నుజ్జు నుజ్జయిన టాటా ఏస్ వాహనం, ఘటనా స్థలం వద్ద బస్సు
కొండమల్లేపల్లి/చింతపల్లి: పనులు ముగించుకొని ఇంటికి పయనమైన వారు గమ్యం చేరకుండానే విగతజీవులయ్యారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేద కుటుంబాల్లో అమావాస్య మృత్యుఘోష మిగిల్చింది. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండల పరిధిలోని దేవత్‌పల్లి ఎక్స్‌రోడ్డు వద్ద హైదరాబాద్–నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై బుధవారం ఆర్టీసీ బస్సును టాటా ఏస్ వాహనం ఢీకొంది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా, 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్ నుంచి మల్లేపల్లికి 16 మంది ప్రయాణికులతో వెళ్తున్న టాటా ఏస్ వాహనం దేవత్‌పల్లి ఎక్స్‌రోడ్డు సమీపంలోకి రాగానే ముందు టైర్ పంక్చర్ అయ్యింది. వాహనం అప్పటికే వేగంగా ఉండటంతో పాటు రోడ్డు పల్లంగా ఉండటంతో డ్రైవర్ నియంత్రించలేకపోయాడు.
ఈ క్రమంలోనే హైదరాబాద్‌కు వస్తున్న దేవరకొండ ఆర్టీసీ డిపో బస్సును బలంగా ఢీకొంది. దీంతో టాటా ఏస్‌లో ప్రయాణిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, డ్రైవర్‌ను హైదరాబాద్ తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. మరో 15 మందికి గాయాలు కాగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
మృతులు వీరే..
చింతపల్లి మండలం మల్లారెడ్డిపల్లికి చెందిన బైకాని గోవర్ధన్ (27), నెల్వలపల్లికి చెందిన శెట్టిపల్లి శ్రీరాములమ్మ (45), కాచిగూడకు చెందిన ఆకుల శ్రీనాథ్(25), కొండమల్లేపల్లిలో ఉంటున్న నీలం వెంకటేశ్వర్లు (50), టాటాఎస్ డ్రైవర్ చండూరు మండలం అంగడిపేటకు చెందిన కాటపాక మహేశ్ (30), వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన ఎడ్డేటి బాలాజిరావు (53) మృతుల్లో ఉన్నారు. మరో ఇద్దరి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మృతుల బంధువుల రోదనలతో దేవరకొండ ప్రభుత్వాస్పత్రి ఆవరణ మార్మోగింది. విషయం తెలుసుకున్న దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ఆర్డీఓ లింగ్యానాయక్ ఆస్పత్రికి చేరుకొని ప్రమాదానికి కారణాలను తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు.
పరీక్ష రాసి ఒకరు.. దైవ దర్శనానికి వెళ్తూ మరొకరు..
కాచిగూడకు చెందిన ఆకుల శ్రీనాథ్ చింతపల్లి మండల కేంద్రంలోని అలూకా జైహింద్‌రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం పరీక్ష రాశాడు. తర్వాత కొండమల్లేపల్లిలోని తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు చింతపల్లి వద్ద టాటా ఏస్ ఎక్కాడు. మరో 10 నిమిషాల్లో కొండమల్లేపల్లికి చేరుకుంటాడు అనుకునేలోపే అనంతలోకాలకు వెళ్లాడు. దీంతో మృతుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. అలాగే చింతపల్లి మండల పరిధిలోని మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన గోవర్ధన్ డ్రైవర్ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం అమావాస్య కావడంతో చెరువుగట్టు దేవస్థానంలో రాత్రి నిద్ర చేసేందుకు చింతపల్లిలో టాటా ఏస్ ఎక్కాడు. అనుకోకుండా జరిగిన రోడ్డు ప్రమాదంలో గోవర్దన్ దైవ దర్శనం చేసుకోకుండానే అనంతలోకాలకు చేరాడు.
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి...
కాగా ఈ ఘోర రోడ్డు ప్రమాదం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఇవ్వాలి: చాడ
సాక్షి, హైదరాబాద్: నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, క్షతగాత్రులకు ఉచితంగా వైద్య చికిత్స అందించాలని సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. రోడ్డు భద్రతా సూచనలు పాటించకపోవడం వల్లే రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదాలు తరచుగా జరుగుతున్నాయని ఆయన బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామాలకు వెళ్లే రహదారులు పూర్తిగా గుంతలుపడడం, మోటర్ వెహికల్ సిబ్బంది తనిఖీలు చేపట్టకపోవడం వల్ల అనేక ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. నల్లగొండ జిల్లా రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు సీపీఐ తన సంతాపాన్ని తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment