జనవరి 1 నుంచి ఈ బ్యాంకు ఖాతాలు క్లోజ్‌.. | These Bank Accounts To Be Closed From January 1 | Sakshi
Sakshi News home page

జనవరి 1 నుంచి ఈ బ్యాంకు ఖాతాలు క్లోజ్‌..

Published Mon, Dec 30 2024 2:29 PM | Last Updated on Mon, Dec 30 2024 3:00 PM

These Bank Accounts To Be Closed From January 1

దేశవ్యాప్తంగా లక్షలాది బ్యాంక్ ఖాతాలను (Bank Account)ప్రభావితం చేసే కీలకమైన మార్పులను 2025 జనవరి 1 నుండి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అమలు చేస్తోంది. ఈ మార్పులను అర్థం చేసుకోవడం, ఆలస్యం కాకముందే మేల్కోవడం చాలా అవసరం. లేకపోతే మీ బ్యాంక్ ఖాతాకు యాక్సెస్‌ను కోల్పోయే ప్రమాదం ఉంది.

బ్యాంకింగ్ లావాదేవీల భద్రత, పారదర్శకత, సామర్థ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో కొన్ని రకాల బ్యాంక్ ఖాతాలను మూసివేయాలని ఆర్బీఐ నిర్ణయించింది. వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా మోసపూరిత కార్యకలాపాలను, ముఖ్యంగా బ్యాంక్ ఖాతా హ్యాకింగ్‌ను  అరికట్టడం, బ్యాంకింగ్‌ రంగంలో డిజిటలైజేషన్, ఆధునికీకరణను ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది.

రిస్క్‌లను తగ్గించడానికి, బ్యాంకింగ్ కార్యకలాపాల్లోని లోపాలను పరిష్కరించడానికి, కస్టమర్‌ల ప్రయోజనాలను పరిరక్షిస్తూ మెరుగైన సేవలను అందించడానికి ఈ కొత్త మార్పులను అమలు చేస్తోంది. ఈ కొత్త మార్గదర్శకాల ప్రకారం 2025 జనవరి 1 నాటికి మూడు నిర్దిష్ట రకాల బ్యాంక్ ఖాతాలను ఆర్బీఐ మూసివేస్తోంది.

డార్మాంట్ అకౌంట్లు
డార్మాంట్ అకౌంట్‌ అంటే రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పాటు ఎటువంటి లావాదేవీలు జరగని ఖాతా. మోసపూరిత కార్యకలాపాల కోసం తరచుగా ఇలాంటి ఖాతాలను లక్ష్యంగా చేసుకునే హ్యాకర్లు ఈ ఖాతాలను దుర్వినియోగం చేసే అవకాశం ఉంది. ఖాతాదారులను, బ్యాంకింగ్ వ్యవస్థను రక్షించడానికి ఆర్బీఐ అటువంటి ఖాతాలను మూసివేయాలని నిర్ణయించింది.

ఇనాక్టివ్‌ అకౌంట్లు
నిర్దిష్ట వ్యవధిలో (సాధారణంగా 12 నెలలు లేదా అంతకంటే ఎక్కువ) లావాదేవీ కార్యకలాపాలు లేని వాటిని ఇనాక్టివ్‌ అకౌంట్లుగా పరిగణిస్తారు. ఖాతా భద్రతను మెరుగుపరచడానికి, మోసపూరిత ప్రవర్తన ప్రమాదాన్ని తగ్గించే ప్రయత్నాలలో భాగంగా ఈ ఖాతాలను కూడా ఆర్బీఐ క్లోజ్‌ చేస్తోంది. మీకూ ఇలాంటి ఇనాక్టివ్‌ అకౌంట్‌ ఉంటే వెంటనే యాక్టివేట్ చేసుకోవడం తప్పనిసరి.

జీరో బ్యాలెన్స్ ఖాతాలు
ఎక్కువ కాలం పాటు జీరో బ్యాలెన్స్‌ని కొనసాగించే ఖాతాలు కూడా క్లోజ్‌ కానున్నాయి. అటువంటి ఖాతాల దుర్వినియోగాన్ని అరికట్టడం, ఆర్థిక నష్టాలను తగ్గించడం, కస్టమర్‌లు తమ బ్యాంకులతో క్రియాశీల సంబంధాలను కొనసాగించేలా ప్రోత్సహించడం ఆర్బీఐ లక్ష్యం. అంతేకాకుండా కేవైసీ (KYC) నిబంధనలను బలోపేతం చేయడం ఈ చర్య ముఖ్య ఉద్దేశం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement