
10 ఏళ్లు నిండిన వారికి ఆర్‌బీఐ అనుమతి
ముంబై: పిల్లలు బ్యాంక్ సేవింగ్స్/డిపాజిట్ ఖాతాల ప్రారంభం, నిర్వహణ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. పదేళ్లు నిండిన వారు (మైనర్లు) బ్యాంక్ ఖాతాలు తెరిచేందుకు, సొంతంగా నిర్వహించేందుకు వీలుగా బ్యాంక్‌లకు ఆర్‌బీఐ అనుమతి మంజూరు చేసింది. ఈ దిశగా సవరించిన నిబంధనలను ఆర్‌బీఐ విడుదల చేసింది.
ఏ వయసు మైనర్లు అయినా తమ తల్లిదండ్రులు లేదా చట్టబద్ధమైన సంరక్షకుల ద్వారా సేవింగ్స్, టర్మ్ డిపాజిట్లు తెరిచేందుకు అనుమతిస్తున్నట్టు వాణిజ్య బ్యాంక్‌లు, కోపరేటివ్ బ్యాంక్‌లకు జారీ చేసిన సర్క్యులర్‌లో ఆర్‌బీఐ పేర్కొంది.
బ్యాంక్‌లు తమ రిస్క్ నిర్వహణ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని పదేళ్లు నిండిన మైనర్లు సేవింగ్స్, టర్మ్ డిపాజిట్ ఖాతాలను తెరిచి, స్వతంత్రంగా నిర్వహించుకునేందుకు అనుమతించొచ్చని స్పష్టం చేసింది. అయితే ఇందుకు సంబంధించిన నిబంధనలను ఖాతాదారులకు ముందుగానే తెలియజేయాలని పేర్కొంది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం/డెబిట్ కార్డులు, చెక్‌బుక్ సదుపాయాలను సైతం మైనర్ ఖాతాదారులకు ఆఫర్ చేయొచ్చని తెలిపింది.