ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ మాట తీరుపై నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆన్‌లైన్ వేదికగా కమెడియన్ కునాల్ కమ్రాపై భవిష్ అగర్వాల్ చేస్తున్న వ్యాఖ్యలు అహంకారపూరితంగా ఉన్నాయంటూ సోషల్ మీడియా యూజర్లు విరుచుకుపడుతున్నారు.
భవిష్ అగర్వాల్, కమెడియన్ కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. షోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు కామెంట్లు ప్రతికామెంట్లతో మాటల దాడి చేసుకుంటున్నారు. ఓలా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల సర్వీస్ సెంటర్ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేయడంతో ఈ వాగ్వాదం ప్రారంభమైంది. ఓలా సర్వీస్ సెంటర్‌లో పెద్ద సంఖ్యలో ఈవీ స్కూటర్‌లున్న ఫొటోను కమ్రా షేర్ చేస్తూ కామెంట్ పెట్టడంతో వివాదం మొదలైంది.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కస్టమర్ల ఇబ్బందులను తెలియజేస్తూ కునాల్ కమ్రా పెట్టిన పోస్టులకు ‘ఇది పెయిడ్ పోస్టు’.. ‘నువ్వు సంపాదించలేనంత డబ్బు ఇస్తా’.. అంటూ తలపొగరుగా ఓలా సీఈవో భవిష్ అగర్వాల్ స్పందించిన తీరు.. ప్రయోగించిన పదాలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: సీఈవో అయినా డెలివరీ బాయ్‌గా వెళ్తే అంతే..
అగర్వాల్ వర్సెస్ కమ్రా మాటల యుద్ధం వ్యవహారంలో చాలా మంది ఓలా కస్టమర్లతోపాటు నెటిజన్లు సైతం కమ్రాకు మద్దతుగా నిలుస్తున్నారు. భవిష్ మాట తీరుపై చీవాట్లు పెడుతున్నారు. ఓలా సర్వీస్ ఎంత చెత్తగా ఉందో చెప్పేందుకు మంచి కమెడియనే కావాల్సిన అవసరం లేదంటూ ఒక యూజర్ స్పందించారు. ఈ అహంకారం నిర్లక్ష్య ధోరణి నుంచి వచ్చిందని, దీనికి బుద్ధి చెప్పాలని మరో యూజర్ కామెంట్ చేశారు. ‘ఎంత అహంకారివి నువ్వు. సంపదను చాటుకోవడం మానేయండి. అంతా పోగొట్టుకుని రోడ్లపైకి వచ్చిన ఇలాంటి అహంకార సీఈవోలు ఎందరో ఉన్నారు. మీ విఫలమైన ఉత్పత్తులు, సేవల నమూనాను పరిష్కరించడంపై దృష్టి పెట్టండి’ అంటూ ఒక నెటిజన్ ఘాటుగా రాసుకొచ్చారు.
ఈ అంశంలో ఓలా రూపొందించిన ఏఐ ఫ్లాట్‌ఫామ్ కృత్రిమ్ కూడా భవిష్ అగర్వాల్‌నే తప్పుపట్టింది. భవిష్ అగర్వాల్, కునాల్ కమ్రా మధ్య మాటల యుద్ధంపై ఓ జర్నలిస్ట్ ఓలా కృత్రిమ్ ఏఐ స్పందనను కోరారు. అది అందించిన స్పందనను ‘ఎక్స్’లో షేర్ చేశారు. కమ్రా లేవనెత్తిన ఆందోళనపై భవిష్ స్పందించిన తీరు హుందాగా లేదంటూ బదులిచ్చింది. ఆందోళనలను గుర్తించి పరిస్థితి పట్ల సానుభూతి చూపాలని అగర్వాల్‌కు కృత్రిమ్ సలహా ఇచ్చింది.
I asked OLA bro's AI for PR advice on the developing situation with @kunalkamra88.
It clearly does not like the response OLA bro gave. 😆 pic.twitter.com/bX6FifrThO— meghnad (Nerds ka Parivaar) (@Memeghnad) October 6, 2024
Comments
Please login to add a commentAdd a comment