
హైదరాబాద్ : నయీం కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ఆదాయపన్ను శాఖ అధికారులు నయీం భార్యకు నోటీసులు పంపించారు. నయీం అక్రమంగా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టారని అవన్నీ ఎలా వచ్చాయో తమకు వివరించాని పేర్కొంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరిలోగల నయీం ఇంటికి ఈ నోటీసులు అంటించారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది. భువనగిరి, పరిసర ప్రాంతాలు, యాదగిరిగుట్ట, ఔషాపూర్, కుందన్‌పల్లి, కీసర, హైద్రాబాద్‌లో ఉన్న భూములపై వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు. బినామీ ఆస్తుల లావాదేవీలపై ఐదుగురు కుటుంబ సభ్యుల పేరుతో నోటీసులు జారీ చేశారు. అక్టోబర్ 3వ తేదీలోగా సమాధానమివ్వాలని ఆదేశించారు. నయీం తల్లి తహెరా బేగం, సోదరి సలీమా బేగం, హుసేనా బేగం, అహేళ బేగం, హీనా కౌసర్ పేర్లతో ఈ నోటీసులు జారీ అయ్యాయి. తెలంగాణలో నయీం కేసు పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.
నయీం ఎన్‌కౌంటర్ తర్వాత కాస్త హడావిడి చేసిన సిట్ పోలీసులు ఆ తర్వాత కేసు విషయంలో కాస్త నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కొద్ది రోజులుగా ఈ కేసు గురించి పెద్దగా చర్చ లేదు. అయితే, తాజాగా నయీం భార్యకు, తల్లికి, సోదరీమణులకు నోటీసులు పంపించారు. మొత్తం 26చోట్ల నయీం ఆస్తులు గుర్తించామని, వాటిల్లో బినామీలు నయీం భార్య, తల్లి, సోదరీమణులు ఉన్నట్లు తాము గుర్తించామని పేర్కొన్న ఐటీ అధికారులు వారి నుంచి వివరాలు కోరారు.