
సాక్షి, హైదరాబాద్: సిట్ పేరుతో గ్యాంగ్‌స్టర్ నయీం కేసు విచారణ జరిపిన పోలీసులు చాలా రోజులుగా మౌనంగా ఉండగా, తాజా గా ఆదాయపన్ను శాఖ రంగంలోకి దిగింది. నయీం తల్లితోపాటు నలుగురు కుటుంబ సభ్యులకు బినామీ ఆస్తుల నిరోధక చట్టం కింద తాఖీదులు జారీ చేసింది. నయీం తల్లి తాహేరా బేగం, భార్య హసీనా బేగం, అక్క సలీమా బేగం, తమ్ముడి భార్య హీనా కౌసర్, తమ్ముడి కూతురు అహేలా బేగంలకు నోటీసులిచ్చింది. సోమవారం ఆదాయపన్ను శాఖ అధికారులు భువనగిరిలోని నయీం పాత ఇంటికి నోటీసులను అంటించి వెళ్లారు. బినామీ లావాదేవీల నిరోధక యూనిట్ (బీపీయూ) డిప్యూటీ కమిషనర్ బ్రజేంద్ర కుమార్ పేరిట జారీ అయిన ఈ నోటీసుల్లో మొత్తం 26 చోట్ల ఉన్న 98 ఆస్తుల వివరాలను పొందుపరిచారు. ఈ ఆస్తులు ఎక్కడ్నుంచి వచ్చాయో తెలపాలని అందులో పేర్కొన్నా రు. నోటీసులో పేర్కొన్న వ్యక్తులు ఏం వ్యాపా రాలు చేస్తున్నారు? ఆదాయ వనరులు ఎక్క డ్నుంచి వస్తున్నాయి? ఆయా ఆస్తుల సేల్ డీడ్‌లు, గత పదిహేనేళ్ల ఐటీ రిటర్న్‌లు, స్థిర, చరాస్తుల క్రయ విక్రయాల వివరాలను తెలి యజేయాలని ఆదేశించారు. అక్టోబర్ 3లోగా వ్యక్తిగతంగా లేదా పోస్టు ద్వారా లేదంటే తమ ప్రతినిధి ద్వారా వివరాలను పంపాలని, లేదంటే జరిమానా విధిస్తామన్నారు.
విలువ వేల కోట్లలో..
ఆదాయపన్ను శాఖ జారీ చేసిన నోటీసుల్లోని ఆస్తుల వివరాలు విస్తుగొలుపుతున్నాయి. వందలు, వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములు, నివాస స్థలాలు కేవలం ఐదుగురి పేరిట రిజిస్టర్ అయి ఉన్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా, నల్లగొండ, ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఆస్తులు ఇందులో ఉన్నాయి. నయీం తల్లి, భార్య, అక్క, తమ్ముడి భార్య, కూతురు పేర్లపై 258 ఎకరాలకు పైగా వ్యవసాయ, వ్యవసాయేతర భూములున్నాయి. వీటి విలువ కనీసం రూ.500 కోట్లు దాటుతుందని అంచనా. ఇక నివాస స్థలాల విషయానికి వస్తే మొత్తం 12,911 చదరపు గజాల ప్లాట్లు ఈ ఐదుగురి పేరిట రిజిస్టర్ అయ్యాయి. అందు లో తమ్ముడి కూతురు అలేహ బేగం పేరిట ఎక్కువగా రిజిస్టర్ కావడం గమనార్హం. ఆమె ఒక్కరి పేరిటే 7,637 చదరపు గజాల నివాస స్థలాల ఉన్నట్టు ఐటీ నోటీసుల్లో పేర్కొన్నారు.
తల్లి తాహెరాబేగం పేరిట 85 ఎకరాల భూమి, 746 చదరపు గజాల నివాస స్థలం, భార్య హసీనా బేగం పేరిట 69.79 ఎకరాల భూమి, 1,736 చదరపు గజాల నివాస స్థలం, అక్క సలీమా బేగం పేరిట 39.33 ఎకరాల భూమి, 2,937.50 చదరపు గజాల నివాస స్థలం, తమ్ముడి భార్య హీనా కౌసర్‌కు 15.9 ఎకరాల భూమి, 600 చదరపు గజాల నివాస స్థలం, ఆలేహ బేగం పేరిట 47.13 ఎకరాల భూమి, 7,637 చదరపు గజాల నివాస స్థలం ఉంది. భువనగిరిలోని ఖిలానగర్‌లో ఉన్న నయీం ఇంటిని తల్లి, భార్య, అక్క పేర్ల మీద ఉమ్మడి రిజిస్ట్రేషన్ చేయడంతో ముగ్గురికీ నోటీసులు జారీ చేశారు.