జీఎస్టీ స్ఫూర్తి కొనసాగాలి
అర్థవంతమైన చర్చలో అందరూ భాగస్వాములవ్వాలి
► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ప్రధానమంత్రి మోదీ
► నివాళులనంతరం లోక్‌సభ, రాజ్యసభలు నేటికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ బిల్లు ఆమోద సమయంలో రాజకీయ పార్టీలు చూపిన ఐక్యతా స్ఫూర్తి ఈ పార్లమెంట్ సమావేశాల్లోనూ కొనసాగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. జీఎస్టీని ‘గ్రోయింగ్ స్ట్రాంగర్ టుగెదర్’ (కలసికట్టుగా బలోపేతం అవుదాం)గా అభివర్ణిస్తూ.. ఆ స్ఫూర్తి ఈ సమావేశాలకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుందన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. ‘వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. వేసవికాలం అనంతరం కురిసే వాన ఎలాగైతే ఆహ్లాదకరమైన మట్టివాసనను తీసికొస్తుందో.. అదే విధంగా జీఎస్టీ అమలు అనంతరం జరుగుతున్న ఈ వర్షాకాల సమావేశాలు నూతన ఉత్తేజాన్ని తీసుకొస్తాయి’ అని చెప్పారు.
ఉన్నత ప్రమాణాలతో కూడిన అర్థవంతమైన చర్చల్లో అన్ని పార్టీలు, ఎంపీలు పాల్గొనే అవకాశాన్ని ఈ సమావేశాలు కల్పిస్తాయని నమ్ముతున్నానని మోదీ పేర్కొన్నారు. ‘అన్ని రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కలసికట్టుగా సాగుతూ దేశం కోసం శ్రమిస్తే మంచి ఫలితాలు సాధించగలమని జీఎస్టీ నిరూపించింది. దేశానికి ఆహార భద్రత కల్పిస్తున్న రైతుల్ని గుర్తు చేసుకుంటూ ఈ సమావేశాల్ని మొదలుపెట్టాలి. ఈ సమావేశాల్లో ఆగస్టు 15 చాలా ముఖ్యమైన రోజు. మనం స్వాతంత్య్రం సాధించి ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకుంటున్నాం. ఆగస్టు 9తో క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తవుతాయి’ అని ప్రధాని గుర్తుచేశారు.
కొత్త సభ్యులతో ప్రమాణ స్వీకారం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. లోక్‌సభ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన సభ్యులతో స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సిట్టింగ్ ఎంపీ వినోద్ ఖన్నా, కేంద్ర మంత్రి అనిల్ దవే, లోక్‌సభ మాజీ సభ్యుల మృతికి సభ నివాళులర్పించింది. అమర్‌నాథ్ ఉగ్రదాడి మృతులకు నివాళిగా సభ్యులు కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం స్పీకర్ సుమిత్రా మహాజన్ సభను మంగళవారానికి వాయిదా వేశారు. సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత కుమార్‌లు ప్రతిపక్ష నేతల వద్దకు వెళ్లి కొద్దిసేపు ముచ్చటించారు. సోనియా గాంధీ, ములాయం సింగ్ యాదవ్, ఫరూక్ అబ్దుల్లాతో వారు కరచాలనం చేశారు.
సినారె, పాల్వాయి, దాసరిలకు నివాళి
ఇటీవల మరణించిన రాజ్యసభ సిట్టింగ్ సభ్యుడు పాల్వాయి గోవర్దన్ రెడ్డి, మాజీ సభ్యులు దాసరి నారాయణరావు, సి.నారా యణ రెడ్డిలకు రాజ్యసభ సంతాపం తెలి పింది. సమాజానికి వారు చేసిన సేవల్ని చైర్మ న్ అన్సారీ కొనియాడారు. దాసరి మరణంతో దేశ చిత్రపరిశ్రమకు చెందిన సుపరిచిత వ్యక్తిని, అంకితభావం కలిగిన సామాజిక కార్యకర్తను కోల్పోయామని, పాల్వాయి మరణంతో ఒక మంచి పార్లమెంటేరియన్‌ను కోల్పోయామన్నారు. సినారె మృతితో గొప్ప కవిని పొగొట్టుకున్నామని పేర్కొన్నారు.