
జూన్‌లో నెమ్మదించిన డిమాండ్
మారుతీ, హ్యుందాయ్ అమ్మకాల్లో రెండింతల క్షీణత
ముంబై: దేశీయ మార్కెట్‌లో డిమాండ్ తగ్గడంతో జూన్‌లో వాహన విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. దిగ్గజ కంపెనీలైన మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్, టాటా మోటార్స్ అమ్మకాల్లో రెండంకెల క్షీణత నమోదైంది. అయితే డీలర్లకు సరఫరా పెరగడంతో మహీంద్రా–మహీంద్రా అమ్మకాలు ఏకంగా 18% పెరిగాయి. మారుతీ సుజుకీ దేశీయంగా జూన్‌లో 1,18,906 ప్యాసింజర్ వాహనాలు విక్రయించింది.

గత ఏడాది జూన్‌లో అమ్ముడైన 1,37,160 వాహనాలతో పోలిస్తే 13% తక్కువ. ‘‘చిన్న కార్ల విభాగంలో అమ్మకాలు అనూహ్యంగా తగ్గడంతో మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాల్లో క్షీణత నమోదైంది. చరిత్రాత్మకంగా జీడీపీ వృద్ధికి కార్ల అమ్మకాలు 1.5% అధికంగా ఉంటాయి. ఇప్పుడు జీడీపీ 6.5% నమోదైనప్పటికీ.. కార్ల అమ్మకాలు నెమ్మదించాయి. చిన్న కార్ల అమ్మకాల్లో వృద్ధి లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కొనుగోలు సామర్థ్యం సన్నగిల్లింది అనేందుకు ఇది సంకేతం’’ అని మారుతీ సుజుకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ రాహుల్ భారతీ తెలిపారు.