Vehicle manufacturing company
-
సామర్థ్యం పెంచుకోనున్న మహీంద్రా
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2.86 లక్షల యూనిట్ల ఆర్డర్ బుక్. 2024లో రానున్న కొత్త మోడళ్లు. వెరశి సామర్థ్యం పెంచుకోవడంపై వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా దృష్టిసారించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నెలకు 55,000 యూనిట్ల స్థాయికి తయారీని చేర్చే అవకాశం ఉంది. ఇందుకు కావాల్సిన పెట్టుబడి ప్రణాళికను 3–6 నెలల్లో మహీంద్రా ప్రకటించనుంది. ప్రధానంగా ఈవీ విభాగంలో ఈ పెట్టుబడులు ఉండొచ్చని సమాచారం. మహీంద్రా ఇప్పటికే 2021–22 నుంచి 2023–24 మధ్య రూ.10,000 కోట్లు వెచి్చస్తోంది. 2024 మార్చి నాటికి నెలకు అన్ని విభాగాల్లో కలిపి 49,000 యూనిట్ల తయారీ సామర్థ్యానికి చేరుకోవాలి సంస్థ ఇప్పటికే లక్ష్యం విధించుకుంది. అయిదు డోర్ల థార్, కొత్త ఈవీ మోడళ్లు రానుండడంతో 49,000 యూనిట్ల స్థాయికి మించి తయారీ సామర్థ్యం ఉండాలన్నది కంపెనీ భావన. థార్, ఎక్స్‌యూవీ 700, స్కారి్పయో మోడళ్లకు బలమైన డిమాండ్‌తో గడిచిన అయిదేళ్లలో దాదాపు రెండింతలకుపైగా సామర్థ్యం పెంచుకుంది. రెండవ స్థానంలో మహీంద్రా.. ఇక వచ్చే 12 నెలల్లో ఎక్స్‌యూవీ 400, ఎక్స్‌యూవీ 300 ఫేస్‌లిఫ్ట్ మోడళ్లు సైతం రానున్నాయి. బలమైన బ్రాండ్ ఇమేజ్ కారణంగా కొన్ని మాసాలుగా సగటున నెలకు 51,000 యూనిట్ల స్థాయిలో బుకింగ్స్ నమోదు అవుతున్నాయి. నవంబర్ 1 నాటికి ఉన్న ఆర్డర్ బుక్ ప్రకారం ఎక్స్‌యూవీ 300, ఎక్స్‌యూవీ 400 మోడళ్లకు 10,000 యూనిట్లు, ఎక్స్‌యూవీ 700 కోసం 70,000, థార్ 76,000, బొలెరో 11,000, క్లాసిక్ వేరియంట్‌తో కలిపి స్కారి్పయో–ఎన్ 1,19,000 యూనిట్లు కస్టమర్లకు చేరాల్సి ఉంది. 2023 జూలై–సెపె్టంబర్ మధ్య దేశవ్యాప్తంగా మహీంద్రా ఎస్‌యూవీలు 1,14,742 యూనిట్లు రోడ్డెక్కాయి. పరిమాణం పరంగా అయిదు త్రైమాసికాలుగా ఎస్‌యూవీల అమ్మకాల్లో మహీంద్రా రెండవ స్థానంలో నిలిచింది. -
భారత్‌లో టయోటా మూడవ ప్లాంట్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జపాన్ సంస్థ టయోటా మోటార్.. భారత్‌లో మూడవ ప్లాంట్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఏటా 80,000–1,20,000 యూనిట్ల సామర్థ్యంతో ఈ కేంద్రాన్ని స్థాపించే అవకాశం ఉంది. రానున్న రోజుల్లో నూతన కేంద్రంలో తయారీ సామర్థ్యాన్ని 2,00,000 యూనిట్లకు చేరుస్తారు. కర్నాటకలోని బీదడి వద్ద ఉన్న టయోటాకు చెందిన రెండు ప్లాంట్లు ఏటా 4,00,000 యూనిట్లు తయారు చేయగలవు. ఈ ప్లాంట్లకు సమీపంలోనే మూడవ కేంద్రం నెలకొల్పాలన్నది కంపెనీ ప్రణాళిక. భారత విపణి కోసం కొత్త ఎస్‌యూవీని అభివృద్ధి చేసే పనిలో కంపెనీ ఇప్పటికే నిమగ్నమైంది. 2026లో ఇది ఇక్కడి రోడ్లపై పరుగు తీయనుంది. కొత్త ఫ్యాక్టరీలో ఈ ఎస్‌యూవీని తయారు చేయనుండడం విశేషం. మధ్యస్థాయి అర్బన్ క్రూజర్ హైరైడర్‌కు మలీ్టపర్పస్ వెహికిల్ ఇన్నోవా హైక్రాస్కు మధ్య ఈ మోడల్ ఉండనుంది. 340–డి కోడ్ పేరుతో రానున్న ఈ ఎస్యూవీ మోడల్ కింద ఏటా 60,000 యూనిట్లను ఉత్పత్తి చేయాలన్నది కంపెనీ ఆలోచన. ఇందుకోసం సరఫరాదార్లను టయోటా సన్నద్ధం చేస్తోంది. భారత్‌లో మినీ ల్యాండ్ క్రూజర్‌ను సైతం పరిచయం చేయాలని సంస్థ భావిస్తోంది. టయోటా మోటార్, సుజుకీ మోటార్ కార్పొరేషన్‌తో అంతర్జాతీయంగా భాగస్వామ్యం ఉన్న సంగతి తెలిసిందే. భారత్‌లో టయోటా ప్లాంట్ల సామర్థ్యంలో 40 శాతం మారుతీ సుజుకీ వినియోగించుకుంటోంది. భారత్‌లో 2030 నాటికి ఏటా 5,00,000 యూనిట్ల తయారీ సామర్థ్యం కలిగి ఉండాలని టయోటా భావిస్తోంది. -
రెండు ఇంధనాలతో మహీంద్రా వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా రెండు రకాల ఇంధనాలతో నడిచే వాహన విభాగంలోకి ప్రవేశించింది. సుప్రో సీఎన్జీ డువో పేరుతో మోడల్‌ను విడుదల చేసింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.6.32 లక్షలు. ఈ తేలికపాటి వాణిజ్య వాహనం సీఎన్జీ, పెట్రోల్‌తో నడుస్తుంది. 750 కిలోల బరువు మోయగలదు. 75 లీటర్ల సీఎన్జీ ట్యాంక్, 5 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయి సామర్థ్యంతో 325 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. మైలేజీ కిలోకు 23.35 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ తెలిపింది. ‘సీఎన్జీ వాహనాల డిమాండ్ నాలుగేళ్లలో నాలుగురెట్లు పెరిగింది. సీఎన్జీ అవసరాన్ని ఇది సూచిస్తుంది. దేశవ్యాప్తంగా 2 టన్నులలోపు సామర్థ్యం గల తేలికపాటి వాణిజ్య వాహనాల అమ్మకాలు నెలకు 16,000 యూనిట్లు. ఇందులో సీఎన్జీ వాటా సుమారు 5,000 యూనిట్లు’ అని మహీంద్రా వైస్ ప్రెసిడెంట్ బానేశ్వర్ బెనర్జీ ఈ సందర్భంగా తెలిపారు. సుప్రో సీఎన్జీ డువో రాకతో నెలవారీ అమ్మకాలు రెండింతలు అవుతాయని సంస్థ భావిస్తోంది. 1.5తోపాటు 2 టన్నుల విభాగంలోనూ రెండు రకాల ఇంధనాలతో నడిచే మోడళ్లను తేనున్నట్టు వెల్లడించింది. -
మారుతీ సుజుకీ డిజైర్ ఎస్–సీఎన్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ మారుతీ సుజుకీ ఎస్–సీఎన్జీ పరిజ్ఞానంతో కాంపాక్ట్ సెడాన్ డిజైర్‌ను రెండు ట్రిమ్స్‌లో ప్రవేశపెట్టింది. ధర ఎక్స్‌షోరూంలో రూ.8.14 లక్షల నుంచి ప్రారంభం. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌తో ఇవి రూపుదిద్దుకున్నాయని కంపెనీ తెలిపింది. మైలేజీ కిలోకు 31.12 కిలోమీటర్లు అని వెల్లడించింది. నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడం, అధిక మైలేజీ కారణంగా ఎస్–సీఎన్జీ వాహనాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని మారుతీ సుజుకీ ఇండియా మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. అయిదేళ్లలో కంపెనీ ఈ విభాగంలో ఏటా సగటున 19 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు. -
భారత్‌కు ఫోక్స్‌వ్యాగన్ వర్చూస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న జర్మనీ సంస్థ ఫోక్స్‌వ్యాగన్ వర్చూస్ సెడాన్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది మే నెలలో భారత మార్కెట్లో అందుబాటులోకి రానుంది. 115 పీఎస్ పవర్‌తో 1.0 లీటర్, 150 పీఎస్ పవర్‌తో 1.5 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ పవర్‌ట్రైయిన్స్, మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్‌తో రూపుదిద్దుకుంది. హోండా సిటీ, హ్యుండాయ్ వెర్నా, మారుతి సుజుకీ సియాజ్, స్కోడా స్లేవియా వంటి మోడళ్లకు ఇది పోటీ ఇవ్వనుంది. మధ్య స్థాయి ప్రీమియం సెడాన్స్ విభాగంలో 12–15 శాతం మార్కెట్ వాటా లక్ష్యంగా చేసుకున్నట్టు ఫోక్స్‌వ్యాగన్ ప్యాసింజర్ కార్స్ ఇండియా బ్రాండ్ డైరెక్టర్ ఆశిష్ గుప్తా వెల్లడించారు. ‘కొత్త ఉత్పాదన రాగానే విభాగం వృద్ధి చెందుతుంది. 2022 డిసెంబర్ నాటికి ఈ విభాగం 1.5 లక్షల యూనిట్లకు చేరుతుందన్న అంచనా ఉంది. కారు నిర్మాణ శైలికి ఇప్పటికీ దేశంలో ఆదరణ ఉంది. మొత్తం ప్యాసింజర్ వెహికిల్స్ అమ్మకాల్లో ఈ శైలి కార్ల వాటా 12–14 శాతం కైవసం చేసుకుంది. ఏటా 4 లక్షల యూనిట్లు అమ్ముడవుతున్నాయి. మధ్యస్థాయి సెడాన్ విభాగం గతేడాది 28 శాతం వృద్ధి చెందింది’ అని వివరించారు. -
హ్యుందాయ్ ఎలక్ట్రిక్ రైడ్
న్యూఢిల్లీ: వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ భారత్‌లో ఎలక్ట్రిక్ రైడ్‌కు సిద్ధమైంది. 2028 నాటికి ఆరు ఎలక్ట్రిక్ మోడళ్లను రంగంలోకి దింపనుంది. వీటిలో ఒకటి వచ్చే ఏడాది ఇక్కడి రోడ్లపై పరుగుతీయనుంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న మోడళ్ల ఆధారంగా, అలాగే అంతర్జాతీయంగా కంపెనీ అమలు చేస్తున్న ఈ–జీఎంపీ ప్లాట్‌ఫాంపైనా కొన్ని మోడళ్లను తయారు చేయనుంది. 77.4 కిలోవాట్ అవర్ వరకు సామర్థ్యం గల బ్యాటరీ పొందుపరిచే వీలుంది. 2, 4 వీల్ డ్రైవ్‌తోపాటు గంటకు 260 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటాయి. ఈ వాహనాల అభివృద్ధి, పరిశోధన కోసం రూ.4,000 కోట్లు ఖర్చు చేయనున్నట్టు హ్యుండాయ్ మోటార్ ఇండియా ఎండీ, సీఈవో ఎస్.ఎస్.కిమ్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి చెన్నై ప్లాంటులో చేపడతామని, బ్యాటరీలను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటామన్నారు. భారత్‌లో కంపెనీ ఇప్పటికే కోనా ఎలక్ట్రిక్‌ను విక్రయిస్తోంది. -
టాటా మోటార్స్ చిన్న ఎస్యూవీ పంచ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం టాటా మోటార్స్ పంచ్ పేరుతో దేశంలో తొలి సబ్ కాంపాక్ట్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. రూ.21,000 చెల్లించి వాహనాన్ని బుక్ చేసుకోవచ్చు. మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో ప్రవేశపెట్టారు. డైనా ప్రో టెక్నాలజీతో 1.2 లీటర్ రెవొట్రాన్ ఇంజన్‌తో తయారైంది. పరిశ్రమలో తొలిసారిగా ఆధునిక ఏఎంటీతో ట్రాక్షన్ ప్రో మోడ్, బ్రేక్ స్వే కంట్రోల్ పొందుపరిచారు. 90 డిగ్రీల కోణంలో తెరుచుకునే డోర్లు, ఆర్16 డైమండ్ కట్ అలాయ్ వీల్స్, డ్యూయల్ టోన్ రూఫ్ ఆప్షన్స్, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఈబీడీ, కార్నర్ సేఫ్టీ కంట్రోల్‌తో ఏబీఎస్, క్రూయిజ్ కంట్రోల్, టిల్ట్ స్టీరింగ్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి హంగులు ఉన్నాయి. ఏడు రంగుల్లో లభిస్తుంది. పంచ్ అభివృద్ధికి 150 నమూనా కార్లను వాడారు. ఇవి 20 లక్షలకుపైగా కిలోమీటర్లు ప్రయాణించాయని కంపెనీ తెలిపింది. భారత్, యూకే, ఇటలీలోని డిజైన్ స్టూడియోలు ఈ కారు అభివృద్ధిలో పాలుపంచుకున్నాయి. -
యమహా కొత్త స్కూటర్.. ఏరోక్స్155
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ యమహా మోటార్ ఇండియా సరికొత్తగా ఏరోక్స్–155 స్కూటర్‌ను ఆవిష్కరించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూంలో ధర రూ.1.29 లక్షలు. 15 పీఎస్ పవర్, సీవీటీ ట్రాన్స్‌మిషన్‌తో 155 సీసీ ఇంజిన్, స్మార్ట్ మోటార్ జనరేటర్ సిస్టమ్, సింగిల్ చానల్ ఏబీఎస్, 14 అంగుళాల టైర్లు, బ్లూటూత్, 24.5 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్, ఎల్ఈడీ హెడ్‌లైట్ వంటివి పొందుపరిచారు. కంపెనీ ఆధునీకరించిన వైజెడ్ఎఫ్–ఆర్15 బైక్‌ను సైతం ఆవిష్కరించింది. దీని ధర రూ.1.67 లక్షల నుంచి ప్రారంభం. 155 సీసీ, 4 స్ట్రోక్, 18.4 పీఎస్ పవర్‌తో లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, 6 స్పీడ్ గేర్ బాక్స్, ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్, క్విక్ షిఫ్టర్, బ్లూటూత్, ఎల్సీడీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి హంగులు ఉన్నాయి. -
Ford: ప్లీజ్ మమ్మల్ని వదిలేసి వెళ్లొద్దు!
'Please don't leave': ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ సంస్థ ఇండియాలో తమ ఆపరేషన్స్ నిలిపేస్తున్నట్టు ప్రకటించడంతో అనేక మంది ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతున్నారు. ఫోర్డ్ డోంట్ గో అంటూ సోషల్ మీడియాలో ఫోర్డ్‌తో తమకున్న ఎమోషనల్ బాండింగ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. సెప్టెంబరు 9న ఫోర్డ్ నుంచి ప్రకటన వెలువడినప్పటి నుంచి ఫోర్డ్ ఇండియా హ్యాష్‌ట్యాగ్ ట్రెండవుతోంది. - మెయినుద్దీన్ షేక్ అనే వ్యక్తి స్పందిస్తూ ఫోర్డ్ అస్పైర్ కారు కొనుక్కోవడం తన లక్క్ష్యమని, దానికి సంబంధించిన డబ్బును కూడబెట్టానని, ఈ ఏడాది చివరికల్లా కొనుక్కుందామని ప్లాన్ చేశానని పేర్కొన్నాడు. ఫోర్డ్ తాజా నిర్ణయంతో తన హృదయం ముక్కలైందని, ఫోర్డ్ ప్లీజ్ డోంట్ గో అంటూ కోరాడు No more EcoSport and Endeavour #FordIndia pic.twitter.com/gWRGunXA19 — Car Stuff (@carrelatedstuff) September 9, 2021 - భార్గవ్ పెదకొలిమి అనే ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ... 12 ఏళ్ల నుంచి ఫోర్డ్ కారు కొనుక్కోవాలనేది తన కలని, ఇప్పుడు ఆ కల తీరే సమయం వచ్చినప్పుడే ఫోర్డ్ ఇండియాను వీడి వెళ్లిపోతుందని తెలిసి హార్ట్‌బ్రేక్ అయ్యిందటూ పేర్కొన్నాడు. క్వాలిటీ, కంఫర్ట్, పవర్ఫుల్ ఇంజన్ అందివ్వడంలో ఫోర్ట్ మేటి అని చెబతూ.. ఇండియాను వదిలి వెళ్లొద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. - నాకు ఆరేడేళ్ల వయసు నుంచి ఫోర్డ్ కారు సొంతం చేసుకోవాలనే కల ఉండేదని, ఇప్పుడు ఫోర్డ్ ఇండియాను వీడి వెలుతుందనే వార్తలతో నా కల చెదిరిపోయిందంటూ సిద్ధార్థ్ నౌతియాల్ అనే వ్యక్తి ట్వీట్ చేశాడు. I'm at a loss of words. I dreamt of owning a Ford since I was 6 or maybe 7 years old. A childhood dream just got crushed. I wish you had updated your budget vehicles (Figo/Freestyle/Aspire). They were enthusiast's choice and had so much potential. 😢 — Siddharth Nautiyal (@1998_Siddharth_) September 9, 2021 నాట్ లీవింగ్ ఇండియా ఇండియాను వీడి పోతున్నట్టు ప్రకటించగానే నెటిజన్ల నుంచి వెల్లువెత్తున్న ఎమోషనల్ ట్వీట్స్‌కి ఫోర్డ్ ఇండియా స్పందించింది. ఇండియాను తాము వీడి వెళ్లడం లేదంటూ లైట్ బిజినెస్ మోడల్ని అప్లై చేయబోతున్నట్టు తెలుపుతోంది. దీని వల్ల లాంగ్ రన్లో సంస్థకు లాభాలు వస్తాయంటూ వివరణ ఇస్తోంది. Hello, Kunal: Ford is NOT leaving India. A new, asset-light business model is being created with the reforms we announced today. This business model will be more profitable in the long run. ^VG — Ford India Service (@FordIndiaHelp) September 9, 2021 -
ఫోర్డ్... రివర్స్‌గేర్!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న యూఎస్ కంపెనీ ఫోర్డ్ మోటార్ భారత్‌లోని తయారీ కేంద్రాలను మూసివేస్తోంది. అలాగే ఎకో స్పోర్ట్, ఫిగో, అసై్పర్ మోడళ్ల అమ్మకాలకు స్వస్తి పలకనుంది. ముస్టాంగ్ కూపే, మ్యాచ్–ఈ వంటి దిగుమతి చేసుకున్న వాహనాలను మాత్రమే ఇక్కడ విక్రయించనున్నట్టు గురువారం ప్రకటించింది. పునరి్నర్మాణ కార్యక్రమంలో భాగంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. సరీ్వస్, విడి భాగాలు, వారంటీ కవరేజ్ కోసం పూర్తి కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలను కొనసాగిస్తామని కంపెనీ తెలిపింది. గుజరాత్ సనంద్‌లోని అసెంబ్లింగ్ సెంటర్‌ను ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ మధ్య, చెన్నైలోని వాహనాలు, ఇంజన్ల తయారీ కేంద్రాన్ని 2022 ఏప్రిల్–జూన్ కాలంలో మూసివేస్తామని కంపెనీ వెల్లడించింది. అమెరికా వాహన కంపెనీల్లో భారత్‌లో ప్లాంట్లను మూసివేసిన తొలి సంస్థ జనరల్ మోటార్స్ కాగా రెండోది ఫోర్డ్ కానుంది. విలువను సృష్టించడానికి.. ‘ఫోర్డ్ ప్లస్ ప్రణాళికలో భాగంగా స్థిర, లాభదాయక వ్యాపారాన్ని దీర్ఘకాలికంగా అందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. సరైన స్థాయిలో వృద్ధికి, విలువను సృష్టించడానికి మూలధనాన్ని కేటాయిస్తాం’ అని ఫోర్డ్ మోటార్ కంపెనీ ప్రెసిడెంట్ జిమ్ ఫార్లే ఈ సందర్భంగా తెలిపారు. ‘డీలర్లతో కలిసి పనిచేస్తూ విలువైన కస్టమర్ల కోసం శ్రద్ధ వహిస్తాం. భారత్ మాకు వ్యూహాత్మకంగా ముఖ్యమైనది. ప్రపంచవ్యాప్తంగా భారీ, ముఖ్యమైన ఉద్యోగుల స్థావరంగా ఫోర్డ్ బిజినెస్ సొల్యూషన్స్ కొనసాగుతుంది’ అని వివరించారు. ఫోర్డ్ బిజినెస్ సొల్యూషన్స్‌లో 11,000 పైచిలుకు మంది పనిచేస్తున్నారు. సామర్థ్యంలో 21 శాతమే.. భారత్‌లో వాహనాల తయారీలో కంపెనీ పెట్టుబడులు కొనసాగించడానికి, అందుకు తగ్గ రాబడిని అందించే మార్గాన్ని చూపించాల్సిన అవసరం ఉందని ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ అనురాగ్ మెహరోత్రా అన్నారు. ‘దురదృష్టవశాత్తు మేము మార్గాన్ని చూపించలేకపోయాం. ఇప్పుడు భారతదేశంలో వ్యాపారాన్ని పునరి్నరి్మంచడం తప్ప మరో మార్గం లేదు. కొత్త ఉత్పత్తుల పరిచయం, వ్యయాలను తగ్గించడానికి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై దృష్టి, మహీంద్రా వంటి సంస్థలతో భాగస్వామ్యం, కాంట్రాక్ట్ తయారీతో సహా చేపట్టిన ప్రయత్నాలన్నీ విఫలమైన తర్వాత కంపెనీ పునర్నిర్మాణ చర్య తీసుకుంది. భారత ఆటోమొబైల్ రంగంలో అంచనాలకు తగ్గట్టుగా వృద్ధి లేదు. మా ప్లాంట్లు స్థాపిత సామర్థ్యంలో కేవలం 21 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. అందుకే మేము ఎగుమతులపై దృష్టి పెట్టాం. కానీ యూఎస్, యూరప్‌లో నిబంధనలను కఠినతరం చేయడంతో పరిమాణం పడిపోయింది. ఉపాధి కోల్పోయిన ఉద్యోగులకు సహేతుక ప్యాకేజీ ఇస్తాం. ప్లాంట్ల విషయంలో కొనుగోలుదార్లతో చర్చిస్తాం’ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో భారీ పెట్టుబడులు.. రెండు ప్లాంట్లపై సంస్థ రూ.18,500 కోట్లు పెట్టుబడి చేసింది. ఏటా 6,10,000 ఇంజన్లు, 4,40,000 వాహనాల తయారీ సామర్థ్యం ఉంది. ప్రస్తుతం ఇక్కడ ఎకో స్పోర్ట్, ఫిగో, అస్పైర్ మోడళ్లు తయారవుతున్నాయి. 70 దేశాలకు వీటిని ఎగుమతి చేస్తున్నారు. ఇక నుంచి వీటి తయారీతోపాటు విక్రయాలు సైతం భారత్‌లో నిలిచిపోనున్నాయి. గత 10 ఏళ్లలో కంపెనీ నిర్వహణ నష్టాలు రూ.14,800 కోట్లు పేరుకుపోయాయి. భారీ స్థాయిలో పెట్టుబడులు చేసినప్పటికీ అంచనాలకు తగ్గట్టుగా కార్లకు డిమాండ్ లేకపోవడం సమస్యను తీవ్రం చేసింది. కంపెనీ నిర్ణయం 4,000 మంది ఉద్యోగులతోపాటు 300 ఔట్లెట్లను నిర్వహిస్తున్న 150 డీలర్íÙప్స్ ప్రిన్సిపల్స్‌పైన పడనుంది. డీలర్లకు షాక్... రూ.2,000 కోట్ల పెట్టుబడులపై ప్రభావం ‘ఫోర్డ్ డీలర్లు రూ.2,000 కోట్లకుపైగా పెట్టుబడి చేశారు. కంపెనీ నిర్ణయం షాక్‌కు గురి చేసింది’ అని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. 40,000 పైచిలుకు ఉద్యోగులు ఈ డీలర్ల వద్ద పనిచేస్తున్నట్టు వివరించింది. రూ.150 కోట్ల విలువైన 1,000 వాహనాలు వీరి వద్ద నిల్వ ఉన్నట్టు ఫెడరేషన్ ప్రెసిడెంట్ వింకేశ్ గులాటీ వెల్లడించారు. ‘డెమో వెహికిల్స్ సైతం డీలర్ల వద్ద ఉన్నాయి. అయిదు నెలల క్రితం వరకు కూడా డీలర్లను కంపెనీ నియమించుకుంది. ఇటువంటి డీలర్లు భారీగా నష్టపోతారు. ఫ్రాంచైజీ ప్రొటెక్షన్ యాక్ట్‌ను కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకురావాలి. పార్లమెంటరీ కమిటీ ఈ విషయాన్ని ప్రతిపాదించింది కూడా. 2017 నుంచి భారత మార్కెట్లో జనరల్ మోటార్స్, మ్యాన్ ట్రక్స్, హార్లే డేవిడ్సన్, యూఎం లోహియా.. తాజాగా ఫోర్డ్ ఇండియా బోర్డ్ తిప్పేసింది’ అని అన్నారు. -
యమహా నుంచి కొత్త ఎడిషన్ బైక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ సంస్థ యమహా.. ఎంటీ15 మాన్స్టర్ ఎనర్జీ యమహా మోటోజీపీ ఎడిషన్ బైక్‌ను ప్రవేశపెట్టింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.1.48 లక్షలు. ఫ్యూయల్ ట్యాంక్‌పై యమహా మోటోజీపీ బ్రాండింగ్ ఉంటుంది. 155 సీసీ, ఫ్యూయల్ ఇంజెక్టెడ్, లిక్విడ్ కూల్డ్, 4 స్ట్రోక్, ఎస్వోహెచ్సీ, 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌తో 4 వాల్వ్ ఇంజన్‌ను పొందుపరిచారు. 10,000 ఆర్పీఎంతో 18.5 పీఎస్, 13.9 ఎన్ఎం టార్క్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్, సింగిల్ చానల్ ఏబీఎస్, వేరియబుల్ వాల్వ్ యాక్చువేషన్ సిస్టమ్ వంటి హంగులు ఉన్నాయి. -
‘ఆటో’ అవకాశాలను అందిపుచ్చుకునేలా..
సాక్షి, హైదరాబాద్: వాహన తయారీ రంగంలో గతంలో ప్రభుత్వరంగ సంస్థలకు కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణలో ప్రస్తుతం పలు ప్రైవేటు వాహన తయారీ సంస్థలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన తయారీ, మరమ్మతు, అనుబంధ రంగాల కోసం మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన పాలసీనీ రూపొందించింది. ఆటోమోటివ్ రంగంలో పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటంతో రాష్ట్రవ్యాప్తం గా పలుచోట్ల ఆటోనగర్లు, పారిశ్రామిక క్లస్టర్లు, ఆటో పార్కులు ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంగారెడ్డి జిల్లా బూచినెల్లి, మెదక్ జిల్లా కాళ్లకల్ పారిశ్రామిక వాడల్లో ఇప్పటికే ఏర్పాటైన ఆటో పార్కులను విస్తరించేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఆటో పార్కులు.. ఆటో క్లస్టర్లు కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, రామగుండం (కుందనపల్లి)లో కొత్తగా ఆటోనగర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు భువనగిరి, జనగామ, స్టేషన్ ఘనపూర్, మడికొం డ, శాయంపేట, సంగెంలో ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ క్లస్టర్లలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా బూచినెల్లిలోనూ ఆటోమోటివ్ అనుబంధ పరిశ్రమల కోసం ఆటోపార్కును ఏర్పాటు చేశారు. మహీంద్ర పరిశ్రమకు అవసరమైన విడి భాగాలు తయారు చేసే పరిశ్రమలు బూచినెల్లి పారిశ్రామిక పార్కులో ఏర్పాటయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వాహన వినియోగదారులకు వాహన డీలర్లను చేరువ చేసేందుకు ‘నయాగాడీ’ అనే ఐటీ ఆధారిత స్టార్టప్ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. రంగారెడ్డి జిల్లా చందనవెళ్లిలో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్లు, మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ వాహ నాల విడి భాగాలు, బ్యాటరీల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఈవీ, ఆటోమోటివ్ రంగాల్లో పెట్టుబడులు ►రూ. 2,100 కోట్లతో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్ చేసేందుకు ట్రైటాన్ ఈవీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆల్టో, వేగనార్ కార్లలో ఈవీ కిట్లను (రెట్రోఫిట్టెడ్) అమర్చేందుకు రాష్ట్రానికి చెందిన ‘ఈ ట్రియో’అనే స్టార్టప్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) అనుమతులు సాధించింది. రెట్రోఫిట్టెడ్ ఎలక్ట్రిక్ కార్లు గేర్లు అవసరం లేకుండా సింగిల్ చార్జితో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ►టచ్ స్క్రీన్ యూనిట్లు, వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్లు వంటి డిజిటల్ సాంకేతికతో కూడిన నెక్సా షోరూమ్‌లను మారుతి సుజుకి రాష్ట్రంలో తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ఈటీఓ మోటార్స్, హాంకాంగ్‌కు చెందిన క్యోటో గ్రీన్ టెక్నాలజీస్ సంయుక్త భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల యూనిట్‌ను ఏర్పాటు చేస్తాయి. ►వ్యవసాయ యంత్ర పరికరాల రంగంలో పేరొందిన మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ జహీరాబాద్‌లోని తమ యూనిట్లో ‘కె2’ట్రాక్టర్లను తయారు చేస్తామని గత ఏడాది ప్రకటించింది. ‘కె2’ప్రాజెక్టు ద్వారా అదనంగా రూ.100 కోట్ల పెట్టుబడులతో పాటు 2024 నాటికి ఉద్యోగ అవకాశాలు రెండింతలు అయ్యే అవకాశముంది. -
సుప్రీంకోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటాం
న్యూఢిల్లీ: బీఎస్–6 ప్రమాణాల వాహనాలకు సంబంధించి సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలకు కట్టుబడి ఉంటామని వాహన తయారీ సంస్థల సమాఖ్య సియామ్ ప్రకటించింది. అత్యున్నత న్యాయస్థానం స్పష్టత నేపథ్యంలో 2020 ఏప్రిల్ 1 నుంచి కేవలం బీఎస్–6 వాహనాల విక్రయం, రిజిస్ట్రేషన్ మాత్రమే జరిగేలా పూర్తి స్థాయి లో కృషి చేస్తామని వివరించింది. అమ్ముడుపోకుండా మిగిలిపోయిన బీఎస్–6యేతర వాహనాలను నిర్దిష్ట గడువు తర్వాత కూడా విక్రయించుకునేలా కొంత వ్యవధి ఇవ్వాలన్న వాదనలను సుప్రీం కోర్టు తోసిపుచ్చడం తెలిసిందే. -
కార్ల విక్రయాలు జూమ్..
♦ మే నెలలో ఆటోమొబైల్ రంగం జోరు... ♦ 10% పెరిగిన మారుతీ, హ్యుందాయ్ సేల్స్ న్యూఢిల్లీ: వాహన తయారీ కంపెనీల మే నెల దేశీ విక్రయాలు 10 శాతం మేర పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు వాటి ప్యాసెంజర్ వాహన అమ్మకాల్లో రెండంకెల వృద్ధి నమోదయ్యింది. కొత్త మోడళ్లు, రుతుపవ నాలపై సానుకూల అంచనాలు విక్రయాల పెరుగుదలకు కారణాలుగా ఉన్నాయి. ♦ మారుతీ దేశీ విక్రయాలు 10.6 శాతం వృద్ధితో 1,02,359 యూనిట్ల నుంచి 1,13,162 యూనిట్లకు పెరిగాయి. స్విఫ్ట్, రిట్జ్, డిజైర్, బాలెనో వంటి కార్ల అమ్మకాల పెరుగుదలే కంపెనీ దేశీ విక్రయాలు ఎగయటానికి కారణం. ♦ హ్యుందాయ్ దేశీ విక్రయాలు 10.41 శాతం వృద్ధితో 37,450 యూనిట్ల నుంచి 41,351 యూనిట్లకు ఎగశాయి. క్రెటా, ఎలైట్ ఐ20, గ్రాండ్ ఐ10 కార్ల డిమాండే కంపెనీ దేశీ విక్రయాల పెరుగుదలకు కారణమని హ్యుందాయ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాకేశ్ శ్రీవాత్సవ తెలిపారు. ♦ మహీంద్రా అండ్ మహీంద్రా దేశీ వాహన విక్రయాలు 10 శాతం వృద్ధితో 33,369 యూనిట్ల నుంచి 36,613 యూనిట్లకు ఎగశాయి. సానుకూల రుతుపవన అంచనాలు కచ్చితంగా డిమాండ్ వృద్ధికి దోహదపడుతాయని ఎం అండ్ ఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ (ఆటో డివిజన్) ప్రవీణ్ షా తెలిపారు. ♦ టూవీలర్ విభాగానికి వస్తే.. హీరో మోటోకార్ప్ వాహన విక్రయాలు 2.32 శాతం వృద్ధితో 5,69,876 యూనిట్ల నుంచి 5,83,117 యూనిట్లకు పెరిగాయి. -
మహీంద్రా మినీ ట్రక్ ‘జీతో’
♦ 8 రకాల వేరియంట్లలో తయారీ ♦ ధర రూ.2.32-2.77 లక్షలు ♦ జహీరాబాద్ ప్లాంటులో అభివృద్ధి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో/సంగారెడ్డి టౌన్ : వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా ‘జీతో’ పేరుతో చిన్న ట్రక్‌ను మెదక్ జిల్లా జహీరాబాద్ ప్లాంటులో మంగళవారం ఆవిష్కరించింది. ఎం-డ్యూరా డీజిల్ ఇంజన్‌ను దీనికి పొందుపరిచారు. 600, 700 కిలోల బరువు మోయగల సామర్థ్యం ఉంది. మొత్తం 8 రకాల వేరియంట్లను రూపొందించారు. ఇన్ని వేరియంట్లతో భారత్‌లో వచ్చిన చిన్న వాణిజ్య వాహనం ఇదే. కావాల్సిన రీతిలో బాడీని మలిచే వీలుండడం ప్రత్యేకత. మైలేజీ లీటరుకు 27.8-37.6 కిలోమీటర్లని కంపెనీ తెలిపింది. వేరియంట్‌ని బట్టి ధర తెలంగాణలోని ఎక్స్‌షోరూంలో రూ.2.32 లక్షల నుంచి రూ.2.77 లక్షల వరకు ఉంది. జహీరాబాద్ ప్లాంటు విస్తరణకు కంపెనీ రూ.250 కోట్లు వెచ్చించింది. జీతో అభివృద్ధికి రూ.50 కోట్లు ఖర్చు చేశారు. ప్లాంటులో ఏటా 1.5 లక్షల యూనిట్ల వరకు జీతో మోడళ్లను తయారు చేసే వీలుంది. బీఎస్ 3, బీఎస్ 4 మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్యాసింజర్ వెహికిల్ కూడా.. జీతో ప్లాట్‌ఫామ్‌పై ప్యాసింజర్ వాహనాన్ని ఏడాదిలో ప్రవేశపెడతామని మహీంద్రా ఈడీ పవన్ గోయెంకా వెల్లడించారు. కంపెనీ ఆటోమోటివ్ విభాగం ప్రెసిడెంట్ ప్రవీణ్ షాతో కలిసి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. చిన్న వాణిజ్య వాహన రంగంలో జీతో సంచలనం సృష్టిస్తుందన్నారు. అయిదేళ్ల తర్వాత కొత్త ప్లాట్‌ఫాంపై వచ్చిన వాహనం జీతో అని తెలిపారు. ఏటా ఒక కొత్త ట్రాక్టర్ మోడల్‌ను ప్రవేశపెడతామని వెల్లడించారు. ఈ ఏడాదే ఏడు కొత్త ప్లాట్‌ఫామ్స్ ఆవిష్కరిస్తామన్నారు. ‘చిన్న వాణిజ్య వాహనాల విపణిలో ఈ ఏడాది 5-7 శాతం వృద్ధి ఆశిస్తున్నాం. మొత్తంగా వాహన పరిశ్రమలో తిరోగమన వృద్ధి కాలం పూర్తి అయింది. ఇక పరిశ్రమ వృద్ధి బాటన పడుతుంది. దేశీయంగా పెట్టుబడి సెంటిమెంటు బలపడుతోంది. అటు రుతుపవనాలు సైతం అనుకూలంగా ఉంటాయి’ అని తెలిపారు. శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లకు జీతో వాహనాలను కంపెనీ ఎగుమతి చేయనుంది. -
బజాజ్ అడ్వెంచ ర్ స్పోర్ట్... కొత్త వేరియంట్లు
హైదరాబాద్: ప్రముఖ వాహన తయారీ సంస్థ బజాజ్ తన పల్సర్ అడ్వెంచర్ స్పోర్ట్ సిరీస్‌లో రెండు కొత్త వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ప్రధానంగా యువతను టార్గెట్ చేస్తూ, సరికొత్త డిజైన్‌తో ‘పల్సర్ ఏఎస్ 200’, ‘పల్సర్ ఏఎస్ 150’ అనే వేరియంట్లను రూపొందించింది. ‘ఏఎస్ 200’ వేరియంట్లో 4 వాల్వ్ 200సీసీ డీటీఎస్-ఐ ఇంజిన్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్, ట్రిపుల్ స్పార్క్ టెక్నాలజీ, సుపీరియర్ బ్రేకింగ్, నైట్రక్స్ మోనో సస్పెన్షన్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.92,500 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ). అలాగే ‘ఏఎస్ 150’ వేరియంట్లో 4 వాల్వ్ 149.5సీసీ డీటీఎస్-ఐ ఇంజిన్, ట్విన్ స్పార్క్ టెక్నాలజీ, 5-స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్, ఎయిర్ కూలింగ్ సిస్టమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. దీని ధర రూ.79,000 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ).