
ఒక ఇన్వెస్టర్ ఒక పథకంలో సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌ను నిలిపివేసి, ఆ పెట్టుబడులను కొనసాగించినట్టయితే.. ఎక్స్‌పెన్స్ రేషియోని ఆ పెట్టుబడుల నుంచి వసూలు చేస్తూనే ఉంటారా?
– అనిల్ మిశ్రా
మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను కొనసాగించినంత కాలం వాటి విలువపై ఎక్స్‌పెన్స్ రేషియోని అమలు చేస్తుంటారు. ఎక్స్‌పెన్స్ రేషియో అన్నది మ్యూచువల్ ఫండ్ సంస్థ వసూలు చేసే వార్షిక చార్జీ. పెట్టుబడుల నిర్వహణ కోసం అయ్యే వ్యయాలు, ఇతర నిర్వహణ వ్యయాలను చార్జీల రూపంలో వసూలు చేసుకుంటాయి. వార్షిక చార్జీ అయినప్పటికీ.. దీన్ని ఏరోజుకారోజు పెట్టుబడుల విలువ నుంచి మినహాయించుకుంటాయి. మనకు రోజువారీగా మార్పునకు గురయ్యే ఫండ్ యూనిట్ల ఎన్‌ఏవీ తెలుసుకదా.
చార్జీలను మినహాయించుకున్న తర్వాతే ఈ ఎన్‌ఏవీ ఖరారవుతుంది. సిప్ నిలిపివేశారంటే అప్పటి నుంచి ఆయా పథకంలో మీరు తాజా పెట్టుబడులు పెట్టరనే అర్థం. కానీ, అప్పటికే చేసిన పెట్టుబడులను ఆ ఫండ్ సంస్థ నిర్వహించాలి కదా. అందుకని తమ నిర్వహణలోని మొత్తం ఆస్తులపై (ఏయూఎం) ఎక్స్‌పెన్స్ రేషియోని వసూలు చేసుకుంటాయి. కాకపోతే తక్కువ ఎక్స్‌పెన్స్ రేషియో ఉన్న పథకాన్ని ఎంపిక చేసుకోవడం ద్వారా దీర్ఘకాలంలో రాబడులను మరింత వృద్ధి చేసుకోవచ్చు.
నేను పన్ను ఆదా కోసం ప్రజా భవిష్యనిధి పథకంలో (పీపీఎఫ్) క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఆదాయపన్నులో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ విధానంలోనూ నేను పీపీఎఫ్ పెట్టుబడులపై పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చా? ఈ ప్రయోజనం గరిష్టంగా ఎంత వరకు ఉంటుంది?
– బల్లూ నాయక్
ఆదాయపన్ను పాత విధానంలో పీపీఎఫ్‌లో ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే పెట్టుబడి గరిష్టంగా రూ.1.5 లక్షలపై సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా వడ్డీ ఆదాయం, గడువు తీరిన తర్వాత చేతికి వచ్చే మొత్తంపైనా పన్ను లేదు. ఒకవేళ కొత్త పన్ను విధానాన్ని మీరు ఎంపిక చేసుకున్నట్టయితే.. సెక్షన్ 80సీ కింద పీపీఎఫ్‌లో చేసే పెట్టుబడులపై పన్ను ప్రయోజనాన్ని కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే కొత్త ఆదాయపన్ను విధానం తక్కువ పన్ను రేట్లతో ఉంటుంది. ఇందులో చాలా వరకు పన్ను మినహాయింపులను తొలగించేశారు.
పీపీఎఫ్‌లో పెట్టుబడులపై పన్ను ఆదా ప్రయోజనం కూడా కొత్త విధానంలో లేదు. అయితే, కొత్త పన్ను విధానాన్ని ఎంపిక చేసుకోవాలా లేక పాత విధానమా? అన్నది మీ ఆదాయం, మినహాయింపులను ఎంత మేర క్లెయిమ్ చేసుకోగలరన్న పరిస్థితులపైనే ఆధారపడి ఉంటుంది. పాత పన్ను విధానంలో పీపీఎఫ్, ఇన్సూరెన్స్, గృహ రుణం చెల్లింపులు.. ఇలా అన్ని రకాల మినహాయింపులను క్లెయిమ్ చేసుకునేట్టు అయితే అదే ఎక్కువ ప్రయోజనాన్ని ఇస్తుంది. కొత్త విధానం సులభతరంగా, తక్కువ పన్ను రేట్లతో ఉంటుంది.
సమాధానాలు : ధీరేంద్ర కుమార్, సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్