సాక్షి, హైదరాబాద్: వాహన తయారీ రంగంలో గతంలో ప్రభుత్వరంగ సంస్థలకు కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణలో ప్రస్తుతం పలు ప్రైవేటు వాహన తయారీ సంస్థలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన తయారీ, మరమ్మతు, అనుబంధ రంగాల కోసం మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన పాలసీనీ రూపొందించింది. ఆటోమోటివ్ రంగంలో పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటంతో రాష్ట్రవ్యాప్తం గా పలుచోట్ల ఆటోనగర్‌లు, పారిశ్రామిక క్లస్టర్లు, ఆటో పార్కులు ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంగారెడ్డి జిల్లా బూచినెల్లి, మెదక్ జిల్లా కాళ్లకల్ పారిశ్రామిక వాడల్లో ఇప్పటికే ఏర్పాటైన ఆటో పార్కులను విస్తరించేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ సన్నాహాలు చేస్తోంది.
ఆటో పార్కులు.. ఆటో క్లస్టర్లు
కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, రామగుండం (కుందనపల్లి)లో కొత్తగా ఆటోనగర్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు భువనగిరి, జనగామ, స్టేషన్ ఘనపూర్, మడికొం డ, శాయంపేట, సంగెంలో ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ క్లస్టర్లలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా బూచినెల్లిలోనూ ఆటోమోటివ్ అనుబంధ పరిశ్రమల కోసం ఆటోపార్కును ఏర్పాటు చేశారు. మహీంద్ర పరిశ్రమకు అవసరమైన విడి భాగాలు తయారు చేసే పరిశ్రమలు బూచినెల్లి పారిశ్రామిక పార్కులో ఏర్పాటయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వాహన వినియోగదారులకు వాహన డీలర్లను చేరువ చేసేందుకు ‘నయాగాడీ’ అనే ఐటీ ఆధారిత స్టార్టప్ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. రంగారెడ్డి జిల్లా చందనవెళ్లిలో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్లు, మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ వాహ నాల విడి భాగాలు, బ్యాటరీల ఏర్పాటుకు టీఎస్‌ఐఐసీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది.
ఈవీ, ఆటోమోటివ్ రంగాల్లో పెట్టుబడులు
►రూ. 2,100 కోట్లతో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్ చేసేందుకు ట్రైటాన్ ఈవీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆల్టో, వేగనార్ కార్లలో ఈవీ కిట్లను (రెట్రోఫిట్టెడ్) అమర్చేందుకు రాష్ట్రానికి చెందిన ‘ఈ ట్రియో’అనే స్టార్టప్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ) అనుమతులు సాధించింది. రెట్రోఫిట్టెడ్ ఎలక్ట్రిక్ కార్లు గేర్లు అవసరం లేకుండా సింగిల్ చార్జితో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి.
►టచ్ స్క్రీన్ యూనిట్లు, వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్లు వంటి డిజిటల్ సాంకేతికతో కూడిన నెక్సా షోరూమ్‌లను మారుతి సుజుకి రాష్ట్రంలో తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ఈటీఓ మోటార్స్, హాంకాంగ్‌కు చెందిన క్యోటో గ్రీన్ టెక్నాలజీస్ సంయుక్త భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల యూనిట్‌ను ఏర్పాటు చేస్తాయి.
►వ్యవసాయ యంత్ర పరికరాల రంగంలో పేరొందిన మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ జహీరాబాద్‌లోని తమ యూనిట్‌లో ‘కె2’ట్రాక్టర్లను తయారు చేస్తామని గత ఏడాది ప్రకటించింది. ‘కె2’ప్రాజెక్టు ద్వారా అదనంగా రూ.100 కోట్ల పెట్టుబడులతో పాటు 2024 నాటికి ఉద్యోగ అవకాశాలు రెండింతలు అయ్యే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment