‘విజయ’ మాదంటే.. మాదే!
►విజయ పాలు , తెలంగాణ ఆంధ్రప్రదేశ్ , కమలనాథన్ కమిటీ
►రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విజయ బ్రాండ్ కోసం వివాదం
►తెలంగాణ విజయ అమ్మకాలపై రాష్ట్రానికి ఏపీ నోటీసులు
►వివాదాలతో పడిపోయిన తెలంగాణ విజయ పాల అమ్మకాలు
►అనాలోచిత నిర్ణయంతో కాలం తీరుతున్న 3 లక్షల టెట్రాప్యాక్‌లు
సాక్షి, హైదరాబాద్: ‘విజయ’బ్రాండ్‌పై రెండు తెలుగు రాష్ట్రాలు పేచీపడు తున్నాయి. అది తమదంటే తమదంటూ గొడవ పడుతున్నాయి. విభజన నేపథ్యంలో విజయ బ్రాండ్ ఎవరికి చెందాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నాయి. బ్రాండ్ అనేది వ్యాపారానికి సంబంధించిన అంశం కాబట్టి రెండు రాష్ట్రాలూ తమ రాష్ట్రం పేరును ముందు తగిలించి విజయ బ్రాండ్‌తో పాలు అమ్ముకోవాలని కమలనాథన్ కమిటీ సూచించింది. కానీ అది అమలు కావడంలేదు. ప్రస్తుతం ‘తెలంగాణ విజయ’, ‘ఆంధ్రప్రదేశ్ విజయ’పాల పేరుతో మార్కెట్లో రెండు రకాల పాల విక్రయాలు జరుగుతున్నా ఏపీ మాత్రం తెలంగాణకు నోటీసులు జారీ చేసింది. తన బ్రాండ్‌తో ఎలా అమ్ముకుంటున్నారంటూ తెలంగాణను నిలదీసింది. దీంతో సమస్య కొలిక్కి రావడంలేదు. ఇదిలావుంటే తెలంగాణలోనూ ‘ఆంధ్రప్రదేశ్ విజయ’పాల అమ్మకాలు జరుగుతున్నాయి. ఇలా అనేకానేక వివాదాల కారణంగా రాష్ట్రంలో విజయ పాల అమ్మకాలు ఢమాల్ అయ్యాయి. దాదాపు 40 వేల లీటర్ల పాల విక్రయాలు పడిపోయాయి.
కాలం చెల్లుతున్న టెట్రాప్యాక్ పాలు..
తెలంగాణ విజయ డెయిరీలో అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఉన్నతాధికారులకు, కిందిస్థాయి అధికారులకు మధ్య దూరం పెరిగింది. దీంతో కిందిస్థాయి అధికారుల ఆలోచనలను పట్టించుకోకుండా ఉన్నతస్థాయిలో నిర్ణయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు ఎలాంటి ఇండెంట్ లేకుండా రెండు నెలల క్రితం దాదాపు 15 లక్షల లీటర్ల విజయ టెట్రాప్యాక్ పాలను ప్యాకింగ్ చేశారు. వాటి నిల్వ కాలం 90 రోజులు. కానీ మార్కెట్‌లో డిమాండ్ లేకపోవడంతో అవి అమ్మకానికి నోచుకోలేదు. ఎలా విక్రయించాలో అర్థంగాక చివరకు ఒక కాంట్రాక్టర్‌ను పిలిపించి కొన్ని అమ్మి పెట్టమని కోరినట్లు సమాచారం. అయినా 2 లక్షల లీటర్ల పాలు వృథా అయ్యే ప్రమాదముందని అంటున్నారు. వాటి గడువు 20 రోజుల లోపే ఉందని, దీంతో రూ.40 లక్షల విలువైన పాలు గంగలో పోసినట్లేనంటున్నారు.