హోం మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలో అఖిలపక్ష భేటీకి హాజరైన రాజకీయ పార్టీల ప్రతినిధులు
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్ని ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో చెప్పాయి. ఉగ్రదాడి అంశంపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలో ఢిల్లీలో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. భద్రతా దళాలకు సంఘీభావం తెలిపి, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం కోసం తామంతా కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఉద్ఘాటించారు.
ఈ సమావేశంలో ఓ తీర్మానాన్ని పార్టీలన్నీ ఆమోదిస్తూ దాడిని, ఉగ్రవాదులకు సరిహద్దుల అవతలి నుంచి అందుతున్న సాయాన్ని ఖండించాయి. అన్ని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను పిలిచి ప్రధాని మోదీ ఓ సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నేత ఆజాద్ సూచించారు. ఆయన సూచనను తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్, సీపీఐ నాయకుడు డి.రాజ సమర్థించారు. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం విడుదల చేసిన తీర్మానంలో ‘ఉగ్రదాడులను ఎదుర్కోవడంలో భారత్ ఇప్పటిరకు స్థైర్యాన్ని ప్రదర్శించింది. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ నిశ్చయంతో ఉందని దేశం మొత్తం ముక్తకంఠంతో చెబుతోంది.
ఉగ్రవాదులతో పోరాడి దేశాన్ని రక్షిస్తున్న భద్రతా దళాలకు మేం అంతా సంఘీభావం తెలుపుతున్నాం’ అని నేతలు పేర్కొన్నారు. పాక్‌ను పరోక్షంగా పేర్కొంటూ సీమాంతర ఉగ్రవాదం కారణంగా సమస్యలను ఎదుర్కుంటోందని తీర్మానం తెలిపింది. అంతకుముందు రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఉగ్రదాడి గురించి, శుక్రవారం తన కశ్మీర్ పర్యటన వివరాలు అందరికీ తెలియజేశారు. ‘ఉగ్రవాదంపై పోరును అర్థవంతమైన దిశలో చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. బలగాల త్యాగాలు ఊరికేపోవు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు శాంతి కావాలి. వారు మనతోపాటే ఉన్నారు. కానీ కొన్ని సంఘవిద్రోహ శక్తులు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారు’ అని రాజ్‌నాథ్ ఇతర నాయకులకు తెలిపారు.
సర్జికల్ దాడి ప్రభావం లేదు: సంజయ్
బీజేపీ మిత్రపక్షం శివసేన నేత సంజయ్ రౌత్ అఖిలపక్ష భేటీలో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి స్ఫూర్తిని పొంది (ఇందిర నేతృత్వంలో 1971 యుద్ధంలో పాక్‌పై భారత గెలుపు) పాకిస్తాన్‌ను నేరుగా దెబ్బ కొట్టాలని అన్నారు. కేంద్రం గొప్పగా చెప్పుకుంటున్న సర్జికల్ స్ట్రైక్స్ పాక్‌పై ఏమైనా ప్రభావం చూపి ఉంటే ఇప్పుడు ఈ దాడి జరిగేది కాదని ఆయన పేర్కొన్నారు. లాహోర్, ఇస్లామాబాద్ సహా పాకిస్తాన్ లోపలి భాగాలపై దాడి జరగాలన్నారు. ఉడీ సైనిక శిబిరంపై 2016లో ఉగ్రవాదులు దాడి జరిపిన అనంతరం ప్రతీకారంగా పాక్–భారత్ సరిహద్దుల్లో, నియంత్రణ రేఖకు అవతల, పాక్ వైపున ఉన్న ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం తెలిసిందే.
కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ, సింధియా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బంధోపాధ్యాయ, టీఆర్‌ఎస్ నుంచి జితేందర్ రెడ్డి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఎల్జేపీ నేత రాం విలాస్ పాశ్వాన్, ఆప్ నేత సంజయ్ సింగ్, ఆర్‌ఎల్‌ఎస్పీ నుంచి ఉపేంద్ర కూష్వాహ, ఆర్జేడీ నాయకుడు జయ ప్రకాశ్ నారాయణ్ యాదవ్ తదితరులు కూడా అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. తీర్మానాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తోమర్ చదివి వినిపించారు. దాడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని కశ్మీర్ విద్యార్థులపై దాడులు జరగొచ్చన్న సమాచారం ఉన్నప్పటికీ ప్రజలంతా సంయమనాన్ని పాటించాలన్న అంశం ఈ తీర్మానంలో లేకపోవడం తనను నిరాశ పరిచిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు
ఉగ్రవేటకు చర్యలు
భద్రతా సమీక్షలో రాజ్‌నాథ్
దాడి జరిగిన రెండ్రోజుల అనంతరం శనివారం దేశవ్యాప్తంగా ప్రస్తుత భద్రతా పరిస్థితులపై హోం మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష నిర్వహించారు. కశ్మీర్ లోయలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను వేటాడేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతీయ భద్రతా సలహాదారు (నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ – ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్ తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
సరిహద్దుతోపాటు దేశ వ్యాప్తంగా ప్రస్తుత భద్రతా పరిస్థితిని అధికారులు రాజ్‌నాథ్‌కు ఈ సమావేశంలో వివరించినట్లు హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని ఎదుర్కొనేందుకు తీసుకున్న భద్రతా చర్యలను హోం మంత్రికి అధికారులు వివరించారు. జమ్మూ కశ్మీర్‌లోని వేర్పాటు వాదులకు ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణపై సమీక్ష నిర్వహించి, పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్‌ఐతో సంబంధాలున్న వేర్పాటు వాదులకు భద్రతను ఉపసంహరించాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు.
కర్ణాటకలోని మాండ్య జిల్లా గుడిగెరె గ్రామంలో అమర జవాన్ హెచ్.గురు అంత్యక్రియలకు భారీగా హాజరైన ప్రజలు
భోపాల్‌లో కొవ్వొత్తులు వెలిగించి అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బంది
Comments
Please login to add a commentAdd a comment