చాడను అరెస్ట్ చేస్తున్న పోలీసులు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీని అమలుపరచని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపడానికి ‘కేసీఆర్ హటావో..తెలంగాణ బచావో’అనే నినాదంతో పోరాటాలు ఉధృతం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సోమవారం సీపీఐ కార్యకర్తలతో కలసి ప్రగతి భవనం ముట్టడించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ..ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి, కేజీ నుంచి పీజీ ఉచిత విద్య, డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మిస్తామని హామీ ఇచ్చి విఫలమైందని విమర్శించారు.
హామీలను అమలుపర్చమని అడిగితే అరెస్టులు చేస్తారా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిని కలవడానికి అపాయింట్‌మెంట్ ఇవ్వరని, ధర్నాలు చేసుకునేందుకు వీలు లేకుండా ధర్నాచౌక్‌లు ఎత్తివేస్తారన్నారు. నియంతల పద్ధతులతో, ప్రజల గొంతు నొక్కుతూ పాలన చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి నియంత్రుత్వ పోకడలు మానకుంటే ప్రజాస్వామ్య, లౌకిక శక్తులతో కలసి పోరాటం చేస్తామని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment