
మూడు బడ్జెట్ల నుంచి ఇదే ప్రశ్న.. పాత పన్ను విధానమా? కొత్త పన్ను విధానమా? ఏది మంచిది. ఏది ఎక్కువ ఉపయోగకరం. ఏది ఎవరికి ఎక్కువ ప్రయోజనకరం. ఏది మంచిదని ప్రశ్నించే బదులు ఏది ఉపయోగం అనేది సరైన ప్రశ్న. మళ్లీ పాత ప్రశ్నే. ఇరవై ఏళ్లు లేదా అంతకన్నా ముందు నుంచి అస్సెస్సీలతో సేవింగ్స్ చేయించి, అలా చేసినందుకు ఆ మేరకు మినహాయింపును ఇస్తూ వచ్చేవారు. ఏయే సెక్షన్ల ప్రకారం సేవ్ చేస్తే మినహాయింపు వస్తుంది.. అని ఆలోచించి అడుగేసేవాళ్లు.
ఉద్యోగస్తులకు కంపల్సరీగా పీఎఫ్ తప్పదు. అంతేకాకుండా, ట్యాక్స్ విధానంలో ‘మినహాయింపు’ను అతిగా వాడారు. డిపాజిట్ చేస్తే మినహాయింపు, విత్‌డ్రా చేస్తే మినహాయింపు, దాని మీద వడ్డీకి కూడా మినహాయింపు. సంక్షేమం అనుకోండి, పొదుపు అనుకోండి, అలవాటు అనుకోండి, ఆకర్షణీయం అనుకోండి.. పీఎఫ్‌ను అతిగా ఆశ్రయించారు. ఇలాగే ఎన్నో పథకాలు. 80సీని ప్రోత్సహిస్తూ ఇరవై పైచిలుకు పథకాలను ప్రవేశపెట్టారు. లిమిట్‌ని పెంచుతూ, 10 సంవత్సరాల పాటు రూ.1,50,000 గరిష్ట పరిమితిగా ఉంచారు. ప్రతి సంవత్సరం ఆ రూ.1,50,000 పరిమితి పెరుగుతుందని అందరూ ఎదురుచూస్తూ వచ్చారు. కానీ నిరాశే. ఎటువంటి మార్పూ లేదు. కనీసం ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కూడా మార్పులు తేలేదు. ఇది. అన్యాయమే. అలాగే ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ఇచ్చే వెసులుబాటైన స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపులో పెంపుదల.. రద్దు.. పునరుద్ధరణ .. పెంపుదల ఇలా మార్పులు తెచ్చారు. ఈ మినహాయింపుని అలాగే కొనసాగిస్తూ ద్రవ్యోల్బణానికి అనుగుణంగా మారిస్తే బాగుండేది. ఇలాంటివి ఎన్నో మినహాయింపులు ఉన్నాయి.
ఇదీ చదవండి: ఆర్బిట్రేజ్ ఫండ్స్‌తో మెరుగైన రాబడులు
పాతకాలం నాటి అంకెలు.. ఆంక్షలు.. వీటిని ఏమీ మార్చకపోవడాన్ని ‘పాలసీ’ అని సరిపెట్టుకోలేము. ప్రభుత్వపు అనిశ్చితి వైఖరి ఇది అనే చెప్పాలి. గత నెలలో ట్రంప్ గెలుపు, తీసుకురాబోయే విప్లవాత్మక మార్పులు, వాటి తీవ్ర ప్రభావం మన ప్రజల మీద ఉంటుంది అని తెలిసినా స్పష్టత లేదు. అలాంటి పరిస్థితుల్లో వచ్చింది మన సీతమ్మగారి పద్దు. ఒక ప్రశ్న మాత్రం మారలేదు. అదేమిటంటే.. ఏది బెటర్? పాత విధానమా లేక కొత్త విధానమా? అయితే, నిస్సందేహంగా ప్రభుత్వ జోరు, హోరు, వైఖరి, ధోరణి అంతా కొత్త విధానం వైపే మొగ్గు చూపుతోంది. ‘పొమ్మనలేక పొగబెట్టినట్లు’ పాత విధానాన్ని ప్రోత్సహించలేదు. అది ఉంటుందా అని అడిగితే కొనసాగిస్తున్నాం అని అన్నారు ఆర్థిక మంత్రి. అయితే, కొన్ని తేడాలు, సలహాలు, సూచనలను తెలుసుకోవాలి. అవేమిటంటే..

భారీగా మినహాయింపు పొందాలనుకునే వారికి పాతది మంచిది. వినియోగం వైపు మొగ్గు చూపించే వారికి కొత్త విధానం ఆకర్షణీయంగా ఉంటుంది. నిలకడగా, నిర్దిష్టంగా, నిశ్చింతగా ఆలోచించే వారికి పాతదే బెటరేమో? స్వతంత్రంగా వ్యవహరించాలి. సులువుగా ఉండాలి. అనువుగా ఉండాలి. కమిట్మెంట్ వద్దనే వారికి కొత్త విధానం బెటరు. మీ ఆదాయాన్ని లెక్కించండి. కంపల్సరీ సేవింగ్స్‌ని పరిగణనలోకి తీసుకుని ఆలోచించండి. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రెడీమేడ్ కాల్‌క్యులేటర్స్ ఉన్నాయి. అప్పుడు సరైన విధానాన్ని ఎంచుకోండి.
కె.సీహెచ్. ఎ.వి.ఎస్.ఎన్ మూర్తి, కె.వి.ఎన్ లావణ్య
ట్యాక్సేషన్ నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment