terrarist attacks
-
కశ్మీర్లో స్థానికేతరులపై ముష్కరుల కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు మళ్లీ పేట్రేగిపోయాయి. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై టన్నెల్ నిర్మాణ పనుల ప్రాంతంలో ఉన్న ఒక వైద్యుడు, ఐదుగురు స్థానికేతర కార్మికులను చంపేశారు. గందేర్బల్లోని గుండ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఘటన చోటుచేసుకుంది. పనులు చేస్తున్న స్థానిక, స్థానికేతర కార్మికులు, ఇతర సిబ్బందిపై ఇద్దరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. గాయపడిన మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. మృతులను డాక్టర్ షెహనవాజ్, ఫహీమ్ నజిర్, కలీం, మహ్మద్ హనీఫ్, శశి అబ్రోల్, అనిల్ శుక్లా, గుర్మిత్ సింగ్‌లుగా గుర్తించారు. ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని దిగ్బంధించి, గాలింపు చేపట్టాయి. కశ్మీర్ ఐజీ వీకే బిర్డి తదితర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఘటనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ఉగ్రమూకలను వదిలేది లేదని స్పష్టం చేశారు. కాల్పుల ఘటనను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఘటనలో మృతుల సంఖ్య పెరగొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం బుల్లెట్ గాయాలతో ఉన్న బిహార్‌కు చెందిన కార్మికుడి మృతదేçహాన్ని షోపియాన్ జిల్లాలో గుర్తించామని అధికారులు తెలిపారు. -
కశ్మీర్లో ఉగ్రదాడి
శ్రీనగర్: కశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి పేట్రేగిపోయారు. కుప్వారా జిల్లాలోని ఒక చెక్‌పాయింట్ వద్ద సీఆర్పీఎఫ్ జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు. అనంతరం, ఇరు వర్గాల కాల్పుల్లో మొహమ్మద్ హజీమ్ భట్ అనే 15 ఏళ్ల బాలుడు చనిపోయాడు. ‘వాంగమ్– ఖాజియాబాద్ వద్దనున్న చెక్పాయింట వద్ద సీఆర్పీఎఫ్ బృందంపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మరణించారు’ అని అధికారులు సోమవారం వెల్లడించారు. ఘటనాప్రాంతానికి అదనపు దళాలను తరలించామని, ఆ ప్రాంతాన్ని దిగ్బంధించి, ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నామని వివరించారు. -
కశ్మీర్లోకి ‘కరోనా’ ఉగ్రవాదులు
జమ్మూ: భారత్‌తో ముఖాముఖి తలపడలేని పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపింది. కోవిడ్–19 బారిన పడిన ఉగ్రవాదులను దొంగచాటుగా దేశంలోకి పంపిస్తోంది. ‘ఇప్పటి వరకు కశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది. ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడిన వారిని దేశంలోకి పంపిస్తోంది. వీరి ద్వారా ఇక్కడి ప్రజలకు వైరస్ సోకుతోంది. దీనిపై పక్కాగా చర్యలు తీసుకోవాల్సి ఉంది’అని కశ్మీర్ డీఐజీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జమ్మూలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదుల్లో చాలామంది కరోనా బారిన పడినట్లు తమకు సమాచారం ఉందన్నారు. -
సౌదీ చమురు క్షేత్రాలపై డ్రోన్లతో దాడి
రియాధ్: యెమెన్ ఉగ్రవాదులు జరిపిన డ్రోన్ దాడులతో సౌదీ అరేబియా చమురు క్షేత్రాల్లో మంటలు చెలరేగాయి. సౌదీ తూర్పు ప్రాంతంలో ఆరామ్కోకు చెందిన అబ్కేయిక్, ఖురైస్ క్షేత్రాలపై శనివారం వేకువ జామున రెండు డ్రోన్లు కూలాయి. దీంతో భారీగా చెలరేగిన మంటలను సిబ్బంది దాదాపు రెండు గంటల అనంతరం అదుపులోకి తెచ్చారని ప్రభుత్వం తెలిపింది. ఈ దాడికి కారణం తామేనంటూ ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న యెమెన్‌లోని హౌతి ఉగ్రవాదులు ప్రకటించుకున్నారు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపిన అంతరంగిక శాఖ మంత్రి.. డ్రోన్లు ఎక్కడివి? ప్రాణాపాయం, పనులపై ప్రభావం వంటి వివరాలను వెల్లడించలేదు. కాగా, అబ్కేయిక్, ఖురైస్‌లపై శనివారం వేకువజామున పది వరకు డ్రోన్లతో తాము దాడి చేసినట్లు హౌతీ ఉగ్రవాదుల ప్రతినిధి అల్ మసీరా టీవీకి తెలిపారు. ఇటీవలి కాలంలో హౌతి ఉగ్రవాదులు సౌదీ అరేబియా వైమానిక స్థావరాలపై పలు క్షిపణి, డ్రోన్ దాడులు జరిపిన విషయం తెలిసిందే. యెమెన్‌లో తమ ప్రాంతాలపై సౌదీ అరేబియా దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేస్తున్నట్లు హౌతీలు అంటున్నారు. ఆరామ్కోకు ఉన్న అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన అబ్కేయిక్‌పై గతంలో అల్‌ఖైదా జరిపిన దాడిలో ఇద్దరు భద్రతా సిబ్బంది మరణించారు. తాజా ఘటనతో ప్రపంచంలోనే అత్యధికంగా చమురు ఎగుమతి చేసే సౌదీ అరేబియాలోని చమురు క్షేత్రాల భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతోపాటు గల్ఫ్ జలాల్లోని ఆయిల్ ట్యాంకర్లపై జూన్, జూలైల్లో జరిగిన దాడులకు ఇరానే కారణమంటూ సౌదీ ప్రభుత్వం, అమెరికా ఆరోపిస్తుండగా తాజా ఘటనతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మళ్లీ పెరిగాయి. వ్యాపార విస్తరణ కోసం ఆరామ్కో త్వరలోనే ఐపీవోకు వెల్లనుండగా ఈ పరిణామం సంభవించడం గమనార్హం. -
9/11 సూత్రధారులపై విచారణ తేదీ ఖరారు
వాషింగ్టన్: 2001లో అమెరికాలోని వరల్డ్‌ట్రేడ్ సెంటర్‌పై జరిగిన దాడి కుట్రదారులపై విచారణ ముహూర్తం ఎట్టకేలకు ఖరారైంది. ఈ కేసును 2021లో చేపట్టనున్నట్లు మిలటరీ కోర్టు జడ్జి ఎయిర్‌ఫోర్స్ కల్నల్ డబ్ల్యూ షేన్ కోహెన్ ప్రకటించారు. సెప్టెంబర్ 11 ఉగ్రదాడులకు వ్యూహ రచనతోపాటు అమలు చేసినందుకు యుద్ధ నేరాల కింద ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ ఐదుగురు ప్రస్తుతం అమెరికా వైమానిక స్థావరం గ్వాంటానమో బే జైలులో ఉన్నారు. వీరిపై 2021 జనవరి 11వ తేదీ నుంచి అక్కడే విచారణ మొదలవుతుందని ఆయన ప్రకటించారు. వీరిని 2002–2003 సంవత్సరాల్లో అమెరికా పాకిస్తాన్లో అరెస్టు చేసింది. అప్పటి నుంచి పలు రహస్య ప్రాంతాల్లో ఉంచి, విచారణ జరిపింది. చివరికి 2006లో గ్వాంటానమో బే జైలుకు తరలించింది. మిలటరీ చట్టాల ప్రకారం వీరిపై నేరం రుజువైతే మరణశిక్ష పడే అవకాశాలున్నాయి. నిందితుల్లో సెప్టెంబర్ 11 దాడులతోపాటు ఇతర ఉగ్రచర్యలకు కుట్రపన్నిన అల్ ఖైదా సీనియర్ నేత ఖలీద్ షేక్ మొహమ్మద్, వలిద్ బిన్ అటాష్, రంజీ బిన్ అల్ షిబ్, అమ్మర్ అల్ బలూచి, ముస్తఫా అల్ హౌసవి ఉన్నారు. అల్‌ఖైదాకు చెందిన మొత్తం 19 మంది సభ్యులు 2001 సెప్టెంబర్ 11వ తేదీన అమెరికాలో నాలుగు విమానాలను హైజాక్ చేసి రెండింటిని వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పైన, ఒకటి అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్‌పైన కూల్చడంతోపాటు మరో దానిని పెన్సిల్వేనియాలో నేల కూల్చారు. ఈ ఘటనల్లో మొత్తం 3వేల మంది చనిపోయినట్లు అప్పట్లో అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. -
నిర్లక్ష్యంగా వ్యవహరించారు; పోలీస్‌బాస్ అరెస్టు..!
కొలంబో : శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహారించారనే కారణంగా పోలీస్ ఉన్నతాధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది. ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని పేర్కొంటూ పోలీస్ చీఫ్ పుజీత్ జయసుందర, రక్షణశాఖ మాజీ చీఫ్ హేమసిరి ఫెర్నాండోను అరెస్టు చేయించింది. ఈస్టర్ సండే (ఏప్రిల్ 21) రోజు ఓ క్రిస్టియన్ చర్చిలో, మరికొన్ని చోట్ల వరుస బాంబు పేలుళ్లు సంభవించడంతో 258కి పైగా పౌరులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. పోలీస్ అధికారుల అలక్ష్యం వల్లనే ఉగ్రదాడి జరిగిందని శ్రీలంక అటార్నీ జనరల్ డప్పుల డిలివెరా సోమవారం స్పష్టం చేశారు. నిఘావర్గాల హెచ్చరికలపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. అటార్నీ జనరల్ సూచనల ప్రకారమే పుజీత్, ఫెర్నాండో అరెస్టుకు ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్టు తెలిసింది. కాగా, అరెస్టు సమయంలో ఈ ఇద్దరూ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండటం గమనార్హం. (చదవండి : శ్రీలంక పోలీస్ చీఫ్‌పై వేటు) అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం క్రిమినల్ నెగ్లిజన్స్ తీవ్రమైన హత్యానేరమని డిలివెరా అన్నారు. ఈ ఘటనల్లో మరో తొమ్మిదిమందిపై కూడా అభియోగాలున్నాయని, వారు కూడా విచారణ ఎదుర్కోవచ్చని చెప్పారు. ఇప్పటికే పార్లమెంటరీ విచారణ కమిటీ ముందు హాజరైన జయసుందర, ఫెర్నాండో తమ వాదనలు వినిపించారు. ప్రోటోకాల్స్‌ను పాటించడంలో విఫలమైన అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన జాతీయ భద్రతకు ముప్పు ఉందన్న హెచ్చరికలను అంచనా వేయలేకపోయారని ఆరోపించారు. -
అమర్నాథ్ యాత్రకు భారీ భద్రత
శ్రీనగర్/జమ్మూ: పవిత్ర అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఈ ఏడాది తొలి బ్యాచ్‌గా 2,234 మంది భక్తులు ఆదివారం గట్టి భద్రత మధ్య జమ్మూకు చేరుకున్నారు. 2017లో అమర్నాథ్ యాత్రికులపై ఉగ్రవాదులు దాడి చేసినందువల్ల ఇప్పుడు బహుళ అంచెల భద్రతను అధికారులు ఏర్పాటు చేశారు. లోక్‌సభ ఎన్నికల కోసం రాష్ట్రానికి వచ్చిన 300 అదనపు కంపెనీల భద్రతా దళాలనే ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించేందుకు కూడా వినియోగిస్తున్నారు. ఆధునిక సాంకేతికతను కూడా వాడుకుంటున్నారు. యాత్ర సోమవారం నుంచి మొదలుకానుంది. ఈ యాత్రకు రావడానికి దేశవ్యాప్తంగా ఒకటిన్నర లక్షల మంది భక్తులు నమోదు చేసుకున్నారు. 46 రోజులపాటు ఈ యాత్ర కొనసాగుతుంది. అనంత్‌నాగ్ జిల్లాలోని 36 కిలో మీటర్ల పొడవైన పహల్గామ్ మార్గం, గండేర్బల్ జిల్లాలోని 14 కిలో మీటర్ల పొడవైన బల్తాల్ మార్గాల్లో యాత్ర సాగుతుంది. 93 వాహనాలతో కూడిన తొలి వాహన శ్రేణిని గవర్నర్ సలహాదారు కేకే శర్మ ఆదివారం జమ్మూలోని భాగవతి నగర్ బేస్ క్యాంపు వద్ద జెండా ఊపి ప్రారంభించారు. -
ఉగ్ర శిబిరంపై దాడికి వాజ్‌పేయి ఆదేశం!
2001, డిసెంబర్ 13న పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పార్లమెంటుపై చేసిన దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ సైన్యం నిర్వహిస్తున్న ఉగ్రవాద శిక్షణ శిబిరంపై దాడి చేయాలని అప్పటి ప్రధాని వాజ్‌పేయి నిర్ణయించారు. పాక్ తన శిబిరాన్ని వేరే చోటుకు మార్చడంతో ఆ ప్రయత్నం ఆగిపోయింది. అమెరికాపై అల్ ఖాయిదా దాడి(9/11) నేపథ్యంలో ఆఫ్ఘన్‌పై యుద్ధానికి దిగిన అమెరికాకు మద్దతివ్వాలని అప్పటి విదేశాంగ మంత్రి జస్వంత్ సింగ్ అన్నారు. దానివల్ల క కలిగే నష్టాలను గుర్తించిన వాజ్‌పేయి దౌత్యనీతిని ఉపయోగించి నిర్ణయాన్ని దాటవేశారు. ‘ఏ ప్రైమ్ మినిస్టర్ టు రిమెంబర్: మెమరీస్ ఆఫ్ ఏ మిలటరీ చీఫ్(గుర్తుంచుకోదగిన ప్రధాని:సైన్యాధిపతి జ్ఙాపకాలు) పేరుతో అప్పటి నౌకాదళాధిపతి సుశీల్ కుమార్ రాసిన పుస్తకంలో ఈ విషయాలు పేర్కొన్నారు. ఆ పుస్తకం శుక్రవారం విడుదలయింది. పార్లమెంటుపై దాడి జరగ్గానే త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రి జార్జి ఫెర్నాండెజ్, భద్రతా సలహాదారు బ్రజేశ్ మిశ్రాలతో సమావేశమయ్యారు. పీవోకేలో ఉన్న ఉగ్ర శిక్షణా శిబిరంపై దాడికి అన్ని నిర్ణయించాం. అన్ని ఏర్పాట్లు జరిగాయి. అయితే, పాకిస్తాన్ ఆ శిబిరాన్ని ఒక స్కూలు, హాస్పటల్ మధ్యకి మార్చినట్టు చివరి నిముషంలో తెలిసింది. శిబిరంపై దాడి చేస్తే జననష్టం జరుగుతుందన్న భావంతో ప్రధాని వాజ్‌పేయి దాడి చేయవద్దన్నారు. అని సుశీల్ తన 135 పేజీల పుస్తకంలో పేర్కొన్నారు. -
నైజీరియాలో ఆత్మాహుతి దాడి
కానో: నైజీరియాలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. రద్దీ ఉన్న ప్రాంతంలో ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ దారుణ ఘటనలో 30 మంది మరణించగా.. 40 మందికి గాయాలయ్యాయి. నైజీరియా బోర్నో రాష్ట్ర రాజధాని మైదుగురికి 38 కి.మీ దూరంలో ఉన్న కొండుగ ప్రాంతంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఘటన జరిగిన తీరును బట్టి ఇది బొకో హరామ్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారి పనిగా అనుమానిస్తున్నామని ఆ దేశ అత్యవసర విభాగ అధికారులు వెల్లడించారు. అయితే ఘటనకు సంబంధించి ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటన చేయలేదు. ఫుట్‌బాల్ అభిమానులందరూ కలిసి ఓ హాల్లో మ్యాచ్‌ను వీక్షిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వీరిలో ఓ వ్యక్తిని సదరు హాల్ యజమాని నిలువరించేందుకు యత్నించినా ఫలితం లేకుండాపోయిం దని.. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని స్థానిక ఆత్మరక్షణ దళ నేత హాసన్ వెల్లడించారు. అప్పటికే జనాల్లోకి చేరుకున్న ఇద్దరు వ్యక్తులు సహా ఈ వ్యక్తి తమను తాము పేల్చుకున్నారని వెల్లడించారు. తొమ్మిది మంది ఘటనా స్థలిలోనే మరణించగా మిగతా వారు చికిత్స పొందుతూ కన్నుమూశారని చెప్పారు. ఎమర్జెన్సీ దళాలు ఘటనాస్థలికి సకాలంలో చేరుకోకపోవడంతో మృతుల సంఖ్య పెరిగిందని అత్యవసర విభాగం అధికారి ఒకరు వెల్లడించారు. -
కశ్మీర్లో ఉగ్ర దుశ్చర్య
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. భద్రతా దళాలపై జరిపిన దాడిలో ఐదుగురు సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో నలుగురు భద్రతా సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం దక్షిణ కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో చోటుచేసుకుంది. ఉగ్రదాడిని తిప్పికొట్టడానికి భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడని అధికారులు వెల్లడించారు. ‘116వ బెటాలియన్‌కు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్లు, రాష్ట్ర పోలీసులు ఇక్కడి కేపీ రోడ్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో మోటార్ సైకిల్ మీద వచ్చిన ఇద్దరు ఉగ్రవాదులు ఒక్కసారిగా తమ వద్ద ఉన్న రైఫిళ్లతో జవాన్లపై కాల్పులకు తెగబడ్డారు. అలాగే వారి వాహనంపై గ్రెనేడ్లను విసిరారు. దీంతో జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా గాయపడిన మరో ముగ్గురుని ఆస్పత్రికి తరలించాం’అని తెలిపారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన అనంతనాగ్ పోలీస్ స్టేషన్ అధికారి అర్షద్ అహ్మద్‌ను చికిత్స కోసం శ్రీనగర్‌కు తరలించినట్లు చెప్పారు. ఈ ఉగ్రవాదులను జైషే మొహ్మద్ ఉగ్రవాద గ్రూపునకు చెందిన వారుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. -
పాక్‌లో హోటల్‌పై దాడి
కరాచీ: పాకిస్తాన్‌లోని తీరప్రాంత నగరం గ్వదర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రఘటనలో హోటల్ సెక్యూరిటీ గార్డు, ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. శనివారం సాయంత్రం పెర్ల్ కాంటినెంటల్ ఫైవ్‌స్టార్ హోటల్ వద్ద ముగ్గురు సాయుధ దుండగులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ హోటల్ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డగించిన హోటల్ సెక్యూరిటీ గార్డును కాల్చి చంపారు. వెంటనే స్పందించిన ప్రత్యేక బలగాలు ఉగ్రవాదులతో హోరాహోరీ తలపడ్డాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో హోటల్లోని కొందరు సందర్శకులు, సిబ్బంది గాయాలపాలయ్యారు. ఈ ఉగ్రదాడి ఘటనకు తమదే బాధ్యతంటూ నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ శనివారం ప్రకటించుకుంది. దాడి నేపథ్యంలో వెంటనే హోటల్లో ఉన్న విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న గ్వదర్..పాక్‌లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతం. వేలాది కోట్ల రూపాయల చైనా నిధులతో ఇక్కడ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తాజాగా ఇటీవల ఏప్రిల్ 18వ తేదీన ఇక్కడ జరిగిన ఉగ్రదాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. -
శ్రీలంక పోలీస్ చీఫ్‌పై వేటు
కొలంబో: శ్రీలంకలో ఈస్టర్ పండుగ రోజు జరిగిన బాంబు పేలుళ్లకు సంబంధించి ముందుగానే నిఘా సమాచారం ఉన్నప్పటికీ సరైన భద్రతా చర్యలు తీసుకోలేకపోయినందుకు పోలీస్ చీఫ్ పూజిత్ జయసుందరను అధ్యక్షుడు సిరిసేన సోమవారం సస్పెండ్ చేశారు. జయసుందర రాజీనామా చేస్తానని ప్రకటించినప్పటికీ చేయలేదు. దీంతో సిరిసేన ఆయనను సస్పెండ్ చేశారు. సీనియర్ డెప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా ఉన్న విక్రమరత్నేను తాత్కాలికంగా పోలీస్ చీఫ్‌గా, మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ ఇళంగకూన్‌ను రక్షణ శాఖ కార్యదర్శిగా నియమిస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. బాంబు పేలుళ్లకు నేతృత్వం వహించినట్లుగా భావిస్తున్న జహ్రాన్ హషీమ్ కుటుంబంలో 18 మంది కనిపించకుడా పోయారనీ, వారంతా చనిపోయుంటారని తనకు భయంగా ఉందని జహ్రాన్ సోదరి మహ్మద్ హషీమ్ మథానియా చెప్పారు. బాంబు పేలుళ్లు జరిగిన రోజు రాత్రి నుంచి తమ కుటుంబంలో ఐదుగురు కనిపించకుండా పోయారనీ, వారిలో తన తండ్రి, ముగ్గురు తన సోదరులు, మరొకరు తన సోదరి భర్త ఉన్నారని ఆమె తెలిపారు. మళ్లీ శుక్రవారం రాత్రి సైందమరుదు పట్టణంలో పోలీసులు, అనుమానిత ఉగ్రవాదులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఆరుగురు చిన్నారులు సహా 10 మంది చనిపోయారని అధికారులు చెప్పారు. ముసుగుపై నిషేధం అమల్లోకి ఈస్టర్ బాంబు పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకలో ముస్లిం మహిళలెవరూ బహిరంగ ప్రదేశాల్లో మొహానికి ముసుగులు ధరించకుండా తీసుకొచ్చిన నిషేధం అమల్లోకి వచ్చింది. ముఖం కనిపించకుండా ఎలాంటి ముసుగులూ ధరించకూడదని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. -
క్షమించండి ఆ విషయంలో తప్పుచేశాం : శ్రీలంక
కొలంబో : ఈస్టర్ పండుగ సందర్భంగా గత ఆదివారం శ్రీలంకలో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమంలో 359 మంది అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ దాడులతో అప్రమత్తమైన శ్రీలంక ప్రభుత్వం భద్రతా చర్యలను ముమ్మరం చేసింది. నిందితులను పట్టుకునేందుకు సీఐడీని రంగంలోకి దింపింది. ఈనేపథ్యంలో పేలుళ్లతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఆరుగురు అనుమానితుల పేర్లు, ఫొటోలను శ్రీలంక ప్రభుత్వం గురువారం రాత్రి విడుదల చేసింది. ఇందులో ముగ్గురి మహిళల పాత్ర ఉన్నట్లు పేర్కొంది. అయితే ఈ ఫొటోల విషయంలో శ్రీలంక ప్రభుత్వం ఘోర తప్పిదం చేసింది. ఒకరి ఫొటోకు బదులు మరొకరి ఫొటో ప్రచురించి చేతులు కాల్చుకుంది. తీరా ఈ విషయంపై సదరు వ్యక్తి నిలదీయడంతో తప్పును గుర్తించి క్షమాణలు కోరింది. శ్రీలకం ప్రభుత్వం ప్రకటించిన అనుమానస్పదుల జాబితాలో ఫాతిమా ఖాదీయా ఉగ్రవాదికి బదులు అమెరికా సామాజిక కార్యకర్త అమరా మజీద్ ఫొటోను ప్రచురించింది. ఈ విషయాన్ని గుర్తించిన అమరా మజీద్ ట్విటర్ వేదికగా తనేలాంటి ఉగ్రదాడుల్లో పాలుపంచుకోలేదని, అనవసరంగా నా ఫొటోను ఎందుకు ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఈ ఉదయం శ్రీలంక ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాల్లో నా ఫొటోను గుర్తించాను. ఈస్టర్ పండుగ నాడు శ్రీలంకలో జరిగిన దాడులతో నాకేమి సంబంధం లేదు. ఇప్పటికే మా ముస్లిం వర్గం నిఘా అధికారుల తప్పుల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. మరోసారి ఇలాంటి తప్పుడు నిందారోపణలు చేయవద్దు. ఒక సారి పున:సమీక్ష జరపండి. దయచేసి ఈ మారణహోమంతో నాకు అంటగడుతూ నిందలు మోపడం ఆపండి. ఇలాంటి సమాచారాన్ని అందించే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే తప్పుల వల్ల అమయాకుల కుటుంబం, కమ్యూనిటీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుంది’ అని వరుస ట్వీట్లతో శ్రీలంక ప్రభుత్వాన్ని నిలదీసింది. ఈ ట్వీట్లతో మేల్కొన్న శ్రీలంక ప్రభుత్వం సామాజిక కార్యకర్తైనా అమరా మజీద్‌కు క్షమాపణలు కోరుతూ ఓ ప్రకటనను విడుదల చేసింది. ‘ ఈ రోజు మీడియాకు విడుదల చేసిన ఆరుగురు అనుమానస్పద ఉగ్రవాదుల విషయంలో ఘోర తప్పిదం చోటుచేసుకుంది. సీఐడీ అందించిన సమాచారం మేరకు మేం ఫాతిమా ఖాదీయా అనే ఉగ్రవాది ఫొటోను ప్రచురించడం జరిగింది. అయితే ప్రస్తుతం సీఐడీ అందించిన సమాచారం ప్రకారం ఆ ఫొటో ఫాతిమా ఖాదీయాది కాదు. అమెరికాకు చెందిన సామాజిక కార్యకర్తది. ఈ పొరపాటుకు చింతిస్తున్నాం. ఆమె ఫొటోను వెంటనే తొలగిస్తున్నాం.’ అని పేర్కొంది. ఈ విషయాన్ని అమరా మజీదే ట్విటర్ వేదికగా తెలియజేసింది. తన ఫొటోను ఆ జాబితా నుంచి తొలిగించారని పేర్కొంది. ఏది ఏమైనప్పటికి దాడులకు ఏమాత్రం సంబంధం లేని ముస్లిం మహిళను ఉగ్రవాదుల జాబితాలో ప్రకటించడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు. ముస్లిం పేరు కనిపిస్తే ఉగ్రవాదులేనన్నట్లు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. UPDATE: Sri Lankan police issues apology for wrongly using my photographs in the WANTED list of terror suspects.#EasterSundayAttacksSL #SriLankaAttack #SriLanka #SriLankaBlasts pic.twitter.com/ClejPkh6OF — Amara Majeed (@AmaraMajeed1) 25 April 2019 -
లంకకు ఉగ్ర ముప్పు!
కొలంబో: శ్రీలంకకు ఇంకా ఉగ్రవాద దాడుల ముప్పు ఉండొచ్చని ప్రధాని రణిల్ విక్రమసింఘే అన్నారు. ప్రస్తుతం తాము స్లీపర్‌సెల్స్‌పై దృష్టి సారించామని తెలిపారు. తాజా పేలుళ్ల నిందితులతోపాటు స్లీపర్లుగా ఉన్న ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామనీ, ఇంకా పేలుళ్లు జరగొచ్చనే అనుమానంతో ఇలా చేస్తున్నామని తెలిపారు. అధ్యక్షుడి సూచనమేరకు రక్షణ శాఖ కార్యదర్శి హేమసిరి ఫెర్నాండో గురువారం రాజీనామా చేశారు. మరోవైపు ఈస్టర్ పేలుళ్లలో బుధవారం నాటికి 359 మంది మరణించారని శ్రీలంక ప్రకటించడం తెలిసిందే. మృతిచెందిన వారి సంఖ్య 253 మాత్రమేనని గురువారం ప్రకటించింది. పేలుళ్లతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఆరుగురు అనుమానితుల పేర్లు, ఫొటోలను శ్రీలంక గురువారం రాత్రి విడుదల చేసింది. పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంక వీసా ఆన్ అరైవల్ (ఆగమనాంతర వీసా) అవకాశాన్ని తాత్కాలికంగా రద్దు చేసింది. ఈ విధానం ప్రకారం 39 దేశాల ప్రజలకు శ్రీలంకకు చేరుకున్నాక అక్కడ వీసా పొందే అవకాశం గతంలో ఉండేది. పర్యాటకులను ఆకర్షించడం కోసం శ్రీలంక ఈ విధానాన్ని గతంలో తీసుకొచ్చింది. అయితే గత ఆదివారం శ్రీలంకలో జరిగిన పేలుళ్లకు విదేశాలతో సంబంధం ఉందన్న అనుమానాలు వ్యక్తం కావడంతో తాజాగా వీసా ఆన్ అరైవల్‌ను శ్రీలంక తాత్కాలికంగా నిలిపివేసింది. మరో 16 మంది అరెస్టు.. పేలుళ్లకు సంబంధించి తాజాగా మరో 16 మందిని శ్రీలంక పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటివరకు అరెస్టయిన వారి సంఖ్య 76కి పెరిగింది. శ్రీలంకలో అత్యంత విజయవంతమైన జనరల్‌గా పేరున్న, ఎల్టీటీఈ ప్రభాకరన్‌ను అంతమొందించిన సమయంలో ఆర్మీకి నేతృత్వం వహించిన ఫీల్డ్ మార్షల్ శరత్ ఫోన్సెకా మాట్లాడుతూ ఈ దాడులకు వ్యూహ రచన చేసిన వ్యక్తికి ప్రభాకరన్‌కు ఉన్నంతటి సమర్థత ఉండి ఉంటుందని అన్నారు. -
అమర జవాన్లకు సెల్యూట్
న్యూఢిల్లీ/లక్నో/జైపూర్: ఉద్వేగం ఉప్పొంగింది. భావోద్వేగాలు పెల్లుబికాయి. మాతృ దేశ సేవలో నేలకొరిగిన అమర జవాన్లకు తుది వీడ్కోలు పలికేందుకు దేశమంతా కదిలొచ్చింది. మేమున్నామంటూ బాధిత కుటుంబాలకు బాసటగా నిలిచింది. పుల్వామా దాడిలో అసువులు బాసిన ధీశాలుల అంత్యక్రియలు శనివారం దేశవ్యాప్తంగా వారివారి స్వస్థలాల్లో అధికార లాంఛనాలతో జరిగాయి. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన తమ వారి పట్ల గర్వం ఓ వైపు, తమలో ఒకరు ఇక లేరని వేదన మరోవైపు. ఇలా ఒక్కో కుటుంబానిది ఒక్కో కథ..ఒక్కో వ్యథ. ఇంతటి విషాద సమయంలో జాతి అంతా ఒక్కటై ముష్కరుల కుట్రకు బలైన భరతమాత ముద్దు బిడ్డల సేవలను శ్లాఘిస్తూ ఘనంగా నివాళులర్పించింది. పాకిస్తాన్ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించింది. చాలా ప్రాంతాల్లో వ్యాపారులు స్వచ్ఛందంగా తమ దుకాణాల్ని మూసేశారు. తమ గ్రామానికి చేరుకున్న అమర జవాన్ల భౌతికకాయాల్ని కడసారి చూసేందుకు ప్రజలు వీధుల్లో రోడ్లకు ఇరు వైపులా నిలబడ్డారు. పలువురు కేంద్ర మంత్రులు ఢిల్లీ నుంచి తమ స్వరాష్ట్రాలకు వెళ్లి అక్కడి మంత్రులతో కలసి వీర జవాన్ల అంతిమ యాత్రలో పాల్గొన్నారు. త్రివర్ణ పతాకం కప్పిన జవాన్ల భౌతిక కాయాలను ఢిల్లీ నుంచి వారి స్వస్థలాలకు సమీపంలోని విమానాశ్రయాలకు తరలించి, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో వారివారి స్వగ్రామాలకు తీసుకెళ్లారు. ఉత్తరాఖండ్‌లోని ఓ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి చితికి నిప్పంటించగా, రాజస్తాన్‌లో రెండు నెలల పసిగుడ్డుతో తండ్రి అంత్యక్రియలు నిర్వహించడం కంటతడిపెట్టించింది. రాజస్తాన్‌లో... రోషితాష్ లాంబా(జైపూర్), నారాయణ్‌లాల్ గుర్జార్(రాజసమంద్), జీత్‌రామ్(భరత్పూర్), భగీరథ్‌సింగ్(ధోల్పూర్), హేమరాజ్ మీనా(కోట)ల అంతిమయాత్రలో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ‘పాకిస్తాన్ ముర్దాబాద్’, ‘భారత్ మాతాకీ జై’నినాదాలు మిన్నంటాయి. ఉత్తరాఖండ్‌లో.. ఉద్ధమ్‌సింగ్ నగర్ జిల్లాలోని మహ్మద్‌పూర్ గ్రామంలో మూడేళ్ల చిన్నారి తన తండ్రి వీరేంద్రసింగ్ చితికి నిప్పు పెట్టిన దృశ్యం అక్కడి వారిని కంటతడి పెట్టించింది. సీఆర్పీఎఫ్ జవాన్లు తమ సహచరుడికి మూడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపి నివాళులు అర్పించారు. ఇక డెహ్రాడూన్‌లో జరిగిన మోహన్‌లాల్ అంత్యక్రియలకు అశేష జనం హాజరయ్యారు. పంజాబ్‌లో.. మోగా జిల్లాలోని గలౌటీ కుర్ద్ గ్రామంలో అమర జవాను జైమల్ సింగ్ మృతదేహానికి ఐదేళ్ల ఆయన కొడుకు గురుప్రకాశ్ నిప్పు అంటించాడు. గురుదాస్‌పూర్‌లో మణిందర్ సింగ్ భౌతికకాయానికి ఆయన తమ్ముడు, సీఆర్పీఎఫ్ జవాన్ అయిన లక్వీర్ సింగ్ దహన సంస్కారాలు నిర్వహించాడు. ఇక రూప్‌నగర్‌లో 26 ఏళ్ల కుల్వీందర్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రజలు పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కుల్వీందర్ సింగ్ భౌతికకాయాన్ని చూసి ఆయనకు కాబోయే భార్య సొమ్మసిల్లిపడిపోవడం అక్కడున్న వారిని కలచివేసింది. ఒడిశాలో.. పుల్వామా దాడిలో మరణించిన తమ రాష్ట్రానికి చెందిన అమర జవాన్లకు విద్యార్థులు, ఉపాధ్యాయులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. జగత్సింగ్పూర్ జిల్లాకు చెందిన ప్రసన్నకుమార్ సాహూ, కటక్‌కు చెందిన మనోజ్కుమార్ల భౌతికకాయాలను స్వీకరించేందుకు భువనేశ్వర్ విమానాశ్రయానికి వేలాది మంది తరలివచ్చారు. మహారాష్ట్రలో.. అమర జవాన్లు నితిన్ శివాజీ రాథోడ్(36), సంజయ్ సింగ్ దీక్షిత్(47)ల భౌతికకాయాలను శనివారం ఔరంగాబాద్ విమానాశ్రయం నుంచి వారి స్వగ్రామాలకు పంపించారు. తమిళనాడులో.. అమర జవాన్లు జి.సుబ్రమణ్యం, సి.శివచంద్రన్ భౌతికకాయాలకు తిరుచిరాపల్లి విమానాశ్రయంలో నిర్మలా సీతారామన్ నివాళులర్పించారు. కర్ణాటకలో.. ఢిల్లీ నుంచి బెంగళూరు చేరుకున్న అమర జవాన్ 33 ఏళ్ల హెచ్. గురు భౌతికకాయానికి ముఖ్యమంత్రి కుమారస్వామి నివాళులర్పించారు. ఉత్తరప్రదేశ్‌లో.. కానౌజ్ జిల్లాలో అమర జవాన్ ప్రదీప్ సింగ్ యాదవ్ అంత్యక్రియల సందర్భంగా ఆయన పదేళ్ల కూతురు సుప్రియ సొమ్మసిల్లింది. ఆయన రెండో కూతురు రెండున్నరేళ్ల చిన్నారిది అక్కడేం జరుగుతోందో అర్థం చేసుకోలేని పరిస్థితి. రాష్ట్రంలోని మహరాజ్‌గంజ్, ఆగ్రా, మేన్పురి, ఉన్నావ్, కాన్పూర్, దెహాట్, చందౌళి జిల్లాల్లోనూ అమర జవాన్ల అంత్యక్రియల్లో ఇలాంటి గంభీర వాతావరణమే కనిపించింది. మాతృదేశ సేవలో నేలకొరిగిన సైనికుల సాహసాలను కీర్తిస్తూ వేలాది మంది ప్రజలు నినాదాలు చేశారు. పుల్వామా దాడికి కారకులను శిక్షించాలని అంత్యక్రియలకు హాజరైన మంత్రులు, అధికారుల్ని డిమాండ్ చేశారు. దియోరియా జిల్లాలో.. సీఎం యోగి ఆదిత్యనాథ్ వస్తేనే తన భర్త విజయ్ మౌర్య అంత్యక్రియలకు అంగీకరిస్తానని ఆయన భార్య విజయ్ లక్ష్మి పట్టుపట్టారు. మంత్రి అనుపమా జైస్వాల్, ఇతర నాయకులు ఆమెను ఒప్పించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చందౌళిలో అవధేశ్ యాదవ్ అంత్యక్రియలు గంగా నదీ తీరంలో నిర్వహించారు. మహరాజ్‌గంజ్‌లోని ఓ పాఠశాలకు అమర జవాను పంకజ్ త్రిపాఠి పేరు పెడతామని కేంద్ర మంత్రి శివప్రతాప్ శుక్లా ప్రకటించారు. తుదిహార్లో మహేశ్ యాదవ్ భౌతికకాయం వద్ద రోదిస్తున్న బంధువు.. కర్ణాటకలోని దొడ్డి గ్రామంలో విలపిస్తున్న హెచ్ గురు కుటుంబసభ్యులు ఆగ్రాలో కుశల్‌కుమార్ భౌతికకాయం వద్ద కుటుంబ సభ్యుల రోదన.. కోల్‌కతాలో సుదీప్బిశ్వాస్ భౌతికకాయం వద్ద విలపిస్తున్న కుటుంబసభ్యులు -
పాక్‌ను దెబ్బకొట్టేదెలా?
పుల్వామా ఘటన తర్వాత పాకిస్తాన్‌ను ఏకాకిని చేసేందుకు భారత్ వీలున్నన్ని దౌత్యమార్గాల్లో ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే చైనా మినహా దాదాపు అన్ని ప్రధాన దేశాలు భారత్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. అయితే దౌత్యపరమైన దెబ్బ కొడితే.. దీని ప్రభావం ఉన్మాదపు పాక్‌పై కనిపించేందుకు సమయం పడుతుంది. కానీ 40 మంది సహచరుల ప్రాణాలను తీసిన పాక్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు భద్రతాదళాల రక్తం మరుగుతోంది. కశ్మీర్లో జరిగే ప్రతీ దాడి వెనుక పాక్ హస్తం ఉంటోందని.. స్పష్టమైన ఆధారాలు లభించాక కూడా ఇంకా చేతులు ముడుచుకుని కూర్చోవాలా? అంటూ బలగాలు ప్రశ్నిస్తున్నాయి. ఇలా ఎన్నేళ్లు ఉన్మాద పొరుగుదేశం ఆగడాలను సహించాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల పనిపట్టడానికి సైన్యానికి పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇచ్చామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించడంతో మిలటరీ తన ముందున్న మార్గాలను విస్తృతంగా పరిశీలిస్తోంది. యుద్ధ విమానాల మోహరింపు పాక్‌పై చర్యలకు అన్నిరకాల దౌత్య మార్గాలను పరిశీలిస్తూనే.. అవసరమైతే దాడి చేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. ఈ వ్యూహంలో భాగంగానే.. ఇప్పటికే సరిహద్దుల్లో 150 యుద్ధ విమానాలను మోహరించింది. భారత్ వాయుసేన సత్తా చాటేలా.. వాయుశక్తి విన్యాసాలు చేయాలని కొద్ది నెలల క్రితమే భారత్ భావించింది. ఇందుకోసమే జాగ్వార్ ఫైటర్ విమానాలు, మిరాజ్–2000 విమానాలను, మల్టీ–రోల్ జెట్స్‌ను మోహరించింది. విన్యాసాల కోసం మోహరించిన ఈ యుద్ధ విమానాలతోనే ఇపుడు పాక్‌పై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడానికి సన్నాహాలు చేస్తోంది. అప్రమత్తమైన పాక్.. టెర్రరిస్టులు వెనక్కి పాకిస్తాన్‌పై యుద్ధం ప్రకటించకుండా కఠినమైన చర్యల్ని తీసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తూ ఉండటంతో పాక్ అప్రమత్తమైంది. కశ్మీర్లో ఉన్న ఉగ్రవాదుల్ని వెనక్కి రప్పిస్తోంది. ఎన్నో ఉగ్రవాద శిబిరాలను మూసివేస్తోంది. ప్రతీకార దాడుల కోసం సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చానని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడంతో ఉగ్రవాద స్థావరాలే భారత్ మొదటి టార్గెట్ అని గుర్తించిన పాక్ సరిహద్దులను ఖాళీ చేస్తోంది. మిలటరీ ముందున్న మార్గాలివే! ► పాక్ భూభాగంలోకి ప్రవేశించకుండానే అత్యాధునిక యుద్ధ విమానాలతో పాక్ దిమ్మ తిరిగేలా దాడులకు దిగడం. సూటిగా పయనించే గైడెడ్ బాంబులు, క్షిపణులు అమర్చిన సుఖోయ్–30 ఎంకేఐ, మిరాజ్–2000, జాగ్వార్ ఫైటర్ విమానాలను ప్రయోగించి ఉగ్రవాదుల కీలక స్థావరాలను ధ్వంసం చేయడం. ఇప్పటికే సైనిక విన్యాసాల కోసం సరిహద్దుల్లో విమానాలు మోహరించి ఉండటంతో ఈ దాడుల్ని చేసేందుకు పెద్ద సమయం కూడా పట్టదు. ► భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతలకు కారణం.. పాక్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ (పీవోజేకే). ఆ ప్రాం తంలో నిర్దేశిత లక్ష్యాలపై వైమానిక దాడులు లేదంటే బ్రహ్మోస్ క్షిపణితో దాడికి పాల్పడటం. ► సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించి నెలరోజులకు పైగా నిర్విరామంగా కాల్పులకు దిగడం. వాస్తవాధీన రేఖ వెంట భింబెర్ గలీ వంటి ప్రాంతాల నుం చి ఇలాంటి కాల్పులు జరిపితే భారతీయ సైనికులకు భద్రంగా ఉంటుంది. భారత ప్రభుత్వం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఈ ప్రాంతంలో దశాబ్దాలుగా సైన్యాన్ని మోహరించింది. ► 2016లో ఉడీలో సైనిక శిబిరంపై దాడి చేశాక పీవోజేకేలోని ఉగ్రవాద శిబిరాలపై ప్రత్యేక బలగాలు మెరుపు దాడులకు పాల్పడినట్లుగా.. మరోసారి సర్జికల్ స్ట్రైక్‌తో ఉగ్రస్థావరాలపై దాడులకు పాల్పడటం. అయితే.. సర్జికల్ స్ట్రైక్స్‌పై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. గతంలో చేసిన ఈ తరహా దాడుల వల్ల పాక్‌కు బుద్ధి రాకపోగా.. వరుసగా దాడులకు పాల్పడుతోంది. అందుకే పాక్ మిలటరీపైనే నేరుగా దాడులు చేసి ఉగ్రవాదుల్ని ప్రేరేపించకుండా కట్టడి చేయాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ► వాస్తవాధీన రేఖ చొరబాట్ల్లకు క్షేమం కాదని ఉగ్రవాద సంస్థలు గుర్తించేలా విస్తృత స్థాయిలో దాడులు జరపడం. ► పూంచ్, ఉడీ పట్టణాలను కలిపే కీలకమైన హజీపీర్ మార్గం ద్వారా చొరబాట్లు అత్యధికంగా ఉంటున్నాయి. 1965 పాక్ యుద్ధం తర్వాత జరిగిన ఒప్పందంలో భాగంగా భారత్ తన దళాన్ని అక్కడ్నుంచి ఉపసంహరించింది. ఆ అవకాశాన్ని వినియోగించుకొని పాక్ ఉగ్రవాదుల్ని మన దేశంలోకి పంపిస్తోంది. ఆ ప్రాంతంలో మళ్లీ సైన్యాన్ని మోహరించి చొరబాట్లను అణచివేయడం. ► పాక్ సైనిక, ఉగ్రవాద శిబిరాలు, ఇతర కీలక స్థావరాలను నాశనం చేయడానికి 90 కిలోమీటర్ల రేంజ్లో సమర్థవంతంగా పనిచేసే స్మెర్చ్ (బీఎం–30) రాకెట్ల వ్యవస్థలు, 290 కిలోమీటర్ల రేంజ్లో పనిచేసే బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణులను యుద్ధవిమానాలతో ప్రయోగించి మెరుపు దాడులకు దిగడం. ► జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్‌ను భారత్‌కు తీసుకువచ్చేలా అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకురావడం. ఇస్లామాబాద్‌లో భారత్ హైకమిషనర్ అజయ్ బిస్రాయ్వెనక్కి పిలిపించడం ద్వారా దౌత్యపరంగా పాక్‌కు ఒంటరిని చేసేందుకు ఇప్పటికే పావులు కదుపుతోంది. -
కశ్మీరీలకు రక్షణ ఇవ్వండి: కేంద్రం
న్యూఢిల్లీ: దాడి తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న కశ్మీర్ ప్రజలు, విద్యార్థులపై దాడుల నేపథ్యంలో వారి రక్షణకు బాధ్యత తీసుకోవాల్సిందిగా కేంద్రం రాష్ట్రాలను కోరింది. తమ ఆస్తులపై దాడులు జరుగుతాయన్న భయంలో ఉత్తరాఖండ్‌లో కశ్మీరీలకు అద్దెకిచ్చిన వారి గృహ యాజమానులు భయపడి, కశ్మీరీలను ఖాళీచేయిస్తున్నట్టు సమాచారం అందినట్లు హోంమంత్రిత్వ శాఖ తెలిపింది. ఇళ్లు ఖాళీ చేసిన కశ్మీరీలు అంబాలా: గ్రామంలో అద్దెకుంటున్న కశ్మీరీలను వెనక్కి పంపాలని హరియాణాలోని అంబాలా గ్రామపంచాయతీ తమ గ్రామస్తులను ఆదేశించింది. సోషల్ మీడియాలో షేర్ అవుతోన్న ఒక వీడియో ప్రకారం, ములానా గ్రామ సర్పంచ్ నరేశ్ ఒక వీడియో ద్వారా సందేశమిచ్చారు. ‘దాడిలో కొందరు కశ్మీరీల ప్రమేయం ఉంది. 24 గంటల్లోగా అద్దెకుంటున్న కశ్మీరీలను పంపించివేయాలి’ అని వీడియోలో ఉంది. వీడియోను చూసిన కొందరు కశ్మీరీలు ఇళ్లు ఖాళీచేసి యూనివర్సిటీ హాస్టల్‌కు మకాం మార్చినట్లు సమాచారం. అంబాలాలోని వర్సిటీల్లో దాదాపు 1,200 మంది కశ్మీరీలు చదువుతున్నట్టుగా సమాచారం. -
దాడి సూత్రధారి ఉమేర్
దాడికి జైషే మొహమ్మద్(జేఈఎం)కు చెందిన మహ్మద్ ఉమేర్ వ్యూహరచన చేశాడని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు చెప్పారు. ఉగ్రవాద దాడులకు సంబంధించి ఉమేర్ అఫ్గాన్‌లో శిక్షణ పొందాడని, ఆ అనుభవంతో దాడికి పథక రచన చేశాడన్నారు. జైషే చీఫ్ మసూద్ అజహర్‌కు ఉమేర్ స్వయానా సోదరుడి కొడుకని చెప్పారు. దాడికి ఉమేర్ సూత్రధారి కాగా, మరో ఇద్దరు ఆర్డీఎక్స్ బాంబును రూపొందించారని ఎన్ఐఏ అధికారులు అన్నారు. బాంబును తయారుచేసిన ఇద్దరు ఇప్పటికే సరిహద్దును దాటి పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోకి వెళ్లిపోగా, ఉమేర్ మాత్రం దాడిని పర్యవేక్షించేందుకు పుల్వామాలోనే ఆగిపోయాడని తెలిపారు. అతని కోసం భద్రతాబలగాలు విస్తృతంగా గాలిస్తున్నాయన్నారు. మసూద్ అజహర్‌కు బంధువైన హైదర్ 2018, అక్టోబర్‌లో కశ్మీర్లో జరిగిన ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోవడంతో, అతని స్థానంలో ఉమేర్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. సిరియా, అఫ్గాన్ తరహాలో.. సిరియా, అఫ్గానిస్తాన్‌లోని అమెరికా బలగాలు లక్ష్యంగా తీవ్రవాదులు, తిరుగుబాటుదారులు కారుతో పుల్వామా తరహాలో ఆత్మాహుతి దాడులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో అఫ్గాన్‌లో ఉగ్రవాదుల దగ్గర శిక్షణ పొందిన ఉమేర్ దాన్ని కశ్మీర్లో పక్కాగా అమలు చేశాడు. ఈ ఆత్మాహుతి దాడి కుట్ర రషీద్ ఘజీ, కమ్రాన్ అనే ఇద్దరు ఉగ్రవాదుల పాత్ర ఉందని అధికారులు తెలిపారు. ఈ దుర్ఘటనపై ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ), జాతీయ భద్రతా దళం(ఎన్ఎస్జీ)తో కలిసి తాము దర్యాప్తు చేస్తున్నామన్నారు. జమ్మూ–కశ్మీర్ జాతీయ రహదారికి సమీపంలో పుల్వామా–పొంపోర్‌ల మధ్య 20–25 కిలోమీటర్ల ప్రాంతం ఉగ్రవాదులకు సురక్షిత స్థావరంగా ఉందన్నారు. ఉగ్రవాదుల్ని ఏరివేయడానికి ఈ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నామనీ, గ్రామాల్లో తనిఖీలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. కాగా, ఉగ్రవాదుల జాడ తెలుసుకునేందుకు అధికారులు ఈ ప్రాంతంలో సెల్‌ఫోన్ కాల్స్ వివరాలను పరిశీలిస్తున్నారు. అలాగే దాడి జరగడానికి 48 గంటల ముందు వరకూ ఇంటర్నెట్ ద్వారా వెళ్లిన కాల్స్, సందేశాలను విశ్లేషిస్తున్నారు. ఐఎస్ఐ మునీర్ ముద్ర! దాడిలో పాక్ నిఘా సంస్థ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్(ఐఎస్ఐ) అధిపతి లెఫ్టినెంట్ జనరల్ అసీమ్ మునీర్ ముద్ర కనిపిస్తోంది. పాక్ ఉత్తర ప్రాంతాల కమాండర్‌గా పనిచేసిన మునీర్‌కు కశ్మీర్‌పై పూర్తి అవగాహన ఉందని ఐఎస్ఐ నిపుణులు వెల్లడించారు. ఐఎస్ఐ చీఫ్‌గా మునీర్‌ను గత ఏడాది అక్టోబర్‌లో పాక్ ఆర్మీ చీఫ్ కమర్ జావేద్ బాజ్వా నియమించారు. పుల్వామా దాడి జరిపిన జైషే మహ్మద్‌తోనే గతంలో కశ్మీర్లో ఐఎస్ఐ అనేక ఉగ్రవాద కార్యకలాపాలు చేయించింది. భారత పార్లమెంటుపై దాడి కేసులో మరణ శిక్షకు గురైన అఫ్జల్ గురు వర్ధంతి సమయంలో అంటే ఫిబ్రవరి మొదటి వారంలో ఇంతటి భారీ దాడి చేయించడానికి ఐఎస్ఐ కుట్ర పన్నిందని పాక్ నిఘా సంస్థ గురించి తెలిసిన వారంటున్నారు. కానీ, తన పథకాన్ని ఇంకా పకడ్బందీగా అమలు చేయడానికి దాడిని కొద్ది రోజులు వాయిదా వేసింది. ‘ఇది అమలు జరిగిన తీరులో ఐఎస్ఐ చీఫ్ ముద్ర కనిపిస్తోంది’ అని కేబినెట్ సెక్రెటేరియట్‌లో పనిచేసిన తిలక్ దేవాశర్ తెలిపారు. -
బ్లాక్‌లిస్ట్‌లో పాకిస్తాన్!
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌ను అంతర్జాతీయ వేదికలపై ఒంటరి చేసేందుకు భారత్ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఉగ్రసంస్థలకు ఆర్థిక సాయంపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)కు పుల్వామా ఘటనపై కీలక సాక్ష్యాధారాలను సమర్పించనుంది. వచ్చేవారం ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఎఫ్ఏటీఏ ప్లీనరీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్‌కు పాకిస్తాన్ నిఘా సంస్థలు అందజేస్తున్న సాయాన్ని భారత్ ఎండగట్టనుంది. ఈ పత్రాలను భద్రతా సంస్థలు రూపొందిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. పారిస్‌లో జరిగే సమావేశంలో పాకిస్తాన్‌ను నిషేధిత జాబితా(బ్లాక్ లిస్ట్)లో చేర్చాల్సిందిగా కోరతామని తెలిపారు. మనీ లాండరింగ్‌తో పాటు ఉగ్రవాదులకు ఆర్థిక సాయమందించే దేశాలను ఎఫ్ఏటీఎఫ్ నిషేధిత జాబితాలో చేరుస్తుంది. దీనివల్ల అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ), యూరోపియన్ యూనియన్(ఈయూ)లు సదరు దేశపు రేటింగ్‌ను డౌన్‌గ్రేడింగ్ చేస్తాయి. దీంతో అంతర్జాతీయ సంస్థల నుంచి రుణసాయం, పెట్టుబడులు నిలిచిపోతాయి. అలాగే ఎస్అండ్పీ, ఫిచ్, మూడీస్ వంటి రేటింగ్ ఏజెన్సీలు సైతం పెట్టుబడులపై రిస్క్ రేటింగ్లను తగ్గించేస్తాయి. తద్వారా నిషేధిత దేశానికి అన్నివైపుల నుంచి దారులు మూసుకుపోతాయి. 2018, జూలైలో జరిగిన ప్లీనరీ సమావేశంలో ఎఫ్ఏటీఎఫ్ పాక్‌ను ‘గ్రే’ జాబితాలో చేర్చింది. నిర్దేశిత నిబంధనలను పాటించకుంటే నిషేధిత జాబితాలో చేరుస్తామని హెచ్చరించింది. ఎఫ్ఏటీఎఫ్లో 35 దేశాలు, ఈయూ కమిషన్, గల్ఫ్ సహకార మండలి సభ్యులుగా ఉన్నాయి. ఉత్తరకొరియా, ఇరాన్ దేశాలను ఎఫ్ఏటీఎఫ్ నిషేధిత జాబితాలో చేర్చింది. -
ప్రతి కన్నీటి బొట్టుకు ప్రతీకారం
యావత్మల్/ధూలె(మహారాష్ట్ర): పాకిస్తాన్ ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారిందని ప్రధాని మోదీ తీవ్రంగా మండిపడ్డారు. భద్రతా బలగాలపై నమ్మకం ఉంచి ఓపికగా ఎదురుచూడాలని, ముష్కరులపై ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని పునరుద్ఘాటించారు. మహారాష్ట్రలోని యావత్మల్, ధూలెలో ప్రధాని శనివారం పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించి బహిరంగ సభల్లో మాట్లాడారు. కశ్మీర్లో ఉగ్రదాడి పట్ల దేశమంతా ఆగ్రహంతో ఉన్న సంగతి స్పష్టంగా తెలుస్తోందని, అందరి కళ్లు చెమర్చాయని అన్నారు. ప్రతి కన్నీటి బొట్టుకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని హామీ ఇచ్చారు. మన సైనికులు లక్ష్యంగా బాంబులు, మారణాయుధాలు సమకూర్చే ఎవరినీ ‘నవ భారతం’ ఉపేక్షించదని అన్నారు. వాళ్ల త్యాగం వృథాగా పోదు.. ‘దేశ విభజన తరువాత ఉనికిలోకి వచ్చిన దేశం ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తోంది. దివాలా అంచుకు చేరిన ఆ దేశం ఉగ్రవాదానికి పర్యాయపదంగా మారింది’ అని యావత్మల్లో జరిగిన బహిరంగ సభలో పాక్ పేరును ప్రస్తావించకుండా మండిపడ్డారు. పుల్వామా దాడి తరువాత దేశం తీవ్ర నొప్పిని అనుభవిస్తోందని, అమర జవాన్ల త్యాగాలను వృథా కానీయమని చెప్పారు. నాగ్‌పూర్‌లోని అజ్నీ–పుణే రైలు సేవలను ప్రారంభించి, స్వయం సహాయక బృందాలకు చెక్కులు అందించారు. విషాదంలోనే సంయమనమూ ఉండాలి.. ఉత్తర మహారాష్ట్రలోని ధూలెలో జరిగిన సభలో మోదీ మాట్లాడుతూ.. విషాదం నిండిన ఈ సమయంలోనే సంయమనంతో వ్యవహరించాలని ప్రజలకు సూచించారు. ‘మనది కొత్త విధానాలు, పద్ధతులతో కూడిన నవ భారతం. ఈ సంగతి ప్రపంచానికి కూడా తెలుస్తుంది’ అని అన్నారు. ‘పుల్వామా’తో మోదీ ప్రచారం: కాంగ్రెస్ పుల్వామా దాడి కేంద్రంగా జాతీయవాదాన్ని రెచ్చగొడుతూ మోదీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మహారాష్ట్ర కాంగ్రెస్ ఆరోపించింది. ‘రాజకీయ పార్టీలన్నీ విభేదాలు విడనాడి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చిన మోదీ..తాను మాత్రం సొంత పార్టీకి ప్రచారం చేస్తూ జాతీయభావాలు రెచ్చగొడుతున్నారు. అమర జవాన్ల మృతదేహాలు ఇంకా వారి స్వస్థలాలకు చేరుకోకముందే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు’ పేర్కొంది. మమ్మల్ని బెదిరించలేరు: పాక్ ఇస్లామాబాద్: ఉగ్రదాడి ఘటనపై తమను ఎవరూ బెదిరించలేరని పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ తెలిపారు. ఈ ఘటనలో భారత్ ఆధారాలు సమర్పిస్తే సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. జర్మనీలో జరుగుతున్న మ్యూనిక్ భద్రతా సదస్సులో పాల్గొంటున్న ఖురేషీ మాట్లాడుతూ..‘ఉగ్రదాడి జరగ్గానే ఏమాత్రం విచారణ జరపకుండా పాక్‌ను భారత్ నిందిస్తోంది. సాక్ష్యాలులేని ఆరోపణలను ప్రపంచం అంగీకరించదు. మమ్మల్ని ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు. పాకిస్తాన్ శాంతిని మాత్రమే కోరుకుంటోంది. ఘర్షణను కాదు. ప్రపంచదేశాల ముందు మా వాదనల్ని కూడా వినిపిస్తాం’ అని పేర్కొన్నారు. -
దేశమంతా ఒకే గళం
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్ని ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో చెప్పాయి. ఉగ్రదాడి అంశంపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలో ఢిల్లీలో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. భద్రతా దళాలకు సంఘీభావం తెలిపి, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం కోసం తామంతా కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో ఓ తీర్మానాన్ని పార్టీలన్నీ ఆమోదిస్తూ దాడిని, ఉగ్రవాదులకు సరిహద్దుల అవతలి నుంచి అందుతున్న సాయాన్ని ఖండించాయి. అన్ని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను పిలిచి ప్రధాని మోదీ ఓ సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నేత ఆజాద్ సూచించారు. ఆయన సూచనను తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్, సీపీఐ నాయకుడు డి.రాజ సమర్థించారు. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం విడుదల చేసిన తీర్మానంలో ‘ఉగ్రదాడులను ఎదుర్కోవడంలో భారత్ ఇప్పటిరకు స్థైర్యాన్ని ప్రదర్శించింది. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ నిశ్చయంతో ఉందని దేశం మొత్తం ముక్తకంఠంతో చెబుతోంది. ఉగ్రవాదులతో పోరాడి దేశాన్ని రక్షిస్తున్న భద్రతా దళాలకు మేం అంతా సంఘీభావం తెలుపుతున్నాం’ అని నేతలు పేర్కొన్నారు. పాక్‌ను పరోక్షంగా పేర్కొంటూ సీమాంతర ఉగ్రవాదం కారణంగా సమస్యలను ఎదుర్కుంటోందని తీర్మానం తెలిపింది. అంతకుముందు రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఉగ్రదాడి గురించి, శుక్రవారం తన కశ్మీర్ పర్యటన వివరాలు అందరికీ తెలియజేశారు. ‘ఉగ్రవాదంపై పోరును అర్థవంతమైన దిశలో చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. బలగాల త్యాగాలు ఊరికేపోవు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు శాంతి కావాలి. వారు మనతోపాటే ఉన్నారు. కానీ కొన్ని సంఘవిద్రోహ శక్తులు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారు’ అని రాజ్‌నాథ్ ఇతర నాయకులకు తెలిపారు. సర్జికల్ దాడి ప్రభావం లేదు: సంజయ్ బీజేపీ మిత్రపక్షం శివసేన నేత సంజయ్ రౌత్ అఖిలపక్ష భేటీలో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి స్ఫూర్తిని పొంది (ఇందిర నేతృత్వంలో 1971 యుద్ధంలో పాక్‌పై భారత గెలుపు) పాకిస్తాన్‌ను నేరుగా దెబ్బ కొట్టాలని అన్నారు. కేంద్రం గొప్పగా చెప్పుకుంటున్న సర్జికల్ స్ట్రైక్స్ పాక్‌పై ఏమైనా ప్రభావం చూపి ఉంటే ఇప్పుడు ఈ దాడి జరిగేది కాదని ఆయన పేర్కొన్నారు. లాహోర్, ఇస్లామాబాద్ సహా పాకిస్తాన్ లోపలి భాగాలపై దాడి జరగాలన్నారు. ఉడీ సైనిక శిబిరంపై 2016లో ఉగ్రవాదులు దాడి జరిపిన అనంతరం ప్రతీకారంగా పాక్–భారత్ సరిహద్దుల్లో, నియంత్రణ రేఖకు అవతల, పాక్ వైపున ఉన్న ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ, సింధియా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బంధోపాధ్యాయ, టీఆర్ఎస్ నుంచి జితేందర్ రెడ్డి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఎల్జేపీ నేత రాం విలాస్ పాశ్వాన్, ఆప్ నేత సంజయ్ సింగ్, ఆర్ఎల్ఎస్పీ నుంచి ఉపేంద్ర కూష్వాహ, ఆర్జేడీ నాయకుడు జయ ప్రకాశ్ నారాయణ్ యాదవ్ తదితరులు కూడా అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. తీర్మానాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తోమర్ చదివి వినిపించారు. దాడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని కశ్మీర్ విద్యార్థులపై దాడులు జరగొచ్చన్న సమాచారం ఉన్నప్పటికీ ప్రజలంతా సంయమనాన్ని పాటించాలన్న అంశం ఈ తీర్మానంలో లేకపోవడం తనను నిరాశ పరిచిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు ఉగ్రవేటకు చర్యలు భద్రతా సమీక్షలో రాజ్‌నాథ్ దాడి జరిగిన రెండ్రోజుల అనంతరం శనివారం దేశవ్యాప్తంగా ప్రస్తుత భద్రతా పరిస్థితులపై హోం మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష నిర్వహించారు. కశ్మీర్ లోయలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను వేటాడేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతీయ భద్రతా సలహాదారు (నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ – ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్ తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దుతోపాటు దేశ వ్యాప్తంగా ప్రస్తుత భద్రతా పరిస్థితిని అధికారులు రాజ్‌నాథ్‌కు ఈ సమావేశంలో వివరించినట్లు హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని ఎదుర్కొనేందుకు తీసుకున్న భద్రతా చర్యలను హోం మంత్రికి అధికారులు వివరించారు. జమ్మూ కశ్మీర్‌లోని వేర్పాటు వాదులకు ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణపై సమీక్ష నిర్వహించి, పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న వేర్పాటు వాదులకు భద్రతను ఉపసంహరించాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా గుడిగెరె గ్రామంలో అమర జవాన్ హెచ్.గురు అంత్యక్రియలకు భారీగా హాజరైన ప్రజలు భోపాల్‌లో కొవ్వొత్తులు వెలిగించి అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది -
త్యాగాలకు మా బిడ్డలంతా సిద్ధం
భోపాల్: దేశం కోసం తమ బిడ్డలందరినీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు మధ్యప్రదేశ్‌లోని కుదవాల్ సిహోరా గ్రామస్థులు. పుల్వామాలో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఈ గ్రామానికి చెందిన 36 ఏళ్ల అశ్విన్ కచ్చి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే దేశం కోసం తమ బిడ్డ ప్రాణాలర్పించినందుకు తామెంతో గర్వపడుతున్నామని.. మిగతా బిడ్డలను కూడా సైన్యంలోకి పంపేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. అశ్విన్ తండ్రి మాట్లాడుతూ.. ‘నా కొడుకు అశ్విన్ లాంటి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకున్న పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలి’ అని కన్నీటిపర్యంతమయ్యారు. ఈ మా గ్రామానికి చెందిన దాదాపు 30 మంది ఇప్పటికే సైన్యంలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరెంతోమంది యువకులు సైన్యంలో చేరేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు' అన్నారు. -
ముగిసిన అఖిలపక్ష సమావేశం
-
ఉగ్రదాడిపై ముగిసిన అఖిలపక్ష సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ పుల్వామా ఉగ్రదాడిపై అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ లైబ్రరీ హాల్లో హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఉగ్రదాడిపై తీసుకోబోయే చర్యలను రాజ్‌నాథ్ సింగ్ అఖిలపక్ష నేతలకు వివరించారు. భారత దేశ ఐక్యత, సమగ్రతను దెబ్బతీసే చర్యలను అనమతించేదిలేదని అఖిలపక్షం అభిప్రాయపడింది. ఉగ్రవాదుల చర్యలను తిప్పికొట్టాల్సిందేనని నిర్ణయించింది. ఈ విషయంలో ప్రభుత్వం చేపట్టే చర్యలకు పూర్తి మద్దతు ఉంటుందని సమావేశంలో పాల్గొన్న ఆయా పార్టీలు స్పష్టం చేశాయి. ఈ సందర్భంగా చేసిన మూడు తీర్మానాలను అఖిలపక్షం ఆమోదించింది. ఉగ్రవాద చర్యలను తిప్పికొట్టేందుకు సైనికులకు దేశమంతా అండగా నిలబడి ఉందని అఖిలపక్షం అభిప్రాయపడింది. -
పాక్‌కు ఆ స్టేటస్‌ను కొనసాగించండి.. కానీ
న్యూఢిల్లీ : ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌కు గతంలో ఇచ్చిన మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ (ఎమ్‌ఎఫ్‌ఎన్)ను భారత ప్రభుత్వం ఉపసంహరించిన విషయం తెలిసిందే. అయితే ఈ స్టేటస్‌ను కొనసాగించాలని, కానీ ఎమ్ఎఫ్ఎన్లోని ‘ఎఫ్’ అర్థాన్ని మాత్రం భారత పౌరులు నిర్ణయిస్తారని టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ సెటైరిక్‌గా ట్వీట్ చేశాడు. I have some news for Pakistan. We should continue their ‘MFN’ status. Only thing is, that this time we the civilians will decide what ‘F’ stands for. https://t.co/5SsC6BlDvT — Gautam Gambhir (@GautamGambhir) February 16, 2019 ‘పాకిస్తాన్ గురించి ఓ వార్త విన్నాను. మనం ఆ దేశానికిచ్చిన ఎమ్‌ఎఫ్‌ఎన్ స్టేటస్‌ను కొనసాగిద్దాం. కానీ ఇందులోని ఎఫ్ అర్థాన్ని మాత్రం భారత పౌరులు నిర్ణయిస్తారు’ అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌పై భారత నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తుండగా పాక్ నెటిజన్లు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భారత నెటిజన్లు ఎఫ్‌కు తమ తోచిన అర్థాన్ని ఇస్తూ కామెంట్ చేస్తుండగా.. పాక్ నెటిజన్లు మాత్రం.. ఈ దాడిలో తమ దేశ ప్రమేయమే లేదని సుద్దపూస మాటలు మాట్లాడుతున్నారు. జమ్మూకశ్మీర్ పుల్వామా జిల్లాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు గురువారం ఆత్మహుతి దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి అనంతరం తీవ్ర భావోద్వేగంతో ట్వీట్ చేసిన గంభీర్.. ఇప్పటి వరకు జరిగింది చాలని.. వెంటనే పాకిస్తాన్‌తో యుద్దం చేయాలని డిమాండ్ చేశాడు. ఈ ఉగ్రదాడిని ఖండించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ.. ఎమ్‌ఎఫ్‌ఎన్ స్టేటస్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించాడు. అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్‌ను ఏకాకిని చేస్తామని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాకిస్తాన్‌కు సహకరించేవారిపై కూడా కఠినంగా వ్యవహరిస్తామని కూడా హెచ్చరించారు. (చదవండి: ఇక మాటల్లేవ్.. యుద్ధమే : గంభీర్)