gangster nayeemuddin
-
నయీమ్ ఆస్తుల్ని లెక్క తేల్చిన సిట్
సాక్షి, హైదరాబాద్ : ఎన్కౌంటర్లో హతమైన గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఆస్తుల వివరాలను ఎట్టకేలకు పోలీసులు లెక్కగట్టారు. నయీమ్ ఆస్తుల విలువ అక్షరాలా రూ.2వేల కోట్లుగా సిట్ లెక్కతేల్చింది. 1019 ఎకరాల వ్యవసాయ భూములు, 29 భవనాలు, రెండు కిలోల బంగారం, రెండు కోట్ల నగదు ఉన్నట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) వెల్లడించింది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, గోవా, ముంబైలలో ఉన్న ఇళ్లు, స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు అనుసరించాల్సిన మార్గంపై సిట్ అధికారులు న్యాయశాఖ నుంచి ఇప్పటికే సలహా కూడా తీసుకుంది. నయీమ్‌కు సంబంధించిన ఆస్తులన్నీ ప్రస్తుతం కోర్టు ఆధీనం ఉన్నాయి. మొత్తం 251 కేసులు నమోదు కాగా, వాటిలో 119 కేసుల్లో దర్యాప్తు పూర్తయింది. ఇంకా మరో 60 కేసులు కొలిక్కి రావాల్సి ఉంది. మరో రెండు నెలల్లో నయీమ్ కేసు దర్యాప్తును సిట్ ముగించనుంది. మొదటి దఫాలో రూ. 140 కోట్ల ఆస్తి... నయీమ్ తన భార్య, సోదరి, అత్త, అనుచరుల పేర్లపైనే ఆస్తులు కూడబెట్టగా అతని భార్యతోపాటు సోదరి, అతడి దగ్గరి బంధువుల పేర్లపై ఉన్న ఆస్తులను స్వాధీనం చేసుకునేలా సిట్ అధారాలు సేకరించింది. వాటి ప్రస్తుత మార్కెట్ విలువను పరిశీలిస్తే... హైదరాబాద్‌లోని అల్కపురి కాలనీలో రెండు ఇళ్ల విలువ రూ. 6 కోట్లు. మణికొండలోని పంచవటి కాలనీలో 8 ప్లాట్ల విలువ సుమారు రూ. 4–5 కోట్లుగా అంచనా. పుప్పాలగూడలో 300 గజాల చొప్పున 12 ఓపెన్ ప్లాట్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. షాద్‌నగర్‌లోని 12 ఎకరాల మామిడి తోట, ఫాంహౌస్‌ల విలువ సుమారు రూ. 25 కోట్లు. తుక్కుగూడలోని 10 ఎకరాల తోట, ఫాంహౌస్ విలువ సుమారు రూ. 35 కోట్లు. కరీంనగర్ శివారులోని నగునూర్‌లో రూ. 5 కోట్ల విలువైన వెంచర్. నల్లగొండలో నయీమ్ అనుచరుల పేరిట ఉన్న రెండు ఇళ్లు, 18 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు. మిర్యాలగూడలో నయీమ్ అత్త పేరిట ఉన్న ఇంటితోపాటు 4 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 65 లక్షలు. భువనగిరి, యాదగిరిగుట్టలోని 16 వెంచర్లలో 180పైగా ఓపెన్ ప్లాట్ల (ఒక్కొక్కటి 250 గజాల నుంచి 300 గజాలు) విలువ సుమారు రూ. 12 కోట్ల నుంచి రూ. 18 కోట్లు. గోవాలోని కోకనట్ హౌస్‌తోపాటు మరో ఇల్లు గుర్తింపు. ఒక్కో ఇంటిని రూ. 2.5 కోట్లకు కొనుగోలు చేసినట్లు నయీమ్ భార్య, సోదరి వాంగ్మూలంలో స్పష్టం చేశారు. వాటిని కూడా జప్తు జాబితాలో పెట్టారు. నాగోల్, సరూర్‌నగర్‌లో ఓ సెటిల్మెంట్లో నయీమ్ అనుచరులు శేషన్న, శ్రీధర్ల పేరిట ఉన్న రెండు ఫంక్షన్ హాళ్ల విలువ సుమారు రూ. 6 కోట్లు. నార్సింగిలో రూ. 2 కోట్ల విలువైన ఇల్లు, శంషాబాద్‌లోని పోలీస్‌హౌస్ విలువ రూ. 2 కోట్లు. కల్వకుర్తిలో 8 ఎకరాల భూమి విలువ రూ. 3.5 కోట్లు. మేడ్చల్‌లో 3 ఎకరాలు, శామీర్‌పేట్‌లో ప్రముఖ రిసార్ట్ సమీపంలో మరో 3 ఎకరాల భూమి గుర్తింపు. ఓ ప్రజా ప్రతినిధితో చేసిన సెటిల్మెంట్లో పొందిన ఈ భూమి విలువ సుమారు రూ. 20 కోట్లు. మొయినాబాద్‌లో ఒక్కోటి రూ. 45 లక్షల విలువైన రెండు విల్లాలు. ఇందుకు అవసరమైన డబ్బు మొయినాబాద్‌లోని అజీజ్‌నగర్ ల్యాండ్ సెటిల్మెంట్తో వచ్చాయని నయీమ్ అనుచరుల వాంగ్మూలంలో సిట్ గుర్తించింది. ఛత్తీస్‌గఢ్ రాయ్‌పూర్‌లో సుమారు రూ. 2 కోట్ల విలువైన రెండు ఇళ్లు. మొత్తం 1,019 ఎకరాలు... నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత సిట్ విచారణలో 210 మంది బాధితులు తమ భూములపై ఫిర్యాదు చేయగా వాటిలో ఆధారాలు గుర్తించింది మాత్రం కేవలం 46 కేసుల్లోనే. ప్రస్తుతం ఆ ఆస్తుల జప్తు కోసం సిట్ సమాయత్తమవుతోంది. నయీమ్ మొత్తం 1,019 ఎకరాల భూమి సంపాదించినట్లు గుర్తించినా ఈ కేసుల్లో ఆధారాలు దొరక్క అధికారులు తంటాలు పడుతున్నారు. 15 ఏళ్ల క్రితం జరిగిన ఈ సెటిల్మెంట్ల విషయంలో కొందరు బాధితులు ఫిర్యాదు చేసినా ఆ భూములు అనేక మంది చేతులు మారాయి. అయితే ప్రస్తుతం పొజిషన్లో ఉన్న వారి ఆదాయ వ్యవహారాలు, డాక్యుమెంట్లు, తదితరాలన్నీ పక్కాగా ఉండటంతో వాటిని స్వాధీనం చేసుకోవడం అంత సులభం కాదని తెలిసింది. అలాగే అనుచరుల పేరిట రిజిస్ట్రేషన్ అయిన కొన్ని భూముల్లోనూ స్వాధీనం అంత సులభం కాదని సమాచారం. ఆదాయ మార్గాలు చూపించడంతోపాటు ఆస్తులను సీజర్ ప్రాపర్టీ నుంచి తొలగించుకునేందుకు ఏకంగా హైకోర్టుకు వెళ్లారని తెలిసింది. దీంతో సిట్ ఆస్తులను గుర్తించినా స్వాధీనానికి తగ్గ ఆధారాలు సంపాదించలేకపోయినట్లు తెలుస్తోంది. -
నయీం గ్యాంగ్‌తో బెదిరించారు
మిర్యాలగూడ: ‘మేము 9వ తరగతినుంచి ప్రేమించుకున్నాం. మొదటినుంచీ మాకు నా తండ్రినుంచి బెదిరింపులు ఉన్నాయి. గతంలో నయీం గ్యాంగ్ ద్వారా బెదిరించాడు. నన్ను కూడా చంపి నాగార్జునసాగర్‌లో పడేస్తానని హెచ్చరించాడు. అయినా మేము భయపడలేదు. కానీ చివరికి అనుకున్నంత పనిచేశాడు. నా భర్తను అకారణంగా చంపేశాడు’అంటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో శుక్రవారం హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత రోదిస్తూ చెప్పింది. ప్రణయ్ హత్య అనంతరం మిర్యాలగూడలోని జ్యోతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన భార్య అమృతను శనివారం పలువురు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె విలపిస్తూ పలు సంచలన విషయాలు చెప్పింది. పలువురు రాజకీయనాయకులు సహా, అక్కడికి వచ్చిన వారు ఆమె పరిస్థితి చూసి కంటనీరు పెట్టుకున్నారు. ప్రణయ్‌ని హత్య చేసిన వారిని చంపేయాలంటూ అమృత విలపించింది. ప్రణయ్‌ని తన తండ్రి మారుతీరావే చంపినట్లు పేర్కొంది. తన భర్తను చంపించిన పుట్టింటికి వెళ్లేది లేదని, తనకు పుట్టే బిడ్డను ప్రణయ్ గుర్తుగా పెంచుకుంటానని వెల్లడించింది. ప్రణయ్‌తో తాను 9వ తరగతి నుంచి ప్రేమలో ఉన్నానని, తనను ఎంతో బాగా చూసుకునే వాడని, తనను కూడా ప్రణయ్ వద్దకు పంపించేయాలని రోదించింది. మాట్లాడుకోవద్దని కొట్టారు.. తామిద్దరూ ప్రేమించుకున్న విషయం గతంలోనే ఇంట్లో వారికి తెలియడంతో తన తండ్రి మారుతీరావు ప్రణయ్‌ని నయీం గ్యాంగ్‌తో బెదిరించినట్లు అమృత తెలిపింది. దాంతో అప్పట్లో ప్రణయ్ కొద్ది రోజుల పాటు కళాశాలకు కూడా రాలేదని చెప్పింది. ఆ తర్వాత ప్రణయ్‌తో మాట్లాడవద్దని ఇంట్లో తండ్రి మారుతీరావు, బాబాయి శ్రవణ్‌కుమార్‌లు ఎన్నోసార్లు తనను కొట్టారని, కాలితో తన్నారని తెలిపింది. ఆ క్రమంలోనే ప్రణయ్‌తో మాట్లాడినట్లు తెలిస్తే తనను కూడా చంపి సాగర్‌లో పడేస్తామని బెదిరించినట్లు వెల్లడించింది. తాను ప్రేమ వివాహం చేసుకోవడం తండ్రికి, బాబాయికి ఇష్టం లేదంది. తన తండ్రి మారుతీరావు కొంతకాలంగా ఫోన్లో మాట్లాడుతున్నాడని, గర్భవతి అయిన విషయాన్ని చెప్పగా అబార్షన్ చేయించుకోవాలని కోరినట్లు తెలిపింది. ప్రణయ్ హత్య జరగడానికి ఐదు నిమిషాల ముందు ఆస్పత్రి నుంచి బయటకు వస్తున్న సమయంలో తండ్రి మారుతీరావు ఫోన్ చేశాడని, కానీ ఫోన్ ఎత్తలేదని చెప్పింది. కాగా, రిసెప్షన్ సమయంలో ప్రణయ్, అమృతలు తీయించుకున్న వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేశారు. దానిని చూసిన అమృత తండ్రి మారుతీరావు మరింత కక్ష పెంచుకున్నట్లు తెలిసింది. కూతురులా చూసుకున్నాం ప్రణయ్ తండ్రి బాలస్వామి గతంలో నయీం గ్యాంగ్‌తో బెదిరించారని ప్రణయ్ తండ్రి పెరుమాళ్ల బాలస్వామి చెప్పారు. శనివారం తనను పరామర్శించడానికి వచ్చిన పలువురు రాజకీయ నేతలకు ఆయన గత విషయాలను చెబు తూ విలపించారు. అమృతను కూతురులా చూసుకుంటున్నా తన కొడుకును మారుతీరావు పొట్టనబెట్టుకున్నాడని కన్నీటిపర్యంతమయ్యారు. తండ్రి కోరిక మేరకు ఇంటికి వెళ్లాలని అమృతకు చెబితే, ఆత్మహత్య చేసుకుంటానేగానీ అక్కడికి వెళ్లేదిలేదని, ప్రణయ్‌తోనే ఉంటానని చెప్పిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా అమృత తన తండ్రి ఇంటికి వెళ్లాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. -
ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీ కోసం నయీం చిత్రీకరణ
సాక్షి, సిటీబ్యూరో: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్ఈటీ) ఆదేశాల మేరకు సిటీకి వచ్చాడు... మారుపేరుతో పాస్‌పోర్ట్ పొందడానికి ప్రయత్నించాడు...ఓ వీడియో కెమెరాతో నగరం మొత్తం తిరుగుతూ కీలక ప్రాంతాలను చిత్రీకరించాడు...ఆ సమయంలో ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను కలిగి ఉన్నాడు...ఉగ్రవాది షేక్ అబ్దుల్ నయీం అలియాస్ సమీర్ అలియాస్ నయ్యూపై నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందంలో (సిట్) నమోదైన కేసు పూర్వాపరాలివి. ఇతడిని పీటీ వారెంట్‌పై గురువారం రాత్రి ఢిల్లీలోని తీహార్ జైలు నుంచి తీసుకువచ్చిన సిట్ పోలీసులు శుక్రవారం జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. షేక్ సోహైల్ పేరుతో పాస్‌పోర్ట్‌కు... మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన నయీం ఇంజినీర్ అయినప్పటికీ ఎల్ఈటీకి సానుభూతిపరుడిగా మారాడు. పాకిస్థాన్‌లో ఉన్న ఆ సంస్థకు చెందిన వారి నుంచివచ్చే ఆదేశాలకు అనుగుణంగా నడుచుకున్నాడు. అందులో భాగంగానే ఇతడు 2007 ఫిబ్రవరిలో హైదరాబాద్‌కు వచ్చాడు. అప్పటికి సిటీలోనే ఉన్న ఇతడి సన్నిహితుడు షోయబ్ జాగీర్దార్ ఇతడిని రిసీవ్ చేసుకున్నాడు. హష్మత్పేటలోని తన బంధువు ఇంట్లో ఆశ్రయం కల్పించాడు. స్టార్ లైన్ ట్రావెల్ ఏజెన్సీకి చెందిన ట్రావెల్ ఏజెంట్ నగేష్ సహకారంతో సికింద్రాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయం నుంచి దొంగ పాస్‌పోర్ట్ పొందడానికి ప్రయత్నించాడు. షేక్ సోహైల్ పేరుతో రూపొందించిన పత్రాలపై సికింద్రాబాద్ వచ్చిన సమీర్ సంతకాలు చేశాడు. అక్కడ నుంచి తిరిగి హష్మత్పేటలోని ఇంటికి వెళ్ళకుండా నగరంలోని కీలక ప్రాంతాలను చుట్టి వచ్చాడు. ఆ సమయంలో తనతో పాటు ఓ వీడియో కెమెరా తీసుకువెళ్లిన నయీం అనేక కీలక ప్రాంతాలను చిత్రీకరించాడు. ఓ అనుమానాస్పద బ్యాగ్‌ను తన వెంటే ఉంచుకున్నాడు. ఎల్ఈటీకి అందించడానికే సిటీలోని కీలక ప్రాంతాలు వీడియో తీశాడని, ‘ఆ బ్యాగ్’లో పేలుడు పదార్థాలు ఉన్నాయని పోలీసులు ఆరోపించారు. కొన్నాళ్ల తర్వాత వెలుగులోకి... ‘సిటీ టూర్’ ముగించుకున్న నయీం మళ్ళీ తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. కొన్ని రోజులకు మళ్లీ ఎల్ఈటీ నుంచి ఇతడికి మరో సమాచారం అందింది. దాని ప్రకారం ఇతగాడు బంగ్లాదేశ్ వెళ్లి కొందరిని కలవాలి. అక్కడ నుంచి ముగ్గురు సుశిక్షుతులైన ఉగ్రవాదుల్ని సరిహద్దులు దాటించి జమ్మూ కాశ్మీర్‌కు చేర్చాలి. కొన్ని నెలల పాటు పాక్‌లో శిక్షణ పొందిన ఈ ఉగ్రవాదుల్లో అక్కడి కరాచీ, హరిపూర్లకు చెందిన మహ్మద్ యూనస్, అబ్దుల్లాలతో పాటు కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌కు చెందిన ముజఫర్ అహ్మద్ రాథోడ్ ఉన్నారు. కాశ్మీర్లో భారీ ఆపరేషన్‌కు ప్లాన్ చేసిన ఎల్ఈటీ దాని కోసమే వారిని పంపింది. 2007 ఏప్రిల్ 4న పశ్చిమ బెంగాల్లో ఉన్న 24 పరగణాల జిల్లాలోని పెట్రాపోల్ నుంచి ఈ నలుగురూ సరిహద్దులు దాటేందుకు ప్రయత్నించారు. దీన్ని గమనించిన సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) పట్టుకోవడంతో వీరిపై బన్గావ్ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన సీఐడీ అధికారులు దర్యాప్తు చేశారు. ఎంతకీ నోరు విప్పని ఈ ఉగ్రవాదులకు పోలీసులు పాలిగ్రఫీ, నార్కో అనాలసిస్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి నిజ నిర్థారణ పరీక్షలు చేసింది. ఈ నేపథ్యంలోనే కాశ్మీర్ కుట్రతో పాటు ‘సిటీ టూర్’ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే సిట్ కుట్ర కేసు నమోదు చేసింది. అప్పట్లోనే సిటీకి తీసుకువచ్చి విచారించడంతో పాటు అభియోగపత్రాలు దాఖలు చేసింది. ఆ ముగ్గురికీ ఉరి శిక్ష విధింపు... పశ్చిమ బెంగాల్ సీఐడీ అధికారులు ఈ నలుగురిపై 2007 జూన్ 29న బన్గావ్లోని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ కేసుల విచారణ జరుగుతుండగానే కోల్‌కతా పోలీసులు 2014 సెప్టెంబర్ 24న సమీర్‌లో మరో కేసుకు సంబంధించి ముంబై కోర్టులో హాజరుపరిచారు. అక్కడ నుంచి తిరిగి హౌరా–ముంబై ఎక్స్‌ప్రెస్‌లో కోల్‌కతాకు తీసుకువెళ్తుండగా... ఖర్సియా–శక్తి రైల్వేస్టేషన్ల మ«ధ్య తప్పించుకుని పారిపోయాడు. దీంతో మిగిలిన ముగ్గురిపై విచారణ పూర్తి చేసిన బన్గావ్ కోర్టు గత ఏడాది జనవరిలో ఉరి శిక్ష విధించింది. అప్పటి నుంచి పరారీలో ఉన్న నయీంను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు 2017 నవంబర్ 29న లక్నోలో పట్టుకున్నారు. ఆపై విచారణ నిమిత్తం నయీంను ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉంచారు. నగరంలోని సిట్‌లో నమోదైన కుట్ర కేసులో ట్రయల్ నిర్వహించాల్సి ఉండటంతో సిట్ నయీంను సిటీకి తీసుకువచ్చింది. -
5 ఎకరాలు, రూ. 5 కోట్లు ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: అన్ని కులాలకు హైదరాబాద్‌లో ఆత్మగౌరవ భవనాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించడం పట్ల తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక హర్షం ప్రకటించింది. నాయీ బ్రాహ్మణ సామాజిక భవన నిర్మాణానికి రాజధానిలో ఎకరం భూమి, కోటి రూపాయలు కేటాయించడం పట్ల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ పెదవి విరిచారు. రాష్ట్రంలో 12 లక్షల జనాభా ఉన్న నాయీ బ్రాహ్మణులకు కంటి తుడుపు కేటాయింపులు సరికాదన్నారు. తమ జనాభాను 3 లక్షల 9 వేలుగా చూపించి తీవ్రవైన అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సమగ్ర సర్వేలో చూపించిన లెక్కలను తాము మొదటి నుంచి వ్యతిరేకించామని, దీని ఆధారంగా తమకు కేటాయింపులు జరపడం తగదన్నారు. మరోసారి నిష్పక్షపాతంగా సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణులకు హైదరాబాద్‌లో 5 ఎకరాల భూమి, రూ. 5 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై అవసరమైతే ముఖ్యమంత్రిని కలుస్తామని, తమ విన్నపంపై కేసీఆర్ సానుకూలంగా స్పందిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. మిగతా హామీల మాటేంటి? నాయీ బ్రాహ్మణులకు ఇచ్చిన మిగతా హామీలను కూడా నిలబెట్టుకోవాలని ప్రభుత్వాన్ని లింగం డిమాండ్ చేశారు. సెలూన్లకు విద్యుత్ రాయితీపై ప్రగతి భవన్ సాక్షిగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామి ఇప్పటివరకు అమలు కాలేదని గుర్తు చేశారు. ఏళ్ల తరబడి దేవాలయాల్లో పనిచేస్తున్న నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనాలు, ఇతర సౌకర్యాలకు నోచుకోలేదని ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. తమకు కేటాయించిన బడ్జెట్ నిధుల్లో కనీసం 20 శాతం కూడా ఖర్చు చేయలేదని వాపోయారు. నిబంధనల పేరుతో బీసీ రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించండి రాజకీయంగా తమ కులానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, చట్టసభల్లో నాయీబ్రాహ్మణులకు తగిన ప్రాతినిథ్యం కల్పించాలని ప్రభుత్వానికి మద్దికుంట లింగం విజ్ఞప్తి చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా ఇతర నామినేటెడ్ పదవుల్లో తమవారికి అవకాశం కల్పించాలని కోరారు. నాయీబ్రాహ్మణులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగేందుకు చేయూత అందించాలని విన్నవించారు. -
భార్య భర్తల గొడవలో తలదూర్చిన నయీం అనుచరులు?
-
నయీం అనుచరుడి హల్చల్!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత.. అతని అనుచరుల కదలికలు పెద్దగా లేవు. నయీం హతమై రెండేళ్లు గడిచింది. ఇప్పుడు అతని అనుచరుడు శేషన్న విశ్వరూపం చూపిస్తున్నాడు. నయీం చేసిన దందాలు, సెటిల్ మెంట్లు, కూడబెట్టిన ఆస్తులు, ఇతరత్రా అన్నీ ఇతని కనుసన్నల్లోనే ఉన్నట్టు చెప్పుకుంటారు. అందుకే నయీం ఎన్కౌంటర్ జరిగిన రెండేళ్ల తర్వాత దందాలు మొదలుపెట్టాడు. ఎల్బీనగర్లోనే ఉంటూ కల్వకుర్తి, అమన్‌గల్, అచ్చంపేట్, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, జడ్చర్ల ప్రాంతాల్లో కార్యకలాపాలను విస్తృతం చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. నయీం గ్యాంగంతా అతడి వెనుకే... నయీం రెండు రకాలుగా గ్యాంగ్‌ను నడిపాడు. ఒకటి తన గురించి తెలిసిన కుటుంబీకులతో, రెండోది తనతో ముందు నుంచి ఉన్న అనుచరులతో.. ఎన్కౌంటర్ తర్వాత అతడి కుటుంబీకులు మొత్తం సైలెంట్ అయిపోయారు. కొందరు జైల్లో ఉంటే మరికొందరు అజ్ఞాతంలో గడుపుతున్నారు. కానీ అనుచర వర్గంగా ఉన్నవారంతా మళ్లీ రంగంలోకి దిగారు. అనుచరులుగా ఉన్న 16 మంది గ్యాంగ్‌లో నంబర్ 2గా ఉన్న శేషన్నతో చేతులు కలిపినట్టు మహబూబ్‌నగర్ పోలీస్ వర్గాలు స్పçష్టం చేశాయి. హైదరాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొం డలో బినామీ ఆస్తులను ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ శేషన్న ఆర్థికంగా బలపడుతూ మళ్లీ దందాలోకి దిగినట్లు సీనియర్ పోలీస్ అధికారి ఒకరు ‘సాక్షి’కి వెల్లడించారు. అతని వెంటే ప్రజాప్రతినిధులు.. నయీం ఎన్కౌంటర్ మరుసటి రోజు నుంచి ఎల్బీనగర్లో ఉన్న ఎంపీపీ ఇంటి పక్కన అపార్ట్మెంట్లోనే శేషన్న షెల్టర్ తీసుకున్నట్లు సమాచారం. అప్పటి నుంచి అక్కడే ఉంటూ కార్యకలాపాలు సాగిస్తున్నాడని తెలిసింది. అచ్చంపేట ప్రాంత ఓ ప్రజాప్రతినిధి, మహబూబ్‌నగర్‌లో పనిచేస్తున్న ఓ ఇన్స్పెక్టర్, డీఎస్పీ, కల్వకుర్తికి చెందిన మరో ప్రజాప్రతినిధితో కలసి శేషన్న సెటిల్మెంట్లు చేస్తున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయి. నయీం బినామీల ఆస్తులను శేషన్న ద్వారా దక్కించుకునేందుకు కొందరు ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. ఆచూకీ తెలియడంలేదు... శేషన్న ఎక్కడున్నాడని పోలీస్ అధికారులను ప్రశ్నిస్తే ప్రస్తుతం అండర్‌గ్రౌండ్‌లో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుంటామని చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ అతను మాత్రం బహిరంగంగానే తిరుగుతున్నాడు. పైగా పోలీస్ అధికారులు, ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే దందాలు చేస్తుండటం అనుమానం కలిగిస్తోంది. నయీం ఎన్కౌంటర్లో కీలక సమాచారం ఇచ్చినందుకే శేషన్నను వదిలిపెట్టినట్లు పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది. నలుగురు రియల్టర్లకు బెదిరింపులు.. కల్వకుర్తి, షాద్‌నగర్‌లో రియల్ ఎస్టేట్ చేస్తున్న నలుగురు వ్యాపారులను ఇటీవల శేషన్న బెదిరించినట్లు తెలిసింది. నయీం గతంలో కబ్జా చేసిన భూములను విక్రయించేందుకు మళ్లీ రియల్టర్లు ప్రయత్నం చేయడమే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై రియల్టర్లు ఓ టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఆ ఎమ్మెల్యే శేషన్నకు దగ్గరగా ఉన్న ఓ ఎంపీపీతో మాట్లాడే ప్రయత్నం చేశారు. శేషన్న జోలికి రావద్దని ఎంపీపీ కూడా ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. రాచకొండ పరిధిలోని మల్కాజ్గిరి జోన్లో ఓ అపార్ట్మెంట్ విషయంలోనూ శేషన్న బెదిరింపులకు పాల్పడినట్లు ఓ సీఐ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. -
‘కరుణానిధి మృతి కలచివేసింది’
సాక్షి, హైదరాబాద్: రాజకీయ దురందరుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ ఎం కరుణానిధి మరణం పట్ల అఖిల భారత నాయీ సెయిన్, సవితా, విల్లంకితుల నాయర్, ఇసాయ్ మేధావుల ఐక్య వేదిక (ఏఐఎన్‌ఐయూఎఫ్) సంతాపం ప్రకటించింది. భారత రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ‘కలైంజ్ఞర్’ మరణం పూడ్చలేనిదని ఏఐఎన్‌ఐయూఎఫ్ కన్వీనర్ దుగ్యాల అశోక్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తమిళ నాయీ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి రాజకీయ రంగంలో శిఖరస్థాయికి ఎదిగారని కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కరుణానిధి మరణం తమ జాతికి శరాఘాతమని ఏఐఎన్‌ఐయూఎఫ్ ప్రతినిధి సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఓటమి ఎరుగని దురందరుడు ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి దేశ రాజకీయ రంగంలో ధ్రువతారగా వెలిగిన కరుణానిధి మరణం తమను ఎంతగానో కలచివేసిందని తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం పేర్కొన్నారు. కరుణానిధి మృతికి ఆయన సంతాపం ప్రకటించారు. ఓటమి ఎరుగని రాజకీయ దురందరుడు కరుణానిధి అని కొనియాడారు. 13 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి, ఐదుసార్లు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన ఘనత ఆయకే దక్కిందన్నారు. డీఏంకే పార్టీకి ఏకధాటిగా 50 ఏళ్లు అధ్యక్షుడిగా కొనసాగారని, తమిళనాడులోనే కాక దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారని గుర్తు చేశారు. నాయీ బ్రాహ్మణ కులంలోని గొప్ప నాయకుడు అస్తమించడంతో తామంతా తీవ్ర దిగ్భ్రాంతిలో మునిగిపోయామన్నారు. కరుణానిధి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కన్నీటి నివాళులు కరుణానిధి నివాళులు అర్పిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని నాయీ బ్రాహ్మణులు సంతాప కార్యక్రమాలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి, కరుణానిధి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సినీ, రాజకీయ రంగంలో ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ద్రవిద యోధుడికి కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు. -
నయీం కేసులో ఆ ముగ్గురికి ఊరట
సాక్షి, హైదరాబాద్: నయీం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన మరో ముగ్గురు అధికారులపై రాష్ట్ర పోలీస్ శాఖ సస్పెన్షన్ ఎత్తివేసింది. ఈ మేరకు రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో సస్పెన్షన్‌లో ఉన్న ఏసీపీ చింతమనేని శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు రాజగోపాల్, మస్తాన్‌వలీ తిరిగి విధుల్లో చేరారు. ఏసీపీ చింతమనేని శ్రీనివాస్ మంగళవారం రాష్ట్ర హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేశారు. అదే విధంగా ఇన్స్పెక్టర్ రాజగోపాల్ నార్త్‌జోన్ ఐజీ కార్యాలయంలో, మస్తాన్‌వలీ వెస్ట్‌జోన్ ఐజీ కార్యాలయంలో రిపోర్ట్ చేసినట్లు పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి. సస్పెన్షన్‌కు ముందు ఏసీపీ శ్రీనివాస్ నగర కమిషనరేట్‌లోని సీసీఎస్‌లో పనిచేయగా, రాజగోపాల్ కొత్తగూడెం ఇన్స్పెక్టర్గా, మస్తాన్‌వలీ సంగారెడ్డి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా పనిచేశారు. కొద్ది రోజుల క్రితమే అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్‌రావు, ఏసీపీ మలినేని శ్రీనివాస్‌రావుపై సస్పెన్షన్ ఎత్తివేసిన పోలీస్ శాఖ.. తాజాగా మిగిలిన ముగ్గురిపై ఎత్తివేయడంతో మొత్తం ఐదుగురు అధికారులు తిరిగి విధుల్లో చేరారు. అయితే వీరిలో ఎవరికి కూడా ఇప్పటివరకు పోస్టింగ్‌లు కేటాయించలేదు. వీరితో పాటు అదనపు ఎస్పీ సునీతారెడ్డి సైతం ఇటీవల పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్ చేసి వెయిటింగ్లో ఉన్నారు. పోలీస్ శాఖ వీరందరికీ త్వరలోనే పోస్టింగులు కల్పించనున్నట్లు తెలిసింది. -
హోంమంత్రి దృష్టికి ‘కొండపల్లి’ వివాదం
సాక్షి, హైదరాబాద్: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో తమ కులస్తులను వెలి వేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు శనివారం రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డిని కలిశారు. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే కారణంతో తమ సంఘీయులను ఊరి నుంచి బహిష్కరించడం దారుణమని మంత్రికి వివరించారు. సాంఘిక దురాచారాలను ప్రోత్సహించొద్దని, తమ కులస్తులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన హోం మంత్రి వెంటనే కుమురం భీం జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసున్నారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. హోంమంత్రిని కలిసిన వారిలో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్యవేదిక అధ్యక్షుడు మద్దికుంట లింగం నాయీ, కార్యదర్శి గొంగుల శ్రీనివాస్ నాయీ, గ్రేటర్ హైదరాబాద్ కమిటీ కార్యదర్శి రమేశ్, కార్టూనిస్ట్ నారూ ఉన్నారు. వివాదం ఇదీ... ఈ నెల 22న కొండపల్లిలో ‘దేవార’ ఉత్సవం జరిగింది. దీనికి నాయీ బ్రాహ్మణులు, రజకులు ఆలస్యంగా రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు సహాయ నిరాకరణ చేపట్టారు. వీరికి గ్రామంలో ఎవరూ సహకరించకూడదని 23న ఊరిలో చాటింపు వేయించారు. గ్రామంలోని మూడు నాయీ బ్రాహ్మణ, ఐదు రజక కుటుంబాలపై సాంఘిక బహిష్కారం విధించారు. బాధితులు మొర పెట్టుకోవడంతో పోలీసులు రాజీ చేసేందుకు ప్రయత్నించారు. క్షమాపణ చెప్పి, వెలి ఎత్తివేస్తే రాజీకి వస్తామని బాధితులు తేల్చి చెప్పారు. అయితే క్షమాపణ చెప్పేందుకు గ్రామస్తులు నిరాకరించారు. బాధితులే తమకు క్షమాపణ చెప్పాలంటూ ఎదురు తిరిగారు. దీంతో తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక సభ్యులు హోంమంత్రి జోక్యం కోరారు. -
వెలివేతపై నాయీ బ్రాహ్మణుల ఆగ్రహం
సాక్షి, ఆసిఫాబాద్: కుమురం భీం జిల్లా రెబ్బెన మండలం కొండపల్లిలో నాయీ బ్రాహ్మణులు, రజకులపై గ్రామ బహిష్కరణ విధించిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక డిమాండ్ చేసింది. గ్రామ ఉత్సవానికి ఆలస్యంగా వచ్చారనే నెపంతో ఊరు నుంచి వెలివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ మద్దికుంట లింగం నాయీ తెలిపారు. చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడిన గ్రామ పెద్దలపై చట్టపరంగా తీసుకోవాలని ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గ్రామ బహిష్కరణకు గురైన నాయీ బ్రాహ్మణులు, రజకులకు అండగా ఉంటామని భరోసాయిచ్చారు. తమ వారికి న్యాయం జరగకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు. ఆందోళనలకు సిద్ధం: రజకులు రజకులకు న్యాయం జరగని పక్షంలో తాము కూడా రాష్ట్ర ఆందోళనలు చేపడతామని చాకలి ఎస్సీ సాధన సమితి ప్రకటించింది. తమ సంఘీయులను గ్రామ బహిష్కరణ చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. సాంఘిక దురాచారాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. వాస్తవం లేదు: గ్రామస్తులు కొండపల్లిలో రజక, నాయీ బ్రాహ్మణ కులస్తులను గ్రామం నుంచి బహిష్కంచలేదని గ్రామస్తులు తెలిపారు. శుక్రవారం రెబ్బెన మండల కేంద్రానికి చేరుకుని సీఐ రమణమూర్తి, తహశీల్దార్ సాయన్నకు ఈ మేరకు తెలిపారు. గ్రామంలోని రజకులకు, నాయీ బ్రాహ్మణులకు గ్రామం నుంచి ఎలాంటి సహకారం అందించవద్దని తీర్మానించామే తప్ప గ్రామం నుంచి బహిష్కరించలేదని వారు చెప్పడం గమనార్హం. ఎటువంటి సహాయం అందించవద్దని చెప్పడం వెలివేత కాకపోతే ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. అయితే సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని అధికారులు సూచించారు. -
నయీం కేసులో కౌంటర్ దాఖలు చేయండి: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీముద్దీన్ ఎన్‌కౌంటర్‌తోపాటు అతని అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు బుధవారం తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు 2 వారాల గడువునిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. నయీం అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ సూర్యాపేట హుజూర్నగర్కి చెందిన శ్రీనివాస్ 2016లో హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీజే నేతృత్వం లోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, పోలీసుల అండదండలతో నయీం వందల కోట్ల రూపాయాలతోపాటు వందల ఎకరాల భూములను అక్రమంగా ఆర్జించారని తెలిపారు. ఇవన్నీ బయటకు వస్తాయన్న ఉద్దేశం తో నయీంను ఎన్కౌంటర్ చేశారని, అందువల్ల దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కోరారు. -
చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వం
సాక్షి, హైదరాబాద్ : నాయీ బ్రాహ్మణులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని ఆల్ ఇండియా నాయీ, సెయిన్, సవితా, విల్లంకితుల నాయర్, ఇసాయ్ మేధావుల ఐక్య వేదిక (ఏఐఎన్‌ఐయూఎఫ్) డిమాండ్ చేసింది. క్షమాపణ చెప్పకపోతే చంద్రబాబును ఢిల్లీలో అడుగుపెట్టనివ్వబోమని హెచ్చరించింది. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్రీయ సెయిన్ సమాజ్ సంఘ్(ఆర్ఎస్ఎస్ఎస్) జాతీయ అధ్యక్షుడు రవీందర్ రాణా మాట్లాడుతూ... చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో దేశవ్యాప్తంగా నాయీ బ్రాహ్మణులు మనోభావాలు దెబ్బతిన్నాయని తెలిపారు. నాయీ బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేసి నెల రోజులు గడుస్తున్నా కనీసం క్షమాపణ చెప్పకపోవడం బాధాకరమన్నారు. బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బహిష్కరిస్తామని హెచ్చరించారు. రెండు రోజుల్లోగా క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. కనీస వేతనాలు ఇవ్వాల్సిందే.. తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులు, వాయిద్య కళాకారులకు కనీస వేతనాలు ఇవ్వాలని నాయీ బ్రాహ్మణ మేధావులు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా ఆలయాల్లో సేవలు అందిస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలనుచ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తక్షణమే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. విలేకరుల సమావేశంలో ఏఐఎన్‌ఐయూఎఫ్ కన్వీనర్ దుగ్యాల అశోక్, తెలంగాణ నాయీ బ్రాహ్మణ ఐక్య వేదిక గౌరవ అధ్యక్షుడు మహేశ్ చంద్ర, చైర్మన్ మద్దికుంట లింగం, ఎం నరసింహారావు, సీనియర్ కార్టూనిస్ట్ నారూ తదితరులు పాల్గొన్నారు. నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులతో మంద కృష్ణమాదిగ చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తా: కృష్ణ మాదిగ నాయీ బ్రాహ్మణులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతానని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ హామీయిచ్చారు. ప్రెస్‌క్లబ్‌లో ఆయనను నాయీ బ్రాహ్మణ సంఘాల నాయకులు కలిశారు. ఏపీ సచివాలయంలో నాయీ బ్రాహ్మణులను బెదిరిస్తూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. చంద్రబాబు వ్యాఖ్యలను ఖండిస్తానని ఈ సందర్భంగా కృష్ణమాదిగ అన్నారు. నాయీ బ్రాహ్మణులు తన మద్దతు ఉంటుందని, వారు ఎక్కడికి పిలిచినా వస్తానని హామీయిచ్చారు. ఇది కూడా చదవండి : నడిరోడ్డుపై చంద్రబాబు గూండాగిరి -
బేషరుతుగా బాబు క్షమాపణలు చెప్పాలి
ఎస్వీఎన్ కాలనీ(గుంటూరు): నాయీబ్రాహ్మణులపై సీఎం చంద్రబాబునాయుడు చేసిన అనుచిత వాఖ్యలకు ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు. ఈ మేరకు నంద నాయీబ్రాహ్మణ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు ఇంటూరి బాబ్జినంద అధ్యక్షత పలువురు సభ్యులు సోమవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. వారికి దీక్షకు మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు నగర అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. చాలీచాలని వేతనాలతో రోజులు నెట్టుకొస్తున్న నాయీబ్రాహ్మణులు సీఎం చంద్రబాబును కలిసి తమ బాధలు చెప్పుకునేందుకు ప్రయత్నిస్తే ఆయన తన స్థాయిని మరచి మరీ అనుచితంగా ప్రవర్తించడం సరికాదన్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్న చంద్రబాబుకు బీసీల కష్టనష్టాలు పట్టడంలేదని విమర్శించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు, వారికి దేవాలయాల్లో ఉద్యోగ భద్రత కల్పిస్తామని, సెలూన్లకు విద్యుత్ బిల్లుల్లో రాయితీ ఇస్తామని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇంటూరి బాబ్జీనంద మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణులకు ముఖ్యమంత్రి బేషరుతుగా క్షమాపణ చెప్పేవరకు నిరసన కొనసాగిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ బాపట్ల పార్లమెంటరీ జిల్లా నియోజకవర్గ సమన్వయకర్త నందిగం సురేష్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు సవరం రోహిత్, కాపు సంఘం నేత వంగవీటి నరేంద్ర, వడ్డెర సంఘం నాయకుడు వెంకట్, కుమ్మర యువసేన నేత లలిత్ తదితరులు పాల్గొని సంఘీభావం తెలిపారు. -
నయీం కేసులో సస్పెన్షన్ల ఎత్తివేత!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో పోలీస్ అధికారులపై సస్పెన్షన్ ఎత్తివేతకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. నయీంతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అదనపు ఎస్పీ మద్దిపాటి శ్రీనివాస్, ఏసీపీలు మలినేని శ్రీనివాస్‌రావు, చింతమనేని శ్రీనివాస్, ఇన్స్పెక్టర్లు రాజగోపాల్, మస్తాన్‌లపై సస్పెన్షన్ వేటు పడటం తెలిసిందే. గతేడాది మే నుంచి ఈ ఐదుగురు అధికారులు సస్పెన్షన్‌లోనే ఉన్నారు. వారితోపాటు మరో 11 మంది అధికారులకు అప్పటి డీజీపీ అనురాగ్ శర్మ చార్జి మెమోలు జారీ చేశారు. మరో ఆరుగురి నుంచి వివరణ తీసుకున్నారు. మొత్తంగా 22 మంది అధికారులు నయీంతో సంబంధాలు కొనసాగించారని సిట్ తేల్చింది. సస్పెన్షన్‌కు గురైన అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు పోలీస్‌శాఖ నుంచి ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదన అందినట్లు హోంశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఏడాదిగా సస్పెన్షన్‌లోనే ఉన్న అధికారులను తిరిగి విధుల్లోకి తీసుకునేలా ప్రభుత్వం నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు సచివాలయ వర్గాల ద్వారా తెలిసింది. 2 రోజుల్లో సస్పెన్షన్ ఎత్తివేతతోపాటు పోస్టింగ్‌లు కల్పిస్తూ ఆదేశాలు వెలువరించే అవకాశం ఉంది. అదనపు ఎస్పీ సునీతపైనా: వివాహేతర సంబంధం కేసులో సస్పెన్షన్‌కు గురైన అవినీతి నిరోధకశాఖ అదనపు ఎస్పీ సునీతనూ తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆమెతోపాటు ఇన్స్పెక్టర్ మల్లికార్జున్‌రెడ్డిపైనా సస్పెన్షన్ ఎత్తేసే అవకాశం ఉందని పోలీస్‌శాఖ ముఖ్య కార్యాలయ వర్గాలు స్పష్టం చేశాయి. -
ఏపీ సచివాలయానికి వెళ్ళడానికి కొత్త నిబంధనలు
-
ఏపీ సచివాలయానికి వెళ్తున్నారా?
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి వెళుతున్నారా? కాస్త ఆగండి. ఇంతకుముందులా మీరు సచివాలయానికి వెళ్లడానికి వీల్లేదు. సందర్శకులను నియంత్రించేందుకు చంద్రబాబు సర్కారు గట్టి చర్యలు చేపట్టింది. సీఎం చంద్రబాబుతో సోమవారం నాయీ బ్రాహ్మణుల వివాదం నేపథ్యంలో సాధారణ పరిపాలన విభాగం(జీఏడీ) హడావుడిగా కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇకపై పేషీలనుంచి జారీ చేసే పాసులు, ఫోనుకాల్స్ ను అనుమతించకూడదని నిర్ణయించింది. ప్రతి పేషి నుంచి ఆన్లైన్లో సందర్శకుల వివరాలు నమోదు చేస్తే సందర్శకులకు జీఏడీ అనుమతి మంజూరు చేస్తుంది. ఈ అనుమతి పత్రంతో ఏ విభాగంలో పనివుంటే ఆ బ్లాక్‌కు మాత్రమే వెళ్లాల్సివుంటుంది. ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు కనీస వేతనాల కోసం సచివాలయంలో సోమవారం ముఖ్యమంత్రిని నాయీ బ్రాహ్మణులు నిలదీశారు. ‘ఇంతమందిని ఇక్కడకు ఎవరు రానిచ్చారు. ఇదేమన్నా చేపల మార్కెటా? ఏం తమాషాలాడుతున్నారా?’ అంటూ చంద్రబాబు ఈ సందర్భంగా రౌడీయిజం ప్రదర్శించారు. సీఎం బెదిరింపు తరువాత సచివాలయం సందర్శకులపై నియంత్రణకు జీఏడీ చర్యలు చేపట్టడం గమనార్హం. ప్రజల ఆగ్రహం.. సచివాలయంలో సందర్శకులపై రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనంతో కట్టిన సచివాలయంలోకి ప్రజలను అనుమతించరా అంటూ ప్రశ్నిస్తున్నారు. తమ హక్కులను కాలరాస్తే సహించబోమన్నారు. సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే తమపై ఆంక్షలు విధించడం సరికాదని, ఈ విషయంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరుతున్నారు. -
చంద్రబాబుగారు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను
-
‘పేదల రక్తానికి మరిగిన పులి చంద్రబాబు’
సాక్షి, విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సచివాలయంలో నాయీ బ్రాహ్మణుల పట్ల సీఎం వీధిరౌడీలా ప్రవర్తించారని విమర్శించారు. చంద్రబాబు వ్యాఖ్యలను బీజేపీ త్రీవంగా ఖండిస్తుందని తెలిపారు. నాయీ బ్రాహ్మణులకు చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారని, పేదవాడి రక్తానికి మరిగిన పులి చంద్రబాబు నాయుడు అని ధ్వజమెత్తారు. విశాఖలో మంగళవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నాయీబ్రాహ్మణుల పట్ల సీఎం ప్రవర్తించిన తీరుకు రాజకీయ నాయకులు సిగ్గుతో తలదించుకుంటున్నారని అన్నారు. క్షురకుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అధర్మంగా లక్షల కోట్ల అవినీతి చేస్తూ.. ధర్మ పోరాటాలు చేస్తున్నారని విమర్శించారు. బరితెగించి ఇసుక అమ్ముతున్నారని, దొంగల ప్రభుత్వం ఇదని ఆరోపించారు. మోదీ లేకపోతే చంద్రబాబు జీరో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లేకపోతే ఏపీలో చంద్రబాబు నాయుడు జీరో అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. ఏపీకి కేంద్రం చాలా సాయం చేసిందని పేర్కొన్నారు. ఈ విషయంలో చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. విధానపరమైన నిర్ణయాల వల్లే కశ్మీర్లో పీడీపీ ప్రభుత్వం నుంచి బీజేపీ బయటకు వచ్చిందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నుంచి టీడీపీయే బయటకు వచ్చిందని గుర్తుచేశారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన 600 హామీలపై మండల స్థాయిలో ఉద్యమిస్తామని పేర్కొన్నారు. -
చంద్రబాబు తీరుతో విస్తుపోయా!
సాక్షి, రాజమహేంద్రవరం: కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా..! అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై అడ్డగోలుగా నోరు పారేసుకున్నారు. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష నేత, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాసేపటి క్రితం ట్విటర్లో స్పందించారు. విస్తుపోయా!... ‘మనం నాగరికంగా ఉండాలంటే నాయీబ్రాహ్మణుల సేవలు పొందడం తప్పనిసరి. అలాంటి నాయీబ్రహ్మణుల పట్ల సచివాలయం సాక్షిగా నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుగారు ప్రవర్తించిన తీరును చూసి విస్తుపోయాను. తమ గోడు చెప్పుకోవడానికి వచ్చిన వారిని బెదిరించడం గర్హనీయం. పైగా తలనీలాలు తీసినందుకు రూ.25లు చొప్పున ఇస్తానంటూ, ఏదో దేవుడిచ్చిన వరం మాదిరిగా చంద్రబాబుగారి హావభావాలు ఆయనలోని అహంకార, నియంత స్వభావాలను కళ్లకుకట్టినట్లు చూపించాయి. చంద్రబాబుగారికి బీసీలపట్ల కపటప్రేమ మరోసారి వెల్లడైంది. ప్రతిరోజూ ఆలయంలో ఒక నాయీ బ్రాహ్మణుడు మహా అయితే 10-15 మందికి తలనీలాలు తీస్తారు. భక్తులు రద్దీగా ఉంటేనే అదికూడా సాధ్యం. భక్తులు రాకపోతే గుడిని నమ్ముకున్న తమ బతుకుల పరిస్థితి ఏంటని అడుగుతున్న నాయీ బ్రాహ్మణుల న్యాయమైన డిమాండ్లపై ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాల్సిన తీరు ఇదేనా? కనీస వేతనాలు ఇవ్వనంటూ సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పటం చట్టానికి వ్యతిరేకం’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. ప్రజాప్రభుత్వంలో... ‘దేవుడి దయతో మన ప్రభుత్వం రాగానే మీ అందరి ముఖంలో చిరునవ్వులు కనిపించేలా కనీస వేతనం ఇస్తాం. ఎప్పటికప్పుడు మీ సమస్యలు పరిష్కారం అయ్యేలా తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రతిదేవాలయ బోర్డులోనూ ఒక నాయీ బ్రహ్మణుడిని సభ్యుడిగా నియమిస్తాం’ అని నాయీ బ్రాహ్మణ వర్గానికి వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. pic.twitter.com/eM3Ye6dxao — YS Jagan Mohan Reddy (@ysjagan) 19 June 2018 -
నాయీ బ్రాహ్మణులపై చంద్రబాబు గుండాగిరి
-
నడిరోడ్డుపై చంద్రబాబు గూండాగిరి
సాక్షి, అమరావతి: ఆకలితో అలమటిస్తూ కనీస వేతనాల కోసం రోడ్డెక్కిన నాయీ బ్రాహ్మణులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూండాయిజం ప్రదర్శించారు. అయ్యా అంటూ ప్రాధేయపడినా కనికరించకుండా కాఠిన్యం చూపారు. ఏం చేస్తారో చూస్తామంటూ సచివాలయం సాక్షిగా బెదిరింపులకు దిగారు. మిమ్మల్ని ఎవరు ఇక్కడకు రానిచ్చారంటూ హుంకరించారు. అధికారం తమ చేతిలో ఉందన్న గర్వంతో నడిరోడ్డుపై నిమ్నవర్గాలపై నోరు పారేసుకున్నారు. నాకే ఎదురు చెప్తారా అంటూ రంకెలు వేశారు. ‘నచ్చితే చెయ్యండి లేకుంటే వెళ్లిపోండి’... తమ డిమాండ్లను పరిష్కరించమని అడిగిన నాయీ బ్రాహ్మణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన సమాధానం ఇది. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో జరిపిన చర్చలు విఫలం కావడంలో సచివాలయంలో సీఎం కాన్వాయ్‌ను నాయీ బ్రాహ్మణులు అడ్డుకున్నారు. తమ సమస్యలను ఆయనకు విన్నవించుకున్నారు. ముఖ్యమంత్రి మాత్రం బెదిరింపు ధోరణితో మాట్లాడారు. కనీస వేతనం ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. జీతాలు పేంచేది లేదని, ముందు విధుల్లో చేరాలని గర్జించారు. కేశఖండనకు రూ. 25 రూపాయలు ఇస్తామని చెప్పారు. సీఎం ప్రతిపాదనను క్షురకులు వ్యతిరేకించారు. దీంతో తమాషాలు చేస్తున్నారా అంటూ వేలు చూపించి చంద్రబాబు హెచ్చరించారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై నాయీ బ్రాహ్మణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీస వేతనం ఇచ్చేంత వరకు సమ్మె విరమించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేం: కేఈ దేవాలయాల్లో పనిచేస్తున్న క్షురకులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేమని అలాగే కన్సాలిడేటెడ్ పే ఇవ్వలేమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి తెలిపారు. టిక్కెట్‌పై 25 రూపాయలు ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని, దీంతో నెలకు ప్రతి క్షురకుడికి రూ. 25 వేలు వచ్చే అవకాశం ఉందని లెక్కలు చెప్పారు. 25 రూపాయలకు అంగీకరించిన వారు ఎంతమంది వస్తే అంతమందితో పని చేయించాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. ఈ భారాన్ని దేవాలయాలే భరిస్తాయన్నారు. సమ్మె విరమించి భక్తుల మనోభావాలను కాపాడేలా నాయీ బ్రాహ్మణులు వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి: కన్నా నాయీ బ్రాహ్మణుల డిమాండ్లపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. విజయవాడ దుర్గగుడి వద్ద నాయీ బ్రాహ్మణుల నిరసన దీక్షలను సందర్శించి ఆయన సంఘీభావం తెలిపారు. నాయీ బ్రాహ్మణుల పోరాటానికి మద్దతు ప్రకటించారు. -
కేఈతో క్షురకుల చర్చలు విఫలం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. క్షురకుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరిపిన హమీయిస్తానని డిప్యూటీ సీఎం చెప్పడంతో నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈలోగా ఆలయాల్లో సమ్మె విరమించాలని క్షురకులను ఆయన కోరగా, సీఎం తమ డిమాండ్లను ఆమోదించే వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయీ బ్రాహ్మణులు స్పష్టం చేశారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమామహేశ్వరరావు మాట తపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త బంద్ చేపట్టాలని నాయీ బ్రాహ్మణ సంఘాలు పిలుపునిచ్చాయి. రాష్ట్రంలో ఉండే అన్ని దేవాలయాలతో పాటు, బార్బర్ షాపులు కూడా బంద్ పాటించాలని సూచించాయి. ఆలయాల్లో పనిచేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు కనీస వేతనం 15 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం నుంచి క్షురకులు ఆందోళన చేస్తున్నారు. దేవాలయాల్లో పనిచేస్తున్న తమను పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించి ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని.. ఉద్యోగ విమరణ చేసిన వారికి నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వాలని కోరుతున్నారు. -
పేదోళ్ల మనోభావాలతో చెలగాటమా?
సాక్షి, విజయవాడ: పేదోళ్ల మనోభావాలతో టీడీపీ ప్రభుత్వం చెలగాటమాడుతోందని, బలహీనవర్గాల పట్ల దారుణంగా ప్రవర్తిస్తోందని వైఎస్సార్ సీపీ నాయకుడు, మాజీ మంత్రి కె. పార్థసారధి విమర్శించారు. కనీస వేతనాల కోసం విజయవాడ దుర్గగుడిలో ఆందోళన చేస్తున్న క్షురకులకు పార్టీ నాయకులు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో కలిసి ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆలయాలకు మంచి ఆదాయం ఉన్నా క్షురకుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. తమ డిమాండ్ల సాధన కోసం నిన్న ప్రభుత్వ పెద్దలను కలిసి అభ్యర్థించినా కనీసం పట్టించుకోలేదని వాపోయారు. ఇది ప్రభుత్వ నిరంకుశ ధోరణికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఆలయాల్లో పనిచేస్తున్న క్షురకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని, నెలకు కనీస వేతనం రూ.17 వేలు ఇవ్వాలని ఏపీ నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సిద్దవటం యానాదయ్య డిమాండ్ చేశారు. గత మూడు రోజుల నుంచి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. కనీస వేతనం లేకుండా ఎలా జీవించాలని ప్రశ్నించారు. సాయంత్రంలోగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సర్కారు దిగొచ్చే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. -
అన్ని ఆలయాల్లో క్షురకుల ధర్నాలు
-
నాయీ బ్రాహ్మణ పాదయాత్ర పోస్టర్ ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నాయీ బ్రాహ్మణుల సేవా సంఘం రాష్ట్ర హడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పాదయాత్ర కరపత్రాన్ని సోమ వారం రాష్ట్ర శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సేవా సంఘం హడ్‌హక్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ... నాయీ బ్రాహ్మణుల హక్కుల సాధన కోసం ఈ పాదయాత్రను నిర్వహిస్తున్నామన్నారు. జూన్ 1న జోగులాంబ గద్వాల నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందన్నారు. 12 రోజుల పాటు ఈ పాదయాత్ర వివిధ జిల్లాల గుండా నగరంలోని ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం వరకు సాగుతుందన్నారు. ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నాయీ బ్రాహ్మణుడికి నవీన కౌరశాల నిర్మాణానికి రూ. 25 వేలు, ప్రతి షాపునకు డొమెస్టిక్ విద్యుత్ మీటర్లుగా మార్చడం, 50 సంవత్సరాలు దాటిన వాయిద్య కళాకారులకు పింఛన్, నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ ఏర్పాటు, ఫెడరేషన్ ద్వారా 90 శాతం సబ్సిడీతో రుణాలు, నాయీ బ్రాహ్మణులకు చట్ట సభలతో పాటు ఇతర నామినేషన్ పోస్టులలో అవకాశం, నగరంలో విద్యార్థి వసతి గృహం, జిల్లా, మండల హెడ్ క్వార్టర్స్‌లో భవనాలు, నాయీ బ్రాహ్మణ యువతీయువకులకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ తదితర డిమాండ్ల సాధన కోసం ఈ పాదయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. జోగులాంబ దేవాలయం నుంచి ఆయిజా, గద్వాల్, ఎర్రవల్లి, బీచ్పల్లి, పెబెర్, వనపర్తి, కొత్తకోట, భూత్పూర్, మహబూబ్‌నగర్, జడ్చర్ల, బాలానగర్, షాద్‌నగర్, శంషాబాద్, అత్తాపూర్ మీదుగా ఈ పాదయాత్ర సాగనుందన్నారు. ఈ కార్యక్రమంలో హడ్‌హక్ కమిటీ సభ్యులు బి.నరేందర్, సూర్యనారాయణ, మోహన్, జగదీష్, వాసు, గడ్డం మోహన్, పాల్వాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.