
స్విట్జర్లాండ్‌కు చెందిన ప్రముఖ వెల్త్ మేనేజర్, బ్యాంకింగ్ సంస్థ యూబీఎస్‌తో ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు భారతీయ వెల్త్, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ ‘360 వన్ డబ్ల్యూఏఎం’ ప్రకటించింది. ఈ ప్రత్యేక వ్యూహాత్మక సహకారం ద్వారా ఇరు సంస్థలు క్లయింట్లకు మెరుగైన ప్రయోజనాలను అందించనున్నాయి.
ఈ సహకారంలో భాగంగా, రెండు సంస్థల క్లయింట్లకు ఆన్‌షోర్, ఆఫ్‌షోర్ వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్లకు అవకాశం లభించనుంది. అసెట్ మేనేజ్ మెంట్ ఉత్పత్తులు, ఇన్వెస్ట్ మెంట్ బ్యాంకింగ్ సేవలు సైతం పొందే ఆస్కారం ఉంటుంది. అలాగే 360 వన్ తన అనుబంధ సంస్థల ద్వారా భారత్‌లోని యూబీఎస్ ఆన్‌షోర్ వెల్త్ మేనేజ్మెంట్ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తుంది. ఇక యూబీఎస్ కూడా 360 వన్‌లో 4.95% వాటాను కొనుగోలు చేయనుంది.
వృద్ధి అవకాశాలను అన్వేషించడానికి రెండు సంస్థలకు చెందిన సీనియర్ నాయకుల నేతృత్వంలో సంయుక్త కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇది ఒక శక్తివంతమైన సహకారం దిశగా మొదటి అడుగు. ఇది తమ క్లయింట్లు, వాటాదారులకు ఉద్యోగులకు విలువ ప్రతిపాదనను మరింత పెంచుతుందని 360 వన్ ఫౌండర్, సీఈవో కరణ్ భగత్ పేర్కొన్నారు.