216 మంది ఏపీ ఉద్యోగులు తెలంగాణకు
♦ రాష్ట్రస్థాయి కేడర్ పోస్టుల పంపిణీ పూర్తి
♦ ఏపీలో పోస్టుల్లేక 216 మంది తెలంగాణకు కేటాయింపు
♦ సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేస్తే వారు ఏపీకి
♦ ఇప్పటి వరకూ 17,473 మంది ఉద్యోగుల పంపిణీ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టులు లేకపోవడంతో ఏపీ స్థానికత కలిగిన 216 మంది ఉద్యోగులు తెలంగాణకు వెళ్లాల్సి వస్తోంది. వీరంటా ఆంధ్రప్రదేశ్‌కు ఆప్షన్ ఇచ్చినప్పటికీ పోస్టు లు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. ఇరు రాష్ట్రాల మధ్య రాష్ట్ర స్థాయి కేడర్ పోస్టుల పంపిణీ శుక్రవారం పూర్తయింది. జనాభా నిష్పత్తి ఆధారంగా మొత్తం 43 వేల పోస్టులను ఇరు రాష్ట్రాలకు కమలనాథన్ కమిటీ పంపిణీ పూర్తి చేసింది. ఇది పూర్తి అయిన తరువాత ఏపీలో సూపర్ న్యూమరరీ పోస్టులు 216 ఏర్పాటు చేయాల్సి ఉందని తేలింది. అయితే ఆ 216 మంది ఉద్యోగుల్లో కొంత మంది 58 ఏళ్లకు దగ్గర్లో ఉన్నారు.
వారు తెలంగాణకు వెళితే త్వరలోనే పదవీ విరమణ పొందాల్సి ఉంటుంది. అదే ఆంధ్రప్రదేశ్‌లో ఉంటే 60 ఏళ్ల వరకూ వారు కొనసాగవచ్చు. అంటే ఏపీకి వెళితే మరో రెండేళ్లకు పైగా ఉద్యోగం చేయవచ్చు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సూపర్ న్యూమరరీ పోస్టులను ఏర్పాటు చేస్తే తెలంగాణకు వెళ్లిన ఉద్యోగులు ఏపీకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన ఫైలు ప్రస్తుతం పరిశీలనలో ఉంది. న్యాయ శాఖ అభిప్రాయం తీసుకున్న తరువాత సీఎస్ ద్వారా ముఖ్యమంత్రి వరకు ఫైలు వెళ్లాల్సి ఉంది. సూపర్ న్యూమరరీ పోస్టుల ఏర్పాటునకు సీఎస్ టక్కర్ సుముఖంగా ఉన్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
ఏపీకి 8,673 మంది..
ఇప్పటి వరకు కమలనాథన్ కమిటీ ఇరు రాష్ట్రాలకు 17,473 మంది రాష్ట్ర స్థాయి కేడర్ ఉద్యోగుల తుది పంపిణీని పూర్తి చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 8,673 మంది ఉద్యోగులను, తెలంగాణకు 8,800 మంది ఉద్యోగులను పంపిణీ చేసింది. తెలంగాణ స్థానికత గల 1,071 మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అలాగే ఆంధ్రప్రదేశ్ స్థానికత గల 488 మంది ఉద్యోగులను తెలంగాణకు పంపిణీ చేశారు. రెండు రాష్ట్రాలకు చెందని నాన్‌లోకల్ 162 మందిని ఆంధ్రప్రదేశ్‌కు, 131 మందిని తెలంగాణకు కేటాయించారు.
ఆంధ్రప్రదేశ్ స్థానికతకు చెందిన ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కే 85.78 శాతం మందిని, తెలంగాణ స్థానికతకు చెందిన 12.35 శాతం ఆంధ్రప్రదేశ్‌కు, నాన్‌లోకల్‌కు చెందిన 1.87 శాతం మంది ఉద్యోగులను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించారు. అలాగే తెలంగాణ స్థానికత కలిగిన 92.97 శాతం మందిని తెలంగాణకు, అలాగే ఆంధ్రప్రదేశ్ స్థానికత కలిగిన 5.55 శాతం, నాన్‌లోకల్‌కు చెందిన 1.31 శాతం మందిని తెలంగాణకు కేటాయించారు.