Bhavish Aggarwal announced a strategic partnership with StoreDot of Israel For Fast Charging - Sakshi
Sakshi News home page

ఓలా మరో సంచలనం! 5 నిమిషాల్లో ఫుల్‌ ఛార్జ్‌.. 160 కి.మీ ప్రయాణం..

Published Mon, Mar 21 2022 3:35 PM | Last Updated on Mon, Mar 21 2022 4:33 PM

Bhavish Aggarwal announced a strategic partnership with StoreDot of Israel For Fast Charging - Sakshi

ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ యజమానులకు, ఈవీ వాహనాలు కొనాలనే ఆలోచనతో ఉన్న వారికి అదిరిపోయే వార్త చెప్పారు ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌. ఈవీ వెహికల్స్‌కి అతి పెద్ద సమస్యగా ఉన్న బ్యాటరీ ఛార్జింగ్‌ టైమ్‌కి అతి త్వరలోనే చెక్‌ పెడుతున్నట్టుగా వెల్లడించారు. 

ఇండియాలో ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సెగ్మెంట్‌లో ఓలా సంచలనం సృష్టించింది. అప్పటి వరకు ఈవీలపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తూ ఓలా స్కూటర్‌ లక్షన్నరకు పైగా ప్రీ బుకింగ్స్‌ సాధించింది. క్రమంగా ఈ బుకింగ్స్‌కు తగ్గట్టుగా వాహనాల డెలివరీ జరుగుతోంది. ఇప్పుడు ఈ వాహనాలకు ఛార్జింగ్‌ సమస్యకు పరిష్కారం చూపించే పనిలో ఉన్నారు భవీష్‌ అగర్వాల్‌.

ఈవీ బ్యాటరీలు, ఛార్జింగ్‌ టెక్నాలజీలో అద్భుతమైన ప్రగతి సాధించిన స్టోర్‌డాట్‌తో వ్యూహాత్మక భాగస్వామిగా కలుస్తున్నట్టు భవీష్‌ అగర్వాల్‌ ప్రకటించారు. త్వరలోనే ఇండియాలో ఈవీలకు సంబంధించి సరికొత్త శకం చూడబోతారని తెలిపారు. 2 వాట్స్‌, 4 వాట్స్‌కి సంబంధించి ఇండియాలో తయారీ, ఆర్‌ అండ్‌ డీ సెంటర్‌ నెలకొల్పబోతున్నట్టు వెల్లడించారు.

ఓలా ఎలక్ట్రిక​ స్కూటర్ల విషయానికి వస్తే 18 నిమిషాల ఛార్జింగ్‌తో 78 కి.మీ ప్రయాణం చేయవచ్చని ఆ కంపెనీ చెబుతోంది. బ్యాటరీ ఫుల్‌ ఛార్జింగ్‌కి వివిధ మోడళ్లను బట్టి కనిష్టంగా 4 గంటల 48 నిమిషాల నుంచి గరిష్టంగా 6 గంటల 30 నిమిషాల సమయం పడుతుంది. స్టోర్‌డాట్‌ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ఇది ఐదు నిమిషాల దగ్గరకి వచ్చేందుకు ఆస్కారం ఉంది.

ఇజ్రాయిల్‌కి చెందిన స్టోర్‌డాట్‌ సంస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా బ్యాటరీ ఛార్జింగ్‌ టెక్నాలజీని రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్‌లో వివిధ సంస్థల ఛార్జింగ్‌ టైం కనిష్టంగా 45 నిమిషాల నుంచి గరిష్టంగా 80 నిమిషాల వరకు ఉంది. వీటన్నింటినీ బీట్‌ చేస్తూ స్టోర్‌డాట్‌ సంస్థ 5 నిమిషాల్లోనే ఒక కారు బ్యాటరీని ఫుల్‌గా ఛార్జ్‌ చేసే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌తో 100 మైళ్లు (160 కి.మీ) కారులో ప్రయాణం చేయవచ్చు.

స్టోర్‌డాట్‌కి చెందిన ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీని ఓలా సంస్థ తమ స్కూటర్లకు ఉపయోగించనుంది. తద్వారా స్కూటర్ల ఛార్జింగ్‌ టైం అనేది నామమాత్రంగా మారుతుంది. స్టోర్‌డాట్‌ టెక్నాలజీని ఓలా స్కూటర్లలో ఉపయోగిస్తే... టీ తాగే టైం లేదా ఫోన్‌లో నోటిఫికేషన్లు చెక్‌ చేసే టైమ్‌లో బ్యాటరీ ఛార్జ్‌ అయ్యే అవకాశం ఉంది. మొత్తంగా పెట్రోల్‌ వెహికల్స్‌లో ఫ్యూయల్‌ ఎంత ఈజీనో ఈవీలలో ఎనర్జీ కూడా అంతే ఈజీగా లభించే రోజు రానుంది.

చదవండి: హమ్మయ్యా ? ఇన్నాళ్లకు ఓ మంచి విషయం చెప్పిన ఓలా సీఈవో

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement