
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముంబైలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్‌పై (New India Co operative Bank) కఠిన ఆంక్షలు విధించింది. ఆరు నెలల పాటు కొత్త రుణాలు మంజూరు చేయకుండా, కొత్త డిపాజిట్లను స్వీకరించకుండా నిరోధించింది. అలాగే క్యాష్ విత్‌డ్రాకు కూడా వీలు లేకుండా చేసింది.
బ్యాంకు ఆర్థిక ఆరోగ్యం, ద్రవ్యత స్థితి గురించి ఆందోళనల కారణంగా ఈ పరిమితులు అవసరమని సెంట్రల్ బ్యాంక్ పేర్కొంది. డిపాజిటర్ల ఆర్థిక భద్రత దృష్ట్యా ఆర్బీఐ ఈ చర్యలు చేపట్టింది. న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ ఇటీవలి సంవత్సరాలలో ఆర్థిక నష్టాలతో సతమతమవుతోంది. దాని వార్షిక నివేదిక ప్రకారం మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో బ్యాంక్ రూ.22.78 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గత సంవత్సరం రూ.30.75 కోట్ల నష్టం వాటిల్లింది.
ఆర్బీఐ ఆదేశాల్లో ఏముందంటే..
2025 ఫిబ్రవరి 13న వ్యాపార లావాదేవీలు ముగిసినప్పటి నుండి ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా రుణాలు మంజూరు చేయడం లేదా పునరుద్ధరించడం, కొత్త పెట్టుబడులు పెట్టడం, నిధులను తీసుకోవడం లేదా కొత్త డిపాజిట్లను అంగీకరించడం, అప్పుల కోసం చెల్లింపులు చేయడం, ఆస్తులను విక్రయించడం, బదిలీ చేయడం వంటివి చేయకూడదని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్‌ను ఆర్బీఐ ఆదేశించింది.
ఖాతాదారులలో ఆందోళన
ఆంక్షల్లో భాగంగా బ్యాంకు ద్రవ్యత సమస్యల కారణంగా డిపాజిటర్లు తమ పొదుపు, కరెంట్ లేదా ఇతర ఖాతాల నుండి నిధులను ఉపసంహరించుకోవడానికి వేలు లేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఆర్‌బిఐ నిర్ణయం కస్టమర్లలో ఆందోళనను సృష్టించింది. దీంతో ముంబైలోని న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ శాఖల వద్దకు కస్టమర్లు పెద్ద ఎత్తున వచ్చారు. ఈఎంఐలు, అద్దెల చెల్లింపులు, రోజువారీ ఖర్చుల నిర్వహణ కోసం క్యాష్ విత్‌డ్రా లేకపోతే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కస్టమర్ల డబ్బులు వెనక్కి వస్తాయా?
న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంకు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ, దాని బ్యాంకింగ్ లైసెన్స్ రద్దు చేయలేదని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీని అర్థం బ్యాంకు ఇప్పటికీ పరిమితుల కింద పనిచేయడానికి అనుమతి ఉంటుంది. అంత వరకూ పరిస్థితిని కేంద్ర బ్యాంకు పర్యవేక్షిస్తుంది. అవసరమైన విధంగా తదుపరి నిర్ణయాలు తీసుకుంటుంది.
ఆర్బీఐ నిబంధనల ప్రకారం.. అర్హత కలిగిన డిపాజిటర్లు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (డీఐసీజీసీ) నుండి డిపాజిట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే రూ. 5 లక్షల వరకు పొందవచ్చు. ఇది బ్యాంకులో డిపాజిట్లు కలిగి ఉన్న కస్టమర్లకు కొంత ఉపశమనం కలిగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment