all-party meeting
-
ఇండియా కూటమి ఎంపీల కీలక భేటీకి టీఎంసీ డుమ్మా
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలను అదానీ అవినీతి అంశం, ఉత్తరప్రదేశ్‌లో సంభాల్ హింసాకాండ ఘటనలు కుదిపేస్తున్నాయి. ఈ అంశాలపై చర్చించాలంటూ ప్రతిపక్షాలు పట్టుపడుతుండటంతో ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సోమవారం సైతం పార్లమెంట్ సమావేశాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అనంతరం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఛాంబర్లో విపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సమావేశమయ్యారు.ఈ భేటీలో అనేక అంశాలు చర్చకు రాగా.. ముఖ్యంగా ఉభయసభల్లో ఎన్డీయే ప్రభుత్వాన్ని ఎదుర్కొనే వ్యూహంపై తీవ్రంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.. అయితే ఈ కీలక సమావేశానికి ఇండియా కూటమిలో భాగంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ డుమ్మా కొట్టింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, నిధుల కొరత, మణిపూర్ హింస అంశం వంటి ఆరు కీలక అంశాలను పార్లమెంట్లో లేవనెత్తాలనుకుంటున్నట్లు టీఎంసీ వర్గాలు తెలిపాయి. కానీ కాంగ్రెస్ మాత్రం అదానీ వ్యవహారంపై మాత్రమే ఒత్తిడి చేయాలనుకుంటోందని.. దీంతో నేడు ఇండియా కూటమి ఫ్లోర్ లీడర్ల సమావేశానికి హాజరుకావడం లేదని ఆ పార్టీ వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. తమ ప్రధాన అంశాలు ఎజెండాలో లేనప్పుడు సమావేశానికి హాజరు కాబోమని తృణమూల్ నేతలు తెలిపినట్లు పేర్కొన్నాయి.మరోవైపు అదానీ గ్రీన్‌పై యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆరోపణలపై చర్చించే వరకు హౌస్‌లోని కార్యకలాపాలను నిలిపివేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సోమవారం ఉదయం కూడా కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ అదానీ సమస్యపై చర్చించేందుకు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. అయితే, కాంగ్రెస్‌తో సహా పలు పార్టీల ఎంపీలు ఫెంగల్ తుఫాను కారణంగా సంభవించిన నష్టం, మసీదు సర్వేపై ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో హింస, బంగ్లాదేశ్‌లో ఇస్కాన్ సన్యాసులను లక్ష్యంగా చేసుకోవడం, పంజాబ్‌లో వరి సేకరణలో జాప్యం వంటి అనేక ముఖ్యమైన సమస్యలపై చర్చలు జరపాలని పట్టుబడుతున్నారు. -
Parliament: లోక్‌సభకు పొగ
కట్టుదిట్టమైన బందోబస్తు ఉండే పార్లమెంటు మూడంచెల భద్రత వ్యవస్థను ఇద్దరు సామాన్యులు ఏమార్చారు. బూట్లలో పొగ గొట్టాలు దాచుకుని మరీ బుధవారం సాధారణ సందర్శకుల్లా దర్జాగా లోక్‌సభ గ్యాలరీలోకి ప్రవేశించారు. జీరో అవర్ కొనసాగుతుండగా గ్యాలరీలోంచి సభా ప్రాంగణంలోకి దూకి.. స్పీకర్ స్థానంకేసి దూసుకెళ్లి కలకలం రేపారు. ‘నిరంకుశత్వం నశించాలి, నల్ల చట్టాలు పోవా’లని నినదిస్తూ, పొగ గొట్టాలను విసిరేశారు. వాటి నుంచి వచ్చి న పసుపు రంగు పొగతో ఎంపీలు భయాందోళనలకు లోనయ్యారు. చివరికి వారే చొరవ చేసి ఇద్దరినీ నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ఆవరణ బయట కూడా ఇద్దరు వ్యక్తులు పొగ గొట్టాలు విసిరి కలకలం రేపారు. వారినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నలుగురికీ మరో ఇద్దరు కూడా సహకరించినట్టు తేల్చారు. సరిగ్గా 22 ఏళ్ల కింద పార్లమెంటుపై ఉగ్రవాదులు దాడికి ప్రయతి్నంచిన రోజే జరిగిన ఈ ఉదంతం సంచలనం రేపింది. దీనిపై పార్టీలకతీతంగా ఎంపీలు, నేతలు ఆందోళన వెలిబుచ్చారు. సభలోకి దూకిన వారు మైసూరు ఎంపీ (బీజేపీ) ప్రతాప్ సింహ సిఫార్సుతో విజిటర్స్ గ్యాలరీ పాస్ సంపాదించినట్టు తేలింది. సాక్షి, న్యూఢిల్లీ: బుధవారం మధ్యాహ్నం. ఒంటి గంట సమయం. లోక్‌సభలో జీరో అవర్ ముగింపుకు వచ్చింది. బీజేపీ సభ్యుడు ఖగేన్ ముర్ము మాట్లాడుతుండగా ఉన్నట్టుండి పెద్ద శబ్దం! ఏమైందో అర్థం కాక లోక్‌సభ సభ్యులంతా ఒక్కసారిగా అయోమయానికి లోనయ్యారు. సందర్శకుల గ్యాలరీ నుంచి ఎవరో సభలోకి పడిపోయారని తొలుత భావించారు. అదేమీ కాదని, ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే సభలోకి దూకాడని అర్థమై బిత్తరపోయారు. ఆలోపే మరో వ్యక్తి కూడా సభలోకి దూకి మరింత కలకలం రేపాడు. ఇద్దరూ బెంచీలపై గెంతుతూ స్పీకర్‌ను చేరుకునేందుకు వెల్‌కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. బూట్లలోంచి పొగ గొట్టాలు తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పొగ హాలంతటా కమ్ముకుంది. ఈ పరిణామాలతో ఎంపీలు తీవ్ర ఆందోళనకు లోనై అటూ ఇటూ పరుగులు తీశారు. చివరికి ఎంపీలు, భద్రతా సిబ్బంది వారిని నిర్బంధించారు. అదే సమయంలో పార్లమెంటు ప్రాంగణం బయట కూడా పొగ గొట్టాలు విసిరి కలకలం రేపిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. 2001లో సరిగ్గా డిసెంబర్ 13వ తేదీనే పాకిస్తాన్‌లోని లష్కరే తొయిబాకు చెందిన ఉగ్రవాదులు పార్లమెంటు ప్రాంగణంపై దాడికి తెగబడి విచ్చలవిడి కాల్పులతో తొమ్మిది మందిని పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. తాజా ఉదంతంపై కేంద్ర హోం శాఖ సమగ్ర దర్యాప్తుకు ఆదేశించింది. తీవ్ర భద్రతా లోపం: ఎంపీలు ఘటన అనంతరం మధ్యాహ్నం రెండింటికి లోక్‌సభ తిరిగి సమావేశమయ్యాక సభ్యులు తీవ్ర ఆందోళన వెలిబుచ్చారు. 2001 దాడి అనంతరం ఇది అతి తీవ్రమైన భద్రతా లోపమంటూ మండిపడ్డారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా దీనిపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 13లోగా పార్లమెంటుపై దాడికి పాల్పడతానంటూ ఖలీస్థానీ వేర్పాటువాది గురుపర్వత్ సింగ్ పన్ను హెచ్చరించిన విషయాన్ని కొందరు సభ్యులు గుర్తు చేశారు. మొదటి వ్యక్తి తన సమీపంలోనే సభలోకి దూకాడని జేడీ(యూ) ఎంపీ రామ్‌ప్రీత్ మండల్ చెప్పారు. తామంతా తీవ్ర ఆందోళనతో అటూ ఇటూ పరుగులు తీశామన్నారు. వాళ్ల దగ్గర బాంబు, మారణాయుధాలుంటే పరిస్థితేమిటని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుదీప్ బంధోపాధ్యాయ ప్రశ్నించారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపిస్తామని స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. సభను వాయిదా వేసి ఈ ఉదంతంపై అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేశారు. కేంద్రం తక్షణం క్షమాపణ చెప్పాలని, పార్లామెంటు భద్రతను తక్షణం మరింత కట్టుదిట్టం చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దుండగులకు పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ సింహాను విచారించాలన్నారు. ఆయన్ను తక్షణం సభ నుంచి బహిష్కరించాలని తృణమూల్ సభ్యులు డిమాండ్ చేశారు. ఇలా జరిగింది... సభలోకి దూకి కలకలం రేపిన వారిని కర్ణాటకలోని మైసూరుకు చెందిన డి.మనోరంజన్ (34), యూపీలోని లక్నోకు చెందిన సాగర్ శర్మ (26)గా గుర్తించారు. జీరో అవర్ కాసేపట్లో ముగుస్తుందనగా ముందుగా సాగర్ ఒక్కసారిగా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. దాంతో ఎంపీలు షాక్‌కు గురై అటూ ఇటూ పరుగులు తీశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్, ఆరెల్పీ ఎంపీ హనుమాన్ బెనీవాల్ అతన్ని పట్టుకునేందుకు ప్రయతి్నస్తుండగానే మరో వ్యక్తి కూడా గ్యాలరీ నుంచి సభలోకి దూకాడు. ఇద్దరూ వెల్‌కేసి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. మొదటి వ్యక్తిని బెనీవాల్ తదితర ఎంపీలు పట్టుకుని దేహశుద్ధి చేశారు. నియంతృత్వం చెల్లదని అతను నినాదాలు చేశాడు. ‘‘దగ్గరికి రావద్దు. మేం దేశభక్తులం. నిరంకుశత్వంపై నిరసన తెలపడానికే వచ్చాం’’ అంటూ బిగ్గరగా అరిచాడు. ఇద్దరూ తమ బూట్ల నుంచి పొగ గొట్టం వంటివాటిని తీసి విసిరారు. వాటినుంచి వెలువడ్డ పసుపు రంగు పొగ సభ అంతటా వ్యాపించడంతో ఎంపీలంతా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు. తర్వాత ఎంపీలంతా కలిసి వారిని నిర్బంధించారు. బాగా దేహశుద్ధి చేసి పార్లమెంటు సిబ్బందికి అప్పగించారు. వెంటనే సభాపతి స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను గంటపాటు వాయిదా వేశారు. సభలో లేని మోదీ, అమిత్ షా ఘటన జరిగినప్పుడు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, మంత్రులు ప్రహ్లాద్ జోషీ, అర్జున్‌రామ్ మేఘ్వాల్తో పాటు కాంగ్రెస్ సభ్యులు రాహుల్ గాందీ, అదీర్ రంజన్ చౌధరి సహా మొత్తం 100 మందికి పైగా ఎంపీలు సభలో ఉన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లేరు. ఆరుగురూ ఒకే ఇంట్లో... పార్లమెంటు ఆవరణలో పొగ గొట్టాలు విసిరి పట్టుబడ్డ వారిని హరియాణాలోని హిస్సార్‌కు చెందిన నీలమ్ (42), మహారాష్ట్రలోని లాతూర్కు చెందిన అమోల్ షిండే (25)గా గుర్తించారు. వీరికి, మనోరంజన్, సాగర్లకు లలిత్, విశాల్ అనే మరో ఇద్దరు కూడా సహకరించినట్టు ఢిల్లీ పోలీసులు తేల్చారు. విశాల్‌ను గురుగ్రాంలో పట్టుకున్నారు. ఐదుగురినీ లోతుగా విచారిస్తున్నారు. ఆరుగురూ గ్యాలరీలోకి వెళ్లాలనుకున్నా ఇద్దరికే పాస్ దొరికినట్టు సమాచారం. వీరందరికీ కనీసం నాలుగేళ్లుగా పరిచయముందని, సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉండేవారని చెబుతున్నారు. అంతాకొంతకాలంగా గురుగ్రాంలో లలిత్ ఇంట్లో నే ఉంటున్నట్టు పోలీసులు తెలిపారు. వీరు 3 నెలలుగా పార్లమెంటు పాస్‌ల కోసం ప్రయతి్నస్తున్నట్టు విచారణలో తేలింది. ఎవరీ సింహా? దుండగులకు విజిటర్స్ పాస్‌లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మాజీ జర్నలిస్టు. కర్ణాటకలోని మైసూరు నుంచి రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రధాని మోదీ జీవిత చరిత్ర రాశారు. పార్లమెంటు కార్యకలాపాలు చూస్తామంటూ మనోరంజన్ పాస్‌లు తీసుకున్నట్టు ఎంపీ కార్యాలయం తెలిపింది. ఇలా నియోజకవర్గాల ప్రజలకు ఎంపీలు పాస్‌లు జారీ చేయడం మామూలేనంది. తాజా ఘటన నేపథ్యంలో పార్లమెంటులోకి సందర్శకులకు పాస్‌ల జారీని నిలిపేశారు. -
మణిపూర్‌కు అఖిలపక్షాన్ని పంపించాలి
న్యూఢిల్లీ/ఇంఫాల్: మణిపూర్‌లో పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం శనివారం పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో అఖిలపక్ష భేటీ నిర్వహించింది. హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించిన ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, టీఎంసీ, డీఎంకే, ఏడీఎంకే, బీజేడీ, ఆప్, ఆర్జేడీ, శివసేనతోపాటు వామపక్షాల పార్టీల నేతలు హాజరయ్యారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, నిత్యానంద్ రాయ్, అజయ్ కుమార్ మిశ్రా, హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా, ఐబీ డైరెక్టర్ తపన్ డేకా కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలను నెలకొల్పేందుకు కేంద్రం తీసుకుంటున్న పలు చర్యలను హోం మంత్రి అమిత్ షా వారికి వివరించారు. ప్రధాని మోదీ స్వయంగా ప్రతిరోజూ అక్కడి పరిస్థితులపై వాకబు చేస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అయితే, అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు వెంటనే అఖిలపక్ష బృందాన్ని పంపించాలని కాంగ్రెస్, టీఎంసీ సహా పలు పార్టీల నేతలు కోరారు. శాంతి భద్రతలను కాపాడటంలో రాష్ట్ర యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, సీఎం బిరెన్ సింగ్‌ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఎస్పీ కోరింది. హోం మంత్రి అమిత్ షా మాట్లాడుతూ..రాష్ట్రంలో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్రం చేయగలిగిందంతా చేస్తోందని చెప్పారు. అఖిలపక్ష బృందాన్ని పంపించడంపై అమిత్ షా ఎటువంటి ప్రకటన చేయలేదని అనంతరం బీజేపీ మణిపూర్ ఇన్చార్జి సంబిత్ పాత్ర మీడియాకు తెలిపారు. ప్రభుత్వం మణిపూర్‌ను మరో కశ్మీర్‌లాగా మార్చాలనుకుంటున్నట్లుందని అక్కడి పరిస్థితులపై టీఎంసీ నేత డెరెక్ ఒ బ్రియాన్ మీడియాతో వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో మంత్రి గోదాముకు నిప్పు మణిపూర్‌లో నిరసనకారుల గుంపు మరోసారి రెచ్చిపోయింది. శుక్రవారం రాత్రి తూర్పు ఇంఫాల్ జిల్లా చింగారెల్‌లోని మంత్రి ఎల్.సుసింద్రోకు చెందిన ప్రైవేట్ గోదాముకు నిప్పుపెట్టడంతో అది కాలిబూడిదయింది. అనంతరం ఖురాయ్‌లోని మంత్రి ఇంటికి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నట్లు పోలీసులు తెలిపారు. వారిపై బాష్పవాయువును ప్రయోగించామన్నారు. -
AP: రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర సమస్యలను సానుకూలంగా పరిష్కరించాలని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసిన వినతులు పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు. సోమవారం ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు వర్చువల్‌గా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. సీఎం జగన్మోహన్రెడ్డి పది ప్రధాన అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అనంతరం వీటి పరిష్కారానికి ప్రధాని ఏర్పాటు చేసిన కమిటీతో రాష్ట్ర బృందం భేటీ అయిందని తెలిపారు. ఈ భేటీలో కేంద్ర బృందం స్పష్టమైన హామీ ఇచ్చిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర సమస్యలు పరిష్కారమయ్యేలా బడ్జెట్ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆశాభావంతో ఉన్నారని తెలిపారు. పార్లమెంటు సమావేశాలు పదేపదే వాయిదా పడకుండా సజావుగా, ఎక్కువ సమయం జరగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నట్లు వివరించారు. సమావేశాలను అడ్డుకొనే వారిపై క్రమశిక్షణ వేటు వేయాలని అన్నారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాలన్నారు. ప్రభుత్వరంగ సంస్థల్ని ప్రైవేటుపరం చేయడాన్ని వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. ఎల్ఐసీ, బీపీసీఎల్, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలని కోరారు. కరోనా నేపథ్యంలో రాష్ట్రాలకు జీఎస్టీ నష్ట పరిహారం మరో ఐదేళ్లపాటు పొడిగించి ఆదుకోవాలన్నారు. మధ్య తరగతి ప్రజలకు స్వల్ప మొత్తంలో ఆరోగ్య బీమా అందించాలన్నారు. సుమారు 56 కోట్ల మంది ప్రజలు ఎలాంటి ఆరోగ్య బీమా లేకుండా ఉన్నారని తెలిపారు. జనాభా లెక్కల సేకరణ తక్షణమే చేపట్టి, కులాలవారీగా గణన చేయాలని సూచించారు. ప్రభుత్వ రంగ సంస్థల్లోని 10 లక్షల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని కోరారు. నిర్ణీత కాల వ్యవధిలో నియామకాలు పూర్తి చేసేలా యూపీఎస్సీ తరహాలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఆర్ఆర్బీకి సైతం చట్టబద్ధత కల్పించాలని విజయసాయిరెడ్డి సూచించారు. -
కశ్మీర్‌పై నేడు ప్రధాని అఖిలపక్ష సమావేశం
జమ్మూకశ్మీర్‌లో భద్రత కట్టుదిట్టం న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్ భవిష్యత్‌పై ప్రణాళిక రూపొందించడానికి ప్రధాని మోదీ ఆధ్వర్యంలో గురువారం కశ్మీర్‌కు చెందిన అఖిలపక్ష నేతలతో సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని నివాసంలో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. కశ్మీర్‌కు చెందిన వివిధ పార్టీ నాయకులు 14 మందిని కేంద్రం ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశానికి హాజరవడానికి ఒక్కొక్కరుగా నేతలు ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన, ఎన్నికల నిర్వహణ వంటి అంశాలపై చర్చ జరిగే అవకాశాలున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా బుధవారం పార్టీ నేతలతో ఈ సమావేశంపై చర్చించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇలాంటి సమావేశాలు జరగడం మంచిదేనని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. కశ్మీర్ ప్రజల ఆకాంక్షలు తీర్చేలా ఈ ప్రాంత ఐక్యత, సమగ్రత కాపాడేలా చర్యలు తీసుకునే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని సమావేశానంతరం నేషనల్ కాన్ఫరెన్స్ జమ్మూ ప్రాంత అధ్యక్షుడు దేవందర్æ రాణా చెప్పారు. పీడీపీ చీఫ్ మెహబూబా కశ్మీర్‌కు తిరిగి స్వతంత్ర ప్రతిపత్తిని కట్టబెట్టాలని సమావేశంలో గట్టిగా డిమాండ్ చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు. కశ్మీర్‌కి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా తిరిగి కట్టబెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరిగే తొలి సమావేశం కావడంతో దీనిపై అందరికీ ఆసక్తి ఏర్పడింది. కశ్మీర్లో 48 గంటల హై అలర్ట్ ప్రధానితో కశ్మీర్ నేతల సమావేశం నేపథ్యంలో నియంత్రణ రేఖ వెంబడి భద్రతను కేంద్రం మరింతగా పెంచింది. 48 గంటలు హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దుల వెంబడి పాక్‌తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ కేంద్రం భద్రతను కట్టుదిట్టం చేసింది. కశ్మీర్ లోయలో ఇంటర్నెట్ను కూడా కట్ చేసే అవకాశాలున్నాయి. -
తక్షణమే ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలి
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన, కరోనా ప్రభావంతో ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రత్యేక హోదా ప్రకటించాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం వర్చువల్‌గా ఏర్పాటైన అఖిలపక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టును కర్నూలుకు తరలించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కోరారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు కావాల్సి ఉందని, వాల్తేరు డివిజన్‌ను కొనసాగిసూ్తనే ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు పనులను పూర్తి చేయాలన్నారు. ► పార్లమెంట్ ఉభయ సభలతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలు, కౌన్సిళ్లు, నామినేటెడ్ పదవుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం సవరించిన బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని కోరారు. ► వ్యవసాయ ఉత్పత్తులకు రైతు గిట్టుబాటు ధర పొందే హక్కును చట్టబద్ధం చేయాలని కోరారు. ► ఇటీవల ఏపీలో వరుసగా జరిగిన ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం వెనుక టీడీపీ నాయకులున్నట్టుగా సీసీ టీవీ పుటేజీల ఆధారంగా వెల్లడైందన్నారు. ► మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాల కేసులను త్వరితగతిన పరిష్కరించేలా ఐపీసీ, సీఆర్పీసీలను సవరించాల్సిన అవసరం ఉందన్నారు. ఏపీ తెచ్చిన దిశ చట్టం 21 రోజుల్లో పరిష్కరించే వీలు కల్పించిందన్నారు. ► విశాఖలో జాతీయ ప్రాధాన్యం కలిగిన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని కోరారు. -
జనవరి 15న ఓటర్ల తుది జాబితా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను జనవరి 15న ప్రచురిస్తామని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో) కె.విజయానంద్ తెలిపారు. ఇటీవల విడుదల చేసిన మూసాయిదా ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు డిసెంబర్ 15లోగా తెలియజేయాలని రాజకీయ పార్టీలను కోరారు. సచివాలయంలోని ఐదో బ్లాక్‌లో రాజకీయ పార్టీలతో శుక్రవారం ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. విజయానంద్ మాట్లాడుతూ, నూతన ఓటర్ల నమోదుకు కూడా సహకరించాలన్నారు. 1,500 మంది ఓటర్లతో కూడిన పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తూ.. ఈనెల 16న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశామని, ఈ జాబితా ప్రకారం రాష్ట్రంలో 4,00,79,025 మంది ఓటర్లుగా నమోదైనట్లు తెలిపారు. క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు జనవరి 5లోగా పరిష్కారం చూపుతామన్నారు. ఈ నెల 28, 29 తేదీలతో పాటు డిసెంబర్ 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచారం నిర్వహించనున్నట్లు తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితా సవరణలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం ముఖ్యమని, ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు బూత్ లెవెల్ ఏజెంట్లను నియమించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొత్త ఓటర్లకు ఫొటో గుర్తింపు కార్డులు రాష్ట్రంలో కొత్తగా 80 లక్షల మంది ఓటర్లకు ఫొటో ఐడెంటిటీ కార్డులు జారీ చేసినట్లు విజయానంద్ తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది జనాభాకు 740 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఓటర్ల నివాసానికి రెండు కిలోమీటర్ల పరిధిలోనే పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గిరిజనులకు కూడా అందుబాటులో ఉండేలా పోలింగ్ స్టేషన్లు ఉంటాయన్నారు. రేషనలైజేషన్ తర్వాత రాష్ట్రంలో 45,917 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయన్నారు. ఉపాధ్యాయ ఓటర్ల నమోదుకు సహకరించండి మార్చిలో 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీల కోసం ఎన్నికలు జరగనున్నాయని, ఓటర్ల నమోదుకు సహకరించాలని పార్టీలను విజయానంద్ కోరారు. ప్రస్తుతం 30 వేల మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకున్నారని చెప్పారు. డిసెంబర్ 31లోగా రాష్ట్రంలో అర్హత కలిగిన ఉపాధ్యాయులందరూ ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. -
విభేదాలు వీడి కలిసి పనిచేద్దాం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా విజృంభిస్తుండడంతో రాజకీయ పార్టీలన్నీ తమ మధ్య ఉన్న విభేదాలను వీడి, ఈ మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. ఢిల్లీ ప్రజల సంక్షేమం కోసం పార్టీలకు అతీతంగా అందరూ చేతులు కలపాలని అన్నారు. రాజకీయ ఐకమత్యంతోనే ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని, తద్వారా కరోనా వ్యాప్తిని కట్టడి చేయడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఆయన సోమవారం అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు. ఈ భేటీకి బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, బీఎస్పీ నేతలు హాజరయ్యారు. ఢిల్లీలో కరోనా నియంత్రణ చర్యలు పక్కాగా అమలయ్యేలా అన్ని పార్టీల కార్యకర్తలు కృషి చెయ్యాలని చెప్పారు. ఈ విషయంలో ఆయా పార్టీల నాయకత్వాలు చొరవ తీసుకోవాలని కోరారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్, ముఖ్యమంత్రి, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, ఢిల్లీలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, అధికారులతో ఆదివారం జరిగిన సంప్రదింపుల సారాంశాన్ని అమిత్ షా అఖిలపక్ష నేతలకు తెలియజేశారు. అమిత్ షా సూచన పాటిద్దాం.. ఢిల్లీలో కరోనా వైరస్‌ను నియంత్రించే విషయంలో కేంద్ర హోంశాఖ అమిత్‌షా చేసిన సూచనను తప్పక పాటించాలని అధికార ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), ప్రతిపక్ష బీజేపీ నిర్ణయించుకున్నాయి. ఇకపై కరోనాపై కలిసికట్టుగా పోరాటం సాగించాలని తీర్మానించుకున్నాయి. అమిత్ షాతో భేటీ అనంతరం ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా, ఆప్ ఎంపీ సంజయ్ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని ఆదేశ్ గుప్తా అన్నారు. -
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి
సాక్షి, హైదరాబాద్: గత 23 రోజులుగా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని పలు రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం హైదరాబాద్‌లోని నాంపల్లిలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (టీపీసీసీ అధ్యక్షుడు), వి. హనుమంతరావు (మాజీ ఎంపీ), ఎం.కోదండరాం (టీజేఎస్ అధ్యక్షుడు), చాడా వెంకటరెడ్డి (సీపీఐ రాష్ట్ర కార్యదర్శి), చెరుకు సుధాకర్ (తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు), ఎల్.రమణ (టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు) తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రజల స్థితిగతులు, రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఆయా పార్టీల నేతలు చర్చించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకోసం కష్టపడుతున్న వైద్య శాఖ సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ సిబ్బందికి అభినందనలు తెలిపారు. కొన్నిరోజుల లాక్‌డౌన్‌కే ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు కోత పెట్టడమేంటని, పెద్ద ఎత్తున వస్తున్న విరాళాలు, రాష్ట్ర ప్రభుత్వం బాండ్ల వేలం ద్వారా సమకూర్చుకుంటున్న నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలందరికి సంబంధించిన విషయంలో ప్రతిపక్ష పార్టీలను సంప్రదించేందుకు సీఎం కేసీఆర్ ఎందుకు ముందుకు రావడం లేదని, వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, ముందు జాగ్రత్త చర్యలపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశం అనంతరం అన్ని పార్టీల నేతలు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయా నేతలు వ్యక్తపరిచిన అఖిలపక్షం డిమాండ్లివే: ► రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి. ► రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగించినందున గతంలో పేదలకు ప్రకటించిన బియ్యం, నగదు సాయానికి అదనంగా రెండో విడత ప్యాకేజీ ప్రకటించాలి. ► వలస కార్మికులకు వీలున్నంత సాయం అందించాలి. వారు స్వగ్రామాలకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. ► కరోనా చికిత్సల కోసం గాంధీతో పాటు పలు ఆసుపత్రులను వినియోగించుకోవాలి. రెడ్‌జోన్ ప్రాంతాల్లో కరోనా నిర్ధారణ కోసం ర్యాపిడ్ టెస్టులు నిర్వహించాలి. ► బియ్యం, నగదు సాయాన్ని తెల్ల రేషన్ కార్డుదారులందరికీ అందేలా చర్యలు తీసుకోవాలి. రేషన్ కార్డులు లేని వారికి కూడా సాయం చేయాలి. ► పసుపు, బత్తాయి, మిర్చి, మామిడి, కంది పంటలను ప్రభుత్వం పూర్తిగా కొనుగోలు చేయాలి. ► ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను వెంటనే విధుల్లోకి తీసుకుని గ్రామీణ ప్రాంతాల్లో కూ లీ పనులు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి. ► రాబోయే 2 నెలలకు పేదలకు కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సాయం అందించాలి. ► వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రజలు, పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని రాష్ట్రంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి. -
రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం
-
‘ఆర్థికం’పై సమగ్రంగా చర్చిద్దాం
న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో.. గురువారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలను లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో విపక్ష సభ్యులు లేవనెత్తారు. నిరసనకారుల ఆందోళనలపై స్పందించకుండా కేంద్ర ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అయిన ఆర్థిక మాంద్యం సహా అన్ని అంశాలపై పార్లమెంట్లో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ వారికి స్పష్టం చేశారు. మెజారిటీ సభ్యులు కోరుతున్న విధంగా.. ఈ బడ్జెట్ సమావేశాల్లో ఆర్థిక అంశాలకు సముచిత ప్రాధాన్యత ఇద్దామని, ప్రస్తుతం ప్రపంచమంతా నెలకొన్న ఆర్థిక మాంద్య పరిస్థితుల నుంచి భారత్ ఎలా ప్రయోజనం పొందగలదనే విషయంపై దృష్టిపెడదామని ప్రధాని సూచించారు. ‘కొత్త సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థకు సరైన దిశానిర్దేశం చేద్దాం’ అన్నారు. భేటీలో సభ్యులు లేవనెత్తిన అన్ని అంశాలపై చర్చిద్దామన్నారు. ‘ప్రతీ అంశంపైనా సాదాసీదాగా చర్చించడం కాకుండా.. సమగ్రంగా నిర్మాణాత్మకంగా చర్చ జరుపుదాం’ అని ప్రధాని సూచించారు. 26 పార్టీలు పాల్గొన్న ఈ అఖిలపక్ష సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మీడియాకు తెలిపారు. సీఏఏ వ్యతిరేక నిరసనలు, ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న నిరుద్యోగం.. తదితర అంశాలను ఈ భేటీలో విపక్షాలు లేవనెత్తాయి. జమ్మూకశ్మీర్‌లో మాజీ సీఎంలు, ఇతర రాజకీయ నేతలను నిర్బంధించిన విషయాన్ని కూడా ప్రస్తావించామని భేటీ అనంతరం కాంగ్రెస్ సభ్యుడు ఆజాద్ తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వీలుగా నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లాను విడుదల చేయాలని డిమాండ్ చేశామన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నేతలు రెచ్చగొట్టేలా, అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరామని కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ తెలిపారు. అంతా సహకరిస్తామన్నారు: స్పీకర్ బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగుతాయని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆశాభావం వ్యక్తం చేశారు. సభ సజావుగా సాగేందుకు సహకరిస్తామని అన్ని పార్టీల నేతలు తనకు హామీ ఇచ్చారన్నారు. సభలో మాట్లాడేందుకు అన్ని పార్టీల సభ్యులకు తగిన సమయమిస్తానన్నారు. -
రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రాభివృద్ధి, ఏపీ ప్రయోజనాలే లక్ష్యంగా వివిధ అంశాలను అఖిలపక్ష సమావేశంలో ప్రధానమంత్రి దృష్టికి తెచ్చినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి తెలిపారు. గురువారం పార్లమెంట్ భవనంలో అఖిలపక్ష సమావేశానికి హాజరైన అనంతరం వైఎస్సార్ సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. మైనారిటీ సోదరుల్లో అభద్రతకు కారణమైన ఎన్పీఆర్, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పామని మిథున్‌రెడ్డి తెలిపారు. వీటిపై సభలో చర్చ కోసం పట్టుబడతామని స్పష్టం చేశారు. ప్రధాని దృష్టికి తెచ్చిన అంశాలు ఇవీ... – రాష్ట్రానికి రెవెన్యూ లోటు గ్రాంట్లకు సంబంధించి ఇంకా రావాల్సిన రూ.18,969 కోట్లు ఇవ్వాలి. – ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ప్రత్యేక నిధులు మంజూరు చేయాలి. కేబీకే– బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాల్సి ఉండగా ప్రస్తుతం జిల్లాకు రూ. 50 కోట్ల చొప్పున ఏడు జిల్లాలకు రూ. 350 కోట్లు చెల్లిస్తోంది. అంచనాలను సవరించి రూ. 24,350 కోట్లు ఇవ్వాలి. ఇప్పటివరకు ఇచ్చిన నిధులు తీసేయగా మిగిలిన రూ. 23,350 కోట్లు ఇవ్వాలి. – జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం కోసం ఆంధ్రప్రదేశ్ ఇప్పటివరకు రూ.11,860 కోట్లు వెచ్చించింది. ఇందులో ఇంకా రూ.3,283 కోట్లు రీయింబర్స్ చేయాల్సి ఉంది. – ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55,548 కోట్లు కాగా సాంకేతిక సలహా కమిటీ దీన్ని క్లియర్ చేసింది. సవరించిన వ్యయ అంచనాల కమిటీ ఆమోదించాల్సి ఉంది. దీన్ని త్వరితగతిన పరిష్కరించాలి – రాజధాని నిర్మాణ అవసరాల కోసం రూ.49,924 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కేంద్రం ఇప్పటివరకు రూ.2,500 కోట్లు ఇచ్చింది. మిగిలిన మొత్తాన్ని విడుదల చేయాలి. – దుగరాజపట్నం పోర్టుకు వాణిజ్య యోగ్యత లేదని కేంద్రం చెప్పినందున దానికి బదులుగా రామాయపట్నం పోర్టు కోసం ఆర్థిక సాయం అందించాలి. – కడపలో స్టీల్ ప్లాంట్‌కు నిధులు మంజూరు చేయాలి. – విభజన చట్టం ప్రకారం ఏపీకి పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందించాలి. పదేళ్లపాటు జీఎస్టీ రీయింబర్స్మెంట్, పదేళ్లపాటు ఆదాయపన్ను మినహాయింపు, వందశాతం ఇన్సూరెన్స్ ప్రీమియం రాయితీ, 20 శాతం రవాణా వ్యయం, 3.6 శాతం పీఎఫ్ చందా తదితర వెసులుబాట్లు కల్పించాలి. – కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా రావాల్సిన రూ. 5,834 కోట్లు విడుదల చేయాలి. ఎన్నార్సీ, ఎన్పీఆర్లను వ్యతిరేకిస్తాం సాక్షి న్యూఢిల్లీ, పీలేరు (చిత్తూరు జిల్లా): ‘సీఏఏ బిల్లు ప్రవేశపెట్టిన తరువాత మైనారిటీ సోదరుల్లో అభద్రత నెలకొంది. ఎన్ఆర్సీ గానీ, ఎన్పీఆర్గానీ కచ్చితంగా వ్యతిరేకిస్తామని తెలిపాం. దీనిపై చర్చ జరగాలని కోరాం. ఈరోజు అనిశ్చితి ఎందుకు నెలకొంది? ఎలా తొలగించాలన్న అంశంపై చర్చ జరగాలని మేం పట్టుబట్టాం. ఇదే అంశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి దృష్టికి కూడా తెచ్చాం. మైనారిటీ సోదరుల తరపున ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లను మేం కచ్చితంగా వ్యతిరేకిస్తాం. మూడు దేశాల నుంచి వచ్చే శరణార్థుల కోసమని సీఏఏ బిల్లు ప్రవేశపెట్టారు. కానీ ఈ రోజు దేశంలో మైనారిటీలంతా అభద్రతా భావానికి లోనయ్యారు. సీఏఏ ప్రవేశపెట్టిన తీరు వేరు ఈరోజు అమలు చేస్తున్న తీరు వేరు. మైనారిటీ సోదరులకు వ్యతిరేకంగా ఉండే ఏ బిల్లునైనా వ్యతిరేకిస్తామని ముఖ్యమంత్రి ఇదివరకే చెప్పారు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలు, ఎన్నార్సీ, ఎన్పీఆర్ వల్ల మైనారిటీ సోదరుల్లో నెలకొన్న అభద్రత తదితర అంశాలన్నీ చర్చకు రావాలని లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా నిర్వహించిన అఖిలపక్ష భేటీలో కోరా. సభాపతి వీటిని నమోదు చేసుకున్నారు’ అని మిథున్‌రెడ్డి తెలిపారు. -
యురేనియం అన్వేషణ ఆపేయాలి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో యురేనియం అన్వేషణ, తవ్వకాలను తక్షణమే నిలిపేయాలని వివిధ పార్టీలు, స్వచ్ఛంద, ప్రజాసంఘాలు, నిపుణులతో కూడిన అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానంలోని అంశాలపై ఇంకా స్పష్టతివ్వాలని పేర్కొంది. పలు డిమాండ్లను అఖిలపక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. అయోమయానికి గురిచేస్తున్నారు.. సోమవారం దస్పల్లా హోటల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ‘యురేనియం ఆపాలి.. నల్లమలను పరిరక్షించాలి’అంశంపై ఈ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. యురేనియం పరిశోధన, అన్వేషణ, వెలికితీత ఏ రూపంలో ఉన్నా వాటిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంద న్నారు. యురేనియం అన్వేషణ నల్లమలపై ఎక్కుపెట్టిన తుపాకీ అని, దాన్ని తప్పక దించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లి, యురేనియం అన్వేషణకు అనుమతించబోమని చెప్పా లని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. యురేనియం తవ్వకాలు, అన్వేషణ ఆపేస్తామన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలపాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అనంతరం మాజీ న్యాయమూర్తి గోపాల్‌గౌడ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సమావేశంలో నిపుణులు, పర్యావరణవేత్తలు బాబూరావు, కె.పురుషోత్తంరెడ్డి, డి.నర్సింహారెడ్డి, ప్రొ.జయధీర్ తిరుమలరావు, కొండవీటి సత్యవతి, వి.సంధ్య, అరవింద్, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కాంగ్రెస్ నేత వీహెచ్, మూమెంట్ అగెన్ట్ యూరోనియం ప్రతినిధి కె.సజయ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఇమ్రాన్ సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు. -
సాగు సంక్షోభం .. నిరుద్యోగం
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ ఎన్నికలు, నిరుద్యోగం, సాగు సంక్షోభం, కరువు, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలను ఆదివారం నాటి అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా లేవనెత్తింది. జమ్మూ కశ్మీర్లో త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరింది. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలకు ఒకరోజు ముందు కేంద్రం నిర్వహించిన ఈ భేటీలో.. ఈ అంశాలన్నిటినీ పార్లమెంటులో చర్చించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఇది ఇప్పటికీ ఒక సైద్ధాంతిక పోరాటమేనని కాంగ్రెస్ పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభలో విపక్ష నేత గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ ఎంపీలు అధీర్ రంజన్ చౌదరి, కె.సురేష్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రీన్ తదితరులు పాల్గొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు అంశాన్ని కూడా విపక్షాలు గట్టిగా ప్రస్తావించాయి. కాగా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని టీఎంసీ నేతలు సుదీప్ బంద్యోపాధ్యాయ్, ఒబ్రీన్లు నొక్కిచెప్పారు. అదే సమయంలో సమాఖ్యవాదం బలహీనపడుతుండటంపై ఆందోళన వ్యక్తం చేస్తూ..రాష్ట్రాలను ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం ఆమోదనీయం కాదని విపక్షాలు స్పష్టం చేశాయి. ‘అధికారంలోకి వచ్చినందుకు ప్రభుత్వాన్ని అభినందించాం. ఇది సైద్ధాంతిక పోరాటం, గతంలోనూ సైద్ధాంతిక పోరాటమే. సైద్ధాంతిక పోరాటంగానే ఉంటుంది కూడా..’ అని ప్రభుత్వానికి చెప్పినట్లు సమావేశం తర్వాత ఆజాద్ విలేకరులకు తెలిపారు. లౌకిక శక్తులకు కాంగ్రెస్ పార్టీ పునాది వంటిదని, ప్రభుత్వంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా ఆ స్ఫూర్తిని సజీవంగా ఉంచేందుకు తమ పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. అధికారంలో లేకపోయినా రైతులు, కార్మికులు, మహిళల అభ్యున్నతికి కృషి కొనసాగిస్తామని అన్నారు. దేశంలో భారీ నిరుద్యోగిత, కరువు పరిస్థితులు, సాగు సమస్యలు, తాగునీటి కొరత వంటి అంశాలపై దృష్టి పెట్టాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు. ‘పత్రికా స్వేచ్ఛ గురించి కూడా లేవనెత్తాం. జర్నలిస్టుల విషయంలో అధికార పార్టీ కార్యకర్తలు వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావించాం. వారిని కొడుతున్నారు. వారి గొంతును అణిచివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిని ఖండిస్తూ ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరాం..’ అని ఆజాద్ తెలిపారు. కశ్మీర్లో రాష్ట్రపతి పాలన అవసరం లేదని, త్వరగా ఎన్నికలు నిర్వహించాలని కోరినట్లు చెప్పారు. పంచాయతీ ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించగలిగినప్పుడు, అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించకూడదన్నారు. ఎన్నికలకు రాష్ట్రాల నిధులు, బ్యాలెట్ పేపర్ల వంటి ఎన్నికల సంస్కరణలను టీఎంసీ లేవనెత్తింది. ప్రతిదానికీ ఆర్డినెన్సును ఉపయోగించడాన్ని కూడా టీఎంసీ ప్రస్తావించింది. దురదృష్టవశాత్తూ 16వ లోక్‌సభలో గత 70 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా దానిని మితిమీరి ఉపయోగించారని బంద్యోపాధ్యాయ, ఒబ్రీన్ చెప్పారు. వైఎస్సార్సీపీ ఎంపీలు వి. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, టీఆర్ఎస్ ఎంపీలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు అఖిలపక్ష భేటీలో పాల్గొన్నారు. అఖిలపక్ష భేటీ ఫలప్రదం: మోదీ ‘ఎన్నికల ఫలితాల తర్వాత, పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు ఒక ఫలప్రదమైన అఖిలపక్ష భేటీ జరిగింది. విలువైన సూచనలిచ్చిన నేతలకు కృతజ్ఞుడినై ఉంటా’ అంటూ అఖిలపక్ష భేటీ అనంతరం మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం, అలాగే ఎన్డీయే భేటీ ఆదివారం ఢిల్లీలో జరిగాయి. బడ్జెట్, ట్రిపుల్ తలాక్ ప్రభుత్వ ప్రధాన ఎజెండా పదిహేడవ లోక్‌సభ మొదటి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర బడ్జెట్‌కు ఆమోదం, ట్రిపుల్ తలాక్ వంటి ఇతర కీలక చట్టాలు ప్రభుత్వ ఎజెండాలో అగ్రభాగాన ఉండనున్నాయి. మొదటి రెండురోజులు సభ్యుల ప్రమాణ స్వీకారానికి వినియోగిస్తారు. 19న స్పీకర్ ఎన్నిక ఉంటుంది. మరుసటి రోజు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జూలై 5న బడ్జెట్ ప్రవేశ పెడతారు. 26 వరకు సమావేశాలు కొనసాగుతాయి. జూన్ 20 నుంచి రాజ్యసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. నేడు ఏపీ ఎంపీల ప్రమాణస్వీకారం సాక్షి, న్యూఢిల్లీ: ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు సోమ, మంగళవారాల్లో లోక్‌సభ సభ్యులుగా ప్రమాణం చేయనున్నారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కుమార్ వీరితో ప్రమాణం చేయిస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి గెలిచిన ఎంపీల ప్రమాణస్వీకారం సోమవారం మధ్యాహ్నానికి పూర్తికానుంది. అక్షర క్రమంలో మొదటగా అండమాన్ నికోబార్ ఎంపీలు, తర్వాత ఏపీ ఎంపీలు ప్రమాణం చేయనున్నారు. తెలంగాణ ఎంపీలు మంగళవారం ప్రమాణం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికెన వైఎస్సార్సీపీ ఎంపీలందరూ సోమవారం ఉదయం వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నివాసంలో భేటీ కానున్నారు. -
దేశమంతా ఒకే గళం
న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం తీసుకునే ఏ చర్యకైనా తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్ని ప్రతిపక్ష పార్టీలు ముక్తకంఠంతో చెప్పాయి. ఉగ్రదాడి అంశంపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలో ఢిల్లీలో శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. పలు జాతీయ, ప్రాంతీయ పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. భద్రతా దళాలకు సంఘీభావం తెలిపి, దేశ ఐక్యత, సమగ్రతను కాపాడటం కోసం తామంతా కలిసికట్టుగా ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో ఓ తీర్మానాన్ని పార్టీలన్నీ ఆమోదిస్తూ దాడిని, ఉగ్రవాదులకు సరిహద్దుల అవతలి నుంచి అందుతున్న సాయాన్ని ఖండించాయి. అన్ని ప్రధాన జాతీయ, ప్రాంతీయ పార్టీల అధ్యక్షులను పిలిచి ప్రధాని మోదీ ఓ సమావేశాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ నేత ఆజాద్ సూచించారు. ఆయన సూచనను తృణమూల్ కాంగ్రెస్ నేత డెరెక్ ఒబ్రెయిన్, సీపీఐ నాయకుడు డి.రాజ సమర్థించారు. రెండు గంటలపాటు సాగిన ఈ సమావేశం అనంతరం విడుదల చేసిన తీర్మానంలో ‘ఉగ్రదాడులను ఎదుర్కోవడంలో భారత్ ఇప్పటిరకు స్థైర్యాన్ని ప్రదర్శించింది. ఉగ్రవాదంపై పోరాటానికి భారత్ నిశ్చయంతో ఉందని దేశం మొత్తం ముక్తకంఠంతో చెబుతోంది. ఉగ్రవాదులతో పోరాడి దేశాన్ని రక్షిస్తున్న భద్రతా దళాలకు మేం అంతా సంఘీభావం తెలుపుతున్నాం’ అని నేతలు పేర్కొన్నారు. పాక్‌ను పరోక్షంగా పేర్కొంటూ సీమాంతర ఉగ్రవాదం కారణంగా సమస్యలను ఎదుర్కుంటోందని తీర్మానం తెలిపింది. అంతకుముందు రాజ్‌నాథ్ మాట్లాడుతూ ఉగ్రదాడి గురించి, శుక్రవారం తన కశ్మీర్ పర్యటన వివరాలు అందరికీ తెలియజేశారు. ‘ఉగ్రవాదంపై పోరును అర్థవంతమైన దిశలో చేపట్టాలని ప్రభుత్వం నిశ్చయించుకుంది. బలగాల త్యాగాలు ఊరికేపోవు. జమ్మూ కశ్మీర్ ప్రజలకు శాంతి కావాలి. వారు మనతోపాటే ఉన్నారు. కానీ కొన్ని సంఘవిద్రోహ శక్తులు పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నారు’ అని రాజ్‌నాథ్ ఇతర నాయకులకు తెలిపారు. సర్జికల్ దాడి ప్రభావం లేదు: సంజయ్ బీజేపీ మిత్రపక్షం శివసేన నేత సంజయ్ రౌత్ అఖిలపక్ష భేటీలో మాట్లాడుతూ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నుంచి స్ఫూర్తిని పొంది (ఇందిర నేతృత్వంలో 1971 యుద్ధంలో పాక్‌పై భారత గెలుపు) పాకిస్తాన్‌ను నేరుగా దెబ్బ కొట్టాలని అన్నారు. కేంద్రం గొప్పగా చెప్పుకుంటున్న సర్జికల్ స్ట్రైక్స్ పాక్‌పై ఏమైనా ప్రభావం చూపి ఉంటే ఇప్పుడు ఈ దాడి జరిగేది కాదని ఆయన పేర్కొన్నారు. లాహోర్, ఇస్లామాబాద్ సహా పాకిస్తాన్ లోపలి భాగాలపై దాడి జరగాలన్నారు. ఉడీ సైనిక శిబిరంపై 2016లో ఉగ్రవాదులు దాడి జరిపిన అనంతరం ప్రతీకారంగా పాక్–భారత్ సరిహద్దుల్లో, నియంత్రణ రేఖకు అవతల, పాక్ వైపున ఉన్న ఉగ్రస్థావరాలపై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేయడం తెలిసిందే. కాంగ్రెస్ నుంచి ఆనంద్ శర్మ, సింధియా, తృణమూల్ కాంగ్రెస్ నుంచి సుదీప్ బంధోపాధ్యాయ, టీఆర్ఎస్ నుంచి జితేందర్ రెడ్డి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూఖ్ అబ్దుల్లా, ఎల్జేపీ నేత రాం విలాస్ పాశ్వాన్, ఆప్ నేత సంజయ్ సింగ్, ఆర్ఎల్ఎస్పీ నుంచి ఉపేంద్ర కూష్వాహ, ఆర్జేడీ నాయకుడు జయ ప్రకాశ్ నారాయణ్ యాదవ్ తదితరులు కూడా అఖిలపక్ష సమావేశానికి హాజరయ్యారు. తీర్మానాన్ని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తోమర్ చదివి వినిపించారు. దాడి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని కశ్మీర్ విద్యార్థులపై దాడులు జరగొచ్చన్న సమాచారం ఉన్నప్పటికీ ప్రజలంతా సంయమనాన్ని పాటించాలన్న అంశం ఈ తీర్మానంలో లేకపోవడం తనను నిరాశ పరిచిందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు ఉగ్రవేటకు చర్యలు భద్రతా సమీక్షలో రాజ్‌నాథ్ దాడి జరిగిన రెండ్రోజుల అనంతరం శనివారం దేశవ్యాప్తంగా ప్రస్తుత భద్రతా పరిస్థితులపై హోం మంత్రి రాజ్‌నాథ్ సమీక్ష నిర్వహించారు. కశ్మీర్ లోయలో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదులను వేటాడేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జాతీయ భద్రతా సలహాదారు (నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ – ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్ తదితరులు సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సరిహద్దుతోపాటు దేశ వ్యాప్తంగా ప్రస్తుత భద్రతా పరిస్థితిని అధికారులు రాజ్‌నాథ్‌కు ఈ సమావేశంలో వివరించినట్లు హోం శాఖకు చెందిన ఓ అధికారి చెప్పారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు కశ్మీర్ లేదా దేశంలోని ఇతర ప్రాంతాల్లో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని ఎదుర్కొనేందుకు తీసుకున్న భద్రతా చర్యలను హోం మంత్రికి అధికారులు వివరించారు. జమ్మూ కశ్మీర్‌లోని వేర్పాటు వాదులకు ప్రస్తుతం ప్రభుత్వం కల్పిస్తున్న రక్షణపై సమీక్ష నిర్వహించి, పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధాలున్న వేర్పాటు వాదులకు భద్రతను ఉపసంహరించాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం నిర్ణయించినట్లు ఓ ఉన్నతాధికారి చెప్పారు. కర్ణాటకలోని మాండ్య జిల్లా గుడిగెరె గ్రామంలో అమర జవాన్ హెచ్.గురు అంత్యక్రియలకు భారీగా హాజరైన ప్రజలు భోపాల్‌లో కొవ్వొత్తులు వెలిగించి అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది -
అఖిలపక్షం కాదు.. అంతా సొంత డబ్బా
సాక్షి, అమరావతి: ఎన్నికలకు ముందు రాజకీయ ప్రయోజనాల కోసం పిలుపునిచ్చిన అఖిపక్ష సమావేశంలో సీఎం చంద్రబాబు తన గొప్పలు చెప్పుకునేందుకు పోటీపడ్డారు. అఖిలపక్ష భేటీ అని మర్చిపోయి ఎప్పటిలాగానే తన సొంత భజనకే ప్రాధాన్యమిచ్చారు. ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు ఈ సమావేశానికి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో పూర్తిగా ప్రాధాన్యం కోల్పోయిన సమావేశాన్ని తాను రోజూ చెప్పే మాటలతోనే చంద్రబాబు సుదీర్ఘంగా నిర్వహించారు. మధ్యాహ్నం మూడున్నర గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ నిర్వహించిన భేటీలో ఒక్క కొత్త అంశంపై కూడా చర్చ జరగలేదు. చంద్రబాబు తన గురించి, రాష్ట్ర ప్రభుత్వం గురించి పదే పదే సొంత డబ్బా కొట్టడమే ఎజెండాగా సమావేశం సాగింది. పార్టీ, ప్రభుత్వ సమావేశాల్లో ప్రతిరోజూ చెప్పే ప్రసంగాన్నే మళ్లీ వినిపించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అఖిలపక్ష సమావేశానికి రాలేదనే అక్కసుతో ఆ పార్టీపై విమర్శలకే చంద్రబాబు పరిమితమయ్యారు. దొంగదెబ్బ తీసేందుకే కన్నాతో కేసు వేయించారు చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేంద్రం లెక్కలు అడుగుతోందని, ఇదేం పద్ధతని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం తాను చేయాల్సినంత చేశానని, హోదాతో సహా చట్టంలోని అంశాల అమలుకు విశ్వ ప్రయత్నాలు చేశానని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని ఇవ్వలేదని, తనను దొంగదెబ్బ తీసేందుకే కన్నా లక్ష్మీనారాయణతో కేసు వేయించారని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై ఉన్న అన్ని కేసులు ఎత్తివేస్తామని, కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుని ప్రత్యేకంగా జీవో విడుదల చేస్తామన్నారు. కేసులు ఉపసంహరించడానికి వీల్లేదని కోర్టులో పిల్ వేశారని, అవసరమైతే చట్టం తీసుకొచ్చి కేసులు మాఫీ చేస్తామన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన అఖిలపక్షం ఇచ్చిన రాష్ట్ర బంద్‌కు సంఘీభావం తెలపలేమని, కానీ సభలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతామని చెప్పారు. ఫిబ్రవరి 1 నుంచి 13 వరకూ వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతామని, అఖిలపక్షం తరఫున కమిటీలు వేస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ఒకటో తేదీన భారీ నిరసన, 11న ఢిల్లీలో మంత్రులతో కలిసి నిరసన దీక్ష, 12న రాష్ట్రపతి దగ్గరకు అఖిల పక్ష నేతలను తీసుకెళ్తామన్నారు. ఢిల్లీలో నిరసన దీక్షను రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన జేఏసీ ఏర్పాటు చేస్తామని, అఖిలపక్ష సమావేశానికి రాని పార్టీల్ని కూడా జేఏసీలో చేరాలని ఆహ్వానిస్తామని తెలిపారు. ఏపీతో అనవసరంగా పెట్టుకున్నామనే భయం ఢిల్లీలో రావాలని చంద్రబాబు చెప్పారు. దేశంలో బీజేపీ, దాని వ్యతిరేక కూటములే ఉన్నాయని ఫెడరల్ ఫ్రంట్‌కు అవకాశం లేదన్నారు. ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా అభివృద్ధి ఆగకుండా చంద్రబాబు అహర్నిశలు పనిచేస్తున్నారని అభినందించారు. హోదా కోసం చేసే ఉద్యమాలకు ఏపీ ఎన్జీవోల మద్ధతు ఉంటుందని, ఢిల్లీలో పోరాటానికి ఉద్యోగులు వస్తారని సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి చెప్పారు. ఒకటో తేదీన సచివాలయ సంఘం తరపున నిరసన ర్యాలీ చేపడతామని, 11, 12 తేదీల్లో చేపట్టే ఉద్యమానికి మద్ధతిస్తామని తెలిపారు. సమావేశంలో లోక్‌సత్తా, రిపబ్లికన్ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ, ఆమ్ ఆద్మీ, నవతరం పార్టీ, సమాజ్ వాదీ, ప్రత్యేక హోదా సాధన సమితి, ఏఐయూడీఎఫ్ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
విభజన అంశాలపై కేంద్రం నిర్లక్ష్యం’
సాక్షి, హైదరాబాద్: విభజన అంశాల అమలుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందని కాం గ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం సచివాలయం మీడి యా పాయింట్లో ఆయన మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో విభజన అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల అక్కడ ఉండే 100 గ్రామాలకు ప్రమాదం ఉందని ఎస్కే జోషి గతంలోనే చెప్పారని, కేంద్రం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
‘రైతుబంధు’పై అఖిలపక్ష భేటీ
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం విధివిధానాలను నిర్ధారించేందుకుగాను అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయా లని సీఎల్పీ నేత కె.జానారెడ్డి డిమాండ్ చేశారు. వ్యవసాయానికి పెట్టుబడి సాయం కౌలుదారుడికి కూడా అందజేయాలనేది తమ విధానమన్నారు. కౌలురైతుల వివరాలను సేకరించాలని బుధవారం సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కోరారు. వ్యవసాయం చేసినవారికే రైతుబంధు నిధులివ్వాలని అన్నారు. సినీ విమర్శకుడు కత్తి మహేశ్ చేసిన వ్యాఖ్యానాలు సమాజంలో భావోద్వేగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని, ఆయనపై చట్టరీత్యా కఠినచర్యలు తీసుకోవాలన్నారు. -
ఉద్యోగాలు సాధించేదాకా ఉద్యమం ఆపేది లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా నిరుద్యోగుల సమస్య పరిష్కారమయ్యేదాకా వెనుదిరిగేది లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న నిరుద్యోగుల పోస్టుకార్డుల ఉద్యమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ జేఏసీ నిర్వహించిన ఈ ఉద్యమంలో మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం సభకు, ర్యాలీకి ప్రభుత్వం అనుమతించకుండా నిర్బంధం విధించిం దన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా నిరుద్యోగుల పక్షాన పోరాడి తీరుతామన్నారు. నిరుద్యోగ సమస్యపై రౌండ్‌టేబుల్, అఖిలపక్ష భేటీలు నిర్వహించామని, ఇప్పుడు పోస్టుకార్డుల ఉద్యమం సాగుతోందన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను ప్రకటించాలని, కేలండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని, నిరుద్యోగులకు భృతిఇవ్వా ల న్నారు. ఈ డిమాండ్ల పరిష్కారానికి విద్యార్థులు, నిరుద్యోగులను సమీకరించి పోరాడుతామన్నారు. పోటీ పరీక్షల కోసం ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రంథాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకుంటే ఉద్య మం తప్పదని హెచ్చరించారు. ఉద్యోగం గాని, లేదా నిరుద్యోగ భృతి గాని ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్రమైన పోరా టాలకు ప్రభుత్వం సిద్ధం కావాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జేఏసీ అధ్యక్షుడు మాదు సత్యంగౌడ్, జేఏసీ నేతలు గోపాలశర్మ, భైరి రమేశ్, నిజ్జన రమేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు. సమావేశం ముగిశాక ఎర్రమంజిల్‌లోని పోస్టుడబ్బాలో స్వయంగా రాసిన పోస్టుకార్డును సీఎం కేసీఆర్‌కు కోదండరాం పోస్టు చేశారు. -
ఎల్లుండి అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆదివారం అఖిలపక్ష భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావాల్సిందిగా అన్ని రాజకీయపార్టీల నేతల్ని ఆమె ఆహ్వానించారు. పార్లమెంటు సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై ప్రతిపక్షాల అభిప్రాయం తెలుసుకునేందుకు కేంద్రం ఇదే తరహా సమావేశం ఒకటి నిర్వహించనుంది. ఈ నెల 29న ఆర్థిక సర్వేను, ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెడుతుందనిఅధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఉభయ సభల్ని ఉద్దేశించి చేసే ప్రసంగంతో సమావేశాలు ప్రారంభమవుతాయి. బలహీనవర్గాల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని కోవింద్ ప్రస్తావించే వీలుంది. -
విద్యారంగ సమస్యలపై నేడు అఖిలపక్ష సమావేశం
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ గుర్తింపు పొందిన కేజీ టు పీజీ విద్యా సంస్థల సమస్యలపై చర్చించేందుకు ఈ నెల 21న మధాహ్నం 1.30కు అఖిలపక్ష నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది. ఈ మేరకు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థల జేఏసీ నేతలు రమణా రెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, సతీశ్ తెలిపారు. లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనందిస్తూ 5 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధిని కల్పిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోందని పేర్కొన్నారు. 17 వేల విద్యా సంస్థల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేస్తున్న ప్రభుత్వ తీరుపై చర్చించనున్నట్లు తెలిపారు. జూనియర్, డిగ్రీ కాలేజీల ట్యూషన్ ఫీజు పెంపు, ఫీజు రీయింబర్స్ మెంట్, విద్యా సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఉచిత ఆరోగ్య కార్డులు వంటి అంశాలపై చర్చిస్తామన్నారు. -
అఖిలపక్షం అంటే ఎందుకు భయం: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: భూముల రికార్డుల సర్వే విధివిధానాలపై చర్చించడానికి అఖిలపక్షం సమావేశం పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. భూసర్వేకు తాము వ్యతిరేకం కాదని, జరుగుతున్న పద్ధతిపైనే అభ్యంతరమన్నారు. కేవలం టీఆర్ఎస్ పార్టీ అంతర్గత వ్యవహారంగా భూసర్వేను మార్చడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు. భూముల విషయంలో ప్రభుత్వ తీరువల్ల గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని పొంగులేటి హెచ్చరించారు. జీఎస్టీ తగ్గింపు పరిధిలోకి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మాత్రమే కాకుండా చేనేత, గ్రానైట్, వ్యవసాయ యంత్రాలను కూడా తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు శ్రద్ద చూపించడంలేదని ప్రశ్నించారు. ఈ నెల 9న జరిగే జాతీయ సదస్సులోనైనా వీటి గురించి పట్టించుకోవాలని కోరారు. తెలంగాణలో విషజ్వరాలు విస్తరించాయని, ఖమ్మంలో తీవ్రతను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన జ్వరాలతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని పొంగులేటి విమర్శించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంపై ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన రాకపోవటం బాధాకరమని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘భూముల రీసర్వేపై అఖిలపక్షం నిర్వహించాలి’
సాక్షి, హైదరాబాద్: భూముల రీసర్వే మార్గదర్శ కాలపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడు తూ జీవో 39ని రద్దు చేయాలన్నారు. భూముల సర్వేకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదన్నారు. రైతులకు రూ. 8 వేల పథకాన్ని, భూరికార్డులను సరిచేసే ప్రక్రియను లింక్ చేయడం సరికాదన్నారు. రికార్డులను సరిచేయాలని, సర్వే నంబర్ల విషయంలోనూ సమగ్రంగా అధ్య యనం జరగాలన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిపుణులతో చర్చించాలన్నారు. గ్రామసభ లను నిర్వీర్యం చేయకుండా, సమగ్రమైన పరి శోధన తర్వాత రికార్డులు, భూసర్వే చేయాల న్నారు. అప్పటివరకు సాదా బైనామాలను క్రమ బద్ధీకరించాలని కోరారు. భూముల రికార్డుల ఆధునీకరణ నిర్ణయం యూపీఏ హయాంలో తీసుకున్నదేనన్నారు. -
‘గోరక్ష’ దౌర్జన్యాన్ని సహించొద్దు
► రాష్ట్రాలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ► గోవు పేరుతో సమాజంలో అస్థిరతకు ప్రయత్నం ► అఖిలపక్ష సమావేశంలో కోరిన ప్రధాని మోదీ ► దేశ భద్రతపై కేంద్రానికి సహకరిస్తామన్న విపక్షాలు న్యూఢిల్లీ: గోరక్ష పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న హింస, దౌర్జన్యాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. గోరక్షను కారణంగా చూపుతూ ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని.. పలువురు సంఘ వ్యతిరేక శక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సమాజంలో అస్థిరతకు కారణమవుతున్నారని మోదీ తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష నేతలతో మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. గోరక్ష పేరుతో జరుగుతున్న మత హింసను అరికట్టడంలో విపక్షాలు సహకారం అందించాలని ప్రధాని కోరారు. ఆవుపేరు చెప్పుకుని రాజకీయ, మత వివాదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ‘గోవును తల్లిగా భావిస్తాం. ఇది మన మనస్సుకు సంబంధించిన అంశం. గోరక్షకు సంబంధించిన చట్టాలున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించటమే సమస్యకు ప్రత్యామ్నాయం కాదు. సంఘ విద్రోహశక్తులు గోరక్షను ఉపయోగించుకుని అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఈ దేశంలోని సామాజిక సామరస్యానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు. ఇలాంటి ఘటనలు దేశ గౌరవానికి భంగం కలిగిస్తాయన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల విషయంలో స్పష్టంగా ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి’అని అఖిలపక్ష భేటీలో తెలిపారు. కొంతకాలంగా దేశంలో గోరక్ష పేరుతో జరుగుతున్న అవాంఛిత ఘటనల్లో దళితులు, ముస్లింలే బాధితులవుతున్నారన్న విపక్షాల ఆందోళనల నేపథ్యంలోనే మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం∙సంతరించుకున్నాయి. చర్చలకు సహకరించండి: మోదీ పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగటంలో విపక్షాలు.. ప్రభుత్వానికి సహకరిం చాలని మోదీ కోరారు. దేశ భద్రత, జాతీయ ప్రాముఖ్యత, ప్రజోపయోగ అంశాలపై చర్చ జరగటంలో క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే నిర్మాణాత్మక చర్చతో పరిష్కరించుకోవాలని కోరారని అనంత్ కుమార్ వెల్లడించారు. భేటీలో గులాంనబీ ఆజాద్ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ). సీతారాం ఏచూరి(సీపీఎం), డి. రాజా (సీపీఐ), ములాయం సింగ్ (ఎస్పీ), ఫారూఖ్ అబ్దుల్లా (ఎన్సీ) తదితర నేతలు పాల్గొన్నారు. జేడీయూ నుంచి ఎవరూ హాజరుకాలేదు. పశ్చిమబెంగాల్లో చెలరేగిన మత ఘర్షణల నేపథ్యంలో బీజేపీతో తీవ్రస్థాయిలో విభేదాల కారణంగా ఈ భేటీకి హాజరుకాబోమని తృణమూల్ ఇదివరకే చెప్పింది. అవినీతిపై.. అంతా ఒక్కటై! అవినీతిని పారద్రోలటంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు విపక్షాలు పూర్తిగా సహకరించాలని ప్రధాని కోరారు. తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల పేర్లు ప్రస్తావించకుండానే.. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారు రాజకీయ వివాదాన్ని సృష్టిం చి తప్పించుకోవాలని చూస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. ‘దేశాన్ని దోచుకున్న వారికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుంటే.. రాజకీయ వివాదాలను సృష్టించి తప్పించుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారికి వ్యతిరేకంగా మనమంతా ఏకమవ్వాలి’ అని విపక్ష నేతలను మోదీ కోరారు. ‘ప్రజాజీవనంలో నిజాయితీగా ఉండటమే కాదు.. అవినీతికి పాల్పడిన నేతలపై చర్యలు తీసుకోవటమూ ముఖ్యమే. ప్రతి పార్టీ అలాంటి వారి ని గుర్తించాలి. వారిని ఏకాకి చేయాలి’ అని మోదీ కోరారు. సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యుం టే బాగుండేదని ప్రతిపక్ష సభ్యులతో ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ వివరిస్తూ.. జీఎస్టీ అమల్లో సహకరించిన విపక్షాలందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారన్నారు. ‘సహకార సమాఖ్య విధానానికి ఇదొక ఉదాహరణ’గా పేర్కొన్నారన్నారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమానికి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అన్ని పార్టీలూ.. సంబ రాలు జరపాలని మోదీ కోరారన్నారు. కశ్మీర్, చైనా అంశాలపై జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ అన్ని పార్టీలు సానుకూలంగా మాట్లాడాయని అనంత్ కుమార్ తెలిపారు. దేశ భద్రత విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతిస్తామని వెల్లడించాయన్నారు. ‘అన్ని పార్టీలు సంయుక్తంగా గోరక్ష పేరుతో జరుగుతున్న దౌర్జన్యాన్ని ఖండించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సంఘ వ్యతిరేక శక్తులపై కఠినచర్యలు తీసుకోవాలి’ అని అఖిలపక్ష భేటీ అనంతరం మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. -
డుమ్మా కొట్టిన తృణమూల్ కాంగ్రెస్!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఆదివారం ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటు సెంట్రల్ హాల్లో జరిగిన ఈ సమావేశానికి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ డుమ్మా కొట్టింది. వర్షాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు, ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై ఫలప్రదమైన చర్చలు జరిపేందుకు సహకరించాలని ప్రతిపక్షాలను కోరేందుకు మోదీ సర్కారు ఈ భేటీ నిర్వహించింది. ఈ భేటీలో ప్రధాని నరేంద్రమోదీతోపాటు కేంద్రమంత్రులు, పలువురు ప్రతిపక్ష పార్టీల నేతలు పాల్గొన్నారు. జీఎస్టీ సహా ప్రతిపక్షాలు లేవనెత్తుత్తే ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. 24 ఉత్తర పరగణాల జిల్లాలో మతఘర్షణలకు బీజేపీ కారణమని ఆరోపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష భేటీకి దూరంగా ఉంది. అయితే, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నిర్వహించే అఖిలపక్ష భేటీకి తాము హాజరవుతామని తృణమూల్ స్పష్టం చేసింది. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు హాజరు కేంద్రం నిర్వహించిన అఖిలపక్షం భేటీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో రైతుల సమస్యలు, ప్రత్యేక హోదా, రైల్వేజోన్, కృష్ణా జలాల పంపకాలు, చేనేత, చిన్నతరహా పరిశ్రమలకు జీఎస్టీ మినహాయింపు, ఫిరాయింపు నిరోధక చట్ట సవరణ తదితర అంశాలను వారు ప్రస్తావించారు. -
15న అఖిలపక్ష సమావేశం
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 16 నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవనున్న నేపథ్యంలో 15న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు జీఎస్టీ బిల్లులుసహా పలు బిల్లుల ఆమోదానికి ప్రతిపక్షాల సహకారం కోరేందుకు ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటుచేస్తోంది. ప్రధానిసహా ప్రధాన పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు, సైన్యం సర్జికల్ దాడులు, ఏపీకి ప్రత్యేక హోదా, ట్రిపుల్ తలాఖ్ అంశాలపై పార్లమెంటులో ప్రభుత్వాన్ని నిలదీయడానికి ప్రతిపక్షాలు సిద్దమవుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌తో సమావేశాలను స్తంభింపజేసేందుకు వైఎస్సార్సీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు. పార్టీ ఫిరాయింపుల వ్యవహారం, పోలవరం అంశాలపై ఏపీ ఎంపీలు పట్టుబట్టే వీలుంది. -
అఖిలపక్షం చిచ్చు
సాక్షి, చెన్నై: డీఎంకే అఖిలపక్షం పిలుపు మక్కల్ ఇయక్కంలో చిచ్చు రగిల్చేనా అన్న ప్రశ్న బయలు దేరింది. ఇందుకు అద్దం పట్టే పరిణామాలు ఆ ఇయక్కంలో చోటు చేసుకుంటున్నాయి. అఖిల పక్షానికి దూరం అని ఎండీఎంకే నేత, ఇయక్కం కన్వీనర్ వైగో ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం వీసీకే నేత తిరుమావళవన్ వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ఇక, సీపీఎం, సీపీఐలు సైతం పునరాలోచించే పనిలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. రాష్ట్రం ప్రభుత్వం అఖిలపక్షానికి స్పందించని దృష్ట్యా, కావేరి హక్కుల సాధనకు డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్ అఖిల పక్ష సమావేశానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ సమావేశానికి వ్యతిరేకంగా బీజేపీ విమర్శలు గుప్పించే పనిలో పడగా, ఇదో ఉప ఎన్నికల స్టంట్ అని అన్నాడీఎంకే ప్రకటించింది. పీఎంకే నేత రాందాసు ఆచీతూచీ అడుగులు వేయడానికి నిర్ణయించగా, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, డీఎండీకే అధినేత విజయకాంత్ లో మౌనంగా పరిస్థితిని పరిశీలిస్తున్నారు. ఇక, కాంగ్రెస్, మనిద నేయ మక్కల్‌కట్చి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ మద్దతు ప్రకటించాయి. రైతు సంఘాలు కొన్ని ఇప్పటికే మద్దతు ఇచ్చి ఉన్నాయి. ఇక, ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐలతో కూడిన మక్కల్ ఇయక్కం ఆ సమావేశానికి దూరం అని కన్వీనర్ వైగో ప్రకటించారు. అయితే, వైగో ప్రకటన ఆ కూటమిలో చిచ్చు రగిల్చేందుకు ఆస్కారాలు కన్పిస్తున్నాయి. ఇందుకు అద్దం పట్టే విధంగా ఆదివారం ఆ ఇయక్కంలోని వీసీకే నేత తిరుమావళవన్ స్పందించడం గమనార్హం. తిరుమా ఎటో : కావేరి వివాదం అన్నది ఏ ఒక్క పార్టీకి సంబంధించిన సమస్య కాదు అని, ఇది అందరి సమస్య, దీని సాధనకు అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని మీడియాతో మాట్లాడుతూ, తిరుమావళవన్ స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించని పక్షంలో, అఖిల పక్షం బాధ్యతల్ని ప్రధాన ప్రతిపక్షం స్వీకరించాలని తాను గతంలో డిమాండ్ చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేశారు. ఎవరు ఎలా వెళ్లినా, తాను పట్టించుకోనని, అయితే, అందరి సమస్య కాబట్టి, అఖిలపక్షం విషయంగా సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని వ్యాఖ్యానించడం గమనార్హం. ఆ మేరకు పార్టీ వర్గాలతో సమాలోచనకు తిరుమావళవన్ పిలుపు నిచ్చారు.ఆ సమావేశం మేరకు తదుపరి నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. కాగా, అందరి సమస్య కాబట్టి, డీఎంకే పిలుపునకు ఆయన స్పందించవచ్చన్న భావన బయలు దేరింది. ఇక, ఇదేఇయక్కంలో ఉన్న సీపీఎం, సీపీఐలు పునరాలోచనలో పడ్డట్టు సంకేతాలు వెలువడ్డాయి. పునరాలోచన : కావేరి హక్కుల సాధన కోసం ఆది నుంచి ఉద్యమిస్తున్న రైతు సంఘాల్లో అత్యధికం వామపక్షాలకు అనుబంధంగా ఉన్నవే. సీపీఎం, సీపీఐ గొడుగు నీడన ఉన్న రైతు సంఘాలు కావేరి హక్కుల కోసం పోరాడుతున్న సమయంలో, వారికి మద్దతుగా డీఎంకే గళం విప్పింది. అలాగే, రైతు సంఘాల అఖిల పక్ష సమావేశానికి డీఎంకే ప్రతినిధులు హాజరయ్యారు. ఇక, ఉద్యమాల్లో , ఆందోళనల్లో స్వయంగా ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్ సైతం పాల్గొని ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అదే నినాదంతో డీఎంకే అఖిల పక్ష సమావేశానికి పిలుపు నివ్వడం సీపీఎం, సీపీఐ వర్గాలను ఇరకాటంలో పడేసినట్టు సమాచారం. మక్కల్ ఇయక్కం డీఎంకేకు వ్యతిరేకంగా సాగుతున్న ఓ కూటమిగా పరిగణించవచ్చు. అయితే, రైతు సమస్యల విషయంలో డీఎంకే కలిసి వస్తున్న నేపథ్యంలో, తాము మాత్రం దూరంగా ఉంటే, ఏదేని విమర్శల్ని ఎదుర్కోవాల్సి ఉంటుందా..? అన్న పరిశీలనలో సీపీఎం, సీపీఐ వర్గాలు పడ్డాయి. తమ అనుబంధ రైతు సంఘాలు డిఎంకే అఖిలపక్షానికి హాజరై, తాము హాజరు కాకుంటే, అన్నదాతల వ్యతిరేకతకు గురి కావాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతో వైగో నిర్ణయాన్ని పునస్సమీక్షించే పనిలో పడ్డట్టు సమాచారం. అయితే, ఇయక్కం కన్వీనర్‌గా ఉన్న వైగో ప్రకటించి ఉన్న నిర్ణయాన్ని వీసీకే, సీపీఎం, సీపీఐలు ధిక్కరించిన పక్షంలో చిచ్చు ఆ ఇయక్కంలో రగిలినట్టే. కాగా, డీఎంకే అఖిల పక్ష సమావేశాన్ని ఈనెల 25న కాకుండా, మరో తేదీలో నిర్వహించి ఉండాల్సిందని ఓ వామపక్షవాది వ్యాఖ్యానించారు. ఈనెల 26వ తేదీ నుంచి ఉప ఎన్నికల నామినేషన్ల పర్వానికి శ్రీకారం చుట్టనుండడం, ఆ ముందు రోజు అఖిలపక్షం పేరుతో అందరూ ఒకే చోట చేరిన పక్షంలో రాజకీయంగా ఇరకాటంలో పడాల్సి వస్తుందేమో అన్న ఆందోళన తమ నేతల్ని వెంటాడుతున్నట్టుగా ఆ వామపక్ష నాయకుడు వ్యాఖ్యానించడం గమనార్హం. -
సుప్రీం చెప్పినా సరే.. వదలొద్దు
బెంగళూరు: కర్ణాటక, తమిళనాడుల మధ్య ఏర్పడిన కావేరి జలాల వివాదం తీవ్రమవుతోంది. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదని కర్ణాటకలో అన్ని పార్టీలు నిర్ణయించాయి. బుధవారం బెంగళూరులో జరిగిన అఖిలపక్ష సమావేశంలో నాయకులు తమ అభిప్రాయలను తెలియజేశారు. కావేరి జలాలను కర్ణాటకలో తాగు నీటి అవసరాలకు వాడాలని, తమిళనాడుకు విడుదల చేయరాదని అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వానికి సూచించారు. ఈ విషయంలో ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని చెప్పారు. కావేరి జలాలను రోజుకు ఆరువేల క్యూసెక్కుల చొప్పున బుధవారం నుంచి మూడు రోజుల పాటు 18 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాల్సిందేనని సుప్రీం కోర్టు మంగళవారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన సంగతి తెలిసిందే. నీటిని వదలకూడదని కర్ణాటక ఉభయసభలు తీర్మానం చేసినా.. తమ ఆదేశాలను పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు. సుప్రీం కోర్టు ఆదేశించినప్పటికీ.. కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదని అన్ని పార్టీల నాయకులు నిర్ణయం తీసుకున్నారు. కాసేపట్లో జరిగే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు. -
జిల్లాల విభజనపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని వైఎస్సార్ సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అఖిలపక్ష సమావేశంలో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సుదీర్ఘంగా చర్చించాలన్నారు. జిల్లాల పెంపు అశాస్త్రీయంగా ఉందని అన్నారు. 10 జిల్లాల తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. ఒకటి రెండు జిల్లాల కోసం దీక్ష చేయడం కేసీఆర్ అహంకారానికి పరాకాష్ఠ అని అన్నారు. రాష్ట్రాల మధ్య చిచ్చు ఆరకముందే సీఎం కేసీఆర్ జిల్లాల మధ్య చిచ్చు రగిల్చారని అన్నారు. 27 నెలలుగా ఉద్యోగాలు వస్తాయని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు నిరాశే మిగిలిందని వాపోయారు. -
వైఎస్సార్సీపీనీ పిలవండి
అఖిలపక్ష సమావేశాలపై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అన్ని అఖిలపక్ష సమావేశాలకు ఇతర పార్టీలతో సమానంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని కూడా పిలవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తమను అఖిలపక్ష సమావేశానికి పిలవకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీని అఖిలపక్ష సమావేశాలకు పిలవలేదని... భవిష్యత్తులో జరిగే సమావేశాలకు తమను కూడా ఆహ్వానించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై సోమవారం న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ జరి పారు. పిటిషనర్ తరఫున న్యాయవాది చిత్తరవు నాగేశ్వరరావు వాదనలు వినిపిస్తూ... కొత్త జిల్లాల ఏర్పాటుపై చర్చించేందుకు ప్రభుత్వం ఇటీవల అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిందని, ఈ సమావేశానికి వైఎస్సార్సీపీ మినహా మిగతా అన్ని పార్టీలను ఆహ్వానించిందని న్యాయమూర్తికి వివరించారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వైఎస్సార్సీపీని విస్మరించిందని.. దీనిపై రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని కలసినా ప్రయోజనం లేకపోయిందని నివేదించారు. తెలంగాణలో వైఎస్సార్సీపీకి నాయకులున్నారని, పెద్ద సంఖ్యలో కేడర్ ఉందని... కొత్త జిల్లాల విషయంలో ప్రజల తరఫున సూచనలు, అభ్యంతరాలు వ్యక్తం చేసే అధికారం రాజకీయ పార్టీగా తమకుందని వివరించారు. కొత్త జిల్లాల డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రభుత్వం త్వరలోనే మరో అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసే అవకాశముందని.. అందువల్ల తమ పార్టీని భవిష్యత్తులో జరిగే అఖిలపక్ష సమావేశాలకు ఆహ్వానించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించారు. ఇతర పార్టీల్లాగానే వైఎస్సార్సీపీని కూడా అఖిలపక్ష సమావేశా లకు ఆహ్వానించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కేసీఆర్‌కు చెంపపెట్టు: వైఎస్సార్సీపీ వైఎస్సార్సీపీని అఖిలపక్ష సమావేశాలకు ఆహ్వానించాలంటూ హైకోర్టు వెలువరించిన తీర్పు సీఎం కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటిదని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శులు కె.శివకుమార్, కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ఓటుతో టీఆర్ఎస్ ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుపొందిన విషయాన్ని కే సీఆర్ మర్చిపోయారని వ్యాఖ్యానించారు. తాము నమ్మకంగా వ్యవహరిస్తే కేసీఆర్ మాత్రం అఖిలపక్షానికి అన్ని పార్టీలను పిలిచి, వైఎస్సార్సీపీని విస్మరించి నమ్మకద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను, ఒక ఎంపీని కూడా టీఆర్ఎస్లో చేర్చుకున్నారని విమర్శించారు. -
సీఎం సమాధానం చెప్పాలి
♦ అఖిలపక్షానికి వైఎస్సార్సీపీని ఎందుకు పిలవలేదు: గట్టు ♦ రాజ్యాంగ విరుద్ధంగా జిల్లాల విభజన ♦ కేసీఆర్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలని సవాల్ ♦ ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన సాక్షి, హైదరాబాద్ : జిల్లాల పునర్విభజన అంశంపై ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎందుకు పిలవలేదో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సమాధానం చెప్పాలని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అఖిలపక్ష భేటీకి వైఎస్సార్సీపీని ఆహ్వానించనందుకు నిరసనగా శనివారం హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ సమీపంలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం వద్ద ‘నిశ్శబ్ద నిరసన’ చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా వ్యవహరిస్తే తాము చూస్తూ కూర్చోబోమని శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపున్న పార్టీని, ఒక ఎంపీ, మూడు ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న పార్టీని పక్కనపెట్టడంలో ఆంతర్యమేమిటని నిలదీశారు. ‘టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా ఉంటూ ఎర్రబెల్లి దయాక ర్రావు చట్టసభలో టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. అలాంటి టీడీపీని అఖిలపక్ష భేటీకి ఎలా పిలిచారు? టీఆర్ఎస్కు టీడీపీకి ఉన్న లోపాయికారీ ఒప్పందమేంటి? ఇతర పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి విలీనం చేసుకోవడం.. ఆ పార్టీ లేదంటూ ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం అంటే ఎనలేని గౌరవమని తరచూ చెప్పే సీఎం ఆ రాజ్యాంగాన్నే ఎందుకు ఉల్లఘిస్తున్నారు..’’ అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. క్షమాపణ చెప్పాలి... అఖిలపక్షానికి వైఎస్సార్సీపీని పిలవనందుకు క్షమాపణ చెప్పాలని పార్టీ ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ డిమాండ్ చేశారు. త్వరలో తాము కోర్టులో వేసే పిటిషన్‌కు ప్రభుత్వమే కదులుతుందని చెప్పారు. కేసీఆర్ మోసపు, అహంకార పాలనను సాగనివ్వమని అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పేర్కొన్నారు. ఈ కుటుంబ పాలనకు అంతం పలకాలని పార్టీ మరో ప్రధాన కార్యదర్శి మతిన్ ముజాదుద్దీన్ ప్రజలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ నేతలంతా తొలుత బోట్‌క్లబ్ నుంచి ప్రదర్శనగా అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని.. అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్‌రావు, జె.మహేందర్‌రెడ్డి, అనుబంధ సంఘాల రాష్ట్ర అధ్యక్షులు కె.అమృతసాగర్ (మహిళా విభాగం), బండారి వెంకట రమణ (సేవాదళ్), బి.శ్రీవర్దన్‌రెడ్డి (ఐటీ విభాగం), నర్ర భిక్షపతి (ట్రేడ్ యూనియన్), డాక్టర్ ప్రఫుల్లారెడ్డి (డాక్టర్స్ విభాగం), జిల్లాల అధ్యక్షులు బొడ్డు సాయినాథ్‌రెడ్డి (హైదరాబాద్), ఎం.భగవంత్‌రెడ్డి (మహబూబ్‌నగర్), నాడెం శాంతికుమార్ (వరంగల్), తుమ్మలపల్లి భాస్కర్‌రావు (నల్లగొండ), బెంబడి శ్రీనివాస్‌రెడ్డి (రంగారెడ్డి), అక్కెనపల్లి కుమార్ (కరీంనగర్), నాయుడు ప్రకాష్ (నిజామాబాద్), ఇతర నాయకులు శ్యామల (గ్రేటర్ మహిళా అధ్యక్షురాలు), డాక్టర్ మవీన్, పి.బాలక్రిష్ణారెడ్డి, రఘురామిరెడ్డి, రహీమ్ షరీఫ్ పాల్గొన్నారు. పలువురు నేతల అరెస్ట్ నిరసన తెలియజేస్తున్న వైఎస్సార్సీపీ నేతలను పొలీసులు అరెస్టు చేశారు. గట్టు శ్రీకాంత్‌రెడ్డిని పోలీసు వ్యాన్‌లోకి బలవంతంగా ఎక్కిస్తుండగా ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కార్యకర్తలు, నాయకులు ఆయనను హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. చికిత్స సాయంత్రం శ్రీకాంత్‌రెడ్డి డిచార్జ్ అయ్యారు. ఇక నేతలు కె.శివకుమార్, కె.అమృతసాగర్, ఎం.శ్యామల, భగవంత్‌రెడ్డి, కేసరి సాగర్, హిరాణిరెడ్డి, మేరి, విష్ణుప్రియ, ఇందిరారెడ్డి, పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కూడా వైఎస్సార్సీపీ నేతలు తమ నిరసన కొనసాగించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా నినాదాలు చేశారు. ఎంతకాలం మోసం చేస్తారు? బీడు భూములకు నీరు, లక్ష ఉద్యోగాలు అని హామీలు గుప్పించిన టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఒక్క ఎకరాకు నీరివ్వలేదని, ఉద్యోగాల భర్తీ చేపట్టలేదని గట్టు శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. పూటకో మాట, వారానికో ప్రకటన చేస్తూ ప్రజల్ని ఎంత కాలం మోసగిస్తారని ప్రశ్నించారు. మండలాల ప్రాతిపదికన జిల్లాల విభజన అంటూ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజల అభిప్రాయం మేరకు జరిగే విభజనను మాత్రమే తాము అంగీకరిస్తామని చెప్పారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను, ఎంపీలను ఏ ప్రాతిపదికన టీఆర్ఎస్లో చేర్చుకున్నారని గట్టు శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. దమ్ముంటే వారితో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని, అప్పుడు ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. -
ప్రజలకు సౌకర్యంగా కొత్త జిల్లాలు
అఖిలపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, కొత్త జిల్లాలు, కొత్త డివిజన్లు, మండలాల ఏర్పాటుపై సచివాలయంలో సీఎం అధ్యక్షతన శనివారం అఖిలపక్ష సమావేశం జరిగింది. టీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఎం,సీపీఐ, ఎంఐఎం పాల్గొన్నాయి. 17 కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 27 జిల్లాలతో రూపొందించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ప్రజల్లోకి వెళ్లిన తర్వాత దానిపై విస్తృత చర్చ జరుగుతుందని భేటీలో సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రతిపాదనలపై ప్రజల అభిప్రాయం మేరకు మార్పుచేర్పులు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై వచ్చే అభిప్రాయాలపై చర్చించడానికి పదిహేను రోజుల తర్వాత ఒకసారి, 30 రోజుల తర్వాత మరోసారి అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తామని వివరించారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే జిల్లాల ఏర్పాటుపై తుది నిర్ణయం తీసుకుంటామని పునరుద్ఘాటించారు. ‘‘2011 జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా 121 కోట్లు. దేశవ్యాప్తంగా 683 జిల్లాల్లో ఒక్కో జిల్లా సగటు జనాభా 18 లక్షలు. తెలంగాణలోనేమో 3.6 కోట్ల జనాభా ఉంటే 10 జిల్లాలే ఉన్నాయి. ఒక్కో జిల్లాలో సగటున 36 లక్షల మంది ఉన్నారు. అంటే జాతీయ సగటు కన్నా రెట్టింపు. విస్తీర్ణపరంగా కూడా జాతీయ స్థాయిలో ఒక్కో జిల్లా సగటున 4 వేల చదరపు కి.మీ. ఉంటే, తెలంగాణ జిల్లాల సగటు విస్తీర్ణమేమో 11 వేల చదరపు కి .మీ. ఉంది. పైగా చాలా మండలాలు, గ్రామాలు జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్నాయి. ఈ పరిస్థితిని నివారించడానికి, ప్రజల సౌకర్యం, పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి వివరించారు. జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని కాంగ్రెస్, టీ టీడీపీ, బీజేపీ, సీపీఎం,సీపీఐ, ఎంఐఎం స్వాగతించాయి. డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు చేసిన కొన్ని సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. సమావేశంలో టీఆర్ఎస్ తరఫున కె.కేశవరావు, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి: సీపీఎం తెలంగాణలో 92 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలున్నందున కొత్త జిల్లాల ఏర్పాటులోనూ సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సీపీఎం సూచించింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి భేటీలో పాల్గొన్నారు. ‘‘జిల్లాల ఏర్పాటులో, పాలనలో ఎస్టీలకు అన్యాయం జరగకుండా చూడాలి. వివాదరహితంగా ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలి. స్థూలంగా జిల్లాల కూర్పును అంగీకరిస్తున్నా, కొన్ని జిల్లాలపై ప్రభుత్వ వైఖరితో విభేదిస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతమంతా కలిపి అటానమస్ కౌన్సిల్ ఏర్పాటు చేయాలి. భద్రాచలం ప్రాముఖ్యత, ఇతర రాష్ట్రాలతో సరిహద్దు కారణంగాదాన్ని జిల్లా చేయాలి. సికింద్రాబాద్‌ను జిల్లా చేయాలి. కంటోన్మెంట్‌ను మల్కాజిగిరి జిల్లాలో కలపాలి. జనగామను జిల్లా చేయాలి. వెనకబడిన మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రధాన పారిశ్రామిక ప్రాంతమైన షాద్‌నగర్‌ను శంషాబాద్‌లో కలపొద్దు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రతిపాదనల్లో మార్పులు చేయాలి’’ అని డిమాండ్ చేశారు. ప్రమాణాలు పాటించాలి: సీపీఐ కొత్త జిల్లాలు, రెవె న్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో నిర్దిష్ట ప్రమాణాలు పాటించాలని సీపీఐ కోరింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంకటరెడ్డి భేటీలో పాల్గొన్నారు. ‘‘కొత్త జిల్లాలు జనాభా, విస్తీర్ణ ప్రాతిపదికలకు అనుగుణంగా ఉండాలి. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలున్నందున వాటి ప్రాతిపదికన కొత్త జిల్లాల సంఖ్యను 17 నుంచి 20కి పరిమితం చేయాలి. ఒక అసెంబ్లీ స్థానాన్ని మూడు నాలుగు జిల్లాలకు విస్తరించడం పాలనా సౌలభ్యం రీత్యా సరికాదు. ప్రజాప్రతినిధులకూ ఇబ్బందికరం. ఒక జోన్ పరిధిలోని ప్రాంతాలను మరో జోన్లో కలిపితే న్యాయపరమైన చిక్కులొస్తాయి. వెనకబడిన ప్రాంతాల ప్రజలకు విద్య, ఉద్యోగ నియామకాల్లో స్థానికత ఆధారంగా రిజర్వేషన్లు కొనసాగాలంటే జోనల్ వ్యవస్థ ఉండాల్సిందే. జనాభా కొన్ని జిల్లాల్లో 7 లక్షలు, మరికొన్నింట్లో 15 లక్షలకు పైగా ఉండటం సరికాదు’’ అన్నారు. స్వాగతిస్తున్నాం: మజ్లిస్ కొత్త జిల్లాల ఏర్పాటును మజ్లిస్ స్వాగతించింది. అఖిలపక్ష భేటీలో మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రీ, ఎమ్మెల్సీ సయ్యద్ అమీన్-ఉల్-హసన్ జాఫ్రీ పాల్గొన్నారు. హైదరాబాద్‌లో ఎలాంటి మార్పులూ చేయకుండా జిల్లాను యథాతథంగా కొనసాగించాలని గట్టిగా వాదనలు విన్పించారు. రంగారెడ్డి జిల్లాను మూడుగా విభజించడాన్ని సమర్థించారు. షాద్‌నగర్‌ను శంషాబాద్‌లో కలిపే బదులు మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంచితే బాగుంటుందన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 53 మండలాలను 70కి పెంచాలన్నారు. అప్పుడు హైదరాబాద్‌లో మరో రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆస్కారముంటుందన్నారు. స్పష్టమైన విధి విధానాలు ప్రకటించాలి : కాంగ్రెస్ జిల్లాల ఏర్పాటుకు స్పష్టమైన విధివిధానాలను ప్రకటించాలని టీ-కాంగ్రెస్ డిమాండ్ చేసింది. భేటీలో పార్టీ తరఫున పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, షబ్బీర్ అలీ హాజరయ్యారు. జిల్లాల ఏర్పాటుకు ఏపీ జిల్లాల పునర్విభజన చట్టం-1974ను అమలు చేయాలని కోరినట్టు తెలిపారు. ‘‘జిల్లాల ఏర్పాటుకు జనాభా, విస్తీర్ణం, సహేతుకత, వాస్తవికత, ప్రజల సౌలభ్యం, మనోగతం, భౌగోళిక స్వరూపం, వనరుల వంటివాటిని దృష్టిలో పెట్టుకోవాలన్నాం. 35 లక్షల జనాభా ఉన్న వరంగల్‌ను మూడు జిల్లాలు చేయడం, 40 లక్షలున్న హైదరాబాద్‌ను ఒకే జిల్లాగా ఉంచడం ఎలా సహేతుకం? ఐదారు జిల్లాల్లో గిరిజన జనాభా ఎక్కువగా ఉండటంవల్ల పీసా, 1/70 వంటి చట్టాలు అమల్లో ఉంటాయి. షెడ్యూల్డు ప్రాంతంలోని భూముల బదిలీల్లోనూ సమస్యలొస్తాయి’’ అన్నారు. జోనల్ వ్యవస్థను కూడా దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. న్యాయపరమైన సమస్యలు రాకుండా, ప్రజలకు ఇబ్బందుల్లేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. రాజకీయ కోణమొద్దు: టీడీపీ కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తున్నామని టీడీపీ పేర్కొంది. ఆ పార్టీ తరఫున తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి భేటీలో పాల్గొన్నారు. ‘‘జిల్లాల విభజన కుటుంబ పాలన కోసమన్నట్టుగా ఉండొద్దు. వాటి ఏర్పాటులో రాజకీయ కోణం ఉండొద్దు. శాస్త్రీయ కోణముండాలి. వివరాలను ప్రభుత్వ వెబ్సైట్లో పెట్టాలి. జనాభాను దృష్టిలో పెట్టుకోవాలి. దీనిపై జిల్లాల్లో పర్యటించి ప్రజలను చైతన్యపరుస్తాం. ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వ నిర్ణయాలుండాలి’’ అన్నారు. జ్యుడీషియల్ కమిషన్ వేయాలి: బీజేపీ జిల్లాల పునర్విభజనపై హైకోర్టు జడ్జితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, ఎస్.మల్లారెడ్డి భేటీలో పాల్గొన్నారు. ‘‘జనాభా, విస్తీర్ణంలో సమతుల్యత పాటించాలి. జిల్లా కేంద్రం, రవాణా సౌకర్యాలు, ఖనిజ సంపద, నీటి వనరులు, ఆర్థిక పరిపుష్టి, విద్యా సౌకర్యాలు, చారిత్రక, సాంస్కృతిక నేపథ్యాలను పరిగణనలోకి తీసుకోవాలి. షెడ్యూల్డు ప్రాంతాల్లోని గిరిజనుల హక్కులకు భంగం కలుగకుండా చూడాలి. వరంగల్‌ను విడదీసి హన్మకొండ జిల్లా ఏర్పాటు చేయడం అశాస్త్రీయం. ప్రజల మనోభిప్రాయాలకు విరుద్ధం. కొత్త జిల్లాలకు సమ్మక్క సారక్క, ప్రొఫెసర్ జయశంకర్, కొమురం భీమ్, లక్ష్మణ్ బాపూజీ వంటి పేర్లు పెట్టాలి. జనగామ, నారాయణపేట, గద్వాల, సిరిసిల్ల జిల్లాల కోసం జరుగుతున్న ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలి. ఒక అసెంబ్లీ నియోజకవర్గమంతటినీ ఒకే జిల్లాలో ఉంచాలి. జోనల్ విధానంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలి’’ అని డిమాండ్ చేశారు. -
జిల్లాల పునర్విభజనపై నేడే అఖిలపక్షం
సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో సమావేశం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై మరో అంకానికి తెరలేస్తోంది. ఈ అంశంపై ఆయా రాజకీయ పార్టీల సూచనలు తీసుకునేందుకు శనివారం సచివాలయంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొంటున్న ఈ సమావేశంలో జిల్లాలపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీతోపాటు ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు టీఆర్ఎస్ నుంచి రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, టీడీపీ నుంచి ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, మల్లారెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంక ట్‌రెడ్డి హాజరవుతున్నారు. ఆయా రాజకీయ పక్షాలు తమ ఎజెండాల తో ఈ భేటీకి హాజరయ్యేందుకు సిద్ధమయ్యాయి. కాగా అఖిలపక్ష భేటీకి ఆహ్వానం అందకపోవడంతో నిరసన తెలిపేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమవుతోంది. మార్గదర్శకాల కోసం పట్టుపట్టనున్న కాంగ్రెస్ జిల్లాల ఏర్పాటుకు మార్గదర్శకాలు, ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. జిల్లాల ఏర్పాటు ప్రజల అవసరాల కోసం జరగాలని స్పష్టం చేయనుంది. మార్గదర్శకాలను ప్రకటించి, వాటి అమల్లో రాజకీయాలకు తావులేకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంత్రాంగం ఏమిటో చెప్పాలని కోరనుంది. ముఖ్యంగా మార్గదర్శకాలను నిష్పక్షపాతంగా అమలుచేయడానికి జ్యుడీషియల్ కమిషన్‌కు అప్పగించాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రజల సౌలభ్యమే.. అంటున్న బీజేపీ కొత్తగా జిల్లాల ప్రతిపాదనల్లో ఆయా జిల్లాల జనాభా, భౌగోళిక స్వరూపం, రవాణా సౌకర్యాలు, జిల్లా కేంద్రానికి దూరం, చారిత్రక నేపథ్యం, వనరులు, నీటివసతి వంటివాటిపై ప్రజల అభిప్రాయాలను, సౌలభ్యాన్ని ప్రశ్నిం చడానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. జిల్లాల ఏర్పాటు కృత్రిమంగా, రాజకీయ, తాత్కాలిక అవసరాల కోసం కాకుండా చూడాలని.. ప్రజా ప్రయోజనాలు అంతిమంగా ఉండాలని పట్టుబట్టనుంది. వరంగల్ పట్టణాన్ని రెండుగా విభజిస్తూ... హన్మకొండను మరో జిల్లాగా చేయడాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆ పార్టీ పేర్కొంటోంది. చారిత్రక నేపథ్యమున్న వరంగల్‌ను విడదీయడాన్ని వ్యతిరేకించే యోచనలో ఉంది. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో ఇతర జిల్లాలకు చెందిన మండలాలను కలిపే విషయంలో, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లను వికారాబాద్‌లో కాకుండా శంషాబాద్‌లో కలపాలనే డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకురానుంది. అసంపూర్తిగా సమాచారం ‘‘కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం పంపించిన సమాచారం అసంపూర్తిగా ఉంది. హైద రాబాద్ జిల్లా సమాచారమే లేదు. ఏ జిల్లాలో ఎంత జనాభా ఉంటుందనే దానిపై స్పష్టత కొరవడింది. అసెంబ్లీ నియోజకవర్గాలను ముక్కలుగా చేయొద్దు. జిల్లా కేంద్రం మధ్యలో ఉండాలి. శాస్త్రీయంగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విభజించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్‌ను బట్టి మా పార్టీ స్పందన ఉంటుంది..’’ - చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటి ‘‘కొన్ని మండలాల ఏర్పాటు ప్రతిపాదనలు సమగ్రం గా లేవు. గిరిజన ప్రాంతాలను కలిపి ప్రత్యేకంగా కౌన్సిల్ ఉండాలి. జిల్లా కేంద్రం విషయంలో ప్రభుత్వం చెబుతున్న వాదన, వాస్తవ ప్రతిపాదనల్లో తేడాలున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ కలసి ఉండాలని చెబుతున్న ప్రభుత్వం.. వరంగల్, హన్మకొండలను ఎలా విడదీస్తోంది? అఖిలపక్షంలో వచ్చే ప్రతిపాదనలు, అభిప్రాయాలకు అనుగుణంగా మా వాదన వినిపిస్తాం..’’ - తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాజకీయ లబ్ధికోసమే.. ‘‘కేవలం రాజకీయ లబ్ధి కోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నట్లు అనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జిల్లాల విభజన ఉంటుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాల విభజన ఉండాలి..’’ - ఎల్.రమణ, టీ టీడీపీ అధ్యక్షుడు -
ప్రాజెక్టులపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టులపై టీఆర్ఎస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీ చెబుతున్న కాకి లెక్కలు తేలాలంటే వెంటనే అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ భేటీకి సాగునీటి రంగ నిపుణులను పిలిచి, పూర్తిస్థాయిలో చర్చించాలన్నారు. ప్రాజెక్టుల నిర్మాణం, ఆయకట్టుపై టీఆర్ఎస్ సర్కార్, కాంగ్రెస్ పేర్కొంటున్న లెక్కలు తప్పులతడకగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌పై ఇంజనీర్ల సంఘం తీవ్రంగా స్పందిస్తోందని.. వారు సంయమనంతో వ్యవహరించాలని సూచిం చారు. శుక్రవారం పార్టీ నాయకులు అజీజ్‌పాషా, పల్లా వెంకటరెడ్డిలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రుణ మాఫీ మూడో విడత బకాయిలను ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించకపోవడంతో రైతులకు రుణాలు అందే పరిస్థితి లేదన్నారు. -
అఖిలపక్షం సీఎం ఇంట్లో దావత్ కాదు కదా..?
* వైఎస్సార్సీపీని అఖిలపక్ష భేటీకి పిలవకపోవడం ఏమిటీ..? * ఏ ప్రాతిపదికన మా పార్టీని ఆహ్వానించలేదు..? * ప్రజాస్వామ్య, రాజ్యాంగ పద్ధతులపై ప్రభుత్వానికి నమ్మకం లేదా? * నేడు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద పార్టీ ఆధ్వర్యంలో నిరసన * వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన తమ పార్టీని.. కొత్త జిల్లాలపై ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ఏ ప్రాతిపదికన ఆహ్వానం పంపలేదో టీఆర్ఎస్ ప్రభుత్వం స్పష్టం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈసీ గుర్తింపు పొందిన పార్టీని పిలవకపోవడం అంటే ఎన్నికల సంఘాన్ని అవమానించడమేనని ధ్వజమెత్తింది. అఖిలపక్ష సమావేశమనేది ముఖ్యమంత్రి ఇంట్లో దావత్(విందు) అయితే కాదు కదా? అని ప్రశ్నించింది. రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థకు లోబడి అన్ని గుర్తింపు పొందిన పార్టీలకు ఆహ్వానం పంపించాల్సి ఉం డగా, తమ పార్టీకి ఎందుకు పంపించలేదో చెప్పాలని నిలదీసింది. ప్రభుత్వం ఏ ప్రామాణికం ఆధారంగా మిగతా పార్టీలను పిలిచిం దో, ఏ కొలబద్ద ప్రాతిపదికన కొత్త జిల్లాలను ఏర్పాటు చేయదలుచుకుందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి, అధికారప్రతినిధి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో టీడీపీనే లేదని, విలీనమైపోయిందని ప్రకటించిన అధికార టీఆర్ఎస్.. ఆ పార్టీని అఖిలపక్షానికి ఆహ్వానించగా తమ పార్టీని మాత్రం ఎలా విస్మరించిందని ప్రశ్నించారు. సీపీఐ, సీపీఎంకు అసెంబ్లీలో ఒక్కో సభ్యుడే ఉన్నా అఖిలపక్షానికి పిలిచారని, వైఎస్సార్సీపీ గత ఎన్నికల్లో తెలంగాణలో ఓ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిచిన విషయాన్ని ఎలా విస్మరించారని నిలదీశారు. ఈ అంశంపై తాము రెండు రోజులుగా ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదని, ఇది సీఎంకు తెలియకుండా జరిగితే దానిని సరిదిద్దుకోవాలని సూచించారు. పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11.30 గంటలకు ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన దీక్షను చేపడుతున్నామని ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కోరుతూ.. అంబేడ్కర్ విగ్రహానికి వినతిపత్రాలు సమర్పిస్తామని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాల సర్కార్‌గా మారిపోయిందని, ఓ పార్టీ గుర్తుపై గెలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వంటి దుర్మార్గమైన, తుగ్లక్ పాలన ఎక్కడా లేదన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం కళ్లు తెరిచి చిల్లర మల్లర రాజకీయాలు చేయకుండా, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని గౌరవించేలా అఖిలపక్షానికి తమ పార్టీని ఆహ్వానించాలని సూచించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అన్ని నిర్ణయాలూ తీసుకుని, ప్రజల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతో మొక్కుబడిగా అఖిలపక్షానికి కొన్ని పార్టీలనే ఆహ్వానించిందని విమర్శించారు. -
జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏమిటి? : డి.కె.అరుణ
మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక ఏమిటో ప్రభుత్వం ప్రకటించాలని మాజీ మంత్రి, గద్వాల ఎమ్మెల్యే డి.కె.అరుణ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో గురువారం ఆమె మాట్లాడుతూ, గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లా చేయాలని ప్రజలు కోరుతున్నారని చెప్పారు. అన్ని వనరులు, భౌగోళిక అనుకూలత ఉన్నా గద్వాలను జిల్లాగా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. అఖిలపక్ష సమావేశంలోనైనా గద్వాల జిల్లా గురించి ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. -
ముందుగానే ప్రతిపాదనలు పంపించండి: చాడ
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్ష భేటీకి ముందుగానే ప్రభు త్వ ప్రతిపాదనలను తమకు పంపించాలని రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రభుత్వ కార్యదర్శికి సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి గురువారం విజ్ఞప్తిచేశారు. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా తాము సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వీలుంటుందని ఆయనకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అఖిలపక్ష భేటీకి తాను, పార్టీ సహాయకార్యదర్శి పల్లా వెంకటరెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. ఈ భేటీకి ముందుగానే కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రతిపాదనలు పంపిస్తారని ఆశిస్తున్నామన్నారు. ఈ భేటీకి సీఎం హాజరవుతున్నారా లేదా అన్నది తెలపాలని కోరారు. -
‘బైపాస్’ పేరుతో రైతుల పొట్టకొట్టొద్దు
తుర్కపల్లి : బైపాస్‌రోడ్డు పేరుతో రైతుల పొట్టకొట్టొద్దని జాతీయ కిసాన్‌సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. బైపాస్ రోడ్డు వెంటనే నాలుగు లేన్ల రోడ్డు విస్తరించాలని తెలంగాణ పరిరక్షణ సమితి ఆధ్యర్యంలో మంగళవారం మండలంలోని జేఎం ఫంక్షన్‌హాలులో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడుతామన్న ప్రభుత్వం ఉన్న భూములు ఆక్రమించుకున్న ప్రజాప్రతినిధులకు, రియల్టర్లకు వత్తాసు పలుకుతుందన్నారు. యాదాద్రి నుంచి కీసర వరకు ప్రభుత్వం తలపెట్టిన బైపాస్ రోడ్డులో 350 ఎకరాల వరకు రైతులు తమ విలువైన భూములు కోల్పోతున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న రోడ్డు అన్నింటికి అనువుగా ఉండి, ప్రభుత్వ భూమి ఉన్నప్పుడు రైతులు భూములు ఆక్రమించుకొని రోడ్డు వేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి సరాసరి యాదాద్రికి వెళ్లడానికే రోడ్డు వేసుకొని ఇటు కాంట్రాక్టర్లు, ప్రజాప్రతినిధుల జేబులు నింపడానికి జరుగుతున్న ప్రయత్నమేనన్నారు. 2013 చట్టం ప్రకారం రైతులకు మార్కెట్ రేట్‌కు నాలుగింతల పరి హారం అందజేయాలన్నారు. బైపాస్ రోడ్డు విషయంలో ఎటువంటి ప్రాజెక్ట్ రిపోర్టు లేకుండా అమాయక రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయాన్ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కల్లూరి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ జెండాలు పక్కన పెట్టి భూనిర్వాసితుల ఎజెండానే ముందుకు తీసుకొని పోరాటం చేయాలని అన్నారు. అనంతరం భూనిర్వాసితులు కమిటీని ఎన్నుకున్నారు. మండల కన్వీనర్‌గా కొక్కొండ లింగయ్య, గౌరవసలహాదారుగా కల్లూరి రామచంద్రారెడ్డి, బబ్బూరి రవీంధ్రనాథ్‌గౌడ్ , 20 మందిని సభ్యులుగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముల్కలపల్లి రాములు, కొండమడుగు నర్సింహ, బండ శ్రీశైలం, మటూరి బాల్‌రాజు, మాటూరి బాల్‌రాజు, మంగ నర్సింహులు, నాయకులు రంగ శంకరయ్య, బబ్బూరి పోశెట్టి, ఎలుగల రాజయ్య, పిడుగు అయిలయ్య, దుర్గయ్య, నర్సింహులు పాల్గొన్నారు. -
యాచారంలో ఫార్మాసిటీ భూములపై అఖిలపక్ష భేటీ
యాచారం మండలం నక్కర్త మేడిపల్లి గ్రామంలో ఫార్మాసిటీ భూముల విషయంపై అఖిలపక్షసమావేశం జరిగింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామమల్లేష్, జిల్లా సీపీఎం కార్యవర్గ సభ్యుడు జంగారెడ్డితో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఫార్మా సిటీ నిర్మాణంలో భూమి కోల్పోయే బాధితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం అందించాలని, అస్సైన్డ్ భూముల్లో బోర్లు వేసిన వారికి కూడా నష్టపరిహారం చెల్లించాలని తీర్మానించారు. భూములు కోల్పోయిన రైతుల కుటుంబాలకు ఫార్మాసిటీలో ఉద్యోగాలు కల్పించాలని కోరారు. -
కొత్త జిల్లాలపై అఖిలపక్షం: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా జిల్లాలు ఏర్పాటుచేయాలని కోరారు. జిల్లాల ఏర్పాటుకు ప్రాతిపదిక, అవసరాలు, జనాభా, వనరులు వంటివాటిని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. నిర్ణయం తీసుకోవడానికి ముందుగా ప్రజా ప్రతినిధులతో, అఖిలపక్ష నేతలతో చర్చించాలని డిమాండ్ చేశారు. కేవలం టీఆర్ఎస్ రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలు ఏర్పాటు చేస్తామంటే ప్రతిఘటిస్తామని ఆయన చెప్పారు. హాకీ ప్లేయర్‌పై చర్య: ఆరేపల్లి ఎస్సీ కులం అంటూ తప్పుడు పత్రాలతో మోసగించిన హాకీ ప్లేయర్ ముఖేశ్కుమార్పై చర్యలు తీసుకోవాలని టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్ డిమాండ్ చేశారు. ముఖేశ్ కులంపై అప్ప టి కలెక్టర్ విచారణ జరిపారని, బీసీ వర్గానికి చెందిన ముఖేశ్‌కుమార్ ఎస్సీని అం టూ తప్పుడు పత్రాలతో మోసం చేశాడని తేల్చినట్టుగా మోహన్ చెప్పారు. -
పార్టీ మారితే వేటేయాలి
♦ ఫిరాయించిన వారి సభ్యత్వాన్ని గడువులోగా రద్దు చేయాలి ♦ అఖిలపక్ష సమావేశంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కచ్చితంగా అమలు చేయాలని, చట్టంలో లోపాలుంటే సవరించాలని వైఎస్సార్సీపీ కోరింది. లోక్‌సభ స్పీకర్ అధ్యక్షతన ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో పార్టీ లోక్‌సభా పక్ష నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి మాట్లాడారు. ఒక సభ్యుడు పార్టీ మారగానే అతడి సభ్యత్వం రద్దయ్యేలా పటిష్టమైన చట్టాలను అమల్లోకి తీసుకొస్తే ఫిరాయింపులను నిరోధించవచ్చని చెప్పారు. అఖిలపక్ష సమావేశం వివరాలను ఆయన ఏపీ భవన్ వద్ద విలేకరులకు వివరించారు. ‘‘అఖిలపక్ష సమావేశంలో ఎక్కువ మంది నేతలు దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులు, మంచినీటి కొరత గురించి ప్రస్తావించారు. నేను ఏపీలోని కరువు, వర్షాభావ పరిస్థితులను వివరించాను. తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటికీ నల్లా నీరు ఇచ్చే పథకం చేపట్టింది. ఇదే పథకాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రం అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పాను. విభజన చట్టంలో ఏపీకి ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ వంటి వాటిని అమలు చేయాలి. వీటికోసం అఖిలపక్ష సమావేశంలో ప్రస్తావించాను’ అని మేకపాటి పేర్కొన్నారు. ఫిరాయింపులను ప్రజలు సహించరు.. ‘‘ఏపీలో కొత్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అధికార పక్షం టీడీపీ ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నుంచి 13 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. ఫిరాయింపులను ఆపడానికి పటిష్టమైన చట్టాన్ని రూపొందించుకోవాలి. వైఎస్సార్సీపీ బీ-ఫారంపై పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు టీడీపీలో చేరడం ఎంతవరకు సబబు? ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా ఇలాంటి ఫిరాయింపులను ప్రోత్సహిస్తారా? ఏపీలో రెవెన్యూ లోటు భారీగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం నుంచి విరివిగా నిధులు తెచ్చుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సింది పోయి రోజుకొకరిని అధికార పార్టీలో చేర్చుకోవడాన్ని ప్రజలు సహించరు’’ అని ఎంపీ మేకపాటి వెల్లడించారు. -
రాష్ట్రానికి మొండిచేయి చూపారు
మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపారని మండలిలో విపక్షనేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి అందాల్సిన నిధులు, రాయితీలకు బడ్జెట్లో కేటాయింపుల్లేవని సోమవారం ఓ ప్రకటనలో ఆయన దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుకు గతేడాదిలాగే కేవలం రూ.100 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. కేంద్రంపై ఒత్తిడి తేవడానికి వీలుగా రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు తక్షణం పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీఎం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
'ఈసారైనా బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగాలి'
ఢిల్లీ: గత శీతాకాల రాజ్యసభ సమావేశాలు తుడ్చి పెట్టుకుపోవడంతో రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ స్వయంగా రంగంలోకి దిగారు. న్యూఢిల్లీలో శనివారం రాజ్యసభకు చెందిన అఖిలపక్ష నేతలతో హమీద్ భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. ఈసారైనా బడ్జెట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని వారిని ఉపరాష్ట్రపతి కోరినట్టు సమాచారం. -
అఖిలపక్షం ఏర్పాటు చేయాలి
రైతు సమస్యలపై చర్చించాలి: పొంగులేటి సాక్షి ప్రతినిధి ఖమ్మం/హన్మకొండ: రైతుల ఆత్మహత్యలను నివారించడానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి డిమాండ్ చేశారు. విపక్షాలు పిలుపునిచ్చిన బంద్‌లో భాగంగా శనివారం వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జరిగిన ఆందోళనల్లో ఆయన పాల్గొన్నారు. హన్మకొండలో పొంగులేటి నేతృత్వంలోని బైక్‌ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఆయన రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు అరెస్టు చేసి సుబేదారి పోలీస్‌స్టేషన్‌కు తరలించగా.. అక్కడ కూడా సీపీఎం, బీజేపీ నాయకులతో కలసి పొంగులేటి నిరసన వ్యక్తం చేశారు. ఖమ్మం బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన రాస్తారోకోలో, బైక్ ర్యాలీలో పొంగులేటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలుచోట్ల పొంగులేటి మాట్లాడారు. రైతుల కుటుంబాలకు ప్రభుత్వం చెల్లించే ఎక్స్‌గ్రేషియాతో ఆ కుటుంబాలను ఆదుకోవచ్చుగానీ, ఆత్మహత్యలను ఆపలేమన్నారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనలో రైతులు సుభిక్షంగా ఉన్నారని పొంగులేటి గుర్తుచేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి మహేందర్‌రెడ్డి, పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బీష్వ రవీందర్, రాష్ట్ర నాయకుడు మునిగాల విలియమ్స్ తదితరులు పాల్గొన్నారు. -
పార్లమెంటులో అనిశ్చితి..నేడు అఖిలపక్ష భేటీ
న్యూఢిల్లీ: గత రెండువారాలుగా పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు స్తంభింపజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితికి పుల్‌స్టాప్ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రతిపక్షాలను శాంతపరిచేందుకు సోమవారం అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. లలిత్‌మోదీ వ్యవహారంలో విదేశాంగ మంత్రి సుష్మా, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే, వ్యాపం కుంభకోణంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ల రాజీనామాలకు విపక్షాలు పట్టుబడుతున్నాయి. అధికార పక్షం చర్చకు సిద్ధమంటుంటే.. ముందు రాజీనామా చేసిన తరువాతే చర్చ అని ఎవరికి వారు భీష్మించుకున్నారు. రెండువారాలైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో అఖిలపక్షాన్ని సమావేశపరచాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
చర్చలు జరగకుండా అడ్డుకుంటే ఎలా..
న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగకపోవడంపై లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై అధికార, ప్రతిపక్ష నాయకులను సమావేశపర్చి మాట్లాడతామన్నారు. విపక్షాల ఆందోళనతో సభను నిర్వహించడానికి అష్టకష్టాలు పడిన స్పీకర్ సభను శుక్రవారం ఉదయానికి వాయిదా వేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రోజూ విపక్షాలు ఇలా అందోళనకు దిగితే సభా కార్యక్రమాలు ఎలా నిర్వహించాలని ప్రశ్నించారు. ప్రోటోకాల్ నిబంధనలకు విరుద్ధంగా సభలోకి ప్లకార్డులు తీసుకురావడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ముందు ఇలా జరగకుండా సభ్యులను నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా సభలో చర్చలు జరగ్గకుండా స్తంభింపచేయడం సరైనది కాదన్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేయాలని ఆలోచిస్తున్నట్టు ఆమె తెలిపారు. పార్లమెంటును పదేపదే అడ్డుకుంటూ చర్చలకు ఆటంకం కలిగించడం భావ్యం కాదని సుమిత్రా అన్నారు. ఈ వ్యవహారంలో అన్ని పార్టీల నాయకులతో చర్చించి ఆయా అంశాలను పరిష్కరించు కోవాల్సి అవసరం ఉందని తెలిపారు. కాగా గత మూడురోజులుగా వ్యాపం, లలిత్ మోదీ కుంభకోణాలపై పార్లమెంట్ ఉభయ సభలు అట్టుడుకుతున్నాయి. అధికార బీజేపీ పార్టీపై కాంగ్రెస్ విరుచుకుపడింది. కళంకిత మంత్రులు రాజీనామాలు చేసే దాకా చర్చలు జరిగే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. బీజేపీ మంత్రులు తక్షణమే రాజీనామా చేయాలని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. -
న్యూ...టర్న్!
మెట్రో మార్పులు షురూ అఖిలపక్షం ఆమోదంతో కొత్త రూట్ల ఎంపిక సిటీబ్యూరో: మెట్రో రైలు ‘న్యూ టర్న్’ తీసుకుంటోంది. దీనికి సంబంధించిన అలైన్మెంట్ మార్పులకు అఖిల పక్ష సమావేశంలో ఆమోదం లభించడంతో ఆయా ప్రాంతాల్లో పనులు ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా అసెంబ్లీ, సుల్తాన్ బజార్ ప్రాంతాలలో స్వల్పంగా, పాతనగరంలో 3.2 కి.మీ. మేర మార్పులు చేయనున్న విషయం విదితమే. ఆ రూట్లలో మారనున్న అలైన్‌మెంట్‌పై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ సిద్ధం చేసిన మ్యాపులు ఇలా ఉన్నాయి... అసెంబ్లీ వద్ద... కారిడార్-1 (ఎల్బీనగర్-మియాపూర్) రూట్లో వచ్చే అసెంబ్లీ వద్ద మెట్రో మార్గంలో మార్పులు చేశారు. దీంతో అసెంబ్లీ వెనక వైపు నుంచి మెట్రో మార్గం వెళ్లనుంది. లక్డీకాపూల్ మెట్రో స్టేషన్ (అశోక హోటల్) నుంచి పోలీస్ క్వార్టర్స్-డీజీపీ కార్యాలయం, జూబ్లీహాల్ల వెనక నుంచి- పబ్లిక్ గార్డెన్ ఓపెన్ గ్రౌండ్- తెలుగు విశ్వ విద్యాలయం వద్దనున్న ఖాళీ స్థలం నుంచి-నాంపల్లి మార్గానికి మెట్రో మార్గం కలవనుంది. దీని కోసం 19 పోలీసు క్వార్టర్లను తొలగించాల్సి వస్తుంది. సుల్తాన్‌బజార్ వద్ద.. చారిత్రక సుల్తాన్ బజార్‌ను పరిరక్షించేందుకు కారిడార్-2 (జేబీఎస్-ఫలక్‌నుమా) రూట్లో వచ్చే మెట్రో మార్గాన్ని ఉస్మానియా మెడికల్ కళాశాల ఓపెన్ గ్రౌండ్ నుంచి కోఠి ఉమెన్స్ కళాశాల ఓపెన్ గ్రౌండ్- తిలక్ పార్క్- బాటా జంక్షన్-బడీచౌడీ మీదుగా మళ్లిస్తున్నారు. ఈ రూట్లో మెట్రో మార్గం 0.7 కి.మీ తగ్గనుంది. తాజా అలైన్మెంట్ మార్పులతో 12 ప్రభుత్వ, 18 ప్రైవేటు భవంతులను నేలమట్టం చేయాల్సి వస్తుంది. పాతనగరంలో... జేబీఎస్-ఫలక్‌నుమా(కారిడార్-2) రూట్లో మెట్రో మార్గంలో పాతనగరంలో కొన్ని మార్పులు చేశారు. ఈ రూట్లో 3.2 కి.మీ. దూరం పెరగనుంది. సాలార్జంగ్ మ్యూజియం- ముస్లింజంగ్‌పూల్-బహదూర్‌పురా-నెహ్రూ జూపార్క్-కాలాపత్తర్-మిశ్రీగంజ్- జంగంమెట్ నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రో మార్గాన్ని మళ్లించనున్నారు. ఈ మార్పులతో 35 ప్రార్థనా స్థలాలు, 28 అషుర్ఖానాలు,7 దేవాలయాల మనుగడకు ఎటువంటి నష్టం కలగబోదని హెచ్ఎంఆర్ నివేదిక సిద్ధం చేసింది. -
నేడు హైదరాబాద్ సమస్యలపై అఖిలపక్ష భేటీ
-
నేడు హైదరాబాద్ సమస్యలపై అఖిలపక్ష భేటీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగర సమస్యలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. సమావేశానికి ఆయా పార్టీల అధ్యక్షులు, శాసనసభాపక్ష నాయకులను ఆహ్వానిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా పలు అంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తీసుకున్న తరువాతే.. ముందుకు వెళ్తామని ముఖ్యమంత్రి చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. నగరంతోపాటు శివారుల్లో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు, మూడు ప్రాంతాల్లో మెట్రో రైల్ అలైన్మెంట్ల మార్పులపై చర్చించాలని నగరవాసుల నుంచి డిమాండ్ ఉంది. వినాయక్‌సాగర్ ఏర్పాటు, వినాయక, బతుకమ్మ, దుర్గామాత విగ్రహాల నిమజ్జనాలకు ప్రత్యామ్నాయ ఏర్పాటుపై కూడా చర్చించనున్నారు. -
ఐక్య పోరుకు సిద్ధం
* పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం సరికాదు - స్థానిక సంస్థల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోంది.. * గత ప్రభుత్వాలకు పట్టిన గతే దీనికీ పడుతుంది.. - రౌండ్‌టేబుల్ సమావేశంలో సర్పంచ్ల సంఘం * రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి ఖమ్మం: బకాయిపేరుతో గ్రామ పంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయటం సరికాదని సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు సత్యనారాయణరెడ్డి అన్నారు. దీనిపై ఐక్యపోరాటాలకు సిద్ధమవ్వాలని సర్పంచ్‌లకు ఆయన పిలుపునిచ్చారు. స్థానిక సిక్వెల్ రిసార్ట్స్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన అఖిలపక్షం సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలను బలోపేతం చేస్తామన్న నాయకులు ఇప్పుడు విద్యుత్ బిల్లుల పేరుతో ఇబ్బందులకు గురిచేయటం సరికాదన్నారు. గత మూడేళ్లుగా విడుదల చేయని 13వ ఆర్థికసంఘం నిధులను ఇప్పుడు విడుదల చేస్తే..వాటిపై కన్నేసి ట్రాన్స్‌కో అధికారులు జీపీలపై పడుతున్నారని ఆరోపించారు. మహారాష్ట్ర, కర్ణాటకాల్లో జీపీలకు ఇచ్చిన అధికారాలనే ఇక్కడా ఇవ్వాలన్నారు. ప్రస్తుతం ఉన్న వాటికి తోడు 20 శాతం టీఎఫ్టీ నిధులు అదనంగా కేటాయించాలని కోరారు. ప్రభుత్వం కావాలనే పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. సౌకర్యాలు కల్పించకపోగా భారాలు మోపడంపై కోర్టుకు వెళ్తామన్నారు. పంచాయతీలకు విద్యుత్ సరఫరా పునరుద్ధరించకపోతే తమ సంఘం ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. 15 ఏళ్ల బకాయిలను ఇప్పుడు చెల్లించాలని పంచాయతీలపై ఒత్తిడి తేవడం సరికాదని ఖమ్మం ఎమ్మెల్యే అజయ్‌కుమార్ అన్నారు. గ్రామపంచాయతీలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పల్లెలు అంధకారంలో కూరుకుపోయాయన్నారు. ప్రజలు పన్నులు కట్టే పరిస్థితుల్లో లేరన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పంచాయతీల పరిరక్షణకు పాటుపడితే ఈ ప్రభుత్వం విద్యుత్ బిల్లుల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలను ఇబ్బందిపెట్టిన చంద్రబాబుకు పట్టిన గతే ఈ ప్రభుత్వానికీ పడుతుందని హెచ్చరించారు. వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఈ విషయంపై చర్చిస్తామన్నారు. కరువు, విద్యుత్ కోతలతో గ్రామీణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని ఎన్డీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు అన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పిన పాలకులు గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేసి వాటిని శ్మశానాలుగా మారుస్తున్నారన్నారు. విద్యుత్ బకాయిలపై ప్రభుత్వం ట్రాన్స్‌కో అధికారులతో మాట్లాడాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బాగం హేమంతరావు కోరారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పంచాయతీల్లో ప్రజలు తాగునీటికి అల్లాడుతున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. గత బిల్లులతో సంబంధం లేకుండా జీపీలకు విద్యుత్ సరఫరా చేయాలని సీపీఎం ఖమ్మం డివిజన్ కార్యదర్శి యర్రా శ్రీకాంత్ కోరారు. చిన్నచిన్న పంచాయతీలకు నిధులు తక్కువగా వస్తాయని, ప్రజలు బిల్లులు కట్టే పరిస్థితి ఉండదని సర్పంచ్ల సంఘం జిల్లా కన్వీనర్ బెల్లం శ్రీనివాస్ అన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని పంచాయతీలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని ఆయన కోరారు. లేదంటే ఆందోళనలకు పూనుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం గౌరవ అధ్యక్షులు నరేందర్, ఎన్డీ నాయకులు రాయల చంద్రశేఖరరావు, సీఐ టీయూ నాయకులు కల్యాణం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ, బీజేపీ నేతలు పాల్గొన్నారు. -
బాన్సువాడను జిల్లా చేయాల్సిందే !
బాన్సువాడ : నాలుగు మండలాలకు కూడలి కేంద్రంగా ఉ న్న బాన్సువాడను జిల్లాగా మార్చాలని అఖిల పక్ష స మావేశంలో పలువురు డిమాండ్ చేశారు. మంగళవా రం స్థానిక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన అఖిల ప క్ష సమావేశంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంలతో పాటు న్యాయవాదులు, పాత్రికేయులు, వ్యా పారులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడు తూ రాష్ట్రంలోనే వెనుకబడిన ప్రాంతాలైన జుక్కల్, ఎ ల్లారెడ్డి, నారాయణఖేడ్, బాన్సువాడ నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా చేస్తే తెలంగాణ పునర్ని ర్మాణంలో భాగంగా ఎంతో అభివృద్ధి చెందుతుందని పే ర్కొన్నారు. జుక్కల్ నియోజకవర్గం జిల్లా కేంద్రం నుంచి 100 కిలో మీటర్ల దూరంలో ఉందని, ఎల్లారెడ్డి నియోజకవర్గం 80 కిలో మీటర్ల దూరంలో ఉందని, బాన్సువాడను జిల్లా చేస్తే కేవలం 20 నుంచి 30 కిలో మీటర్ల దూరంలో జిల్లా కేంద్రం కావడంతో పాటు ప్రజలకు జిల్లా స్థాయి అధికారులు అందుబాటులో ఉంటారని అన్నారు. బాన్సువాడను జిల్లాగా మార్చే వరకు ఉద్యమం చేయాలని తీర్మానించారు. బాన్సువాడ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి రాష్ట్ర మంత్రి వర్గంలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ఆయన కృషి చేస్తే సాధ్యం కానిది లేదని, టీఆర్ఎస్ నాయకు లు సైతం జిల్లా కేంద్రం కోసం తమ వంతు కృషి చేస్తామని చెప్పారన్నారు. అధికార పార్టీ నాయకత్వం వ హించి ఉద్యమాన్ని కొనసాగిస్తే తమకేమీ అభ్యంత రం లేదని, జిల్లాగా చేయడం వల్ల ఈ ప్రాంతంలో ని రుద్యోగ సమస్య కూడా దూరమవుతుందని పేర్కొన్నారు. దీని కోసం అందరం ఐక్యంగా కృషి చేద్దామని తీర్మానించారు. సమావేశంలో కాంగ్రెస్ సెగ్మెంట్ ఇం చార్జి కాసుల బాల్‌రాజ్, కాంగ్రెస్ నాయకులు అలీబిన్ అబ్దుల్లా, సాయిలు, అబ్దుల్ ఖాలిక్, భాస్కర్, నాగుల గామ వెంకన్న, టీడీపీ మండల అధ్యక్షుడు కొర్ల పోతురెడ్డి, బీజేపీ మండల అధ్యక్షుడు అర్శపల్లి సాయిరెడ్డి, సీపీఐ నేత దుబాస్రాములు, చాంబర్‌ఆఫ్ కామర్స్ అ ధ్యక్షుడు నాగులగామ శ్రీనివాస్‌గుప్త, న్యాయవాదులు మూర్తి, మాణిక్‌రెడ్డి, రమాకాంత్, ఖలీల్ పాల్గొన్నారు. నేడు జిల్లా సాధన సమితి ఆవిర్భావం అఖిల పక్ష సమావేశాన్ని బుధవారం మధ్యాహ్నం ఒంటి గంటకు స్థానిక ఆర్అండ్బీ సమావేశంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశ ంలో బాన్సువాడ జిల్లా సాధన సమితిని ఏర్పాటు చేసి, కార్యవర్గాన్ని ప్రకటిస్తామని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో అన్ని పార్టీలతోపాటు, వ్యాపార, వాణిజ్య, కుల సంఘాలు, చాంబర్ ఆఫ్ కామర్స్, లయన్స్‌క్లబ్ తదితర సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ప్రెస్‌క్లబ్ కార్యదర్శి సయ్యద్ అహ్మద్ కోరారు. -
ఏకపక్ష నిర్ణయం వద్దు
రాజధానిపై అఖిలపక్ష సమావేశం అభిప్రాయం హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు విషయంలో అన్ని పక్షాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అఖిల పక్ష సమావేశం అభిప్రాయపడింది. ఏపీ రాజధాని ఏర్పాటుపై సిటిజన్స్ ఫోరం శనివారం హైదరాబాద్‌లో అఖిల పక్ష సమావేశం నిర్వహించింది. ఏకపక్షంగా, ఏ కొందరికో ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు చేయడంవల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని సమావేశం హెచ్చరించింది. ఈ సమావేశంలో ఫోరం ప్రతినిధులు, పలు పార్టీల నేతలు హాజరై అభిప్రాయాలను వ్యక్తీకరించారు. ఎం.వి. మైసూరారెడ్డి( వైఎస్సార్ సీపీ) : రాజధాని ఏర్పాటుపై అన్ని పార్టీలతో చర్చించాకే నిర్ణయం తీసుకోవాలి. ఒంటెత్తుపోకడలతో ముందుకెళ్లడం రాష్ట్ర అభివృద్ధికి మంచిది కాదు. ప్రభుత్వ భూములు ఎక్కువ ఉన్నచోటే రాజధాని నిర్మాణం చేపట్టాలి. సి.రామచంద్రయ్య (కాంగ్రెస్): విభజన వల్ల ఏ ప్రాంతానికి అన్యాయం జరిగిందో అక్కడే రాజధాని నిర్మాణం చేపట్టాలి. గడికోట శ్రీకాంత్‌రెడ్డి( వైఎస్సార్సీపీ): గతంలో రాజధానిని కోల్పోయిన కర్నూలును పరిగణలోకి తీసుకోవాలి. ఈ ప్రాంత అభివృద్ధికి ఎటువంటి ఒప్పందాలు చేసుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం తగదు. చింతామోహన్, మాజీ ఎంపీ : కాంగ్రెస్ అధికారంలో ఉంటే తిరుపతిని రాజధానిగా ఎంపిక చేసేవారు. సి.ఆంజనేయరెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి: రాజధాని కర్నూలులోనే ఏర్పాటు చేయాలి. లేకుంటే ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లా దొనకొండ పరిసర ప్రాంతాలను ఎంపిక చేయాలి. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, రిటైర్డ్ న్యాయమూర్తి: అన్నింటా అన్యాయానికి గురవుతున్నామని రాయలసీమ వాసుల్లో ఆవేదన ఉంది. అందుకే రాజధాని ఎంపికపై ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవద్దు. హన్మంతరెడ్డి, సిటిజన్స్ ఫోరం: శ్రీబాగ్ ఒప్పందం మేరకు సీమలోనే రాజధాని ఏర్పాటు చేయాలి. వీఎల్‌ఎన్‌రెడ్డి, నిపుణుడు: దొనకొండ ప్రాంతంలో 68,741 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. 14 కిలోమీటర్ల దూరంలో నాగార్జున సాగర్ కుడి కాల్వ, 25 కిలోమీటర్ల పరిధిలో వెలిగొండ ప్రాజెక్టులు ఉన్నాయి. జీఆర్ రెడ్డి, సిటిజన్స్ ఫోరం: రాష్ట్ర విభ జించే సమయంలో సమన్యాయం పాటించలేదని విమర్శిస్తున్న చంద్రబాబు రాజధాని ఏర్పాటు విషయంలో మాత్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. -
అఖిలపక్షంలోనే అన్ని నిర్ణయాలు
* అసెంబ్లీలో సీఎం కేసీఆర్ * పోలవరంపై త్వరలోనే భేటీ.. * అనర్హుల రేషన్‌కార్డులు, హౌసింగ్ అక్రమాలపై దృష్టి సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అన్ని నిర్ణయాలను అఖిలపక్షంలో చర్చించి తీసుకుంటామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ప్రతీ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని, విపక్షాలు ఇచ్చే సలహాలు, సూచనలు తీసుకుంటామని, తాము పూర్తి విశాల దృక్పథంతో ఉన్నామని ముఖ్యమంత్రి శుక్రవారం అసెంబ్లీలో చెప్పారు. వివిధ రంగాల్లో లోటుపాట్లపై ఆయన మాట్లాడారు. ‘మేమే నిర్ణయాలు తీసుకుని 63 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాలు బాగుపడితే సరికాదు. అన్ని నియోజకవర్గాలూ అభివృద్ధి చెందాలి. కష్టపడి తెలంగాణ సాధించుకున్నాం. అందరం పాత్రధారులం.. సూత్రధారులం అవుదాం.. పోలవరం ముంపులోని 7 మండలాలను ఆంధ్రలో కలిపే ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా పోరాడుదాం. శనివారం అసెంబ్లీలో ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తీర్మానం చేద్దాం. సమావేశాలు ముగిసిన తరువాత అఖిలపక్షం ఏర్పాటు చేస్తాను. ఢిల్లీకి వెళ్లి ఆర్డినెన్స్ ఉపసంహరణకు ఒత్తిడి తెద్దాం. అందుకు బీజేపీ నాయకులు కూడా సహకరించాలి’ అని కేసీఆర్ పేర్కొన్నారు. చివరి ఏడాది రాజకీయాలు చేద్దాం.. ‘‘అహంకారం, ఒంటెత్తుపోకడతో మేము వెళ్లం. అందర్నీ కలుపుకొని వెళ్తాం. జీహెచ్ఎంసీ, కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలు ఉన్నాయి. తర్వాత నాలుగున్నరేళ్లపాటు అభివృద్ధిపై దృష్టిపెడదాం. చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దాం. మా తప్పులపై మీరు, మీ పనులపై మేము ప్రజాక్షేత్రానికి వెళదాం. ప్రజలు తీర్పునిస్తారు. అప్పటి వరకు అందరం కలిసి పనిచేద్దాం’’ అని సీఎం వ్యాఖ్యానించారు. ఇళ్ల కంటే కార్డులెక్కువా? ‘తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్యకంటే రేషన్‌కార్డులు ఎక్కువగా ఉన్నాయి. అధికారులు ఇచ్చిన లెక్కలను మీ ముందు పెడుతున్నాను. దీనిపై ఏమి చేద్దామో మీరే చెప్పండి.. జిల్లాల వారీగా ఉన్న లెక్కలు అఖిలపక్ష సమావేశంలో ఇస్తా. ప్రతిపైసాకు జవాబుదారీతనం ఉండాలి. నిధులు దుర్వినియోగం కారాదు. తెలంగాణలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం కుటుంబాలు 84,20,662 ఉంటే.. తె ల్ల రేషన్‌కార్డులు 91,94,880, గులాబీ కార్డులు 15,07,509, అంత్యోదయ కార్డులు కూడా కలుపుకొంటే.. మొత్తం 1,07,02,479 కార్డులున్నాయి. ఇంకా లక్షల సంఖ్యలో రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు ఉన్నాయి. ఇది అధికారులు ఇచ్చిన లెక్క. ఇదేమి చందులాల్ దర్బార్ (నిజాం ప్రభుత్వంలో ఉండేది). తెలంగాణ సొమ్ము ఇలా పోతుంటే ఎలా..? వీటిని ఏమి చేద్దామన్న అంశంపై అఖిలపక్ష సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుందాం’ అని అన్నారు. హౌసింగ్ నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలు ఇళ్ల పేరుతో నిధులు దుర్వినియోగం చేసిన అధికారులు, ప్రజాప్రతినిధులపై విచారణ జరిపిస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ‘1983-2014 మధ్య కాలంలో తెలంగాణలో మొత్తం 42 లక్షలు ఇళ్లు నిర్మించారు. ఇంకా ఐదు లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. 83-94 వరకు సెమీ పక్కా ఇళ్లు 10 లక్షలు నిర్మించామంటున్నారు. తెలంగాణలో ఉన్న కుటుంబాల సంఖ్యే 84 లక్షలు. మరి ఇంకా ఇళ్లు కావాలని ఎందుకు అడుగుతున్నారు. దీనిపై అఖిలపక్ష సమావేశంలో చర్చిద్దాం’ అని అన్నారు. -
అఖిలపక్షం పేరుతో విభజన ఆపొద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం మరోసారి రాష్ట్రంలోని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు చెప్పారు. అఖిలపక్ష సమావేశం ద్వారా తెలంగాణ ప్రక్రియను ఆపడానికి ప్రయత్నించకూడదని కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. పార్టీ నాయకులు ఈటెల రాజేందర్, నాయిని నర్సింహారెడ్డి, జి.వివేక్, స్వామిగౌడ్, వినోద్‌కుమార్, గోయల్, రమణాచారి, దాసోజు శ్రవణ్ తదితరులతో కలిసి తెలంగాణభవన్‌లో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మళ్లీ మళ్లీ కమిటీల పేరుతో ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు విషయంలో కాలయాపన చేయవద్దని ఈటెల కోరారు. విభజన నిర్ణయం నేపథ్యంలో 11 అంశాలపై కేంద్ర హోం శాఖ రాష్ట్రంలోని రాజకీయ పార్టీల సలహాలు, సూచనలు కోరుతూ రాసిన లేఖకు స్పందనగా తమ పార్టీ అభిప్రాయాలతో కూడిన 12 పేజీల నివేదికను జీవోఎంకు మెయిల్ ద్వారా పంపినట్టు నేతలు చెప్పారు. నివేదిక ప్రతిని పోస్టు ద్వారా కూడా పంపనున్నామన్నారు. జీవోఎంకు టీఆర్ఎస్ అందజేసిన నివేదిక వివరాలు క్లుప్తంగా... హైదరాబాద్ పోలీస్ తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విభజన నోట్లోనూ, సీడబ్ల్యూసీ తీర్మానంలోనూ హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను టీఆర్ఎస్ సమర్థిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలోనూ శాసనమండలిని కొనసాగించాలి. హైదరాబాద్ రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని అన్నది తాత్కాలిక వెసులుబాటే అయినందున ఆ ప్రభుత్వ నిర్వహణకు అన్నిరకాల కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి అంగీకరిస్తున్నాం. అయితే ఆ ప్రాంతంలో అతిత్వరగా కొత్త రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి వారే ప్రాధాన్యం ఇస్తారని భావిస్తున్నాం. శాంతిభద్రతలు పూర్తిగా రాష్ట్రం పరిధిలోనే ఉండే అంశం. హైదరాబాద్‌లో పోలీసు వ్యవస్థ సైతం తెలంగాణ రాష్ట్ర పరిధిలోనే ఉండాలి. రాష్ట్ర విభజనతో పాటు రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులను ఏర్పాటు చేయాలి. హైకోర్టులో నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా అతి త్వరగా రెండుగా విడదీయాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన 371 డి కొనసాగించాలి. కృష్ణా నదీ జలాలలో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన మిగులు జలాలలో తెలంగాణ రాష్ట్రం తమ న్యాయమైన వాటా కోరే వరకు బ్రజే శ్‌కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పును అమలులోకి రాకుండా చూడాలి. ట్రిబ్యునల్ రాష్ట్రానికి అదనంగా 190 టీఎంసీల కృష్ణా నీరు వస్తుందని ప్రాథమికంగా తేల్చింది. ఇక్కడి పాలకులు ఈ నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతంలో లేని ప్రాజెక్టులకు కేటాయించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మా న్యాయమైన వాటా కోరేవరకు ట్రిబ్యునల్ తుది తీర్పు అమలు చే యరాదు. దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి, అన్యాయానికి గురైన తెలంగాణ ప్రాంతం కోసం గోదావరి, కృష్ణా నదులపై ఒక్కో జాతీయ ప్రాజెక్టును నిర్మించాలి. పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర పరిధిలో ఉన్నప్పటికీ, దీని వల్ల ముంపునకు గురయ్యేది అధికంగా తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని గిరిజన ప్రాంతాలే. అందువల్ల ముంపు బాధితులకు పునరావాస, పునర్నిర్మాణ ప్యాకేజీ ప్రకటించడంతో పాటు వన్యప్రాణి, అటవీ పర్యావరణ అనుమతుల తర్వాతనే ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టాలి. సింగరేణిపై పూర్తి హక్కులు తెలంగాణకే ఇవ్వాలి సింగరేణి బొగ్గు గనులపై ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉన్న పూర్తి హక్కులను తెలంగాణ ప్రభుత్వానికి కల్పించాలి. సింగరేణిలో ఉన్న 51 శాతం రాష్ట్ర పూర్తి వాటాను తెలంగాణకు బదలాయించాలి. తెలంగాణ ప్రాంతానికి ఈ సరికే మంజూరు చేసిన రైల్వేలైన్లను పూర్తి చేయాలి. నాలుగు వేల మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టును తెలంగాణలో నిర్మించాలి. మరో 1400 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టును రంగారెడ్డి జిల్లాలో నిర్మించాలి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలో బొగ్గు గనుల నుంచి కేటాయించిన బొగ్గులో 60 శాతం వాటాను తెలంగాణకు కేటాయించాలి. 1956కు ముందు హైదరాబాద్ రాష్ట్ర ఆస్తులుగా ఉన్నవన్నీ తెలంగాణ రాష్ట్రానికే చెందాలి. అప్పట్లో ఢిల్లీలో ఉండే హైదరాబాద్ హౌస్‌కు బదులుగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన భూములు, ఆంధ్రాభవన్ తెలంగాణకే చెందాలి. తెలంగాణ ప్రాంతంలో ఒక ఐఐఎం, జాతీయ స్థాయి మెడికల్ సైన్స్ సంస్థతో పాటు గిరిజన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలి. 57 ఏళ్లలో జరిగిన నష్టానికి తగినవిధంగా ప్యాకేజీ ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు తరువాత 57 ఏళ్లలో రూ.4.10 లక్షల కోట్ల తెలంగాణ ప్రాంత నిధులను వేరే ప్రాంతాలలో ఖర్చు పెట్టారు. దీనివల్ల మరో రూ.4.78 లక్షల కోట్ల ఆదాయం ఈ ప్రాంతం కోల్పోవాల్సి వచ్చింది. ఈ 57 ఏళ్ల కాలంలో తెలంగాణ ప్రాంతంలోని 2. 5 లక్షల కుటుంబాలు రెండు తరాల పాటు ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని 57 ఏళ్ల పాటు జరిగిన నష్టానికి ప్రతిఫలంగా ఈ ప్రాంతానికి తగిన ప్యాకేజీ ప్రకటించాలి. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు చాలా తక్కువమంది ఉన్నారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంత ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు సొంత రాష్ట్రానికి వచ్చేందుకు అంగీకారం తెలిపితే వారందరినీ ఇక్కడికి బదలాయించాలి. రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి సర్వీసు పుస్తకం పరిశీలించి ఎవరు ఏ ప్రాంత ఉద్యోగి అన్నది నిర్ధారించాలి. అక్రమంగా తెలంగాణ ప్రాంతానికి వచ్చిన ఉద్యోగులు ఇక్కడే పెన్షన్ తీసుకుంటున్నారు. వీరికి తెలంగాణ ట్రెజరీ నుంచి కాకుండా అవతలి ప్రాంతంలో పెన్షన్ చెల్లింపు ఏర్పాట్లు జరగాలి. -
'అఖిలపక్ష భేటీని అన్ని రాజకీయ పార్టీలు బహిష్కరించాలి'
కేంద్ర ప్రభుత్వం మరోసారి ఏర్పాటు చేయనున్న అఖిలపక్ష భేటీని బహిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సభ్యులు రిటైర్డ్ జడ్జి లక్ష్మణ్ రెడ్డి అన్ని రాజకీయపార్టీలకు పిలుపు నిచ్చారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆర్టికట్ 3ను దుర్వినియోగం చేస్తుందని ఆరోపించారు. రాష్ట్ర విభజనపై శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన వేదకను కేంద్రం పరిగణలోకి తీసుకోకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కమిటీ నివేదికను పక్కనపెట్టి ఓట్లు, సీట్లు కోసం రాష్ట్ర విభజన చేయడం అప్రజాస్వామికమని ఆయన పేర్కొన్నారు. అయితే అఖిల పక్ష సమావేశానికి కేంద్రం ఇచ్చిన గడువు చాలా తక్కువగా ఉందని విశాలాంధ్ర మహాసభ అధ్యక్షుడు నల్లమోతు చక్రవర్తి అభిప్రాయపడ్డారు. -
మళ్లీ అఖిలపక్షం: షిండే వెల్లడి
* జీఓఎం విధివిధానాలపై సూచనల కోసమే * 7న జీఓఎం భేటీకి ముందే అఖిలపక్ష భేటీకి అవకాశం * ‘భాగస్వాముల’ అభిప్రాయ సేకరణకు జీఓఎం నిర్ణయం * కాంగ్రెస్ కోర్ కమిటీ భేటీ అనంతరం వెల్లడించిన షిండే * కోర్ కమిటీ భేటీకి ముందు రాష్ట్రపతిని కలిసిన షిండే సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలను చర్చించేందుకు వచ్చే వారంలో రాష్ట్రానికి చెందిన అన్ని రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విభజన అంశాన్ని పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రుల బృందం (జీఓఎం) నవంబర్ 7వ తేదీన మలివిడత సమావేశం కానున్న నేపథ్యంలో.. జీఓఎం భేటీకి ముందే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించే అవకాశముందని ఆయన చెప్పారు. షిండే బుధవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. మంత్రుల బృందం విధివిధానాల్లోని వివిధ అంశాలపై అఖిలపక్ష భేటీ చర్చించి, సూచనలు చేస్తుందని వివరించారు. షిండే నేతృత్వంలోనే ఏర్పాటైన కేంద్ర మంత్రుల బృందం ఇప్పటికే రెండు సార్లు సమావేశమైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ విభజనతో నదీ జలాల పంపిణీ, విద్యుత్, ఆస్తుల పంపకం, సరిహద్దుల గుర్తింపు అంశాలపై ఆ భేటీల్లో చర్చలు జరిపింది. జీఓఎం అనుసరించాల్సిన మార్గం, పద్ధతులపైనా చర్చించింది. ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయం మేరకు.. విభజనపై కేంద్ర కేబినెట్‌కు నివేదించే తన సిఫారసులను రూపొందించటంలో అన్ని ముఖ్యమైన అంశాలపైనా భాగస్వాముల అభిప్రాయాలను జీఓఎం తీసుకుంటుంది. కోర్ కమిటీ నిర్ణయం మేరకే కాంగ్రెస్ అత్యున్నత నిర్ణాయక విభాగమైన కోర్ కమిటీ భేటీలో మెజారిటీ నేతల నుంచి వ్యక్తమైన అభిప్రాయాల మేరకే రాష్ట్ర విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ నివాసంలో బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.30 గంటల వరకు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ప్రధానితో పాటు పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, హోంమంత్రి షిండే, రక్షణ మంత్రి ఎ.కె.ఆంటోనీ, ఆర్థికమంత్రి చిదంబరం, న్యాయమంత్రి సల్మాన్‌ఖుర్షీద్, సోనియా రాజకీయ వ్యవహారాల కార్యదర్శి అహ్మద్‌పటేల్‌లు ఈ భేటీలో పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయంటూ సర్వేలు వెల్లడిస్తున్న నేపథ్యంలో.. రానున్న ఎన్నికల మీద కోర్ కమిటీలో చర్చ జరిగినట్లు సమాచారం. రాష్ట్ర విభజన విషయంలో ప్రస్తుత పరిస్థితిని, హోంశాఖ పరిధిలో చేపడుతున్న చర్యలను, మంత్రుల బృందం పరిశీలనలో ప్రగతిని షిండే ఈ భేటీలో వివరించారని తెలిసింది. రాజ్యాంగంలోని 371(డి) అధికరణ, విభజన ప్రక్రియలో అనుసరించాల్సిన న్యాయ పరమైన అంశాల గురించి న్యాయశాఖ మంత్రి సల్మాన్‌ఖుర్షీద్ వివరించినట్లు చెప్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ ఏర్పాటుపై మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే నిర్ణయం కూడా కోర్ కమిటీలో తీసుకున్నట్లు సమాచారం. కోర్ కమిటీ భేటీ అనంతరం షిండే విలేకరులతో మాట్లాడారు. విభజనకు సంబంధించి మంత్రుల బృందానికి అన్ని పార్టీలు అభిప్రాయాలు, సూచనలు ఇవ్వాలని ఆయన కోరారు. అన్ని పార్టీలు నివేదికలు సమర్పించిన తర్వాత.. మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అవకాశముందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. మంత్రుల బృందానికి నివేదికలు సమర్పించడానికి నవంబర్ 5 వరకు గడువు ఉన్న విషయం విదితమే. గడువు ముగిసిన తర్వాత నాలుగైదు రోజుల్లోపే సమావేశం ఉండే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం. రాష్ట్రపతి ప్రణబ్‌తో షిండే భేటీ కోర్ కమిటీ సమావేశానికి ముందు షిండే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా జరగడం లేదంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖలను ప్రణబ్‌ముఖర్జీ హోం శాఖకు పంపించిన నేపథ్యంలో.. ఈ అంశం మీద కూడా చర్చ జరిగి ఉంటుందని భావిస్తున్నారు.