ఆ డైరీతో తేలనున్న టీఆర్‌ఎస్ బాగోతం : చాడ
వరంగల్:
నయీం డైరీని బయటపెడితే టీఆర్ఎస్ బాగోతం తెలుస్తుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. నయీం ఆగడాలపై సీపీఐ ప్రత్యక్ష ఆందోళన దిగుతుందని స్పష్టం చేశారు. వరంగల్‌లో విలేకరులతో మాట్లాడుతూ... టిపాస్‌తో ఎన్ని పరిశ్రమలు వచ్చాయో..ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో, పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ తెలంగాణ ప్రజలకు నిరాశ కలిగించిదన్నారు. విభజన చట్టంలోని అంశాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వలేదని నిప్పులు చెరిగారు.
కేంద్రబడ్జెట్ పై సీఎం కేసీఆర్ నోరు విప్పాలని చాడ అన్నారు. అఖిలపక్షంతో కలిసి కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయహోదా, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ప్రస్తావన బడ్జెట్‌లో లేకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. చేప పిల్లల పంపిణీ అక్రమాలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నోట్లరద్దుపై కేసీఆర్ భజన మానుకోవాలని సూచించారు. మిషన్ భగీరథ ఒక మేడిపండు అని ఎద్దేవా చేశారు. సీఎం ఇలాకాలో మిషన్ భగీరథ అక్రమాలపై విచారణ జరిపించాలని కోరారు.