
మఖ్దూం భవన్‌లో నిరసన తెలియజేస్తున్న కె.నారాయణ, చాడ తదితరులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా ప్యాకేజీ డొల్ల, పచ్చి మోసం అని చెబుతున్న సీఎం కేసీఆర్.. ఫెడరల్ అధికారాలు, హక్కులను లాక్కుంటున్న కేంద్రంపై పోరులో ప్రధాన పాత్ర పోషించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కోరారు. లౌకిక, ప్రజాతంత్ర, వామపక్ష శక్తులతో కలసి కేంద్రం మెడలు వంచే పోరాటాలకు సీపీఐ అండగా ఉంటుం దన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో సొంతూళ్లకు నడుచుకుంటూ వెళుతూ దారిలో మరణిం చిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని పార్టీ ప్రధాన కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు.
ఈ వర్గాలను ఆదుకునేందుకు వెంటనే చర్యలు చేపట్టాలంటూ సీపీఐ ఆధ్వర్యంలో నిరసనలు నిర్వహించారు. మంగళవారం మఖ్దూం భవన్‌లో పార్టీ నాయకులు కె.నారాయణ, చాడ వెంకటరెడ్డి, అజీజ్‌పాషా, పశ్యపద్మ, సుధాకర్ తదితరులు నల్లజెండాలతో భౌతికదూరం పాటిస్తూ నిరసనలో పాల్గొన్నారు. మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా చేపడుతున్న చర్యలపై ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుకు సీపీఐ నేత నారాయణ లేఖ రాశారు. కోవిడ్‌కు, ప్రభుత్వరంగ సంస్థలపై వేటుకు సంబంధముందా అన్న విషయాన్ని చెప్పాలని కోరారు. దేశమంతా కరోనా ఎజెండానే ప్రధానంగా ఉండగా.. కేంద్రం ఎజెండా మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ వంటి కోల్‌మైన్స్, ఇస్రో, రక్షణ, అటామిక్ ఎనర్జీ వంటి పరిశ్రమలను స్వదేశీ, విదేశీ కార్పొరేట్ కోరలకు బలి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.