సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళుతున్నారా? కాస్త ఆగండి. ఇంతకుముందులా మీరు సచివాలయానికి వెళ్లడానికి వీల్లేదు. సందర్శకులను నియంత్రించేందుకు చంద్రబాబు సర్కారు గట్టి చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబుతో సోమవారం నాయీ బ్రాహ్మణుల వివాదం నేపథ్యంలో సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) హడావుడిగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై పేషీలనుంచి జారీ చేసే పాసులు, ఫోనుకాల్స్ ను అనుమతించకూడదని నిర్ణయించింది. ప్రతి పేషి నుంచి ఆన్‌లైన్‌లో సందర్శకుల వివరాలు నమోదు చేస్తే సందర్శకులకు జీఏడీ అనుమతి మంజూరు చేస్తుంది. ఈ అనుమతి పత్రంతో ఏ విభాగంలో పనివుంటే ఆ బ్లాక్‌కు మాత్రమే వెళ్లాల్సివుంటుంది.
ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు కనీస వేతనాల కోసం సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని నాయీ బ్రాహ్మణులు నిలదీశారు. ‘ఇంతమందిని ఇక్కడకు ఎవరు రానిచ్చారు. ఇదేమన్నా చేపల మార్కెటా? ఏం తమాషాలాడుతున్నారా?’ అంటూ చంద్రబాబు ఈ సందర్భంగా రౌడీయిజం ప్రదర్శించారు. సీఎం బెదిరింపు తరువాత సచివాలయం సందర్శకులపై నియంత్రణకు జీఏడీ చర్యలు చేపట్టడం గమనార్హం.
ప్రజల ఆగ్రహం..
సచివాలయంలో సందర్శకులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనంతో కట్టిన సచివాలయంలోకి ప్రజలను అనుమతించరా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమ హక్కులను కాలరాస్తే సహించబోమన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే తమపై ఆంక్షలు విధించడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment