శ్రీలంక ఐజీపీ పుజిత్ జయసుందర
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పర్వదినాన ఉగ్రవాదుల మారణకాండను నిలువరించడంలో విఫలమైనందుకు మరో అధికారిపై వేటు పడింది. ఉగ్రదాడిపై నిఘావర్గాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ నిర్లక్ష్యంతో వ్యవహరించినందుకు శ్రీలంక ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(ఐజీపీ) పుజిత్ జయసుందర శుక్రవారం రాజీనామా సమర్పించారు. అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన ఆదేశాల నేపథ్యంలో రక్షణ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో ఇప్పటికే రాజీనామా చేయగా, తాజాగా ఐజీపీ జయసుందర బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
ఇంటెలిజెన్స్ కమాండ్ ఏర్పాటు..
‘ఈ ఉగ్రవాది చోటుచేసుకోవడానికి ప్రస్తుత ప్రభుత్వ వ్యవహారశైలీ కారణమే. దేశంలో జర్నలిస్టుల హత్యలు, కిడ్నాపులు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన కొందరు మిలటరీ ఇంటలిజెన్స్ అధికారులను ఇటీవల అరెస్ట్ చేశాం. పరిస్థితిని చక్కదిద్దేందుకు సంయుక్త ఆపరేషన్స్ కమాండ్‌ను ఏర్పాటుచేస్తాం. ప్రజల భద్రత దృష్ట్యా ఇంటింటిని తనిఖీ చేస్తాం’ అని సిరిసేన తెలిపారు.
సూత్రధారి.. జహ్రాన్ హషీమ్
నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే) చీఫ్ జహ్రాన్ హషీమ్(40) ఈ ఆత్మాహుతి దాడులకు నేతృత్వం వహించాడని సిరిసేన తెలిపారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐసిస్)కు ఎన్టీజే విధేయత ప్రకటించిందని వెల్లడించారు. ‘ఈస్టర్ రోజున షాంగ్రీలా హోటల్‌పై ఇల్హమ్ అహ్మద్ ఇబ్రహీం అనే ఆత్మాహుతి బాంబర్‌తోపాటు జహ్రాన్ ఈ దాడిలో పాల్గొన్నాడు. ఈ ఆత్మాహుతి దాడిలో వీరిద్దరూ ఘటనాస్థలంలోనే ప్రాణాలు విడిచారు’ అని సిరిసేన పేర్కొన్నారు.
ముస్లింలపై ఉగ్రముద్ర వద్దు..
ఆత్మాహుతిదాడుల నేపథ్యంలో ముస్లిం సమాజంపై ఉగ్రవాదులుగా ముద్రవేయవద్దని అధ్యక్షుడు సిరిసేన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘నేషనల్ తౌహీద్ జమాత్(ఎన్టీజే)ను నిషేధించే అంశాన్ని మేం పరిశీలించాం. కానీ ఇప్పుడున్న చట్టాల ద్వారా అది సాధ్యం కాదు. ఇందుకోసం త్వరలోనే కొత్త చట్టాన్ని తీసుకువస్తాం’ అని సిరిసేన చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment