తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకుంటాం: కమల్‌నాథ్
అవసరమైతే సమావేశాలు పొడిగిస్తాం
పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కమల్‌నాథ్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు అవసరమైతే పార్లమెంట్ సమావేశాలను పొడిగిస్తామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్ అన్నారు. విదేశాల్లో ఉన్న ఆయన శుక్రవారం ఎన్డీటీవీతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అభిప్రాయాలను చెప్పడానికి రాష్ట్రపతి ఆ రాష్ట్ర అసెంబ్లీకి మరో వారం గడువిచ్చారు కదా... ఈ నేపథ్యంలో పార్లమెంటుకు బిల్లును తేవడానికి మీకు సమయం సరిపోతుందా? అని ప్రశ్నించగా కమల్‌నాథ్ పై విధంగా స్పందించారు. తెలంగాణ బిల్లు తమ అత్యంత ప్రాధాన్యాంశాల్లో ఒకటని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి బిల్లు రాష్ట్రపతికి తిరిగిరాగానే ఆయన దాన్ని హోం శాఖకు పంపుతారు. అక్కడి నుంచి తెలంగాణ బిల్లు కేబినెట్ ముందుకు వస్తుంది. అనంతరం దాన్ని పార్లమెంటులో ప్రవేశపెడతాం. ఒకవేళ సమయం సరిపోకపోతే... పార్లమెంటు సమావేశాలను పొడిగిస్తామని చెప్పారు. బీజేపీ కూడా తెలంగాణకు మద్దతు ఇస్తామని చెప్పిందని... అందువల్ల ఇబ్బందులు ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 5 నుంచి 21 వరకు జరగనున్న విషయం తెలిసిందే.
ఎలాంటి అభిప్రాయం వచ్చినా సమస్య ఉండదు: దిగ్విజయ్
ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై అసెంబ్లీ చర్చలో ఎలాంటి అభిప్రాయం వ్యక్తమైనా సమస్య ఉండదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. పెంచిన గడువును వినియోగించుకొని శాసనసభ నిర్ణీత గడువులోగా బిల్లును తిరిగి పంపాలని సూచించారు. ఆయన శుక్రవారమిక్కడ తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ.. బిల్లుపై వీలైనంత త్వరగా చర్చ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి సూచించినట్లు వెల్లడించారు.