New tax regime
-
పన్ను భారం తగ్గేదెలా..?
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి రిటర్నులు దాఖలు చేసే వారికి నూతన పన్ను విధానం డిఫాల్ట్‌గా ఎంపికై ఉంటుంది. పాత పన్ను వ్యవస్థతోనే కొనసాగాలనుకుంటే విధిగా దానిని ఎంపిక చేసుకోవాల్సిందే. లేదంటే కొత్త విధానం అమలవుతుంది. పాత వ్యవస్థతో పోలిస్తే కొత్త పన్ను విధానంలో పన్ను భారం తక్కువ. కానీ, పాత విధానంలో పన్ను మినహాయింపులు, తగ్గింపులు ఎక్కువ. వీటిని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే కనుక కొత్త విధానంతో పోలిస్తే గణనీయమైన పన్ను భారాన్ని తగ్గించుకోవచ్చు. దీంతో నికరంగా చెల్లించే పన్ను తగ్గిపోతుంది. మరి వీటిల్లో తమకు ఏది అనుకూలమో తేల్చుకోవాలంటే, ఈ వివరాలు తెలుసుకోవాల్సిందే. ఆదాయపన్ను భారాన్ని సాధ్యమైనంత తగ్గించుకోవాలని కోరుకునే వారికి.. పాత, కొత్త పన్ను విధానాల్లో ఎంపిక కీలకం అవుతుంది. చట్టప్రకారం మీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంటే, అప్పుడు విధిగా రిటర్నులు దాఖలు చేసి నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాలి. పాత, కొత్త పన్ను రేట్లను ఒకసారి పరిశీలిద్దాం. ఈ రెండు వ్యవస్థల్లోనూ కొంత పన్ను రాయితీ ఉంది. పాత విధానంలో నికరంగా రూ.5 లక్షలు, నూతన విధానంలో నికరంగా రూ.7 లక్షలు మించకుండా పన్ను వర్తించే ఆదాయం ఉంటే సెక్షన్ 87ఏ కింద ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదు. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల ప్రయోజనాన్ని కూడా కలిపి చూస్తే వేతన జీవులు పాత విధానంలో రూ.5.50,000 ఆదాయం, కొత్త విధానంలో రూ.7,50,000 మించని ఆదాయంపై రూపాయి పన్ను కట్టక్కర్లేదు. ఆదాయపన్ను చట్టంలోని వివిధ సెక్షన్ల కింద వేర్వేరు సాధనాల్లో ఇన్వెస్ట్ చేసి పన్ను ప్రయోజనాన్ని క్లెయిమ్ చేసుకోలేని వారికి నూతన విధానమే అనుకూలం. పాత విధానంలో సెక్షన్ 80సీ, 80డీ, 24 ఇలా పలు సెక్షన్ల కింద పన్ను తగ్గింపులు, మినహాయింపులను వినియోగించుకుంటే, రూ.5 లక్షలకు పైన ఆదాయం ఉన్నవారు సైతం గణనీయమైన ప్రయోజనాన్ని పొందొచ్చు. ఇంతకుమించి ఆదాయం కలిగిన వారు ఈ రెండింటిలో ఏది లాభదాయకమో తేల్చుకోవాలంటే కొంత కసరత్తు అవసరం. పీపీఎఫ్, సుకన్య సమృద్ధి దీని కింద పీపీఎఫ్, ఈఎల్ఎస్ఎస్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సరి్టఫికెట్, పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్లో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మొత్తంపై పన్ను లేకుండా చూసుకోవచ్చు. జీవిత బీమా పాలసీకి చెల్లించే ప్రీమియం, పిల్లల ట్యూషన్ ఫీజులను కూడా ఈ సెక్షన్ కింద చూపించుకోవచ్చు. గృహ రుణం తీసుకుని, ఒక ఆర్థిక సంవత్సరంలో దీనికి చేల్లించే అసలును (ప్రతి ఈఎంఐలో అసలు, వడ్డీ భాగం ఉంటుంది) సెక్షన్ 80సీ కింద చూపించి, ఆ మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంను సెక్షన్ 80డీ కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. 60 ఏళ్లలోపు వయసున్న వారు రూ.25,000 వరకు, అంతకుమించిన వయసు వారికి రూ.50,000 వరకు పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది. ఇదే సెక్షన్ కింద హెల్త్ చెకప్‌లకు చేసే వ్యయం రూ.5,000 వరకు పన్ను మినహాయింపు ఉంది. విరాళాలు ఇస్తే.. అర్హత కలిగిన సంస్థలకు విరాళాలు ఇస్తే, ఆ మొత్తంపై సెక్షన్ 80జీ కింద పన్ను భారం ఉండదు. ఇక సెక్షన్ 80టీటీఏ కింద సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్లపై ఆర్జించే వడ్డీ రూ.10,000 మొత్తంపై పన్ను లేదు. అదే 60 ఏళ్లు నిండిన వారికి వడ్డీ ఆదాయం రూ.50,000పై పన్ను లేదు. ఇవన్నీ పాత పన్ను విధానంలో ఉన్న చక్కని పన్ను మినహాయింపు ప్రయోజనాలు. పన్ను ఆదా, పెట్టుబడులు పాత వ్యవస్థలో ఉన్న పన్ను ఆదా ప్రయోజనాలను ఉపయోగించుకుంటే, మరింతగా పన్ను ఆదా చేసుకోవచ్చని లాడర్7 ఫైనాన్షియల్ అడ్వైజర్స్ వ్యవస్థాపకుడు సురేష్ శడగోపన్ పేర్కొన్నారు. వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఒకవైపు పెట్టుబడులపై రాబడిని, మరోవైపు పన్ను ఆదా చేసుకోవడానికి వీలుంటుంది. కొత్త పన్ను విధానంలో పెట్టుబడులకు ఎలాంటి ప్రోత్సాహం లేదు. అంటే ఇది పెట్టుబడులను నిర్బంధం చేయదు. ఎన్పీఎస్ వేతన జీవులు, స్వయం ఉపాధిలోని వారు, ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఎన్పీఎస్పై పన్ను ప్రయోజనాలు ఉన్నాయి. వేతన జీవులు అయితే తమ మూలవేతనం, డీఏలో 10 శాతం మేర ఎన్పీఎస్కు చందా జమ చేయడం ద్వారా ఆ మొత్తంపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. స్వయం ఉపాధిలో ఉన్న వారు తమ మొత్తం ఆదాయంలో 20 శాతంపై ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. ఈ సెక్షన్ కింద ఈ రెండు వర్గాలకు గరిష్ట ప్రయోజనం రూ.1.5 లక్షలు. ఇక 80సీసీడీ (1బి) కింద వేతన జీవులు, స్వయం ఉపాధి పొందుతున్న వారు రూ.50,000 జమలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. పైన చెప్పుకున్న రూ.1.5 లక్షలకు ఇది అదనం. 80సీసీడీ(2) కింద వేతన జీవులకు అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగి ఎన్పీఎస్ ఖాతాలో సంస్థ చేసే జమలు దీనికింద వస్తాయి. ప్రభుత్వరంగ ఉద్యోగులు అయితే తమ మూలవేతనం, డీఏలో 14 శాతం, ప్రైవేటు ఉద్యోగులు 10 శాతం మేర యాజమాన్యం జమలపై పన్ను మినహాయింపు పొందొచ్చు. ఇక్కడ గరిష్ట పరిమితి రూ.7.5 లక్షలు. ఈపీఎఫ్ జమలు కూడా ఈ పరిమితిలో భాగమే. హెచ్ఆర్ఏ అద్దె ఇంట్లో ఉంటూ, పనిచేసే సంస్థ నుంచి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) పొందుతుంటే అప్పుడు కూడా పన్ను ప్రయోజనాన్ని అందుకోవచ్చు. మెట్రోల్లో నివసించే వారు తమ మూల వేతనం, డీఏలో 50 శాతం మేర సెక్షన్ 10(13ఏ) కింద క్లెయిమ్ చేసుకోవచ్చు. నాన్ మెట్రోల్లోని వారికి ఈ పరిమితి 40 శాతంగా ఉంది. అలాగే, హెచ్ఆర్ఏ రూపంలో ఒక ఆర్థిక సంవత్సరంలో అందుకున్న మొత్తం.. మూలవేతనం, డీఏలో 10 శాతాన్ని వాస్తవంగా చెల్లించిన అద్దె నుంచి తీసివేయగా వచ్చే మొత్తం.. ఈ మూడింటిలో ఏది తక్కువ అయితే ఆ మొత్తంపై పన్ను మినహాయింపు పొందొచ్చు. పనిచేసే ప్రాంతంలో సొంత ఇంట్లో నివాసం ఉండే వారికి హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపు రాదు. పనిచేసే చోట అద్దె ఇంట్లో ఉంటూ, వేరే ప్రాంతంలో సొంతిల్లును అద్దెకు ఇచి్చన వారు సైతం హెచ్ఆర్ఏపై పన్ను మినహాయింపును పొందొచ్చు. లీవ్ ట్రావెల్ అలవెన్స్ (ఎల్‌టీఏ) పన్ను పరిధిలోకి వస్తుంది. ప్రయాణాలకు చేసిన ఖర్చును చూపించి, పన్ను భారం తొలగించుకోవచ్చు. గృహ రుణం/విద్యా రుణం రుణంపై ఇంటిని కొనుగోలు చేసే ధోరణి పెరిగింది. ఉద్యోగంలో చేరిన తొలినాళ్లలోనే ఇప్పుడు యువత సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. ఇలాంటి వారు కొంత డౌన్ పేమెంట్ చెల్లించి, మిగిలిన మొత్తానికి రుణం తీసుకుంటున్నారు. ఈ రుణానికి చేసే అసలు చెల్లింపులు ఒక ఏడాదిలో రూ.1.5 లక్షలను సెక్షన్ 80సీ కింద, వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల మేర సెక్షన్ 24(బి) కింద చూపించుకుని ఆ మొత్తంపై పన్ను కట్టక్కర్లేదు. సొంతగా నివాసం ఉన్నా లేదా అద్దెకు ఇచ్చినా సరే ఈ ప్రయోజనానికి అర్హులే. విద్యా రుణానికి ఒక ఆర్థిక సంవత్సరంలో చేసే వడ్డీ చెల్లింపులు ఎంత ఉన్నా సరే ఆ మొత్తాన్ని రిటర్నుల్లో చూపించుకుని పన్ను లేకుండా మినహాయింపు పొందొచ్చు. మీకు ఏది అనుకూలం? పాత విధానంలో ఇక్కడ పేర్కొన్న మినహాయింపులను పూర్తిగా వినియోగించుకుంటే.. సెక్షన్ 80సీ కింద 1.50 లక్షలు, 80 సీసీడీ (1బి) కింద రూ.50,000 (ఎన్పీఎస్), స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000, గృహ రుణం వడ్డీ రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.9.5 లక్షలపై పన్ను లేనట్టే. అలాగే, ప్రైవేటు ఉద్యోగులు పనిచేసే సంస్థ ద్వారా ఎన్పీఎస్ ఖాతాకు గరిష్టంగా రూ.7.5 లక్షల మేర జమ చేయించుకుంటే అప్పుడు మొత్తం రూ.17 లక్షలపై పన్ను లేనట్టు అవుతుంది. కొత్త విధానంలో రూ.7 లక్షల మొత్తంపై సెక్షన్ 87ఏ కింద పన్ను రాయితీ కలి్పంచారు. దీనికి రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే రూ.7.5 లక్షలపై పన్ను లేదు. ఆదాయం రూ.7,50,001 ఉన్న వారికి 87ఏ రాయితీ వర్తించదు. వారు తమ ఆదాయంపై పూర్తి పన్ను చెల్లించాలి. మొదటి మూడు లక్షలపై పన్ను లేదు. 3–6 లక్షలపై 5 శాతం ప్రకారం రూ.15,000. రూ.6.–7.51 లక్షలపై 10 శాతం ప్రకారం రూ.15,000 కలిపి మొత్తం రూ.30,000, దీనికి సెస్ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. 7.51 లక్షల ఆదాయంపై పాత విధానంలో రిటర్నులు వేసుకునేట్టు అయితే.. 87ఏ రిబేటు, స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి రూ.5.5 లక్షల వరకు పన్ను లేదు. 80సీ సాధనంలో 1.5 లక్షలు ఇన్వెస్ట్ చేసుకుని, దీనికి అదనంగా ఎన్‌పీఎస్‌లో రూ.50,000 ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా రూపాయి పన్ను లేకుండా చూసుకోవచ్చు. విధానాన్ని మార్చుకోవచ్చు.. పాత పన్ను నుంచి కొత్త పన్నుకు.. తిరిగి పాత పన్నుకు మారడంపై ఆంక్షలు ఉన్నాయి. వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆదాయం పొందని వారు ప్రతి ఆర్థిక సంవత్సరంలోనూ పాత, కొత్త పన్ను వ్యవస్థల్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవచ్చు. వృత్తి లేదా వ్యాపారం నుంచి ఆదాయం పొందుతున్న వారు సెక్షన్ 115బీఏసీ కింద నూతన పన్ను విధానం నుంచి వైదొలిగే ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. అప్పుడు తిరిగి నూతన పన్ను విధానానికి ఒక్కసారి మాత్రమే మారే అవకాశం ఉంటుంది. ‘‘తక్కువ పన్ను శ్లాబుల పరిధిలో ఆదాయం కలిగిన వారికి నూతన పన్ను విధానమే మెరుగైనది. అధిక రేటు శ్లాబుల్లో ఉన్నవారు, అన్ని రకాల మినహాయింపులు వినియోగించుకుంటే వారికి పాత విధానం అనుకూలం’’అని రైట్ హారిజాన్స్ సీఈవో అనిల్ రెగో సూచించారు. -
కొత్త పన్ను విధానం ఏప్రిల్ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా పన్ను లేదు!
ఆదాయపు పన్నుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పన్ను విధానం 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి అంటే వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తోంది. కొత్త ఆదాయపు పన్ను విధానంలో జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు రూ. 7.5 లక్షల వరకూ వార్షిక ఆదాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: ఈ పథకంతో సీనియర్ సిటిజన్స్‌కు రూ.20 వేల వరకు రాబడి! 2023 బడ్జెట్ ఏమి చెబుతోంది? ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 7 లక్షలకు మించకుంటే అలాంటివారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని 2023 బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87ఏ కింద లభించే గరిష్ట రాయితీ పరిమితిని 2023 బడ్జెట్లో రూ.12,500 నుంచి రూ.25,000కి పెంచింది. (ఇక ఎయిర్‌ప్యాడ్స్ కూడా తక్కువ ధరకే: రూ. 1,654 కోట్లతో ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీ!) సెక్షన్ 87ఏ కింద రాయితీ ఎవరికి వర్తిస్తుంది? ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. సెక్షన్ 87ఏ కింద రాయితీ కేవలం భారత్‌లో నివాసం ఉంటున్న వారికి మాత్రమే. ప్రవాసభారతీయులు (ఎన్నారైలు), హిందూ అవిభక్త కుటుంబాలు, సంస్థలు వంటి ఈ రాయితీకి అనర్హులు. స్టాండర్డ్ డిడక్షన్ జీతం అందుకునే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 2023 కొత్త బడ్జెట్లో రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను పొడిగించింది. ఇంతకు ముందు స్టాండర్డ్ డిడక్షన్ పాత ఆదాయపు పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉండేది. రూ. 7.5 లక్షల వరకూ పన్ను లేదు 2023 బడ్జెట్లో ప్రకటించిన తగ్గింపు, రాయితీ, ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పుల ఫలితంగా ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పింఛన్‌దారులు వార్షిక ఆదాయం రూ. 7.5 లక్షల వరకూ ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. ప్రాథమిక మినహాయింపుపై గందరగోళం వద్దు 2023 బడ్జెట్ ప్రకారం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. మరి రూ.7.5 లక్షల వరకు పన్ను లేదని ఎలా చెబుతున్నారని గందరగోళానికి గురికావద్దు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 3 లక్షలు దాటితే పన్ను విధిస్తారు. అయితే రూ.7.5 లక్షల వరకు ఆదాయం ఉన్నా కూడా కొత్త పన్ను విధానంలో రిబేట్, తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు. -
చాయిస్ మనదే! అంకెలు తెలిశాక అడుగేయండి.. భారీగా పన్ను ఆదా చేసుకోండి
- ట్యాక్సేషన్ నిపుణులు కె.సీహెచ్.ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య బడ్జెట్ వచ్చింది. 1–4–2023 నుంచి ప్రారంభమయ్యే సంవత్సరానికి అది వర్తిస్తుంది. అంటే 2023–24 ఆర్థిక సంవత్సరంలో (01–04–2023 నుంచి 31–03–2024 వరకు) సంపాదించిన లేదా సంబంధిత ఆదాయం మీద పన్ను భారం లెక్కించాలి. అలా లెక్కించడానికి బడ్జెట్లో మార్పులు చేశారు. ఆ మార్పుల ప్రకారం రిటర్నుల దాఖలుకు కొత్త విధానానికి మళ్లుతామా లేదా పాత పద్ధతే కొనసాగిస్తామా అన్నది మన ఇష్టం. ఎంపిక మనదే. చాయిస్ మనదే. ఏం చేద్దాం అన్న ఆలోచన .. ఎలా చేద్దాం అన్న ప్లానింగ్ విషయంలో మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. అలాగే తీసుకోండి. ఆదాయపు అంకెలు తెలిశాక అడుగు వేయండి. మీరు గుర్తుంచుకోవల్సిన విషయాలు. 01–04–2023 నుండి మొదలయ్యే సంవత్సరంలో మీ ఆదాయం ఎంత అనేది.. వేతన జీవులు .. గవర్నమెంటు వారైతేనేం, స్థిరంగా జీతభత్యాలు వచ్చే వారైతేనేం .. ఎవరైనా సరే కరెక్టుగా అంచనా వేసుకోవచ్చు. ప్రైవేట్ సంస్థల్లోని ఉద్యోగస్తులు, ఉద్యోగం రాని వాళ్లు, లేని వాళ్లు అంచనా వేసుకోవడం కొంచెం కష్టం. వ్యాపారం/వృత్తుల్లో ఉన్నవారు కూడా అంచనా వేయడం కష్టమే. విధిగా.. అంటే తప్పనిసరిగా పీఎఫ్ కట్టేవారు, ఇంటి రుణం మీద వడ్డీ చెల్లించేవారు, రుణాన్ని సక్రమంగా చెల్లించేవారు, పిల్లలకు స్కూలు ఫీజులు చెల్లించేవారు, వీరందరికీ తప్పనిసరిగా 80సీ సెక్షన్ ప్రకారం తగ్గింపు లేదా మినహాయింపు ఉంటుంది. వీరు ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అంటే పన్ను ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా పైన చెప్పినవి అన్నీ ఆచరిస్తారు. అప్పుడు కొత్త విధానం వైపు మొగ్గు చూపించనక్కర్లేదు. కానీ, చెక్ చేసుకోండి. కొత్త విధానంలో ప్రయోజనం ఉంటుందంటే అటు వైపు వెళ్లండి. ఇలాంటప్పుడు మీ ప్లానింగ్ .. ట్యాక్స్ ప్లానింగ్‌తో కన్నా ఫైనాన్షియల్ ప్లానింగ్‌తో ముడిపడినట్లు. పీఎఫ్ పరిధిలోకి రానివారు, సేవింగ్స్ చేయలేని వాళ్లు, ఇల్లు లేని వారు, పిల్లలు లేనివాళ్లు .. వీళ్లంతా మరో కేటగిరీ. వీరికి 80సీ ప్రయోజనం అవసరం లేదు. ఆ సెక్షన్‌ని ఆశ్రయించనక్కర్లేదు. అలాంటప్పుడు పాత విధానం వైపు కన్నెత్తి చూడనక్కర్లేదు. కొత్త విధానమే సో బెటర్. ఒక విధానం కింద .. భవిష్యత్ కోసం దాచుకోవడం .. లేదా ఇన్వెస్ట్ చేయడం. ఈ మేరకు మీ బ్యాంకులో నుంచి రూ. 2,00,000 స్థిరంగా వెళ్లిపోతుంది. ఇంత మొత్తం లేకపోయినా సంసారాన్ని లాక్కుని రాగలరా? అయితే 80సీని ఆశ్రయించండి. ఎందుకు మాస్టారూ .. అంత మొత్తాన్ని బ్లాక్ ( ఆఔౖఇఓ) (నల్లధనం కాదు) చేసుకోవడం .. చేతుల్లో డబ్బు లేకుండా ఇబ్బంది పడటం? అని ఆలోచించే అవసరాల ఆనందరావు ఉంటారు.. ముందు జాగ్రత్తే ముఖ్యం అనే ముత్యాలరావు ఉంటారు. అమ్మాయి పెళ్లి కోసం ఆలోచించే కల్యాణరావు, అబ్బాయి చదువు కోసం ఆలోచించే సరస్వతీరావు, సొంతిల్లు కోసం కలలు కనే శోభనబాబు, ఫిక్సిడ్ డిపాజిట్ల పిన్నమయ్య, ఎన్నెస్సీల ఎంకయ్య ఇలా ఎందరో మనలో... మీ బాణీ మీదే, మీ ధోరణి మీదే, మీ ప్రాధాన్యత మీదే.. ఆలోచించి అడుగేయండి. పన్నుకు సంబంధించిన సందేహాలు ఏవైనా ఉంటే పాఠకులు business@sakshi.comకు ఈ–మెయిల్ పంపించగలరు. -
New Tax Regime: కొత్త పన్ను విధానంతో మధ్యతరగతికి మరింత మేలు: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: కొత్త పన్ను విధానంతో మధ్యతరగతి ప్రజలకు లబ్ధి కలుగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దీని ద్వారా మధ్యతరగతి వారి చేతుల్లో ఎక్కువ డబ్బు మిగులుతుందన్నారు. ఆర్బీఐ కేంద్ర బోర్డుతో సమావేశం అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. కేవలం ప్రభుత్వ పథకాల్లోనే పెట్టుబడులు పెట్టే విధంగా ప్రజలను ప్రేరేపించాల్సిన అవసరం లేదని, పెట్టుబడులపై వ్యక్తిగత నిర్ణయం తీసుకునే అవకాశం వారికి కల్పించాలన్నారు. డబ్బు సంపాదించి, ఇంటిని నడిపించే వ్యక్తికి తన డబ్బును ఎక్కడ పెట్టాలో, ఎలా ఆదా చేసుకోవాలో బాగా తెలుసున్నారు. స్టాండర్డ్ డిడక్షన్‌కు అవకాశం కల్పించడంతోపాటు మారిన శ్లాబులు, పన్ను రేట్లతో సగటు పన్ను చెల్లింపుదారుడి చేతిలో ఎక్కువ డబ్బు మిగులుతుందన్నారు. కొత్త బడ్జెట్లో నిర్మలా సీతారామన్ నూతన పన్ను విధానాన్ని ఎంచుకునే వారికి 50వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రతిపాదించారు. పన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలకు పెంచారు. అలాగే రాయితీలతో కూడిన పన్ను విధానంలోనూ పన్ను శ్లాబ్ రేట్లను పునర్వ్యవస్థీకరించారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రూ.3 లక్షల వరకు వార్షికాదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. రూ.3లక్షల నుంచి 6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.6 లక్షల నుంచి 9 లక్షల వరకు 10 శాతం, రూ.9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం, రూ.12 లక్షల నుంచి15 లక్షల వరకు 20 శాతం, రూ.15 లక్షలకు పైగా వార్షికాదాయం ఉన్న వారు 30 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మధ్యతరగతి ప్రజలపై పన్ను భారం తగ్గించడానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని, పన్ను విధానాన్ని సరళీకరిస్తామన్న మాటను నిలబెట్టుకుందని ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. అదానీ గ్రూప్ సంక్షోభంపై మంత్రి స్పందిస్తూ.. దేశంలోని నియంత్రణ సంస్థలు ఎంతో అనుభవం కలిగినవని, పరిణామాలను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నాయన్నారు. అలాగే క్రిప్టో కరెన్సీ అంశంపై మాట్లాడుతూ బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ ఆస్తులపై నియంత్రణకు సంబంధించి ఉమ్మడి అభిప్రాయం కోసం జీ20 దేశాల సమావేశాల్లో చర్చిస్తామన్నారు. -
జీఎస్టీ వచ్చేస్తోంది: ఇక వారికే ఫుల్ డిమాండ్
ముంబై : దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానంలోకి తీసుకొచ్చే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్(జీఎస్టీ) మరికొన్ని రోజుల్లో అమలుకాబోతుంది. జూన్ 30న అర్థరాత్రి పార్లమెంట్ వేదికగా దీన్ని గ్రాండ్ గా లాంచ్ చేసి, జూలై 1 నుంచి అమలుచేయబోతున్నారు. దీంతో అన్ని రంగాల కంపెనీలు ఇప్పటికే ఈ కొత్త జీఎస్టీ విధానానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత పన్ను, టెక్నాలజీ నిపుణులకు భారీగా డిమాండ్ ఏర్పడునుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఎఫ్ఎంసీజీ రంగంలో వీరికి భారీగా డిమాండ్ ఉంటుందని, తర్వాత కన్జ్యూమర్ గూడ్స్, ఫార్మాస్యూటికల్స్, రియల్ ఎస్టేట్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో పన్ను, టెక్నాలజీ నిపుణుల అవసరం ఎక్కువగా ఉంటుందని తెలిసింది. ఈ కొత్త పన్ను విధానంతో ప్రయోజనాలు పొందడానికి సంస్థలు వీరిని నియమించుకుంటారని ఇండస్ట్రి నిపుణులు, నాలుగు అతిపెద్ద ఆడిట్ సంస్థల ఎగ్జిక్యూటివ్ లు చెబుతున్నారు. పన్ను అవగాహన అధికారులు, నిపుణులు చెబుతున్న ప్రకారం, జీఎస్టీని నమోదుచేసుకున్న కంపెనీలు చివరికి 90 లక్షలుగా ఉంటాయని, వారిలో 1 శాతం పెద్ద కంపెనీలుంటే, ఆ కంపెనీలకు జీఎస్టీ బాధ్యతలు నిర్వర్తించడానికి కనీసం ఐదుగురు నిపుణులు అవసరం పడతారని పేర్కొన్నారు. అంతేకాక 10 శాతం మధ్యస్థాయి కంపెనీల్లో కనీసం ఒకవ్యక్తి అవసరం పడతారని చెప్పారు. దీంతో ఈ కొత్త జీఎస్టీ విధానంతో 1.3 మిలియన్ నిపుణులకు డిమాండ్ ఏర్పడుతుందన్నారు. కొన్ని బాధ్యతలను ప్రస్తుతమున్న సేల్స్, ఇతర పన్నుల నిపుణులు నిర్వర్తించవచ్చు, కానీ కొత్తగా ప్రతిభావంతులును కూడా నియమించుకోవాల్సినవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. పన్ను వైపుగా అయితే లాయర్లు, ఛార్టెడ్ అకౌంటెంట్లు, కాస్ట్ అకౌంటెంట్లు, ట్యాక్స్ కన్సల్టెంట్స్ కు భారీగా డిమాండ్ ఉంటుందని ఇండస్ట్రీ నిపుణులు చెప్పారు. టెక్నాలజీ వైపు అయితే సాఫ్ట్ వేర్ నిపుణులకు అవసరం ఎక్కువగా ఉంటుందన్నారు. అంతేకాక సెమీ-స్కిల్డ్ వర్కర్లకు కూడా డిమాండ్ ఏర్పడుతుందని నిపుణులు తెలిపారు. జీఎస్టీ రిటర్న్స్ లను, ప్రభుత్వ డేటా బేస్ లతో సమకాలీకరించాల్సి ఉంటుంది. జీఎస్టీ మేనేజర్, వీపీ-జీఎస్టీ లేదా జీఎస్టీ టీమ్ లీడర్ వంటి కొన్ని పొజిషన్లు క్రియేట్ అవుతాయని ఓ సంస్థ సీరియర్ డైరెక్టర్ చెప్పారు. కొత్త జీఎస్టీ విధానాన్ని సరిగ్గా అమలుచేయలేకపోతే, కంపెనీలకే రెవెన్యూలు, లాభాలు పోతాయని, దీంతో మార్కెట్ షేరును వారు కోల్పోతారని పలువురు పేర్కొంటున్నారు. కార్పొరేట్లలో జీఎస్టీపై ఎంతో బాధ్యతతో పనిచేసేవారిని తీసుకోవాల్సి ఉంటుందన్నారు. మంచి ప్రణాళికతో దీన్ని అమలుచేస్తే, అన్ని సమస్యలను అధిగమించవచ్చని, ఆర్థిక పొదుపులో జీఎస్టీ ఎంతో కీలకమైనదని పేర్కొంటున్నారు.