కరాచీ: పాకిస్తాన్‌లోని తీరప్రాంత నగరం గ్వదర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌పై ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఉగ్రఘటనలో హోటల్ సెక్యూరిటీ గార్డు, ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. శనివారం సాయంత్రం పెర్ల్ కాంటినెంటల్ ఫైవ్‌స్టార్ హోటల్ వద్ద ముగ్గురు సాయుధ దుండగులు యథేచ్ఛగా కాల్పులు జరుపుతూ హోటల్ లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. వీరిని అడ్డగించిన హోటల్ సెక్యూరిటీ గార్డును కాల్చి చంపారు. వెంటనే స్పందించిన ప్రత్యేక బలగాలు ఉగ్రవాదులతో హోరాహోరీ తలపడ్డాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు.
ఈ క్రమంలో హోటల్‌లోని కొందరు సందర్శకులు, సిబ్బంది గాయాలపాలయ్యారు. ఈ ఉగ్రదాడి ఘటనకు తమదే బాధ్యతంటూ నిషేధిత బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ శనివారం ప్రకటించుకుంది. దాడి నేపథ్యంలో వెంటనే హోటల్‌లో ఉన్న విదేశీయులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు భద్రతా అధికారులు వెల్లడించారు. అఫ్గానిస్తాన్, ఇరాన్ దేశాలతో సరిహద్దు పంచుకుంటున్న గ్వదర్..పాక్‌లోని అత్యంత సమస్యాత్మక ప్రాంతం. వేలాది కోట్ల రూపాయల చైనా నిధులతో ఇక్కడ పోర్టు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తాజాగా ఇటీవల ఏప్రిల్ 18వ తేదీన ఇక్కడ జరిగిన ఉగ్రదాడిలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment