Parliament meetings
-
విభజన హామీలపై నిలదీయండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒక్కటేనని, వారం రోజుల పాటు జరిగే సమావేశాల్లో ఎంపీలు ఆయా అంశాలపై మాట్లాడా లని చెప్పారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రాజెక్టుల అప్పగింతపై గళం విప్పాలని ఆదేశించారు. తెలంగాణ నీటి వనరులను గుప్పిట పెట్టుకునేందుకు కేంద్రం చేస్తు న్న ప్రయత్నాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్ష తన సుమారు మూడు గంటల పాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, కేటీ రామారావు, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లొద్దు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన విధానాలపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ఎంపీల పైనే ఉందని స్పష్టం చేశారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా తెలంగాణలోని వెను కబడిన జిల్లాలకు ఐదో ఇన్స్టాల్మెంట్ కింద రూ.450 కోట్ల విడుదల, ఎన్హెచ్ఏఐ సాయంతో ఆదిలాబాద్ సీసీఐ పునరుద్దరణ, రాష్ట్రంలో ఐఐఎం, 23 నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి ప్రస్తావించాలని కేసీఆర్ చెప్పారు. అలాగే పెండింగులో ఉన్న రైల్వే పనులు వేగవంతం చేసేందుకు నిధుల విడుదల, నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్ భగీ రథకు రూ.19,205 కోట్ల మంజూరు, బయ్యారంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు, జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు, ఎస్సీల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలు లేవనెత్తాలని సూచించారు. త్వరలో అన్ని కార్యక్రమాలకు..! ఎంపీలు పి.రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కేఆర్ సురేష్‌రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తుంటి ఎముక చికిత్స అనంతరం కోలుకుంటూ తొలిసారిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్, మునుపటి తరహాలో చురుగ్గా ఉన్నారని పలువురు ఎంపీలు తెలిపారు. త్వరలో పార్టీ పరంగా జరిగే అన్ని కార్యక్రమాలకు తాను స్వయంగా హాజరవుతానని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఈ భేటీలో ఎలాంటి ప్రస్తావన రాలేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం లోక్‌సభ ఎన్నికల దిశగా పార్టీ పరంగా జరుగు తున్న సన్నద్ధతపైనా కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లా డారు. నియోజకవర్గాల వారీ సన్నాహక సమావే శాల్లో కేడర్ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్, పార్టీ పరంగా చేపట్టబోయే దిద్దుబాటు చర్యలు, కార్యక్రమాల గురించి తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహాలు, ఎత్తుగడలను వివరించారు. శని వారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే లోక్‌సభ ఎన్ని కల సన్నాహక సమావేశాల గురించి ప్రస్తావిస్తూ, పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటూనే ఈ భేటీ లకు ఎంపీలు హాజరుకావాలని ఆదేశించారు. -
నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ఎంపీలు
సాక్షి, ఆదిలాబాద్: ఎన్నికల తర్వాత 17వ లోక్‌సభ మొదటిసారిగా సమావేశం కానుంది. సోమవారం నుంచి పార్లమెంట్ సెషన్స్ ప్రారంభం కానున్నాయి. మొదటి మూడు రోజుల పాటు లోక్‌సభకు ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదిలాబాద్ నుంచి బీజేపీ ఎంపీ సోయం బాపురావు, పెద్దపల్లి నుంచి టీఆర్ఎస్ ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేతలు ఇరువురు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇరువురు పార్లమెంట్‌కు తొలిసారిగా ఎన్నికయ్యారు. ఆదివారం ఈ నేతలు వేర్వేరుగా దేశ రాజధాని ఢిల్లీకి బయల్దేరి వెళ్లారు. అనూహ్యంగా విజయం.. గత ఏప్రిల్ 11న పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించారు. మే 23న ఫలితాలు వెలబడ్డాయి. ఆదిలాబాద్ నుంచి బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు అనూహ్యంగా టీఆర్ఎస్ అభ్యర్థి గోడం నగేశ్‌పై 58వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆదిలాబాద్ పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో గతేడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఆరు నియోజకవర్గాల్లో గెలుపొందగా ఒక్క ఆసిఫాబాద్‌లో కాంగ్రెస్ గెలుపొందింది. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరారు. దీంతో ఏడు నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ అనూహ్యంగా ఇక్కడ పార్లమెంట్ పరిధిలో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావు గెలుపొందడం చారిత్రాత్మకమైంది. ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంట్ నియోజకవర్గమైన ఆదిలాబాద్ నుంచి ఆదివాసీ నేత సోయం బాపురావు ఘన విజయం సాధించారు. పెద్దపల్లి నుంచి... పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బొర్లకుంట వెంకటేశ్ నేత కాంగ్రెస్ అభ్యర్థి ఆగం చంద్రశేఖర్‌పై 95వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్ మూడో స్థానంలో నిలిచారు. వెంకటేశ్ నేత డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున చెన్నూర్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన పరాజయం పాలయ్యారు. అక్కడ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన బాల్క సుమన్, మంత్రి కొప్పుల ఈశ్వర్ సహకారంతో కేటీఆర్ సమక్షంలో పార్లమెంట్ ఎన్నికల ముందు వెంకటేశ్ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్దపల్లి అభ్యర్థిగా బరిలోకి దిగి టీఆర్ఎస్ నుంచి గెలుపొందారు. ఇద్దరు తొలిసారే.. ఆదిలాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులుగా గెలిచిన సోయం బాపురావు, బొర్లకుంట వెంకటేశ్ నేత ఇరువురు పార్లమెంట్‌కు తొలిసారి ఎన్నికయ్యారు. సోయం బాపురావు గతంలో బోథ్ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇక బొర్లకుంట నేత ఉద్యోగిగా పదవి విరమణ తీసుకొని డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలై అనంతరం లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరిక్షించుకుని విజయం సాధించారు. ఇదిలా ఉంటే సోయం బాపురావు తెలుగులో ప్రమాణస్వీకారం చేయనుండగా, వెంకటేశ్ నేతది తెలియరాలేదు. -
విభజన అంశాలపై కేంద్రం నిర్లక్ష్యం’
సాక్షి, హైదరాబాద్: విభజన అంశాల అమలుపై కేంద్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తుందని కాం గ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం సచివాలయం మీడి యా పాయింట్లో ఆయన మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో విభజన అంశాలపై చర్చించాలని డిమాండ్ చేశారు. దీనిపై సీఎం కేసీఆర్ వెంటనే అఖిలపక్ష భేటీ నిర్వహించాలన్నారు. పోలవరం ప్రాజెక్టు వల్ల అక్కడ ఉండే 100 గ్రామాలకు ప్రమాదం ఉందని ఎస్కే జోషి గతంలోనే చెప్పారని, కేంద్రం దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
దద్దరిల్లిన పార్లమెంటు
న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు వేడిపుట్టిస్తున్నాయి. రఫేల్, రామ మందిరం, కావేరీ జలాల సమస్యలపై ఉభయ సభలు దద్దరిల్లాయి. బుధవారం రెండో రోజు సమావేశాలు ప్రారంభం కాగానే పలు అంశాలపై ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి. దీంతో సభా కార్యక్రమాలు నడవకుండానే గురువారానికి ఉభయసభలు వాయిదా పడ్డాయి. మధ్యాహ్నం తర్వాత కాంగ్రెస్, శివసేన, అన్నా డీఎంకే సభ్యులు వారి వారి సమస్యలు తీర్చాలంటూ ప్లకార్డులు పట్టుకుని వెల్‌లోకి దూసుకెళ్లారు. రఫేల్ విమానాల కొనుగోలులో అవినీతి జరిగిందని, దీనిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. తమిళనాడులోని కావేరీ తీరప్రాంత రైతులకు న్యాయం చేయాలని అన్నా డీఎంకే ఎంపీలు డిమాండ్ చేశారు. వారిని స్పీకర్ సుమిత్రా మహాజన్ ఎంతగా వారించినా వారు వినకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. రాజ్యసభలో ఆటిజం బిల్లుకు ఆమోదం.. ప్రతిపక్షాలు నినాదాల మధ్యే రాజ్యసభలో ఆటిజం బిల్లుకు ఆమోదం లభించింది. నేషనల్ ట్రస్ట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ఆటిజం, సెరెబ్రల్ పాల్సీ, మెంటల్ రిటార్డేషన్, మల్టిపుల్ డిజేబిలిటీస్ (సవరణ)–2018 బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. రాజ్యసభలో కావేరీ జలాలపై అన్నా డీఎంకే, డీఎంకే పార్టీల సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేశారు. వారివారి సీట్లలోకి వెళ్లి కూర్చోవాల్సిందిగా రాజ్యసభ చైర్మన్ వెంకయ్య సభ్యులను కోరారు. సభ్యులు వినకుండా నిరసన వ్యక్తం చేస్తుండటంతో పెద్దల సభను చైర్మన్ గురువారానికి వాయిదా వేశారు. -
కొంచెం పులుపు... కొంచెం తీపి...
సాక్షి, న్యూఢిల్లీ: తన ఏడాది పదవీకాలం ఒకింత పులుపుగా.. ఒకింత తీపిగా ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. పాతికేళ్లుగా ఏటా మీడియా ప్రతినిధులకు విందు ఏర్పాటు చేస్తున్న వెంకయ్య.. ఉపరాష్ట్రపతి అయ్యాక కూడా ఆ ఆనవాయితీని కొనసాగించారు. సోమవారం తన అధికారిక నివాసంలో విందు ఏర్పాటు చేశారు. బూరెలు, డబల్ కా మీఠా నుంచి చేపల కూర వరకు దక్షిణాది వంటకాలతో రుచికరంగా విందు ఏర్పాటు చేశారు. తాను ఉప రాష్ట్రపతి అయ్యాక నిర్మించిన సమావేశ మందిరాల విశేషాలను, అక్కడ జరిగే సంగీత సాహిత్య కార్యక్రమాలను వివరించారు. ఈ పదవిని ఎలా ఆస్వాదిస్తున్నారు.. ఇతర పదవులకు దీనికి ఉన్న తేడా ఏంటన్న ప్రశ్నలకు వెంకయ్య బదులిస్తూ ‘‘కట్టా.. మీటా.. అని ఒక్క మాటలో చెప్పగలను. పని లేకుండా నేను ఉండను.. పనిలోనే ఆనందాన్ని పొందుతాను. ప్రజలతో మమేకమవడం నా బలహీనత. వారిని కలవడం, మాట్లాడటం, నడవడం, కలిసి తినడం ఇష్టం. అందరి ఇళ్లకు వెళ్లేవాడిని. నా కూతురు.. ‘మా నాన్న అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటారు’ అని వ్యంగ్యంగా అనేది. దేశంలో అన్ని రాష్ట్రాలు, దాదాపు అన్ని జిల్లాలు తిరిగాను. ఏనాడూ అలసిపోలేదు. ఇప్పుడు ప్రోటోకాల్ కారణంగా ప్రజలతో నిత్యం మమేకమవడం కష్టసాధ్యమైన పని’’అని తెలిపారు. సర్దుకుపోతున్నా.. ‘‘స్పందించకుండా ఉండలేను.. కానీ ఈ పదవిలో ఉంటూ రియాక్ట్ అవడం కుదరదు.. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడాలన్నా కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్‌వర్క్‌కు లోబడి మాట్లాడాలి. ప్రోటోకాల్ కారణంగా వ్యక్తిగతంగా ఎక్కడికి వెళ్లాల న్నా కుదరదు. సాధారణ విమానాల్లోనూ వెళ్లడం కుదరదు. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటా యి. సర్దుకుపోతున్నా. ప్రజలను, రైతులను, విద్యార్థులను కలవడంపై చాలా ఆసక్తి ఉంది. ఈ పదవిలో ఉన్నా కలుస్తూనే ఉంటాను. విశ్వవిద్యాలయాలను తరచుగా సందర్శిస్తాను. సైన్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలను సందర్శిస్తాను’’అని పేర్కొన్నారు. ‘‘2019 ఎన్నికల వరకు రాజకీయాల్లో ఉండి.. తర్వాత సామాజిక సేవాలో నిమగ్నమవ్వాలనుకున్నా. కానీ ఉపరాష్ట్రపతినయ్యాను. కొంత సమ యం కుటుంబానికి కేటాయించడానికి అవకాశం దొరకడంతో వారూ సంతోషపడుతున్నారు’’అని పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపులపై.. ‘‘పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగితే అధికారపక్షం, విపక్షాలు, ప్రజలు ఆస్వాదించవచ్చు. నిబంధనలను పాటించాలని అనడం, పాటించడం కష్టమే. కానీ వాటి నుంచి వచ్చే ఫలితాలు ఊహించని రీతిలో ఉంటాయి. పార్టీ ఫిరాయింపుల పిటిషన్‌పై తక్షణం నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారికి వన్నె తెస్తుంది. అందరూ దాన్ని ఆదర్శంగా తీసుకుంటారని భావిస్తున్నా’’అని వెంకయ్య పేర్కొన్నారు. -
అంతరాయం కలిగించకండి.. ప్లీజ్!
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. గతంలో ఇతర పార్టీల సభ్యులు చేశారంటూ తమ వాదనలను సమర్ధించుకోవాలనుకుంటే అంతరాయాలు కొనసాగుతూనే ఉంటాయని తెలిపారు. ఈ నెల 18వ తేదీ నుంచి వర్షాకాలం సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభ్యులకు ఆమె లేఖ రాశారు. ‘మన పార్లమెంట్, మన ప్రజాస్వామ్యం సజావుగా, ఆదర్శవంతంగా సాగాలంటే ఏం చేయాలనే దానిపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం ఆసన్నమయింది. ప్రజాస్వామ్యానికి ఆలయం వంటి పార్లమెంట్ గౌరవం, పవిత్రతను కాపాడే లక్ష్యం మనందరిదీ’ అని పేర్కొన్నారు. ‘ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటమే కాదు, దేశాభివృద్ధికి, ప్రజాస్వామ్య పటిష్టానికి మీరు కృషి చేయాల్సి ఉంటుంది’ అని తెలిపారు. సభ్యులు సభ వెల్‌లోకి దూసుకువచ్చి నినాదాలు చేయటం, ప్లకార్డులు ప్రదర్శించడాన్ని ఆమె ప్రస్తావిస్తూ..తమ అభిప్రాయాలను, డిమాండ్లను తెలిపేందుకు కొన్ని పరిమితులు, నిబంధనలు ఉంటాయన్నారు. తమ తమ నియోజకవర్గాల్లో రాజకీయ పోరు సాగిస్తూనే సభ్యులు ప్రజాస్వామ్యయుత బాధ్యతలను కూడా సభలో నెరవేర్చాల్సి ఉంటుందన్నారు. మరో 5 భాషలకు ఛాన్స్ రాజ్యసభలో సభ్యులు మరో ఐదు భాషలు మాట్లాడే అవకాశం కల్పిస్తున్నట్లు రాజ్యసభ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు తెలిపారు. ఈనెల 18వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వర్షాకాల సమావేశాల నుంచి ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రాజ్యాంగం 8వ షెడ్యూల్లో పొందుపరిచిన 22 భాషలకు గాను తెలుగు సహా 12 భాషల్లో మాట్లాడేందుకు మాత్రమే అవకాశం ఉంది. కొత్తగా డొంగ్రి, కశ్మీరీ, కొంకణి, సంథాలీ, సింధి భాషల్లో సభ్యులు మాట్లాడేందుకు వీలుగా శిక్షణ పూర్తి చేసుకుని అర్హత పొందిన అనువాదకులకు నియమించినట్లు తెలిపారు. -
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు
హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలను సజావుగా జరగకుండా ప్రతిపక్షాలు అడ్డుకోవడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని కేంద్ర మాజీమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిరసనలో భాగంగా గురువారం ఇక్కడ లోయర్ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. అంబేడ్కర్ విగ్రహానికి దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. దత్తాత్రేయ మాట్లాడుతూ మోదీ అవినీతి రహిత పాలన అందిస్తుంటే, అనేక సంక్షేమ పథకాలతో దేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తుంటే సహకరించాల్సిన ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని విమర్శించారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రతి అంశంపై చర్చించడానికి, సమాధానం చెప్పడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. 23 రోజులపాటు పార్లమెంటు సమావేశాలను ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్ల రూ.200 కోట్ల ప్రజాధనం వృథా అయిందని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ప్రజలకు మేలు చేసే విధంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నగర కార్యదర్శి సలంద్రీ శ్రీనివాస్‌యాదవ్, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, చింత సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
జిన్‌పింగ్ కోసం రాజ్యాంగ సవరణకు సిద్ధం
బీజింగ్: కమ్యూనిస్ట్ చైనాలో వార్షిక పార్లమెంటు సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రస్తుత చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను నిరవధికంగా అదే పదవిలో కొనసాగేలా రాజ్యాంగంలో మార్పులు చేసే అవకాశముంది. చైనా పార్లమెంటు అయిన జాతీయ ప్రజా కాంగ్రెస్‌తో పాటు చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్సభ్యులైన దాదాపు 5,000 మంది ఈ సమావేశాలకు హాజరు కానున్నారు. ఎన్పీసీలో 269 మిలటరి ప్రతినిధులు సహా 2,980 మంది సభ్యులున్నారు. చైనాలో అన్ని రంగాల ప్రముఖులతో ఏర్పాటుచేసిన సీపీపీసీసీలో యాక్షన్ నటుడు జాకీచాన్ కూడా సభ్యుడిగా ఉండటం విశేషం. -
‘కనీస వేతన బిల్లు’కు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ కార్మికులకు కనీస వేతనం అమలు చేయడమే లక్ష్యంగా రూపొందించిన నూతన కనీస వేతన బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. నాలుగు కార్మిక చట్టాలను విలీనం చేసి ఈ బిల్లును తీసుకొచ్చారు. ఇది చట్టరూపం దాల్చితే దేశవ్యాప్తంగా సుమారు 4 కోట్ల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలుగుతుంది. కనీస వేతనాల చట్టం–1948, వేతనాల చెల్లింపు చట్టం–1936, బోనస్ చెల్లింపు చట్టం–1965, సమాన వేతనాల చట్టం–1976లు ఇందులో భాగం కానున్నాయి. బిల్లు ప్రకారం కేంద్రం నిర్దేశించే కనీస వేతనాలను రాష్ట్రాలు కూడా అమలుచేయాల్సి ఉంటుంది. అంతకు మించి కనీస వేతనాలను ఇచ్చే వెసులుబాటును రాష్ట్రాలకు కల్పించారు. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. -
జీఎస్టీ స్ఫూర్తి కొనసాగాలి
అర్థవంతమైన చర్చలో అందరూ భాగస్వాములవ్వాలి ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ప్రధానమంత్రి మోదీ ► నివాళులనంతరం లోక్‌సభ, రాజ్యసభలు నేటికి వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు ఆమోద సమయంలో రాజకీయ పార్టీలు చూపిన ఐక్యతా స్ఫూర్తి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనూ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీని ‘గ్రోయింగ్ స్ట్రాంగర్ టుగెదర్’ (కలసికట్టుగా బలోపేతం అవుదాం)గా అభివర్ణిస్తూ.. ఆ స్ఫూర్తి ఈ సమావేశాలకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. వేసవికాలం అనంతరం కురిసే వాన ఎలాగైతే ఆహ్లాదకరమైన మట్టివాసనను తీసికొస్తుందో.. అదే విధంగా జీఎస్టీ అమలు అనంతరం జరుగుతున్న ఈ వర్షాకాల సమావేశాలు నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తాయి’ అని చెప్పారు. ఉన్నత ప్రమాణాలతో కూడిన అర్థవంతమైన చర్చల్లో అన్ని పార్టీలు, ఎంపీలు పాల్గొనే అవకాశాన్ని ఈ సమావేశాలు కల్పిస్తాయని నమ్ముతున్నానని మోదీ పేర్కొన్నారు. ‘అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కలసికట్టుగా సాగుతూ దేశం కోసం శ్రమిస్తే మంచి ఫలితాలు సాధించగలమని జీఎస్టీ నిరూపించింది. దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న రైతుల్ని గుర్తు చేసుకుంటూ ఈ సమావేశాల్ని మొదలుపెట్టాలి. ఈ సమావేశాల్లో ఆగస్టు 15 చాలా ముఖ్యమైన రోజు. మనం స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నాం. ఆగస్టు 9తో క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తవుతాయి’ అని ప్రధాని గుర్తుచేశారు. కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులతో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సిట్టింగ్ ఎంపీ వినోద్ ఖన్నా, కేంద్ర మంత్రి అనిల్ దవే, లోక్‌సభ మాజీ సభ్యుల మృతికి సభ నివాళులర్పించింది. అమర్నాథ్ ఉగ్రదాడి మృతులకు నివాళిగా సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్‌లు ప్రతిపక్ష నేతల వద్దకు వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. సోనియా గాంధీ, ములాయం సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లాతో వారు కరచాలనం చేశారు. సినారె, పాల్వాయి, దాసరిలకు నివాళి ఇటీవల మరణించిన రాజ్యసభ సిట్టింగ్ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి, మాజీ సభ్యులు దాసరి నారాయణరావు, సి.నారా యణ రెడ్డిలకు రాజ్యసభ సంతాపం తెలి పింది. సమాజానికి వారు చేసిన సేవల్ని చైర్మ న్ అన్సారీ కొనియాడారు. దాసరి మరణంతో దేశ చిత్రపరిశ్రమకు చెందిన సుపరిచిత వ్యక్తిని, అంకితభావం కలిగిన సామాజిక కార్యకర్తను కోల్పోయామని, పాల్వాయి మరణంతో ఒక మంచి పార్లమెంటేరియన్‌ను కోల్పోయామన్నారు. సినారె మృతితో గొప్ప కవిని పొగొట్టుకున్నామని పేర్కొన్నారు. -
‘గోరక్ష’ దౌర్జన్యాన్ని సహించొద్దు
► రాష్ట్రాలు ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి ► గోవు పేరుతో సమాజంలో అస్థిరతకు ప్రయత్నం ► అఖిలపక్ష సమావేశంలో కోరిన ప్రధాని మోదీ ► దేశ భద్రతపై కేంద్రానికి సహకరిస్తామన్న విపక్షాలు న్యూఢిల్లీ: గోరక్ష పేరుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న హింస, దౌర్జన్యాలపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. గోరక్షను కారణంగా చూపుతూ ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని.. పలువురు సంఘ వ్యతిరేక శక్తులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని సమాజంలో అస్థిరతకు కారణమవుతున్నారని మోదీ తెలిపారు. సోమవారం నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం అఖిలపక్ష నేతలతో మోదీ ఢిల్లీలో సమావేశమయ్యారు. గోరక్ష పేరుతో జరుగుతున్న మత హింసను అరికట్టడంలో విపక్షాలు సహకారం అందించాలని ప్రధాని కోరారు. ఆవుపేరు చెప్పుకుని రాజకీయ, మత వివాదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ‘గోవును తల్లిగా భావిస్తాం. ఇది మన మనస్సుకు సంబంధించిన అంశం. గోరక్షకు సంబంధించిన చట్టాలున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ నిబంధనలను ఉల్లంఘించటమే సమస్యకు ప్రత్యామ్నాయం కాదు. సంఘ విద్రోహశక్తులు గోరక్షను ఉపయోగించుకుని అస్థిరత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఈ దేశంలోని సామాజిక సామరస్యానికి నష్టం కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు’ అని తెలిపారు. ఇలాంటి ఘటనలు దేశ గౌరవానికి భంగం కలిగిస్తాయన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి భద్రతల విషయంలో స్పష్టంగా ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి’అని అఖిలపక్ష భేటీలో తెలిపారు. కొంతకాలంగా దేశంలో గోరక్ష పేరుతో జరుగుతున్న అవాంఛిత ఘటనల్లో దళితులు, ముస్లింలే బాధితులవుతున్నారన్న విపక్షాల ఆందోళనల నేపథ్యంలోనే మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం∙సంతరించుకున్నాయి. చర్చలకు సహకరించండి: మోదీ పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగటంలో విపక్షాలు.. ప్రభుత్వానికి సహకరిం చాలని మోదీ కోరారు. దేశ భద్రత, జాతీయ ప్రాముఖ్యత, ప్రజోపయోగ అంశాలపై చర్చ జరగటంలో క్రియాశీలకంగా వ్యవహరించాలన్నారు. ఏమైనా సమస్యలుంటే నిర్మాణాత్మక చర్చతో పరిష్కరించుకోవాలని కోరారని అనంత్ కుమార్ వెల్లడించారు. భేటీలో గులాంనబీ ఆజాద్ (కాంగ్రెస్), శరద్ పవార్ (ఎన్సీపీ). సీతారాం ఏచూరి(సీపీఎం), డి. రాజా (సీపీఐ), ములాయం సింగ్ (ఎస్పీ), ఫారూఖ్ అబ్దుల్లా (ఎన్సీ) తదితర నేతలు పాల్గొన్నారు. జేడీయూ నుంచి ఎవరూ హాజరుకాలేదు. పశ్చిమబెంగాల్లో చెలరేగిన మత ఘర్షణల నేపథ్యంలో బీజేపీతో తీవ్రస్థాయిలో విభేదాల కారణంగా ఈ భేటీకి హాజరుకాబోమని తృణమూల్ ఇదివరకే చెప్పింది. అవినీతిపై.. అంతా ఒక్కటై! అవినీతిని పారద్రోలటంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు విపక్షాలు పూర్తిగా సహకరించాలని ప్రధాని కోరారు. తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ పార్టీల పేర్లు ప్రస్తావించకుండానే.. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వారు రాజకీయ వివాదాన్ని సృష్టిం చి తప్పించుకోవాలని చూస్తున్నారని మోదీ వ్యాఖ్యానించారు. ‘దేశాన్ని దోచుకున్న వారికి సంబంధించి చట్టం తన పని తాను చేసుకుపోతుంటే.. రాజకీయ వివాదాలను సృష్టించి తప్పించుకోవాలని వారు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వారికి వ్యతిరేకంగా మనమంతా ఏకమవ్వాలి’ అని విపక్ష నేతలను మోదీ కోరారు. ‘ప్రజాజీవనంలో నిజాయితీగా ఉండటమే కాదు.. అవినీతికి పాల్పడిన నేతలపై చర్యలు తీసుకోవటమూ ముఖ్యమే. ప్రతి పార్టీ అలాంటి వారి ని గుర్తించాలి. వారిని ఏకాకి చేయాలి’ అని మోదీ కోరారు. సోమవారం జరగనున్న రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం అయ్యుం టే బాగుండేదని ప్రతిపక్ష సభ్యులతో ప్రధాని వ్యాఖ్యానించారు. ఈ సమావేశం వివరాలను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ వివరిస్తూ.. జీఎస్టీ అమల్లో సహకరించిన విపక్షాలందరికీ మోదీ కృతజ్ఞతలు తెలిపారన్నారు. ‘సహకార సమాఖ్య విధానానికి ఇదొక ఉదాహరణ’గా పేర్కొన్నారన్నారు. ఆగస్టు 9న క్విట్ ఇండియా ఉద్యమానికి 75ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అన్ని పార్టీలూ.. సంబ రాలు జరపాలని మోదీ కోరారన్నారు. కశ్మీర్, చైనా అంశాలపై జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ అన్ని పార్టీలు సానుకూలంగా మాట్లాడాయని అనంత్ కుమార్ తెలిపారు. దేశ భద్రత విషయంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలకు సంపూర్ణ మద్దతిస్తామని వెల్లడించాయన్నారు. ‘అన్ని పార్టీలు సంయుక్తంగా గోరక్ష పేరుతో జరుగుతున్న దౌర్జన్యాన్ని ఖండించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు సంఘ వ్యతిరేక శక్తులపై కఠినచర్యలు తీసుకోవాలి’ అని అఖిలపక్ష భేటీ అనంతరం మోదీ ట్విటర్లో పేర్కొన్నారు. -
2,500 కోట్ల రెవెన్యూ నష్టం
ఢిల్లీలో మీడియాతో మంత్రి ఈటల ► 35 వస్తువులపై పన్ను తగ్గించాలని కోరినా కేంద్రం స్పందించలేదు ►వ్యాపారుల నుంచి వచ్చే సమస్యలను కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తాం ► జీఎస్టీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు అతిథిగా హాజరు సాక్షి, న్యూఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వల్ల రాష్ట్రం సుమారు రూ. 2,500 కోట్ల మేర రెవెన్యూ కోల్పోనుందని తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 8,500 కోట్లు పన్ను రూపంలో వెళ్తే కేంద్రం వాటా నుంచి రాష్ట్రానికి కేవలం రూ. 6 వేల కోట్ల మేర మాత్రమే తిరిగి వస్తుందని, మిగిలిన మొత్తాన్ని కేంద్రం ఎలా భర్తీ చూస్తుందో చూడాల్సి ఉందన్నారు. శుక్రవారం ఢిల్లీలో జీఎస్టీ ప్రత్యేక పార్లమెంటు సమావేశాలకు అతిథిగా హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘అన్ని సమస్యలూ పరిష్కరించాకే జీఎస్టీ అమలు చేస్తే బావుంటుందని మేం ఇదివరకే పలుమార్లు కేంద్రానికి సూచించాం. ఇప్పటివరకు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశాల్లో 145 వస్తువులపై పన్ను తగ్గించాలని పలు రాష్ట్రాల నుంచి విజ్ఞాపనలు అందాయి. 35 వస్తువులపై పన్ను తగ్గించాలని మేం కూడా కోరాం. అయినా కేంద్రం నుంచి స్పందన లేదు. మిషన్ భగీరథ వంటి సంక్షేమ పథకాలపై కూడా 18 శాతం పన్ను విధించడంపై అభ్యంతరం వ్యక్తం చేశాం. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే ఉండే బీడీ పరిశ్రమపై సిగరెట్లతో సమానంగా పన్ను విధించడం వల్ల కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం ఉంటుందని చెప్పాం. వస్త్ర, గ్రానైట్ పరిశ్రమలపై కొత్త పన్ను శ్లాబులు భారం కానున్నాయని కేంద్రం దృష్టికి తెచ్చాం. మా డిమాండ్లపై సానుకూల స్పందన రాలేదు. రానున్న రోజుల్లో జీఎస్టీ అమలు సందర్భంగా వ్యాపార వర్గాల నుంచి వచ్చే సమస్యలను కౌన్సిల్ దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేస్తాం. జీఎస్టీ అమలుకు అవసరమైన సాఫ్ట్వేర్, అధికారులకు శిక్షణ, వ్యాపారులకు అవగాహన రావాలంటే 4 నెలలు వేచిచూస్తే బావుంటుందని సూచించాం. జీఎస్టీ అమలు నేపథ్యంలో మా పరిధిలో మేం వీలైనంత సిద్ధంగా ఉంటాం. సమస్యలు ఎదురైతే ఎక్కడికక్కడ ఎలా పరిష్కరించాలో సమీక్షిస్తున్నాం’’ అని ఈటల వివరించారు. కోవింద్‌కు ఈటల శుభాకాంక్షలు ఎన్డీయే తరఫు రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్‌ను మంత్రి ఈటల రాజేందర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్డీయే తరఫున బరిలో నిలిచినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కేంద్ర పౌర సరఫరాలశాఖ మంత్రి రాంవిలాస్ పాశ్వాన్‌తో సమావేశమైన ఈటల... రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాల్సిందిగా కోరారు. ఈ భేటీలో ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్ కుమార్, బి.బి.పాటిల్ తదితరులు పాల్గొన్నారు. -
ఫిబ్రవరి 2న సాధారణ బడ్జెట్!
వీలుంటే అంతకంటే ముందే.. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను జనవరి మూడో వారంలో ఏర్పాటు చేసి సాధారణ బడ్జెట్‌ను ఫిబ్రవరి 2న లేదా అంతకుముందే పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి కేంద్రం కసరత్తు చేస్తోంది. సాధారణ బడ్జెట్‌ను ముందుగానే పార్లమెంట్లో ప్రవేశపెట్టడం, సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ విలీనం వంటి ప్రభుత్వ నిర్ణయాలను పార్లమెంటరీ స్థాయీ సంఘానికి ఆర్ధిక శాఖ వివరించింది. గురువారం జరిగిన పార్లమెంటరీ స్ధాయీ సంఘం సమావేశంలో బడ్జెట్ సంస్కరణల లక్ష్యాలు, సంస్కరణల ప్రక్రియలోని వివిధ అంశాలను ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా వివరించారని తెలుస్తోంది. సాధారణ బడ్జెట్లో రైల్వే బడ్జెట్‌ను విలీనం చేయడం వల్ల కలిగే లాభ, నష్టాలపై స్ధాయీ సంఘం సభ్యులు పలు సందేహాలు వ్యక్తం చేశారని తెలుస్తోంది. కాగా, జనవరి 30, ఫిబ్రవరి 2 మధ్యలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని, మార్చి 31 నాటికల్లా ఆర్ధిక బిల్లును పార్లమెంటు ఆమోదించే ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. ఏప్రిల్ 1, 2017 నుంచి వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ను అమలు చేసేందుకు వీలుగా కేంద్రం బడ్జెట్‌ను ముందుగా ప్రవేశపెట్టాలని కృతనిశ్చయంతో ఉంది. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 10 వరకు పార్లమెంట్ సమావేశాలకు విరామం ఇవ్వొచ్చని, తర్వాత సమావేశమైనప్పుడు బడ్జెట్‌పై చర్చించి మార్చి 31కల్లా ఆమోదించడానికి పార్లమెంట్‌కు సమయం ఉంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. -
'అందుకే ఆ పార్టీపై మరింత వ్యతిరేకత..'
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడం వల్ల దేశ ప్రయోజనాలకు కాంగ్రెస్ విఘాతం కల్గిస్తోందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. కాంగ్రెస్‌కు దేశ ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యంగా మారిపోయాయని ఆయన ఆరోపించారు. గురువారం ఆయన మీడియతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చర్యలతో దేశంపై అనేక దుష్పరిమాణాలు పడుతాయన్నారు. అదే విధంగా పార్లమెంటులో సుష్మా స్వరాజ్, లలిత్ మోదీ అంశంపై స్పష్టమైన సమాధానం ఇచ్చినట్టు తెలిపారు. కాంగ్రెస్ ఇలాంటి అప్రజాస్వామిక చర్యల వల్లే దేశ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై మరింత వ్యతిరేకత పెరుగుతోందని వెంకయ్యనాయుడు విమర్శించారు. -
పోటాపోటీగా స్కాంలు!
పార్లమెంటు మొదలై మూడురోజులైంది. ఈ మూడురోజులూ పట్టుమని పది నిమిషాలపాటు ఉభయ సభలు సాగిన దాఖలాలు లేవుగానీ అప్పుడే రూ. 27 కోట్లు ఖర్చయిందని గణాంకాలు చెబుతున్నాయి. పార్లమెంటు ప్రత్యక్ష ప్రసారాలను గమనిస్తుంటే అధికారం చేతులు మారడమే కాదు... వ్యూహాలు కూడా చేతులు మారినట్టు కనబడుతోంది. కుంభకోణాలు వెల్లడైనప్పుడల్లా, తనపై ఆరోపణలొచ్చినప్పుడల్లా యూపీఏ సర్కారు ప్రత్యారోపణలు చేసేది. స్కాం గురించి ప్రస్తావిస్తే మరి మీమాటేమిటని ప్రశ్నించేది. మంత్రులు రాజీనామా చేయాలని అడిగితే ముందు చర్చిద్దాం రండని పిలిచేది. చర్చలంటే భయమెందుకనేది. అటు బీజేపీ మాత్రం మంత్రులు రాజీనామా చేశాకే చర్చకొస్తామని, అంతవరకూ సభను సాగనిచ్చేది లేదని తెలిపేది. ఇప్పుడు కూడా అచ్చం అవే వాదనలు సాగుతున్నాయి. కాకపోతే పాత్రధారులు మారారు. యూపీఏకు నాయకత్వంవహించిన కాంగ్రెస్ ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుని అప్పుడు బీజేపీ మాట్లాడిన మాటల్ని వల్లెవేస్తున్నది. సహజంగానే బీజేపీ యూపీఏ సర్కారు వారసురాలిగా మారింది. పాత రికార్డుల్ని తిరగేసి వారి వ్యూహాలన్నిటినీ మక్కికి మక్కీ అనుసరిస్తున్నది. ఫలితంగా పార్లమెంటు స్తంభించి, ఇదా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం... ఈ మాత్రం దానికి సమావేశాల నిర్వహణ దేనికని విస్తుపోవడం సాధారణ పౌరుల వంతవుతున్నది. మొదటిరోజు ఏం చేయాలో తోచనట్టు కనబడిన బీజేపీ నాయకత్వం రెండోరోజుకల్లా తేరుకుని ప్రతివ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిలో ఒకరైన విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం ఉదయమే దీనికి శ్రీకారం చుట్టారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు బొగ్గు కుంభకోణం నిందితుడు సంతోష్ బగ్రోడియాకు దౌత్య పాస్‌పోర్టు ఇప్పించమని కొన్నాళ్లక్రితం తనపై ఒత్తిడి తెచ్చారని వెల్లడించారు. ఆ తర్వాత కొన్ని గంటలకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ విలేకరుల సమావేశం పెట్టి ఉత్తరాఖండ్ సీఎం హరీష్ రావత్ కార్యదర్శి మద్యం డీలర్ల ప్రతినిధితో ముడుపుల వ్యవహారం గురించి మాట్లాడినట్టు కనబడుతున్న స్టింగ్ ఆపరేషన్ సీడీని విడుదల చేశారు. దీనికి కొనసాగింపుగా గురువారం కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ హిమాచల్ ప్రదేశ్ సీఎం వీరభద్రసింగ్ ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టారని ఆరోపించారు. ఇది పాత ఆరోపణేనని, ప్రస్తుతం కేసు కోర్టులో నడుస్తున్నందున ఇంతకుమించి మాట్లాడనని వీరభద్రసింగ్ జవాబు. ఈ రెండు స్కాంలకూ ముందు కాంగ్రెస్‌కే చెందిన గోవా మాజీ సీంఎ దిగంబర్ కామత్‌కు సంబంధించిన మైనింగ్ కుంభకోణాన్ని బీజేపీ వెల్లడించింది. రేపో మాపో కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌పై ఉన్న 18 ఏళ్లనాటి హత్యానేరం ఆరోపణలను తవ్విపోసి, దానిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించమని బీజేపీ కోరవచ్చునంటున్నారు. ఎటూ పార్లమెంటు సజావుగా సాగడం లేదు గనుక దొరికిన విశ్రాంతి సమయాన్ని వినియోగించుకుని బీజేపీ ఇలా కాంగ్రెస్ సీఎంలు, మాజీ సీఎంలపై రోజూ ఆరోపణలు చేయడం పనిగా పెట్టుకోదల్చుకున్నట్టు కనబడుతోంది. కాస్త వెనక్కు వెళ్తే కాంగ్రెస్ కూడా ఈ పనే చేసింది. తనపై కుంభకోణాల ఆరోపణ వచ్చినప్పుడల్లా బీజేపీ నేతలపై ప్రత్యారోపణలు చేసేది. అప్పట్లో ఆ పార్టీలో శరవేగంతో ఎదుగుతున్న నరేంద్రమోదీని ప్రధానంగా లక్ష్యం చేసుకుని ఈ ఆరోపణలుండేవి. 2002లో గుజరాత్లో జరిగిన నరమేథం, అందుకు సంబంధించిన వేర్వేరు కేసులు అందులో కొన్ని. అలాగే ఒక గుర్తు తెలియని మహిళ కదలికలపై మోదీ ప్రభుత్వం కన్నేసిందని అప్పట్లో మీడియాకు లీకులిచ్చింది కూడా కాంగ్రెసే. ఇప్పుడు అచ్చం అదేమాదిరి వ్యూహాన్ని బీజేపీ అనుసరిస్తున్నది. సుష్మా, శివరాజ్‌సింగ్ చౌహాన్, వసుంధరరాజే సింధియాలపై పార్లమెంటు అట్టుడుకుతుంటే చర్చకు సిద్ధమని చెబుతోంది. ఎలాంటి చర్చలైనా రాజీనామాల తర్వాతేనని కాంగ్రెస్ అంటోంది. 2జీ స్పెక్ట్రమ్ స్కాం వెల్లడైనప్పుడు టెలికాం మంత్రి ఎ. రాజా రాజీనామా చేయాలని బీజేపీ...ముందు చర్చించడానికి సభను సజావుగా సాగనివ్వండని కాంగ్రెస్ పరస్పరం వాదించుకున్నాయి. ఇన్నాళ్లకు ఇప్పుడు సుష్మా కూడా తనపై వచ్చిన ఆరోపణలకు బదులుగా ప్రత్యారోపణ చేస్తున్నారు తప్ప చేసిన పనిని సమర్థించుకోలేకపోతున్నారు. ‘నేను లలిత్ మోదీకి ఎలాంటి సాయమూ చేయలేదు. ప్రయాణ పత్రాలు కావాలన్న ఆయన అభ్యర్థనపై బ్రిటన్ తీసుకునే నిర్ణయం ప్రభావం ఇరు దేశాల సంబంధాలనూ ప్రభావితం చేయబోదని మాత్రమే చెప్పాను’ అని ఆమె సంజాయిషీ ఇస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బ్రిటన్‌లోని భారత హైకమిషనర్ కార్యాలయాన్నిగానీ, కేంద్ర హోంశాఖ, ఆర్థిక శాఖలనుగానీ ఎందుకు సంప్రదించలేదో సుష్మా చెప్పలేకపోతున్నారు. అది చెప్పకుండా ఎన్ని ప్రత్యారోపణలు చేసినా నిష్ర్పయోజనం. అసలిలా ప్రత్యారోపణలు చేసేముందు బీజేపీ గతాన్ని గుర్తు చేసుకోవాలి. స్కాంలు బయటపడినప్పుడు కాంగ్రెస్ అనుసరించిన ఈ మాదిరి ఎత్తుగడలు ఆ పార్టీని కాపాడాయా? దాని పాపాలన్నీ ప్రక్షాళన అయ్యాయా? అవతలి పార్టీ కూడా స్కాంలకు పాల్పడుతున్నది గనుక కాంగ్రెస్దేమీ తప్పులేదని జనం భావించారా? లేనేలేదు. నిరుడు జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ ఎన్నడూలేని స్థాయిలో 44 స్థానాలకు పరిమితం కావాల్సివచ్చింది. కనుక కుంభకోణం ఆరోపణలకు జవాబుగా తిరిగి ఆరోపణలు చేయడంవల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదని బీజేపీ గుర్తించాలి. దానికి బదులు అధికారంలో ఉన్నారుగనుక తామే తగిన విచారణకు ఆదేశించి నిజాల్ని నిగ్గుతేల్చడం సరైన చర్య అవుతుంది. అంతకన్నా ముందు తమ నేతల సచ్ఛీలత నిరూపించుకోవడం బీజేపీ బాధ్యత. అంతేతప్ప ఇరుపక్షాలూ కలిసి పార్లమెంటును స్తంభింపజేసి దాని విలువైన సమయాన్నీ, ప్రజాధనాన్నీ వృథా చేయడం న్యాయం కాదు. -
అధైర్య పడొద్దు అండగా ఉంటాం..
ఆదుకుంటే సర్కార్‌కు సెల్యూట్ చేస్తాం... లేకుంటే పోరాటమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు పొంగులేటి కరీంనగర్ జిల్లాలో వర్షాలకు దెబ్బతిన్న పంటల పరిశీలన సాక్షి ప్రతినిధి, కరీంనగర్: అన్నదాతలెవరూ అధైర్యపడొద్దని, పదిరోజుల్లో ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చారు. ఈనెల 20 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లోనూ అకాల వర్షాల వల్ల తెలంగాణ రైతాంగానికి జరిగిన నష్టంపై చర్చిస్తామన్నారు. ప్రధానిమంత్రి నరేంద్రమోదీ, సీఎం కేసీఆర్‌ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి నూటికి నూరుశాతం నష్టపరిహారం అందేలా ఒత్తిడి తెస్తానని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట శాఖ అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం జిల్లాలోని మల్యాల, చొప్పదండి, జగిత్యాల, వేములవాడ ప్రాంతాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడు తూ తెలంగాణలోని ఏడు జిల్లాల్లో వరి, మామిడి, అరటి, పసుపు, నువ్వులు, జొన్న, సజ్జ పంటలు బాగా దెబ్బతిన్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే అన్నదాతను ఆదుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో విపత్తులో పంట నష్టపోయిన రైతులకు తక్షణమే పరిహారం ఇచ్చేవారని గుర్తు చేశారు. దురదృష్టవశాత్తు వైఎస్ తరువాత వచ్చిన పాలకులెవరూ అన్నదాతకు అండగా నిలవడం లేదన్నారు. తెలంగాణలో ఇప్పటికే 600 మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని చెప్పారు. ఆత్మహత్యలు పునరావృతం కాకుండా ఉండాలంటే వైఎస్ మాదిరిగా అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. 10 రోజుల్లోగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతుల ఉసురు తగిలిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాగించబోదన్నారు. 10 రోజుల్లో అన్నదాతను ఆదుకుంటే ప్రభుత్వానికి సెల్యూట్ చేస్తామని... లేనిపక్షంలో రైతుల పక్షాన నిలబడి పోరాడటంలో తామే ముందుంటామని స్పష్టం చేశారు. పర్యటనలో పొంగులేటితోపాటు పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శులు నల్లా సూర్యప్రకాష్‌రావు, గాదె నిరంజన్‌రెడ్డి, మతిన్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బి.రవీందర్, క్రిస్టియన్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ తదితరులు ఉన్నారు. -
పార్లమెంట్‌ను స్తంభింపజేస్తాం
నిజామాబాద్ క్రైం : తెలంగాణ ప్రత్యేక హైకోర్టు కోసం పార్లమెంట్ సమావేశాలను స్తంభింపచేస్తామని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలో ని జిల్లా కోర్టు ముందు తెలంగాణకు ప్రత్యేక హై కోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ న్యాయవాదులు చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష శిబిరాన్ని ఆమె సందర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ప్రత్యేక హై కోర్టు కోసం న్యాయవాదులు చేస్తున్న ఉద్య మం సబబేనన్నారు.న్యాయవాదులు తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచారన్నారు. తెలంగాణ వచ్చాక కూడ ఇలాంటి ధర్నాలు, దీక్షలు, నిరసనలు చూసేది లేకుండేదని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఏర్పడ్డాక పార్లమెంట్లో మొట్ట మొదటి సారిగా తాను పోలవరం నుంచి హైకోర్టు వరకు అనేక అంశాల పై మాట్లాడినట్లు తెలిపారు. ఇదే ఏ జెం డాపై సీఎం చంద్రశేఖర్‌రావు మూడుసార్లు ప్రధానమంత్రిలో మాట్లాడారన్నా రు. ఉద్యోగుల విభజన, క్యాడర్ అధికారుల విభజన, హై కోర్టు విభజన చాల ఆలస్యంగా జరుగుతున్నాయని, ఇప్పటికిప్పడు క్యాడర్ విభజన ప్రక్రియ మొదలయ్యిందన్నారు. హై కోర్టు విభజనపై ఇంకా ఊసేత్తటం లేదన్నారు. దీని వెనుక ఎవరు ఉన్నారు, ఏం జరుగుతు ందో మనందరికి తెలిసిన విషయమేనన్నారు. జరుగుతున్న ఈ మొత్తం వ్యవహరం వెనుక సీమాంధ్ర లాబీ ఉందని, వారికి హై కోర్టు విడిపోవద్దన్న కోరిక బలంగా ఉందన్నారు. ఓ పక్క ప్రత్యేక హై కోర్టు కోసం న్యాయవాదులు ఉద్యమాలు చేస్తుంటే మరో పక్క కొత్తగా జడ్డీల నియమాకాలు చేపట్టడం ములిగే నక్కపై తాటికాయ పడ్డట్టుగా మనకు కొత్త కష్టం వచ్చి పడిందన్నారు. న్యాయవాదులు కోరుతున్నట్లు సెక్షన్ 41(ఏ)ను రద్దుచేసి న్యాయవాదులకు లాభం జరిగేలా, జూనియర్ న్యాయవాదులకు న్యాయం జరిగేలా సీఎం కేసీఆర్ నిర్ణ యం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు చె ప్పారు. అవకాశం ఉంటే ప్రత్యేక హై కో ర్టు కోసం ఈ విధమైన ఉద్యమం కాకుం డా మరో విధంగా ఉద్యమించేం దుకు న్యాయవాదులు ఆలోచన చేయాలన్నా రు. ఎంపీ వెంట దీక్ష శిబిరాన్ని సందర్శించిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆమరణ దీక్ష చేస్తున్న న్యాయవాదులకు సంఘీభావాన్ని తెలిపారు. కార్యక్రమంలో నిజామాబాద్ నగర మేయర్ ఆకుల సుజాత, జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ గడ్డం సుమన, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ఎల్ శాస్త్రి, టీఆర్ఎస్ కార్పొరేటర్లు వైశాలినిరెడ్డి, సూదంలక్ష్మీ, సీనియర్, జూనియర్ న్యాయవాదులు ఉన్నారు. న్యాయవాదుల బంద్‌కు మద్దతు ప్రగతినగర్ : తెలంగాణ రాష్ట్రనికి ప్ర త్యేక హైకోర్టును మంజూరు చేయాలని జిల్లా జేఏసీ చైర్మన్ గోపాల్ శర్మ అన్నారు.గురువారం టీఎన్జీవోస్ భవన్లో ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టును ఏర్పటు చేశాకే జూనియర్ జడ్డిల నియూమకాలు చేపట్టాలని తెలిపారు. చట్టానికి వ్యతిరేకంగా ఉన్న 41(ఎ) జీవోను రద్దు చేయూలన్నారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టును ఏర్పటు చేయాలనే ఆందోళనలో భాగంగా ఈ నెల 21న నిజామాబాద్ నగరం బంద్‌కు బార్ అసోసియెషన్ నాయకులు ఇచ్చిన పిలుపునకు తాము పూర్తి మద్దతూ తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్ ప్రభాకర్,ఎఫ్‌సీఐ భాస్కర్,రవీందర్,దాస్,నర్సింలు తదితురులు పాల్గొన్నారు. -
అక్కున చేర్చుకుని ఆశీర్వదించారు.... అండగా ఉంటా
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘రాజకీయాలకు కొత్త అయినా జిల్లా ప్రజలు నన్ను అక్కున చేర్చుకుని ఆశీర్వదించి గెలిపించారు. వారు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే నా ముందున్న కర్తవ్యం. ఆ విషయంలో ఎక్కడా రాజీపడను. ఖమ్మం జిల్లా ప్రజలకు ఢిల్లీలో అండగా ఉంటా. వారి కస్టోడియన్ బాధ్యతలు తీసుకుని ఢిల్లీలో ఖమ్మం వాణి వినిపిస్తా’ అని అంటున్నారు ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పార్లమెంటు సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి, పార్లమెంటు సమావేశాలకు తొలిసారి హాజరై జిల్లాకు వచ్చిన పొంగులేటి శనివారం తన విజన్‌పై ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను ఖమ్మం పార్లమెంటు స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ప్రజల పక్షాన పనిచేస్తానని, ఏజెన్సీ గిరిజనుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ తానని ఆయన చెప్పారు. పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో తాను ఇప్పటికే పోరాడానని, లోక్‌సభలో స్పీకర్ వెల్‌లోకి వెళ్లి నిరసన తెలియజేశానని, మున్ముందు కూడా వారి పక్షాన నిలబడి పోరాడతానని అన్నారు పొంగులేటి. కొత్తగా ఏర్పడిన నవతెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకోవాలని, అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం అందుకు కృషి చేయాలని, కేంద్రం సహకరించాలని పొంగులేటి అన్నారు. ఇంటర్వ్యూ విశేషాలివి..... సాక్షి: ఖమ్మం పార్లమెంటు సభ్యునిగా బాధ్యతలు స్వీకరించారు.. మీ అనుభూతి ఎలా ఉంది? పొంగులేటి: చాలా సంతోషంగా ఉంది. ఒక ఎంపీగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం నిజంగా అదృష్టం. అలాగే లక్షలాది మంది గొంతుక వినిపించడం ఓ బాధ్యత కూడా. ఆ అదృష్టాన్ని ఆస్వాదిస్తూనే బాధ్యతను కూడా గుర్తించి పనిచేసినప్పుడు పదవికి సార్థకత లభిస్తుంది. ఇందుకోసం నా శక్తివంచన లేకుండా కృషి చేస్తా. సాక్షి: పార్లమెంటు సభ్యునిగా మీరు జిల్లా అభివృద్ధిపై ఎలాంటి ముద్ర వేయబోతున్నారు? పొంగులేటి: ఖమ్మం ఎంపీగా తెలంగాణ నుంచి వైఎస్సార్సీపీ తరఫున ఒక్కడినే ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ఇది నాపై మరింత బాధ్యత పెంచుతుంది. ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ సమస్యలను కూడా మా పార్టీ తరఫున వినిపించాల్సి ఉంటుంది. ఆ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి పనిచేస్తా. ఖమ్మంలో నా మార్కు చూపించాలనే తాపత్రయాన్ని ప్రజలు నాకు కలిగించారు. అందుకు సంబంధించి అన్నీ సిద్ధం చేసుకుంటున్నా. ఐదేళ్ల తర్వాత నన్ను ఎంపీగా గెలిపించిన ప్రజలకు న్యాయం జరిగిందనే భావన కలిగితే చాలు. జిల్లా ప్రజల పక్షాన ఢిల్లీలో కస్టోడియన్ బాధ్యతలు తీసుకుంటా. సాక్షి: జిల్లా అభివృద్ధిలో మీ ప్రథమ ప్రాధాన్యాలు ఏంటి? పొంగులేటి: దివంగత నాయకుడు వైఎస్. రాజశేఖర్‌రెడ్డి బాటలో రైతులే నా తొలి ప్రాధాన్యత. రైతుకు ఎంత చేసినా తక్కువే. జిల్లా రైతాంగం పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. విత్తనాలు, ఎరువులు, గిట్టుబాటు ధర, సాగునీరు... ఇలా అన్ని విషయాల్లో రైతాంగం సమస్యలు ఎదుర్కొంటోంది. ఆయా సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తా. రైతు విత్తు విత్తిన దగ్గరి నుంచి పంట అమ్ముకునేంతవరకు ప్రభుత్వాలు కాపలా ఉండాలన్నది నా వ్యక్తిగత భావన. అదే విధంగా జిల్లా ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్య సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ విషయంలో ప్రత్యేక విజన్ రూపొందించే ప్రయత్నం జరుగుతోంది. గ్రామాల్లో తాగునీటి కల్పనపై కూడా దృష్టి పెట్టి పనిచేస్తా. అర్హులైన అందరికీ ఇళ్లు ఇప్పించాలన్నది నా ఆశయం. ఆ కర్తవ్యాన్ని నిర్వహించడంలో ఎక్కడా నిర్లక్ష్యం వహించను. ఇక, జిల్లాలో ఎక్కువగా ఉన్న గిరిజనులు, గిరిజన ప్రాంతాల విషయంలో ఇప్పటివరకు ఉన్న నిర్లక్ష్యాన్ని పోగొట్టాలన్నది నా కోరిక. పోలవరం కింద ముంపునకు గురయ్యే ఏడు మండలాలను తెలంగాణలోనే ఉంచేలా ఇప్పటికే పోరాటం చేశా. ఇక ముందు కూడా పార్లమెంటులో పోరాడుతా. సాక్షి: ప్రత్యేక ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా? పొంగులేటి: ఖమ్మం ఎంపీగా ప్రత్యేక ప్రణాళికలు తయారు చేసుకునే పనిచేస్తా. ఇందుకోసం ప్రతి నెలా చివర్లో మేధావులతో సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. జిల్లాలోని అన్ని వర్గాలకు చెందిన మేధావులు జిల్లా అభివృద్ధి కోసం చేసే సూచనలను పరిగణనలోకి తీసుకుని పనిచేయాలనుకుంటున్నా. ఇక, పార్లమెంటు సభ్యునిగా కేంద్రం నుంచి జిల్లాకు నిధులు తేవడం నా ప్రధాన బాధ్యత. దీంతో పాటు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్ల నిర్మాణం పూర్తి చేయడం, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల నిధులను పెంచడం కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా. ముఖ్యంగా జిల్లాలో దాదాపు 5వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేసే వీలుంది. దీని కోసం అటు కేంద్రం, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి జిల్లా ఎమ్మెల్యేల సహకారంతో అభివృద్ధి చేస్తా. ఇక తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణంలో నా పాత్ర ఎలాగూ ఉంటుంది. జిల్లాలో ఉన్న పామాయిల్ ఫ్యాక్టరీకి తోడు ఉపాధి అవకాశాలను మెరుగుపర్చడం కోసం అవసరమైతే ప్రైవేటు సెక్టార్‌ను కూడా ప్రోత్సహించే విషయంపై ఆలోచన జరుగుతోంది. ఇక గిరిజన, మైనింగ్ యూనివర్శిటీల ఏర్పాటు కేంద్రం పరిధిలోనే ఉంటుంది కనుక ఎంపీగా ఢిల్లీలో వీటి సాధన కోసం పని చేస్తా. సాక్షి: పట్టణ ప్రాంతాల విషయంలో ఏం చేయాలనుకుంటున్నారు? పొంగులేటి: జిల్లాలోని ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, ఇతర పట్టణాల అభివృద్ధితో పాటు పట్టణాల్లో డ్రైనేజి, సీసీ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టాలనుకుంటున్నానను. ఖమ్మం పట్టణంలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇందుకోసం ఏళ్ల తరబడి ప్రతిపాదనలు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పాటు తాగునీటిని నిల్వ చేసుకునే రిజర్వాయర్లను ఏర్పాటు చేయాల్సి ఉంది. గోళ్లపాడు చానల్ శాశ్వత మరమ్మతులు చేయిస్తా. ఖమ్మానికి రింగ్‌రోడ్డు నిర్మించడం ద్వారా కొంతమేర ట్రాఫిక్ సమస్యను నివారించవచ్చు. పట్టణ ప్రాంతాలలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న అర్హులందరికీ ఇళ్ల స్థలాలిప్పించేందుకు కృషి చేస్తా. సాక్షి: రాజకీయంగా ఎలా వ్యవహరించదల్చుకున్నారు? పొంగులేటి: ఎన్నికలయ్యేంతవరకే రాజకీయాలు. ఆ తర్వాత ప్రజలందరూ ఒక్కటే. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కూడా ఈ విషయాన్ని ఎప్పుడూ చెపుతుండేవారు. రాజకీయ వివక్ష నా దగ్గర ఉండదు. అందరినీ ఒకేలా చూస్తా. నవ తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడంలో మా పాత్ర ఉంటుంది. వైఎస్సార్సీపీ పక్షాన ఈ విషయంలో శక్తివంచన లేకుండా పనిచేస్తాం. తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వానికి కూడా ప్రజల పక్షాన మా మద్దతు ఉంటుంది. ఎన్నికల సమయంలో ఆ పార్టీ ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చాలి. ముఖ్యంగా రైతు రుణాల విషయంలో వెనక్కు వెళ్లవద్దనేది నా సూచన. ఎన్నికల మేనిఫెస్టోను యథాతథంగా అమలుచేయాలని కోరుతున్నా. -
కేంద్ర మంత్రివర్గ సమావేశం రేపటికి వాయిదా
న్యూఢిల్లీ : ఈరోజు సాయంత్రం జరగాల్సిన కేంద్ర మంత్రివర్గ సమావేశం రేపటికి వాయిదా పడింది. గురువారం ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ కానుంది. కాగా లోక్‌సభ తొలి సమావేశాల తేదీలను కేబినెట్ భేటీలో ఖరారు చేయనున్నట్లు సమాచారం. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలతో పాటు పలు ఇతర అంశాలను కూడా భేటీలో చర్చకు రానున్నాయి. కొత్తగా కొలువు తీరిన మోడీ సర్కార్ నిన్న తొలిసారిగా సమావేశం అయిన విషయం తెలిసిందే. -
పార్లమెంట్ వద్ద మహిళల నిరసన
న్యూఢిల్లీ: పార్లమెంట్ సమావేశాలను పొడిగించైనా చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేస్తూ గురువారం పార్లమెంట్ బయట కొంతమంది మహిళలు ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకొచ్చిన వారు 144 సెక్షన్ అమల్లో ఉన్న ప్రాంతాల్లో నినాదాలిచ్చారు. దీంతో వారిని పోలీసులు అరెస్టు చేసి పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే కీలక బిల్లుల ఆమోదం కోసం పార్లమెంట్ సమావేశాలు పొడిగించే అవకాశం ఉందని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ అంతకుముందే ప్రకటించారు. -
రాజ్యసభలోనూ టీ ఆమోదం: మన్మోహన్సింగ్
టీ బిల్లుపై కేసీఆర్‌కు ప్రధాని భరోసా న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ ఏర్పాటు పూర్తయిపోయినట్టేనని, గురువారం రాజ్యసభలో కూడా బిల్లు ఆమోదం పొందుతుందని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావుతో ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ అన్నారు. బుధవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన కేసీఆర్‌కు ప్రధానమంత్రి ఎదురయ్యారు. ఈ సందర్భంగా లోక్‌సభలో తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపినందుకు కేసీఆర్ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో ప్రధాని కేసీఆర్ భుజం తట్టి తెలంగాణ బిల్లు రాజ్యసభలో కూడా ఆమోదం పొందుతుందని భరోసా ఇచ్చారు. రాజ్యసభలో అవరోధాలున్నాయా? తెలంగాణ బిల్లుకు సవరణలు చేయాలంటూ రాజ్యసభలో బీజేపీ పట్టుబట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో, బిల్లు ఆమోదానికి ఏవైనా సాంకేతిక ఇబ్బందులున్నాయా అని కేసీఆర్ నిపుణులతో చర్చించారు. ఎమ్మెల్యేలు కె.తారక రామారావు, టి.హరీశ్‌రావు, కేంద్ర సమాచార కమిషనర్, న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్, రిటైర్డు ఐఏఎస్‌లు ఎ.కె.గోయల్, రామ లక్ష్మణ్, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్, విశ్లేషకులు వి.ప్రకాశ్ తదితరులతో కేసీఆర్ బుధవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాజ్యసభలో సవరణలు చేయాల్సి వస్తే పరిణామాలు ఎలా ఉంటాయనేదానిపై కేసీఆర్ తెలుసుకున్నారు. ఏదేమైనా తెలంగాణ ఏర్పాటుకు సోనియాగాంధీ కృతనిశ్చయంతో ఉన్నారని, ఇక ఎలాంటి అవరోధాలు ఉండవని కేసీఆర్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్వైపు టీ-టీడీపీ ఎమ్మెల్యేల మొగ్గు? తెలంగాణకు చెందిన పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరాలని ఆసక్తి చూపిస్తున్నట్లు టీఆర్ఎస్ నాయకులు వెల్లడించారు. కాంగ్రెస్‌ను వ్యతిరేకించే కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు నేరుగా ఆ పార్టీలో చేరకుండా, టీఆర్ఎస్లో చేరాలని కోరుకుంటున్నట్టుగా తెలిసింది. కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నా, విలీనమైనా తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుంటున్నామని సమర్థించుకోవడానికి అవకాశం ఉంటుందనే యోచనలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నట్టు ఆ పార్టీ నాయకులు తెలిపారు. -
చూపు..ఢిల్లీ వైపు
అందరిచూపు హస్తినవైపే..! ఆరు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్న ప్రత్యేకరాష్ట్రం కల సాకారమయ్యేదశలో ఏమవుతుందోనని అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందే సమయంలో ఎదురవుతున్న అవరోధాల దృష్ట్యా జిల్లావాసుల్లో హైటెన్షన్ నెలకొంది. ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందుతుందని, నిశ్చింతగా ఉండాలని ఢిల్లీలోనే మకాం వేసిన జిల్లా ఎంపీలు కేసీఆర్, మందా జగన్నాథం ప్రజలకు భరోసా ఇస్తున్నారు. బిల్లుపై భిన్నస్వరాలు వినిపిస్తున్న బీజేపీ జాతీయ నేతలపై ఒత్తిడి పెంచేందుకు ఆ పార్టీ నేతలు ఢిల్లీబాట పట్టారు.. సాక్షి, మహబూబ్‌నగర్: పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన రోజు సీమాంధ్ర, తెలంగాణ ఎంపీల మధ్య చోటుచేసుకున్న తోపులాట జరిగి తీవ్రఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలి సిందే. ఈ పరిణామాల నేపథ్యంలో మళ్లీ సోమవారం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. మంగళ, బుధవారాల్లో లోక్‌సభ, రాజ్యసభల్లో తెలంగాణ బిల్లుపై చర్చ జరగనుండటంతో పాటు ఆమోదం కోసం ఓటింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తె లంగాణ బిల్లుకు కచ్చితంగా ఆమోదముద్ర పడుతుందని తె లంగాణవాదులు ముఖ్యంగా పాలమూరు వాసులు ధీమావ్యక్తం చేస్తున్నారు. బిల్లు ఆమోదం పొందేందుకు జిల్లా మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్స భ స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తు న్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మందా జగన్నాథం వివిధ పార్టీల అగ్రనేతలతో సంప్రదింపులు జరుపుతున్న విషయం తె లిసిందే. ఇతరపార్టీల నేతల మద్దతు కూడా కూడగట్టేందుకు టీఆర్ఎస్, టీజేఏ సీ, టీజీఓ నాయకులు ఢిల్లీలో మకాం వేశారు. ఎవరికి వారే..! టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఎంపీ మందా జగన్నాథం, మరికొంత మంది టీఆర్ఎస్ నాయకులు, టీజేఏసీ, టీజీఓ ప్రతినిధులు కూడా ఢిల్లీలో మకాం వేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఉభయసభల్లో ఆమోదం పొందే విధంగా కాంగ్రెస్, బీజేపీలతో పాటు ఇతర పార్టీలకు చెందిన జాతీయ నాయకుల మద్దతును కూడగట్టే పనిలో నిమగ్నమయ్యారు. జిల్లాకు చెందిన బీజేపీ నాయకులు, ఎమ్మెల్యేలు నాగం జనార్దన్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి పార్టీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి తదితరులు ఢిల్లీకి వెళ్లి తమ జాతీయ నాయకులపై ఒత్తిడి పెంచడం ద్వారా తెలంగాణ బిల్లుకు గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. బిల్లుకు మద్దతివ్వడం ద్వారా తెలంగాణ ప్రాంతంలో పార్టీ బలోపేతమవుతుందని జాతీయనేతల వద్ద ప్రస్తావిస్తూ ఒత్తిడి పెంచుతున్నారు. బిల్లుపైనే చర్చ సమైక్యవాదులు, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలు, ప్రజాప్రతినిధులు కొం దరు అక్కడే మకాంవేసి ఎలాగైనా బిల్లును అడ్డుకుంటామని గట్టిగా చెబుతుండటంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళనసర్వత్రా నెలకొంది. దీనికితోడు బిల్లు ఆమోదం పొందుతుందని కొండంత ఆశతో ఎదురుచూస్తున్న పాలమూరు వాసులు బీజేపీ జాతీయ నాయకులు భిన్నస్వరాలు వినిపిస్తుండటంతో అయోమయానికి గురవుతున్నారు. బిల్లుకు మద్దతు తెలిపే విషయంపై బీజేపీ నేతలు తలోమాట మాట్లాడుతున్నారని కాంగ్రెస్‌నేతలు ఆరోపిస్తున్నారు. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి, ఆమోదం కోసం చర్చించే విషయంపై కాంగ్రెస్ పార్టీకి స్పష్టత, విధివిధానాలు లేవని బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో జిల్లాలో ప్రధానపట్టణాలు, మండల కేంద్రాలతోపాటు ఎక్కడ నలుగురైదుగురు గుమికూడి నా తెలంగాణ బిల్లుపైనే ప్రధానంగా చర్చ జరుగుతోంది. -
చివరి సమావేశాలు సాగేదెలా?!
సంపాదకీయం: అయిదేళ్లపాటు పార్లమెంటు సమావేశాలను సజావుగా నడపడంలో దారుణంగా విఫలమైన యూపీఏ ప్రభుత్వం నేటి నుంచి ప్రారంభం కానున్న చిట్టచివరి సమావేశాల్లో ఏదో అద్భుతాలు చేయగలదని ఎవరూ అనుకోరు. నెలరోజుల్లోపే రద్దుకానున్న 15వ లోక్‌సభ ముందు ఇప్పుడు 72 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో అన్నీ కాకపోయినా వివాదాస్పదమైన తెలంగాణ బిల్లు, మహిళా కోటా బిల్లు, లోక్‌పాల్‌కు సంబంధించిన నాలుగు బిల్లులు, వికలాంగుల హక్కుల బిల్లువంటి 39 బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం తహతహలాడుతోంది. ఇవిగాక రైల్వే, ఆర్ధిక బడ్జెట్లకు సంబంధించిన ఓటాన్ అకౌంట్లు ఉండనే ఉన్నాయి. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు ప్రతిసారీ అఖిలపక్షాన్ని సమావేశపరిచి సభ ప్రశాంతంగా, సజావుగా సాగేలా చూడమని విపక్షాన్ని అభ్యర్థించడం మామూలే. కానీ సమావేశాల ముందో, అవి సాగుతుండగానో వెల్లడయ్యే స్కాములు... వాటిపై అవసరమైన విచారణకు ప్రభుత్వం సిద్ధంకాకపోవడం పర్యవసానంగా పార్లమెంటు వాయిదాల్లో గడిచిపోవడం ఈ అయిదేళ్ల కాలంలో చాలా సార్లు జరిగింది. అన్ని పక్షాలతోనూ చర్చించి తీసుకున్న నిర్ణయంగా యూపీఏ సర్కారు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ విభజన నిర్ణయం కొత్త సమస్యలను మోసుకొచ్చింది. ఆ సమస్యల ప్రభావం పార్లమెంటు కార్యకలాపాలపై పడింది. ఇన్ని సమస్యలు వెన్నాడుతుండగా, లోక్‌సభకు ఎన్నికలు ముంచు కొస్తుండగా కొసమెరుపు మెరిపించాలని, జనం జేజేలను అందుకోవాలని యూపీఏ సర్కారు భావిస్తున్నది. అయితే, ఇందుకు చేసే ప్రయత్నాల్లో చిత్తశుద్ధి కొరవడింది. బిల్లుల ఆమోదానికి సహకరించనిపక్షంలో ప్రత్యర్థి పక్షాల నైజాన్ని బట్టబయలు చేయవచ్చునని... అవి సహకరిస్తే ఎలాగూ ఆ బిల్లులను తీసుకొచ్చిన ఘనత తనకే దక్కుతుందని భావిస్తోంది. ఒకవేళ లోక్‌సభ సజావుగా నడపలేకున్నా... అక్కడ ప్రవేశ పెట్టే బిల్లులు ముందుకు కదలక మురిగిపోయే స్థితి ఉంటే... అలాంటి బిల్లుల్ని ఎటూ రాజ్యసభలో పెట్టి వాటి ఉనికిని కాపాడవచ్చునని అను కుంటోంది. బిల్లుల ప్రాముఖ్యాన్ని, వాటి ద్వారా తీరగల ప్రజా ప్రయోజ నాలనూ దృష్టిలో పెట్టుకోవడం కాక... అవతలి పక్షాన్ని ఎలా ఇరకాటంలో పెట్టాలన్న వ్యూహం పన్నడం రాజకీయం అవుతుందే తప్ప చిత్తశుద్ధి అనిపించుకోదు. అవినీతి నిరోధానికి బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడగలదని చెబుతున్న లోక్‌పాల్, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన మహిళా కోటా బిల్లు, తెలంగాణ ఏర్పాటు అంశాల్లో విపక్షాలు సహకరించకపోతే ఆ సంగతిని జనంలో జోరుగా ప్రచారం చేసుకోవచ్చునని పాలకపక్షం తలపోస్తున్నది. క్రితం సమా వేశాల్లో అధికారపక్షం ఎంపీలే సభకు అవరోధంగా నిలిచారు గనుక ముం దు సొంతింటిని చక్కదిద్దుకోమని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ చెబుతోంది. ఈ వ్యూహ ప్రతివ్యూహాల సంగతలా ఉంచి యూపీఏ సర్కారు వైఫల్యం ఈ అయిదేళ్లలోనూ అడుగడుగునా కనబడింది. మొదటి లోక్‌సభతో మొదలెట్టి ఇంతవరకూ కొనసాగిన 15 సభల తీరుతెన్నులు గమనిస్తే ఇప్పటి సభ మాత్రమే 72 పెండింగ్ బిల్లులతో అన్నిటినీ తలదన్నింది. ఈ బిల్లుల్లో సర్కారు చెబుతున్నట్టు నిజంగా విపక్షాలన్నీ సహకరించి 39 బిల్లులు ఆమోదం పొందుతాయనుకున్నా 33 బిల్లులు మురిగిపోతాయి. ఇలా మురిగిపోవడానికి అవకాశం ఉన్న బిల్లుల్లో విద్యా ట్రిబ్యునళ్ల బిల్లు, న్యాయ ప్రమాణాల బిల్లు, అణు భద్రత బిల్లు, ఇండో- బంగ్లా సరిహద్దు ఒడంబడిక వంటివి ఉన్నాయి. అయితే, 39 బిల్లులను సాకల్యంగా చర్చించడానికీ, అవసరమైన సవరణలను చేయడానికి కావలసిన వ్యవధి ఏమాత్రం లేదు. ఈ సమావేశాలు కేవలం పక్షంరోజులు మాత్రమే జరగబోతున్నాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పెంపు విషయంలో తీసుకొచ్చిన బిల్లును నయానా భయానా అందరినీ దారికి తెచ్చుకుని ఆమోదింపజేసుకున్న ఘనత యూపీఏ సర్కారుకున్న మాట నిజమే. తెలుగుదేశం అధినేత బాబుతో మాట్లాడి ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలను గైర్హాజరు చేయించి ప్రభుత్వం గట్టెక్కిన సంగతి ఎవరూ మరిచిపోలేరు. అయితే, చివరాఖరి సమావేశాల్లో అలాంటి ఎత్తులు పారుతాయనుకోవడం కుదరదు. జనమంతా తమనే గమనిస్తారు గనుక అన్ని పార్టీలూ ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తాయి. ఎంతో ముఖ్య మైన బిల్లులు పెండింగ్‌లో ఉండిపోయాయని, దానివల్ల వివిధ వర్గాలకు అందవలసిన ప్రయోజనాలు దూరమవుతున్నాయని కేంద్రం నిజంగా భావించివుంటే గత సమావేశాలనైనా సరిగా జరిగేలా చూసేది. కానీ, ఆ సమావేశాలను రెండురోజులముందే ముగించి అందరినీ ఆశ్చర్య పరిచింది. ఇన్ని బిల్లులు పెండింగ్‌లో ఉండగా వాటినలా ముగించడం విడ్డూరమే. అప్పటికి గండం గడిచి గట్టెక్కితే చాలనుకునే సంకుచిత దృక్పథమే ఇందుకు కారణం. వాస్తవానికి ఒక పార్లమెంటు పనితీరు కొలవడానికి అది ఆమోదించిన బిల్లుల సంఖ్య గీటురాయి కాదు. ఎన్ని బిల్లులపై అది అర్ధవంతమైన చర్చలను సాగించగలిగిందన్నదే ప్రధాన మైనది. సంఖ్యరీత్యా చూస్తే ప్రస్తుత లోక్‌సభ ఈ అయిదేళ్ల వ్యవధిలోనూ ఇంతవరకూ 165 బిల్లును ఆమోదించింది. ఇందులో మూజువాణి ఓటుతో ఆమోదం పొందిన బిల్లులెన్నో చూస్తే మన చట్టసభల బండారం బయటపడుతుంది. అధిక ధరలు, అవినీతి, ఉపాధి లేమి, సాగు సంక్షో భం వంటి కీలకమైన సమస్యలపై చర్చలు, వాటి పరిష్కార మార్గాలు అన్వేషించడంలో లోక్‌సభ ఏనాడూ శ్రద్ధపెట్టలేకపోయింది. ఇప్పుడు చివరి నిమిషంలో స్వీయప్రయోజనాలను ఆశించి, ఓట్లపై కన్నేసి పలు బిల్లులను ఆమోదింపజేసుకోవాలని పాలకపక్షం తహతహ లాడుతున్నది. ఈ నేపథ్యంలో సమావేశాలు ఎలా సాగుతాయో వేచిచూడాల్సిందే. -
తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటాం: కమల్‌నాథ్
అవసరమైతే సమావేశాలు పొడిగిస్తాం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్ సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అవసరమైతే పార్లమెంట్ సమావేశాలను పొడిగిస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ అన్నారు. విదేశాల్లో ఉన్న ఆయన శుక్రవారం ఎన్డీటీవీతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అభిప్రాయాలను చెప్పడానికి రాష్ట్రపతి ఆ రాష్ట్ర అసెంబ్లీకి మరో వారం గడువిచ్చారు కదా... ఈ నేపథ్యంలో పార్లమెంటుకు బిల్లును తేవడానికి మీకు సమయం సరిపోతుందా? అని ప్రశ్నించగా కమల్‌నాథ్ పై విధంగా స్పందించారు. తెలంగాణ బిల్లు తమ అత్యంత ప్రాధాన్యాంశాల్లో ఒకటని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బిల్లు రాష్ట్రపతికి తిరిగిరాగానే ఆయన దాన్ని హోం శాఖకు పంపుతారు. అక్కడి నుంచి తెలంగాణ బిల్లు కేబినెట్ ముందుకు వస్తుంది. అనంతరం దాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతాం. ఒకవేళ సమయం సరిపోకపోతే... పార్లమెంటు సమావేశాలను పొడిగిస్తామని చెప్పారు. బీజేపీ కూడా తెలంగాణకు మద్దతు ఇస్తామని చెప్పిందని... అందువల్ల ఇబ్బందులు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5 నుంచి 21 వరకు జరగనున్న విషయం తెలిసిందే. ఎలాంటి అభిప్రాయం వచ్చినా సమస్య ఉండదు: దిగ్విజయ్ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీ చర్చలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమైనా సమస్య ఉండదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. పెంచిన గడువును వినియోగించుకొని శాసనసభ నిర్ణీత గడువులోగా బిల్లును తిరిగి పంపాలని సూచించారు. ఆయన శుక్రవారమిక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. బిల్లుపై వీలైనంత త్వరగా చర్చ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సూచించినట్లు వెల్లడించారు. -
ఆంటోని కమిటీని కలుస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ :వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు పాసవుతుందని రాష్ట్ర భారీ, మధ్యతరహా నీటి పారుదల శాఖ మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్ర మంత్రివర్గం తెలంగాణపై నోట్ రూపొందించి రాష్ట్రపతికి పంపే విధంగా అధిష్టానవర్గం నియమించిన ఆంటోని క మిటీని కోరుతామన్నారు. ఇందుకోసం తెలంగాణ మంత్రులమంతా ఢిల్లీకి వెళ్తు తున్నట్టు ఆయన తెలిపారు. శుక్రవారం నిజామాబాద్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఆంటోని కమిటీని కలుస్తారన్నారు. రెండ్రోజుల్లో హైదరాబాద్‌లో తెలంగాణ ప్రజాప్రతినిధులు సమావేశమవుతున్నట్టు తెలి పారు. 1956లో ఆంధ్రప్రదేశ్‌లో తెలంగా ణ రాష్ట్రం కలిసినప్పుడే ప్రత్యేక పరిస్థితుల్లో మళ్లీ విడిపోవచ్చునని అప్పుడే నిర్ణయించారన్నారు. అందువల్లనే హైదరాబాద్‌తో కూడిన 10 జిల్లాల తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. తెలంగాణ కొత్తగా ఏర్పడుతున్న రాష్ట్రమేమీ కాదని, పాత రాష్ట్రాన్ని పునరుద్ధరించుకుంటున్నామన్నారు. 40 ఏళ్ల ప్ర జల ఆకాంక్ష, ప్రజాప్రతినిధుల కోరికను సోని యా గాంధీ నాయకత్వంలో నెరవేరుతోంద న్నారు. కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ కలసి పని చేసినప్పడే తెలంగాణ ప్రక్రియ ప్రారంభమైందన్నా రు. టీడీపీతో టీఆర్ఎస్ కలసి నప్పడు కూడా కాంగ్రెస్ నాయకత్వం ప్రజల ఆకాంక్షకే పెద్దపీట వేసిందన్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకున్న అధిష్టానవర్గం సీడబ్ల్యుసీ, యూపీఏలో తెలంగాణపై తీర్మానం చేసిందని, మళ్లీ వెనక్కు తీసుకునే సవాల్ లేదని మంత్రి అన్నారు. సీమాంధ్రులు ప్రజలు సాగునీరు, విద్యుత్ సమస్యలపై అపోహలు చెందాల్సిన అవసరం లేదన్నారు. 50ఏళ్లుగా నాగార్జునసాగర్, శ్రీశైలం గోదావరి జలాల వినియోగం లో కొనసాగుతున్న భాగస్వామ్యమే యథాతథంగా కొనసాగుతుందన్నారు. విద్యుత్ విని యోగంలో కూడా ఇలాంటి విధానమే ఉం టుందన్నారు. హైదరాబాద్‌తో పాటు తెలంగా ణ రాష్ట్రంలో సీమాంధ్రులకు భద్రత కల్పించే బాధ్యత తమదేనన్నారు. ఇప్పటిలాగానే సీ మాంధ్రులు తెలంగాణ రాష్ట్రంలో వ్యాపారాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవచ్చునని అన్నా రు. నిజామాబాద్ జిల్లాతో పాటు పలు ప్రాం తాల్లో కూడా సీమాంధ్ర ప్రజలు వ్యాపారాలు చేసుకోవడంతో పాటు ప్రజాప్రతినిధులుగా కొనసాగుతున్న విషయాన్ని ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. తెలంగాణ ప్రజలు 50 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు కూడా సీమాంధ్రుల ను ఎలాంటి వేధింపులకు గురిచేయకపోగా బా గా గౌరవించి అక్కున చేర్చుకున్నారని ఇక్కడి ప్రజల త్యాగనిరతిని కొనియాడారు. విడిపోయి కలిసుందాం ఒక కుటుంబంలోని అన్నదమ్ముల్లాగా విడిపో యి తెలంగాణ, సీమాంధ్ర ప్రజలుగా కలిసి ఉందామని మంత్రి పి.సుదర్శన్‌రెడ్డి అన్నారు. స్నేహపూర్వక పోటీతత్వం వల్లనే రెండు రాష్ట్రా లు అభివృద్ధి దశలో పయనిస్తాయన్నారు. తె లంగాణ రాష్ట్రంలో విద్యుత్, వ్యవసాయ రంగాలకు ప్రధాన్యత ఇవ్వగలమన్నారు. రాష్ట్రంలో 32లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా తెలంగాణ లో 24 లక్షలకుపైగా ఉన్నాయని అందువల్లనే విద్యుత్ ఉత్పత్తిపై తగిన శ్రద్ధ పెట్టగలమన్నా రు. హైదరాబాద్ లేకుండా తెలంగాణ రాష్ట్రా న్ని ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకొనే సమస్యలేదన్నారు. సోనియా దయతో తెలంగాణ -ఈరవత్రి అనిల్, ప్రభుత్వ విప్ సోనియా దయతో తెలంగాణ సాకారం అవుతోందని ప్రభుత్వ విప్ ఈరవత్రి అనిల్ అన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన మం డవ వెంకటేశ్వరరావును తెలంగాణ ప్రజలు నాలుగు సార్లుగా ఎమ్మెల్యేగా గెలిపించారంటే ఆ ప్రాంత వాసులను మనం ఏవిధంగా గౌరవించామన్న విషయం స్పష్టమవుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత కూడా ఇదే పద్ధతిలో సీమాంధ్రులకు భద్రత ఉం టుందన్నారు. పది రోజుల్లో కాంగ్రెస్ కమిటీలు -తాహెర్ బిన్ హందాన్, డీసీసీ అధ్యక్షులు రానున్న పదిరోజుల్లో కాంగ్రెస్ పార్టీ జిల్లా, బ్లాక్, మండల కమిటీలను పునరుద్ధరించడం ద్వారా సంస్థాగతంగా బలోపేతం అయ్యేం దుకు కృషి చేస్తానని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ తెలిపారు. ఈ మేరకు పీసీసీ నుంచి అనుమతి ఉందన్నారు. పూర్తి స్థాయిలో అన్ని కమిటీలను పునరుద్ధరించడం ద్వారా రానున్న ఎన్నికల్లో పార్టీని విజయపథం వైపు నడిపించగల మని ఆయన తెలిపారు. సమావేశంలో డీసీసీబీ అధ్యక్షుడు పట్వారి గంగాధర్, జిల్లా గ్రంథాల య చైర్మన్ శ్రీనివాస్‌యాదవ్, కాంగ్రెస్ నాయకులు గడుగు గంగాధర్, తిరుపతిరెడ్డిలు పాల్గొన్నారు.