షుడిగా ఉన్న జహ్రన్ హషీమ్ వీరందరికీ శిక్షణ ఇచ్చాడన్నారు. ఈస్టర్ రోజున జరిగిన ఆత్మాహుతి దాడిలో హషీమ్‌సహా 9 మంది బాంబర్లు తమను తాము పేల్చేసుకున్నారని వెల్లడించారు. హషీమ్ రూపొందించిన ఆత్మాహుతి దళంలో మహిళా బాంబర్ కూడా ఉందని పేర్కొన్నారు. హషీమ్ తొలుత శ్రీలంకలోని మట్టకళప్పు ప్రాంతం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలను నడిపేవాడనీ, కానీ ఇతని వ్యవహారశైలిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో రెండేళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయాడని చెప్పారు.
ఘటనాస్థలిలో లభ్యమైన బాంబులు, బ్యానర్లు
మళ్లీ నెత్తురోడింది
Published Sun, Apr 28 2019 4:06 AM | Last Updated on Sun, Apr 28 2019 12:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment