కార్ల విక్రయాలు జూమ్..
♦ మే నెలలో ఆటోమొబైల్ రంగం జోరు...
♦ 10% పెరిగిన మారుతీ, హ్యుందాయ్ సేల్స్
న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీల మే నెల దేశీ విక్రయాలు 10 శాతం మేర పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు వాటి ప్యాసెంజర్ వాహన అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదయ్యింది. కొత్త మోడళ్లు, రుతుపవ నాలపై సానుకూల అంచనాలు విక్రయాల పెరుగుదలకు కారణాలుగా ఉన్నాయి.
♦ మారుతీ దేశీ విక్రయాలు 10.6 శాతం వృద్ధితో 1,02,359 యూనిట్ల నుంచి 1,13,162 యూనిట్లకు పెరిగాయి. స్విఫ్ట్, రిట్జ్, డిజైర్, బాలెనో వంటి కార్ల అమ్మకాల పెరుగుదలే కంపెనీ దేశీ విక్రయాలు ఎగయటానికి కారణం.
♦ హ్యుందాయ్ దేశీ విక్రయాలు 10.41 శాతం వృద్ధితో 37,450 యూనిట్ల నుంచి 41,351 యూనిట్లకు ఎగశాయి. క్రెటా, ఎలైట్ ఐ20, గ్రాండ్ ఐ10 కార్ల డిమాండే కంపెనీ దేశీ విక్రయాల పెరుగుదలకు కారణమని హ్యుందాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు.
♦ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీ వాహన విక్రయాలు 10 శాతం వృద్ధితో 33,369 యూనిట్ల నుంచి 36,613 యూనిట్లకు ఎగశాయి. సానుకూల రుతుపవన అంచనాలు కచ్చితంగా డిమాండ్ వృద్ధికి దోహదపడుతాయని ఎం అండ్ ఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటో డివిజన్) ప్రవీణ్ షా తెలిపారు.
♦ టూవీలర్ విభాగానికి వస్తే.. హీరో మోటోకార్ప్ వాహన విక్రయాలు 2.32 శాతం వృద్ధితో 5,69,876 యూనిట్ల నుంచి 5,83,117 యూనిట్లకు పెరిగాయి.