‘గోరక్ష’ దౌర్జన్యాన్ని సహించొద్దు
► రాష్ట్రాలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
► గోవు పేరుతో సమాజంలో అస్థిరతకు ప్రయత్నం
► అఖిలపక్ష సమావేశంలో కోరిన ప్రధాని మోదీ
► దేశ భద్రతపై కేంద్రానికి సహకరిస్తామన్న విపక్షాలు
న్యూఢిల్లీ: గోరక్ష పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న హింస, దౌర్జన్యాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. గోరక్షను కారణంగా చూపుతూ ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని.. పలువురు సంఘ వ్యతిరేక శక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సమాజంలో అస్థిరతకు కారణమవుతున్నారని మోదీ తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష నేతలతో మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు.
గోరక్ష పేరుతో జరుగుతున్న మత హింసను అరికట్టడంలో విపక్షాలు సహకారం అందించాలని ప్రధాని కోరారు. ఆవుపేరు చెప్పుకుని రాజకీయ, మత వివాదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ‘గోవును తల్లిగా భావిస్తాం. ఇది మన మనస్సుకు సంబంధించిన అంశం. గోరక్షకు సంబంధించిన చట్టాలున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించటమే సమస్యకు ప్రత్యామ్నాయం కాదు. సంఘ విద్రోహశక్తులు గోరక్షను ఉపయోగించుకుని అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఈ దేశంలోని సామాజిక సామరస్యానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు.
ఇలాంటి ఘటనలు దేశ గౌరవానికి భంగం కలిగిస్తాయన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల విషయంలో స్పష్టంగా ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి’అని అఖిలపక్ష భేటీలో తెలిపారు. కొంతకాలంగా దేశంలో గోరక్ష పేరుతో జరుగుతున్న అవాంఛిత ఘటనల్లో దళితులు, ముస్లింలే బాధితులవుతున్నారన్న విపక్షాల ఆందోళనల నేపథ్యంలోనే మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం∙సంతరించుకున్నాయి.
చర్చలకు సహకరించండి: మోదీ
పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగటంలో విపక్షాలు.. ప్రభుత్వానికి సహకరిం చాలని మోదీ కోరారు. దేశ భద్రత, జాతీయ ప్రాముఖ్యత, ప్రజోపయోగ అంశాలపై చర్చ జరగటంలో క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే నిర్మాణాత్మక చర్చతో పరిష్కరించుకోవాలని కోరారని అనంత్ కుమార్ వెల్లడించారు. భేటీలో గులాంనబీ ఆజాద్ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ). సీతారాం ఏచూరి(సీపీఎం), డి. రాజా (సీపీఐ), ములాయం సింగ్ (ఎస్పీ), ఫారూఖ్ అబ్దుల్లా (ఎన్‌సీ) తదితర నేతలు పాల్గొన్నారు. జేడీయూ నుంచి ఎవరూ హాజరుకాలేదు. పశ్చిమబెంగాల్‌లో చెలరేగిన మత ఘర్షణల నేపథ్యంలో బీజేపీతో తీవ్రస్థాయిలో విభేదాల కారణంగా ఈ భేటీకి హాజరుకాబోమని తృణమూల్ ఇదివరకే చెప్పింది.
అవినీతిపై.. అంతా ఒక్కటై!
అవినీతిని పారద్రోలటంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు విపక్షాలు పూర్తిగా సహకరించాలని ప్రధాని కోరారు. తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల పేర్లు ప్రస్తావించకుండానే.. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారు రాజకీయ వివాదాన్ని సృష్టిం చి తప్పించుకోవాలని చూస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. ‘దేశాన్ని దోచుకున్న వారికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుంటే.. రాజకీయ వివాదాలను సృష్టించి తప్పించుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారికి వ్యతిరేకంగా మనమంతా ఏకమవ్వాలి’ అని విపక్ష నేతలను మోదీ కోరారు.
‘ప్రజాజీవనంలో నిజాయితీగా ఉండటమే కాదు.. అవినీతికి పాల్పడిన నేతలపై చర్యలు తీసుకోవటమూ ముఖ్యమే. ప్రతి పార్టీ అలాంటి వారి ని గుర్తించాలి. వారిని ఏకాకి చేయాలి’ అని మోదీ కోరారు. సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యుం టే బాగుండేదని ప్రతిపక్ష సభ్యులతో ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ వివరిస్తూ.. జీఎస్టీ అమల్లో సహకరించిన విపక్షాలందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారన్నారు. ‘సహకార సమాఖ్య విధానానికి ఇదొక ఉదాహరణ’గా పేర్కొన్నారన్నారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమానికి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అన్ని పార్టీలూ.. సంబ రాలు జరపాలని మోదీ కోరారన్నారు.
కశ్మీర్, చైనా అంశాలపై జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ అన్ని పార్టీలు సానుకూలంగా మాట్లాడాయని అనంత్ కుమార్ తెలిపారు. దేశ భద్రత విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతిస్తామని వెల్లడించాయన్నారు. ‘అన్ని పార్టీలు సంయుక్తంగా గోరక్ష పేరుతో జరుగుతున్న దౌర్జన్యాన్ని ఖండించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సంఘ వ్యతిరేక శక్తులపై కఠినచర్యలు తీసుకోవాలి’ అని అఖిలపక్ష భేటీ అనంతరం మోదీ ట్విటర్‌లో పేర్కొన్నారు.