లంకకు ఉగ్ర ముప్పు! | Sri Lanka braces for more attacks as it urgently hunts suspects | Sakshi
Sakshi News home page

లంకకు ఉగ్ర ముప్పు!

Published Fri, Apr 26 2019 3:20 AM | Last Updated on Tue, Jun 4 2019 6:33 PM

Sri Lanka braces for more attacks as it urgently hunts suspects - Sakshi

శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే

కొలంబో: శ్రీలంకకు ఇంకా ఉగ్రవాద దాడుల ముప్పు ఉండొచ్చని ప్రధాని రణిల్‌ విక్రమసింఘే అన్నారు. ప్రస్తుతం తాము స్లీపర్‌సెల్స్‌పై దృష్టి సారించామని తెలిపారు. తాజా పేలుళ్ల నిందితులతోపాటు స్లీపర్లుగా ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామనీ, ఇంకా పేలుళ్లు జరగొచ్చనే అనుమానంతో ఇలా చేస్తున్నామని తెలిపారు. అధ్యక్షుడి సూచనమేరకు రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం రాజీనామా చేశారు. మరోవైపు ఈస్టర్‌ పేలుళ్లలో బుధవారం నాటికి 359 మంది మరణించారని శ్రీలంక ప్రకటించడం తెలిసిందే.

మృతిచెందిన వారి సంఖ్య 253 మాత్రమేనని గురువారం ప్రకటించింది. పేలుళ్లతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఆరుగురు అనుమానితుల పేర్లు, ఫొటోలను శ్రీలంక గురువారం రాత్రి విడుదల చేసింది. పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక వీసా ఆన్‌ అరైవల్‌ (ఆగమనాంతర వీసా) అవకాశాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ విధానం ప్రకారం 39 దేశాల ప్రజలకు శ్రీలంకకు చేరుకున్నాక అక్కడ వీసా పొందే అవకాశం గతంలో ఉండేది. పర్యాటకులను ఆకర్షించడం కోసం శ్రీలంక ఈ విధానాన్ని గతంలో తీసుకొచ్చింది. అయితే గత ఆదివారం శ్రీలంకలో జరిగిన పేలుళ్లకు విదేశాలతో సంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తం కావడంతో తాజాగా వీసా ఆన్‌ అరైవల్‌ను శ్రీలంక తాత్కాలికంగా నిలిపివేసింది.

మరో 16 మంది అరెస్టు..
పేలుళ్లకు సంబంధించి తాజాగా మరో 16 మందిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 76కి పెరిగింది. శ్రీలంకలో అత్యంత విజయవంతమైన జనరల్‌గా పేరున్న, ఎల్‌టీటీఈ ప్రభాకరన్‌ను అంతమొందించిన సమయంలో ఆర్మీకి నేతృత్వం వహించిన ఫీల్డ్‌ మార్షల్‌ శరత్‌ ఫోన్సెకా మాట్లాడుతూ ఈ దాడులకు వ్యూహ రచన చేసిన వ్యక్తికి ప్రభాకరన్‌కు ఉన్నంతటి సమర్థత ఉండి ఉంటుందని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement