department of Industry
-
పరిశ్రమలశాఖపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
సమన్వయంతో సమర్థ వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు జీవితకాలం తోడు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర పరిశ్రమలశాఖ వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని పరిశ్రమలకు సింగిల్‌విండో విధానంలో చేయూత అందించే విధంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ ఏపీ వన్’తో పాటు వివిధ విభాగాల వనరులను సమర్థంగా వినియోగించుకునే విధంగా నివేదిక రూపొందించే బాధ్యతను పరిశ్రమలశాఖ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ)నకు అప్పగించింది. విస్తృత అధ్యయనం అనంతరం పరిశ్రమలశాఖ పరిధిలోకి వచ్చే ఏపీఐఐసీ, ఏపీ ఈడీబీ, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్, ఏపీఎస్ఎఫ్సీ, ఏపీటీపీసీలతోపాటు స్కిల్ డెవలప్మెంట్ వంటి విభాగాలను సమన్వయం చేసుకుంటూ మానవ వనరులను ఎలా వినియోగించుకోవచ్చన్న దానిపై ప్రతి విభాగానికి స్పష్టమైన విధివిధానాలను సూచిస్తూ బీసీజీ నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలోని అంశాల అమలుపై పరిశ్రమలశాఖ అధికారులు వివిధ శాఖల అధికారులతో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం, నిర్వహణ వంటి వాటిల్లో ఏపీఐఐసీ, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ల మధ్య సమన్వయం కొరవడింది. కొన్ని సందర్భాల్లో ఒకేపనిని రెండు సంస్థలు చేపట్టడంతో మానవ వనరులు, సమయం వృధా అవుతున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ బీసీజీ పలు సూచనలు చేసింది. పరిశ్రమలశాఖ ఏయే రంగాల్లో పటిష్టంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉందనే విషయాలను ఈ నివేదికలో వివరించింది. అన్నీ వైఎస్సార్ ఏపీ వన్ గొడుగు కిందకు అన్ని శాఖలను సమన్వయపర్చేలా వైఎస్సార్ ఏపీ వన్ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీసీజీ సిఫారసు చేసింది. వైఎస్సార్ ఏపీ వన్‌కి ప్రత్యేకంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, 20 నుంచి 25 మంది ఉద్యోగులను నియమించాలంది. ఏడాదికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలను పునరుజ్జీవింప చేసేవిధంగా ఒక ప్రత్యేక సెల్‌తో పాటు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, వైఎస్సార్ బడుగు వికాసం, పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సెల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నివేదికను సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ.. రాష్ట్రంలోని పరిశ్రమలకు జీవితకాలం హ్యాండ్‌హోల్డింగ్ ఇవ్వడంతోపాటు కొత్తగా యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే వారికి సహాయకారిగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమలశాఖ అధికారులను బుధవారం ఆదేశించారు. -
ఆటో పీఎల్ఐ నోటిఫికేషన్ విడుదల
న్యూఢిల్లీ: అత్యాధునిక ఆటోమోటివ్ టెక్నాలజీ ఆధారిత వాహనాలు (ముందస్తు అనుమతి కలిగిన), అన్ని రకాల ఆటో విడిభాగాల తయారీపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు (పీఎల్ఐ పథకం) అందుకోవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఆటోమొబైల్ రంగానికి రూ.25,938 కోట్ల ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్టు ఇటీవలే ప్రకటించగా.. ఇందుకు సంబంధించి పీఎల్ఐ పథకం కింద రాయితీలు కలి్పంచే నోటిఫికేషన్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ శుక్రవారం జారీ చేసింది. సైనిక వినియోగానికి సంబంధించిన వాహనాలకూ ఈ పథకం కింద ప్రయోజనాలు లభించనున్నాయి. సీకేడీ/ఎస్కేడీ కిట్లు, ద్విచక్ర, త్రిచక్ర, ప్యాసింజర్, వాణిజ్య, ట్రాక్టర్ల అగ్రిగేట్స్ సబ్సిడీలకు అర్హతగా నోటిఫికేషన్లో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుత ఆటోమొబైల్ కంపెనీలతోపాటు.. కొత్త నాన్ ఆటోమోటివ్ పెట్టుబడి సంస్థలూ పథకం కింద ధరఖాస్తు చేసుకోవచ్చు. ఛాంపియన్ ఓఈఎం, కాంపోనెంట్ చాంఫియన్ ఇన్సెంటివ్ స్కీమ్ అనే రెండు భాగాల కింద ధరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పథకం కింద ఒక గ్రూపు పరిధిలోని కంపెనీలకు మొత్తం ప్రోత్సాహకాల్లో 25 శాతానికి మించకుండా (అంటే రూ.6,485 కోట్లకు మించకుండా) ప్రోత్సాహకాలు లభిస్తాయి. చాంపియన్ ఓఈఎం పథకం కింద విక్రయాలు కనీసం రూ.125 కోట్లుగాను, కాంపోనెంట్ చాంపియన్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద విక్రయాలు కనీసం రూ.25 కోట్లుగాను ఉండాలని ఈ నోటిఫికేషన్ స్పష్టం చేస్తోంది. -
రాష్ట్ర జీడీపీలో ఎగుమతుల వాటా 12%
సాక్షి, అమరావతి: రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఎగుమతుల వాటాను పెంచే విధంగా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు. ప్రస్తుతం దేశ జీడీపీలో ఎగుమతుల వాటా 20% ఉంటే రాష్ట్ర జీడీపీ (జీఎస్డీపీ)లో ఇది 12 శాతానికి పరిమితమైందని తెలిపారు. దీన్ని పెంచేందుకు 10 ఏళ్లకాలానికి ప్రణాళిక తయారు చేసినట్లు చెప్పారు. వాణిజ్య ఉత్సవ్‌లో భాగంగా మంగళవారం రాష్ట్రంలో ఎగుమతుల అవకాశాలను వెల్లడించేలా ‘స్థానికంగా ఉత్పత్తి– అంతర్జాతీయంగా విక్రయం’ అంశంపై వివిధ దేశాల రాయబార ప్రతినిధులతో సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం 300 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఎగుమతులను 2025 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం చేరుకోవాలంటే ఏటా దేశ ఎగుమతుల్లో 36 శాతం వృద్ధి నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ఎగుమతులు ప్రస్తుత 16.8 బిలియన్ డాలర్ల నుంచి 22.4 బిలియన్ డాలర్లకు చేరతాయని తెలిపారు. అలాగే 2030 నాటికి రాష్ట్ర ఎగుమతులను రెట్టింపు చేయాలన్న లక్ష్యం చేరుకోవాలంటే ఏటా 8% వృద్ధిని నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. 10 ఏళ్ల కాలానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని రెండు, మూడేళ్లకు ఒకసారి సమీక్షించుకుంటూ ముందుకు వెళ్లనున్నట్లు చెప్పారు. -
‘ఆటో’ అవకాశాలను అందిపుచ్చుకునేలా..
సాక్షి, హైదరాబాద్: వాహన తయారీ రంగంలో గతంలో ప్రభుత్వరంగ సంస్థలకు కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణలో ప్రస్తుతం పలు ప్రైవేటు వాహన తయారీ సంస్థలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాహన తయారీ, మరమ్మతు, అనుబంధ రంగాల కోసం మౌలిక వసతుల కల్పనను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహన పాలసీనీ రూపొందించింది. ఆటోమోటివ్ రంగంలో పలు సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతుండటంతో రాష్ట్రవ్యాప్తం గా పలుచోట్ల ఆటోనగర్లు, పారిశ్రామిక క్లస్టర్లు, ఆటో పార్కులు ఏర్పాటు చేసేందుకు పరిశ్రమల శాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. సంగారెడ్డి జిల్లా బూచినెల్లి, మెదక్ జిల్లా కాళ్లకల్ పారిశ్రామిక వాడల్లో ఇప్పటికే ఏర్పాటైన ఆటో పార్కులను విస్తరించేందుకు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల కల్పన సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఆటో పార్కులు.. ఆటో క్లస్టర్లు కామారెడ్డి, మంచిర్యాల, కరీంనగర్, రామగుండం (కుందనపల్లి)లో కొత్తగా ఆటోనగర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటితో పాటు భువనగిరి, జనగామ, స్టేషన్ ఘనపూర్, మడికొం డ, శాయంపేట, సంగెంలో ఏర్పాటయ్యే ఇండస్ట్రియల్ క్లస్టర్లలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా బూచినెల్లిలోనూ ఆటోమోటివ్ అనుబంధ పరిశ్రమల కోసం ఆటోపార్కును ఏర్పాటు చేశారు. మహీంద్ర పరిశ్రమకు అవసరమైన విడి భాగాలు తయారు చేసే పరిశ్రమలు బూచినెల్లి పారిశ్రామిక పార్కులో ఏర్పాటయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వాహన వినియోగదారులకు వాహన డీలర్లను చేరువ చేసేందుకు ‘నయాగాడీ’ అనే ఐటీ ఆధారిత స్టార్టప్ తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. రంగారెడ్డి జిల్లా చందనవెళ్లిలో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్లు, మహబూబ్‌నగర్ జిల్లా దివిటిపల్లిలో ఎలక్ట్రానిక్ వాహ నాల విడి భాగాలు, బ్యాటరీల ఏర్పాటుకు టీఎస్ఐఐసీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తోంది. ఈవీ, ఆటోమోటివ్ రంగాల్లో పెట్టుబడులు ►రూ. 2,100 కోట్లతో ఎలక్ట్రిక్ వాహన తయారీ యూనిట్ చేసేందుకు ట్రైటాన్ ఈవీ సంస్థ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకుంది. ఆల్టో, వేగనార్ కార్లలో ఈవీ కిట్లను (రెట్రోఫిట్టెడ్) అమర్చేందుకు రాష్ట్రానికి చెందిన ‘ఈ ట్రియో’అనే స్టార్టప్ ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ) అనుమతులు సాధించింది. రెట్రోఫిట్టెడ్ ఎలక్ట్రిక్ కార్లు గేర్లు అవసరం లేకుండా సింగిల్ చార్జితో 150 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ►టచ్ స్క్రీన్ యూనిట్లు, వర్చువల్ రియాలిటీ సిమ్యులేటర్లు వంటి డిజిటల్ సాంకేతికతో కూడిన నెక్సా షోరూమ్‌లను మారుతి సుజుకి రాష్ట్రంలో తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తోంది. రాష్ట్రానికి చెందిన ఈటీఓ మోటార్స్, హాంకాంగ్‌కు చెందిన క్యోటో గ్రీన్ టెక్నాలజీస్ సంయుక్త భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల యూనిట్‌ను ఏర్పాటు చేస్తాయి. ►వ్యవసాయ యంత్ర పరికరాల రంగంలో పేరొందిన మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ జహీరాబాద్‌లోని తమ యూనిట్లో ‘కె2’ట్రాక్టర్లను తయారు చేస్తామని గత ఏడాది ప్రకటించింది. ‘కె2’ప్రాజెక్టు ద్వారా అదనంగా రూ.100 కోట్ల పెట్టుబడులతో పాటు 2024 నాటికి ఉద్యోగ అవకాశాలు రెండింతలు అయ్యే అవకాశముంది. -
ఏపీలో పెట్టుబడులకు అపార అవకాశాలు
సాక్షి, అమరావతి: జర్మనీకి చెందిన పరిశ్రమలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అపార అవకాశాలున్నాయని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు. పెట్టుబడులు పెట్టేందుకు జర్మనీ ప్రాధాన్యం ఇచ్చే తయారీ, ఉత్పత్తి, నైపుణ్యం, వైద్యం, సేంద్రియ వ్యవసాయం, సౌరవిద్యుత్ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తూ నిర్ణయాలు తీసుకుందన్నారు. మంగళవారం ఏపీటీఎస్ కార్యాలయంలో జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్ స్టోల్‌తో మంత్రి మేకపాటి సమావేశమై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న పారిశ్రామిక విధానం గురించి వివరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై జర్మనీ కాన్సులేట్ జనరల్ అడిగి తెలుసుకున్నారని చెప్పారు. త్వరలో నెల్లూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్ ఈనెల 25న ప్రారంభిస్తారని మంత్రి తెలిపారు. 28 నుంచి విమానాల రాకపోకలు ప్రారం భమవుతాయన్నారు. నెల్లూరు ఎయిర్‌పోర్టును త్వర లో అభివృద్ధి చేస్తామన్నారు. గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటాలో, ప్రభుత్వానికి వచ్చే ఆదాయం లో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో పెటు ్టబడుల ఉపసంహరణపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని తెలిపారు. ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ స్పష్టంగా సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. అంతకుముందు పరిశ్రమలశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి కరికాల వలవన్ జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్కు ఆహ్వానం పలికారు. పారిశ్రామికాభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాల గురించి ఏపీఐఐసీ ఎండీ రవీన్‌కుమార్‌రెడ్డి ప్రజెంటేషన్ ఇచ్చారు. స్టార్టప్‌లలో పాలుపంచుకోవాలని ఏపీటీఎస్ ఎండీ నందకిశోర్ కోరారు. సమావేశంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, పరిశ్రమలశాఖ అదనపు డైరెక్టర్ నాయక్, ఈడీబీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ కృష్ణ జీవీగిరి, ఐటీ సలహాదారు విద్యాసాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడుల బాటలో ఏపీ పెట్టుబడులకు అవకాశాలున్న మార్గంలో ఏపీ ముందుకెళుతోందని జర్మనీ కాన్సులేట్ జనరల్ కరిన్స్టోల్ పేర్కొన్నారు. నైపుణ్యరంగంపై దృష్టి పెట్టడం మంచి పరిణామమన్నారు. -
సముద్రపు నీరు మంచి నీరుగా..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పారిశ్రామిక అవసరాలకు సముద్రపు నీటిని శుద్ధి (డీశాలినేషన్) చేసి వినియోగించుకోవాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా తొలి డీశాలినేషన్ ప్లాంట్‌ను కృష్ణపట్నం మెగా లెదర్ క్లస్టర్లో ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. లెదర్ పార్కులో ఏర్పాటు చేసే యూనిట్లకు నీటి వినియోగం అధికంగా ఉండటంతో ఒక్క చుక్క నీటిని కూడా భూగర్భజలాల నుంచి వినియోగించకుండా పూర్తిగా సముద్రపు నీటినే వినియోగించే విధంగా ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 536.88 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ మెగా లెదర్ క్లస్టర్‌కు రోజుకు 10.5 మిలియనలీటర్ల నీరు అవసరమవుతుందని అంచనా. ఇందుకోసం రోజుకు 90 మిలియన్ లీటర్లకు పైగా సముద్రపు నీటిని శుద్ధిచేయాల్సి ఉంటుంది. ఇలా శుద్ధి చేయగా వచ్చిన మంచినీటిని వినియోగించి మిగిలిన నీటిని సముద్రంలోకి వదిలేస్తారు. తొలిదశలో 386.88 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న ఈ క్లస్టర్‌కు రోజుకు 3.5 మిలియన్ లీటర్ల నీరు అవసరవుతుందని అంచనా వేశారు. ఇందుకోసం 30.5 మిలియన్ లీటర్ల సముద్రపు నీటిని శుద్ధిచేయాల్సి ఉంటుంది. డీశాలినేషన్ ప్లాంట్ ఏర్పాటుకు సుమారు రూ.70 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నామని, దీనికి త్వరలోనే టెండర్లు పిలుస్తామని కృష్ణపట్నం లెదర్ కాంప్లెక్స్ లిమిటెడ్ అధికారులు తెలిపారు. నాలుగు పైసలకే లీటరు నీరు అందుబాటులోకి డీశాలినేషన్ విధానంలో పరిశ్రమలకు కారుచౌకగా నాలుగు పైసలకే లీటరు నీరు అందించవచ్చని, తీరప్రాంతంలో ఏర్పాటు చేసే యూనిట్లకు ఈ విధానంలో నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని 2019 ఆగస్టులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇజ్రాయేల్ పర్యటన సందర్భంగా చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాష్ట్రంలో డీశాలినేషన్ విధానంలో సముద్రపు నీటిని వినియోగించుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానం అందించేలా ఇజ్రాయేల్‌కు చెందిన ఐడీఈ టెక్నాలజీస్‌తో ప్రభుత్వం గతేడాది ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు డీశాలినేషన్ ద్వారా నీటిని అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి సూచించారు. ఈ మేరకు రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాల కోసం సముద్రపు నీటిని వినియోగించుకునే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పరిశ్రమలశాఖ డైరెక్టర్ జె.సుబ్రమణ్యం తెలిపారు. ఇందులో భాగంగా తొలుత కృష్ణపట్నం లెదర్ పార్క్‌లో డీశాలినేషన్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. -
పరిశ్రమలకు ఆధార్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పరిశ్రమలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాలను గుర్తించేందుకు పరిశ్రమలశాఖ ‘ఆంధ్రప్రదేశ్ సమగ్ర పరిశ్రమ సర్వే2020 (ఎస్పీఎస్)’ని చేపట్టింది. పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్, నీరు, నిపుణులైన మానవ వనరులను సమకూర్చడం ద్వారా పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ను మొదటిస్థానంలో నిలపాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ సమగ్ర సర్వేను చేపడుతున్నారు. అక్టోబర్ 15కల్లా సర్వే పూర్తి చేసి అదే నెల 30వ తేదీలోగా పూర్తి సమాచారాన్ని విడుదల చేయాలని పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్వే కోసం ప్రత్యేక బృందాలు.. ►సర్వే సందర్భంగా రాష్ట్రంలో పతి పరిశ్రమకు ఆధార్ తరహాలో 11 అంకెలతో ప్రత్యేక సంఖ్యను కేటాయించి తొమ్మిది రకాల సమాచారాన్ని సేకరిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని కార్యదర్శులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వే ద్వారా వివరాలు సేకరిస్తారు. ►సర్వే పర్యవేక్షణ కోసం ప్రతి జిల్లాలో కలెక్టర్ చైర్మన్‌గా 11 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. (అమరావతికి నిధుల సమీకరణ) ►సర్వే సమాచారాన్ని విశ్లేషించడం ద్వారా పరిశ్రమల అవసరాల మేరకు మానవ వనరులకు స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాల ద్వారా శిక్షణ ఇప్పిస్తారు. పరిశ్రమ ఆధార్ అంటే...? ►పరిశ్రమలకు ఆధార్ తరహాలో కేటాయించే 11 అంకెలతో కూడిన ప్రత్యేక సంఖ్య ద్వారా అది ఏ రంగానికి చెందిన పరిశ్రమ? ఏ జిల్లాలో ఉంది? అనే వివరాలను సులభంగా గుర్తించవచ్చు. ►11 డిజిట్స్‌లో మొదటి మూడు జిల్లాను, తర్వాత రెండు అంకెలు మండలాన్ని సూచిస్తాయి. తదుపరి సంఖ్య ఏ రంగానికి చెందిన పరిశ్రమ? అనే విషయాన్ని తెలియచేస్తుంది. చివరి 5 డిజిట్స్ సీరియల్ నంబర్ ఉంటాయి. ఇలా రాష్ట్రంలోని చిన్న పరిశ్రమ నుంచి పెద్ద పరిశ్రమ వరకు ప్రత్యేక సంఖ్యను కేటాయిస్తారు. -
రామాయపట్నంపై జపాన్ సంస్థల ఆసక్తి
సాక్షి, అమరావతి: రామాయట్నం పోర్టుతో సహా మొత్తం పది కీలక రంగాలలో ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఎత్తున పెట్టుబడులకు పెట్టేందుకు జపాన్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం సచివాలయంలోని తన కార్యాలయంలో జపాన్ సంస్థలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. జపాన్‌కు చెందిన బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ (జేబీఐసీ), జపాన్ ప్రీమియర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (జేఐసీఏ), ప్రీమియర్ జపాన్ డెవలప్మెంట్ ఏజెన్సీ, కునియమి ఎసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లిమిటెడ్ సంస్థలు ఏపీ పారిశ్రామికాభివృద్ధిలో సహకరించేందుకు సుముఖంగా ఉన్నట్లు మంత్రి వివరించారు. జపాన్ సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్న రంగాలు.. ► రాష్ట్రంలో పోర్టుల నిర్మాణం, ఓడరేవుల ద్వారా రవాణా, పోర్టు ఆధారిత క్లస్టర్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ క్లస్టర్ల అభివృద్ధిలో జపాన్ సంస్థల భాగస్వామ్యం. ► సోలార్ విద్యుత్ పార్కుల ఏర్పాటు, ఆక్వాకల్చర్ అభివృద్ధి, ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ల ఏర్పాటులో పెట్టుబడులకు సంసిద్ధత. ► ఏపీ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసెట్స్ మేనేజ్మెంట్తో భాగస్వామ్యం, పట్టణాల పునరుద్ధరణ, అభివృద్ధిలో తోడ్పాటు. ► విశాఖ కేంద్రంగా పెవిలియన్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు సంసిద్ధం. విశాఖలో ఏర్పాటు చేయనున్న స్కిల్ సెంటర్, ఐటీ, పారిశ్రామిక క్లస్టర్లు, పోర్టులు, మౌలిక వసతుల కల్పన, విశాఖను ఐటీ హబ్‌గా మార్చేలా నైపుణ్య కేంద్రం ఏర్పాటుకు సహకారం. ► అంతర్జాతీయ మార్కెట్ల స్థాయిలో జేబీఐసీ (జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్) క్రెడిట్ రేటింగ్‌తో ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి. పరిశీలనలో ఉన్న మరికొన్ని ప్రాజెక్టులు (ప్రాథమిక దశ) ► రామాయపట్నం పోర్టు ద్వారా సరుకు రవాణా, పోర్టు కేంద్రంగా ఇండస్ట్రియల్ క్లస్టర్ అభివృద్ధి. ► విశాఖపట్నం సమీపంలోని నక్కపల్లి ఇండస్ట్రియల్ నోడ్ ► 10 వేల మెగావాట్ల సామర్థ్యమున్న సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు ► విశాఖపట్నం అభివృద్ధి, మౌలిక వసతులు, స్థిరాస్తి రంగానికి సహకారం. ► వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎంవో అదనపు ప్రత్యేక సీఎస్ పీవీ రమేశ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలవన్ తదితరులు పాల్గొన్నారు. జపాన్‌కు చెందిన వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
పెట్టుబడుల ప్రవాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి మూడు ప్రతిష్టాత్మక విదేశీ కంపెనీలు ముందుకొచ్చాయి. జపాన్‌కు చెందిన ఏటీజీ సంస్థ టైర్ల తయారీ కంపెనీ, చైనాకు చెందిన వింగ్‌టెక్ సంస్థ మొబైల్ ఫోన్ల తయారీ యూనిట్, హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ సంస్థ భారీ స్థాయిలో పాదరక్షల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఈ మూడు కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు.. తద్వారా ప్రత్యక్షంగా 22,000 మందికి ఉపాధి కల్పించడానికి ఉద్దేశించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను ప్రభుత్వానికి సమర్పించాయి. వీటిని పరిశీలించిన పరిశ్రమల శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ పెట్టుబడులకు ముఖ్యమంత్రి అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు(ఎస్ఐపీబీ) ఆమోదం తెలిపిన వెంటనే ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాలు(ఎంఓయూ) చేసుకోవడానికి ఆయా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఎస్ఐపీబీ పునర్వ్యవస్థీకరణ గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రితో పాటు మొత్తం 11 మంది సభ్యులతో ఎస్ఐపీబీని ఏర్పాటు చేశారు. ఆ బోర్డును పునర్వ్యవస్థీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. పరిమిత సభ్యులతో కొత్త ఎస్ఐపీబీని ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తోంది. వారం రోజుల్లో కొత్త బోర్డు ఏర్పాటయ్యే అవకాశాలున్నాయని పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. మూడు ప్రాజెక్టులకు ఎస్ఐపీబీ ఆమోదం తెలిపితే, ఎంఓయూ కుదుర్చుకొని, ఆయా సంస్థలకు భూ కేటాయిపులు చేయడానికి రంగం సిద్ధమైంది. ఏటీజీ టైర్ల కంపెనీకి 80 ఎకరాలు.. భారీ వాహనాలు, గనుల తవ్వకంలో ఉపయోగించే యంత్రాలకు అవసరమైన టైర్ల తయారీలో పేరొందిన జపాన్‌కు చెందిన అయన్స్ టైర్ గ్రూపు(ఏటీజీ) విశాఖపట్నం సమీపంలో యూనిట్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. రూ.1,600 కోట్ల పెట్టుబడితో ఎగుమతి ఆధారిత టైర్ల యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విశాఖపట్నంలో పోర్టులు ఉండటంతో వ్యూహత్మకంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. యూనిట్ ఏర్పాటుకు 110 ఎకరాలు కావాలని ఏటీజీ కంపెనీ కోరగా, డీపీఆర్‌ను పరిశీలించిన తర్వాత దాదాపు 80 ఎకరాలు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికే గుజరాత్, తమిళనాడులో ఏటీజీ యూనిట్లు ఉన్నాయి. విశాఖపట్నం యూనిట్ దేశంలో మూడో యూనిట్ కానుంది. విశాఖపట్నంలో ఏర్పాటు చేసే కొత్త యూనిట్లో దాదాపు 2,000 మందికి ప్రత్యక్షంగా, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశం ఉంది. రేణిగుంట ఈఎంసీలో వింగ్‌టెక్ యూనిట్ చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ వింగ్‌టెక్ ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. ఈ యూనిట్ ద్వారా నేరుగా 10,000 మందికి ఉపాధి లభించడంతో పాటు మరో 5,000 మందికి సప్లైచైన్ విభాగంలో పరోక్ష ఉపాధి లభించనుంది. చిత్తూరు జిల్లా రేణిగుంటలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎంసీ)–2లో వింగ్‌టెక్ యూనిట్ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఏడాదికి 40 లక్షల మొబైల్ ఫోన్ల తయారీ కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. రేణిగుంటలో ఈఎంసీలకు నీటి కొరతను తీర్చడానికి ఏపీఐఐసీ రూ.20 కోట్లతో మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని నెలకొల్పనుంది. తిరుపతి మున్సిపాలిటీ నుంచి వచ్చే మురుగునీటిని శుద్ధి చేసి, ఈఎంసీలకు పంపిణీ చేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. శాశ్వత ప్రాతిపదికన కండలేరు రిజర్వాయర్ నుంచి రూ.200 కోట్లతో పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేయడానికి పరిశ్రమల శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోంది. నీటి కొరత తీరితే ఈఎంసీల్లో పెట్టుబడులు పెట్టడానికి మరిన్ని సంస్థలు ముందుకొస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. రెండు దశల్లో పాదరక్షల తయారీ యూనిట్ హాంకాంగ్‌కు చెందిన ఇంటెలిజెంట్ సెజ్ డెవలప్మెంట్ సంస్థ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సమీపంలో భారీ పాదరక్షల తయారీ యూనిట్‌ను నెలకొల్పడానికి ముందుకొచ్చింది. దాదాపు రూ.750 కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్ ఏర్పాటు చేయనున్నారు. అడిడాస్ వంటి ప్రముఖ బ్రాండ్ పాదరక్షలను ఈ సంస్థ తయారీ చేస్తోంది. శ్రీకాళహస్తి సమీపంలో రెండు దశల్లో ఏర్పాటు చేసే యూనిట్ ద్వారా 10,000 మందికి నేరుగా ఉపాధి లభించనుంది. ఇందులో అత్యధికంగా మహిళలకే ఉపాధి కల్పించనున్నారు. 298 ఎకరాలు కేటాయించడానికి ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇంటెలిజెంట్ సంస్థ ఇప్పటికే నెల్లూరు జిల్లా తడ వద్ద యూనిట్ ఏర్పాటు చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో 2006లో మొదలైన ఈ యూనిట్ ఇప్పుడు ప్రతినెలా 12 లక్షల జతల పాదరక్షలను ఉత్పత్తి చేస్తోంది. ఇప్పటివరకు రూ.700 కోట్ల పెట్టుబడి పెట్టి, 11,000 మందికి ఉద్యోగాలు కల్పించడం గమనార్హం. -
పరిశ్రమల స్వర్గధామం ఏపీ
యూనివర్సిటీ క్యాంపస్: ‘పరిశ్రమల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం. లంచాలకు తావు లేకుండా పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహిస్తాం. పెట్టుబడులతో ముందుకొస్తే అవసరమైన అనుమతులను వెంటనే ఇస్తాం’ అని రాష్ట్ర మంత్రులు, ఏపీఐఐసీ చైర్పర్సన్, ఎమ్మెల్యేలు పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తిరుపతి ఎస్వీయూ సెనేట్ హాల్లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే అంశంపై చిత్తూరు జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి మాట్లాడుతూ.. పారిశ్రామిక చట్టం సవరణలో భాగంగా మరికొన్ని సంబంధిత శాఖలను సింగిల్ డెస్క్ పోర్టల్‌లోకి తీసుకొస్తామన్నారు. ఏపీఐఐసీ ద్వారా పరిశ్రమల స్థాపనకు మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. సామాజిక బాధ్యతతో పారిశ్రామిక రంగంలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నామని వివరించారు. పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం తగ్గించేందుకు పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనపై పూర్తిస్థాయి దృష్టి సారిస్తున్నామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా త్వరితగతిన పారిశ్రామిక అనుమతులు మంజూరు చేయడంతో పాటు వారికి అవగాహన కల్పించేందుకు ప్రతినెలా సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. ఏపీఐఐసీ కింద జిల్లాలో నాలుగువేల ఎకరాల భూమి ఉందని, వచ్చే ఏడాది కల్లా పరిశ్రమల పనులు ప్రారంభించి వేగవంతంగా పూర్తయ్యేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ఏపీఐఐసీ చైర్పర్సన్ ఆర్.కె.రోజా అధికారులకు సూచించారు. చెన్నై పోర్టు, కృష్ణపట్నం పోర్టు, చెన్నై ఎయిర్‌పోర్టు జిల్లాకు సమీపంలో ఉన్నాయని, దీన్ని దృష్టిలో ఉంచుకొని వీలైనన్ని పరిశ్రమలు స్థాపిస్తే ఉద్యోగాల విప్లవం తీసుకురావచ్చన్నారు. మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, తుడా చైర్మన్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి రజిత్ భార్గవ్ మాట్లాడుతూ నియోజకవర్గాల వారీగా ఏఏ పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందో ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిమూలం, వెంకటేగౌడ, శ్రీనివాసులు తదితరులు మాట్లాడారు. విద్యుత్ బిల్లులు తగ్గించి, పరిశ్రమలకు మేలు చేసేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చక్కగా ప్రయత్నిస్తున్నారని పలువురు పారిశ్రామికవేత్తలు కొనియాడారు. -
లైన్ క్లియర్
ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా టీఎస్ఐఐసీ కన్సల్టెన్సీ సహకారంతో డీపీఆర్‌కు తుదిరూపు రాష్ట్రానికే తలమానికంగా ఫార్మాసిటీ రూపకల్పన ఫార్మాసిటీ కోసం ఇప్పటివరకు ప్రభుత్వం 4వేల ఎకరాల భూమిని సేకరించింది. ముచ్చర్ల, పంజాగూడ, మీర్ఖాన్పేట, కుర్మిద్దలో భూములకు పరిహారం కూడా చెల్లించింది. నానక్‌నగర్, తిప్పాయిగూడ తదితర గ్రామాల్లోనూ భూములను సమీకరించే పనిలో నిమగ్నమైంది. ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేసినందున.. ఇక ఫార్మా పనులు వేగం పుంజుకోనున్నాయి. ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదనల మండలి (నిమ్జ్) హోదా కూడా కట్టబెట్టేందుకు కేంద్ర సర్కారు సూత్రప్రాయంగా అంగీకరించింది. ఔషధనగరికి మార్గం సుగమమైంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో 12,500 ఎకరాల్లో ప్రతిపాదించిన ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ అంకురార్పణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా బల్క్‌డ్రగ్ ఉత్పత్తుల్లో మూడో వంతు మనరాష్ట్రంలో తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఔషధ రంగానికి చిరునామాగా మార్చాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ సర్కారు ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే కందుకూరు మండలం ముచ్చర్ల కేంద్రంగా ఔషధనగరి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఔషధ దిగ్గజ కంపెనీల అధినేతలను వెంటబెట్టుకొని తొలి పర్యటనను ఇక్కడే చేశారు. అదేరోజు ఫార్మాసిటీ స్థాపనపైనా ప్రకటన చేశారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదిం చిన ఫార్మాసిటీ ప్రాజెక్టుకు జిల్లాలో 10,628.36 ఎకరాలను సమీకరించడానికి ప్రభుత్వం ప్రణాళిక తయారుచేసింది. ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదనలమండలి (నిమ్జ్) హోదా కూడా కట్టబెట్టేందుకు కేంద్ర సర్కారు సూత్రప్రాయంగా అంగీకరించడం.. కనిష్టంగా 12,500 ఎకరాలుంటే గానీ ఈ హోదా వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టు విస్తీర్ణాన్ని పెంచింది. ఈ హోదాతో రాయితీలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం గ్రాంటు రూపేణా విరివిగా నిధులు విడుదలచేసే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా ఇరుజిల్లాల్లో కలిపి 15 వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది. దీంట్లో ఇప్పటివరకు ప్రభుత్వం 4వేల ఎకరాల భూమిని సేకరించింది. ముచ్చర్ల, పంజాగూడ, మీర్ఖాన్పేట, కుర్మిద్దలో భూముల కు పరిహారం కూడా చెల్లించింది. అలాగే నానక్‌నగర్, తిప్పాయిగూడ తదితర గ్రామాల్లో కూడా భూములను సమీకరించే ప్రక్రియలో వేగం పెంచింది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా అమన్‌గల్ మండలంలోని భూ ములను ఆ జిల్లా యంత్రాంగం సమకూర్చుతోంది. కాగా, ప్రభుత్వం సమీకరిస్తున్న భూమిలో అత్యధికంగా అసైన్డ్, ప్రభుత్వ భూములే ఉన్నాయి. రాష్ట్రానికి సిరి.. ఔషధనగరి ఔషధ ఉత్పత్తుల్లో రాష్ట్రం ముందంజ లో ఉంది. బల్క్‌డ్రగ్ ఉత్పత్తులో మూడోవంతు తెలంగాణ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుకు జీవం పోసిన ప్రభుత్వం.. ఇక్కడ జీవశాస్త్ర, జీవ సాంకేతిక పరిజ్ఞానం, ఔషధ పరిశోధన, నూతన ఔషధాల ఆవిష్కరణలకు ఫార్మాసిటీని కేంద్రంగా మలచాలని యోచిస్తోంది. దీనికి ‘నిమ్జ్’ హోదాను ఇచ్చేందుకు అనుమతించడంతో పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరవాలని నిర్ణయించింది. ఔషధనగరి ఏర్పాటులో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్ఐఐసీ ఇప్పటికే పలు ఔషధ తయారీ ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపులు జరిపింది. పలు కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను నెలకొల్పే విధంగా ఒప్పించగలిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్న ప్రభుత్వం.. కాలుష్య ఉద్గారాలు రాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో శుద్ధియంత్రాలను ఏర్పాటు చేస్తోంది. దీనికి అనుగుణంగా నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు నేతృత్వంలోని అధికారుల బృందం ఐర్లాండ్, ఇంగ్లాండ్, జర్మనీ తదితర దేశాల్లో పర్యటించింది. ఈ మేరకు ఎస్టీపీల స్థాపనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. మరోవైపు ఫార్మాసిటీ ప్రాజెక్టు డీపీఆర్‌ను రూపొందించడానికి అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించింది. తాజాగా ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేసినందున.. ఫార్మా పనులు మరింత వేగంగా ముందుకు సాగేందుకు దోహదం చేయనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి. -
రావత్ అవుట్.. మిశ్రాపై సీఎస్ సీరియస్
♦ రాయితీల కుంభకోణంలో కీలక మలుపు ♦ పరిశ్రమలశాఖ కొత్త కమిషనర్‌గా సాల్మన్ ♦ మిశ్రాను వివరణ కోరిన చీఫ్ సెక్రటరీ సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల శాఖ కొత్త కార్యదర్శిగా సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ పోస్టులో ఉన్న షంషేర్‌సింగ్ రావత్‌ను తప్పించారు. పారిశ్రామిక రాయితీల వ్యవహారంలో అవకతవకలు వెలుగుచూసిన నేపథ్యంలో జరిగిన ఈ నిర్ణయం సర్వత్రా చర్చనీయాంశమైంది. రూ.2,045 కోట్ల రాయితీల్లో దాదాపు రూ.100 కోట్ల మేర పక్కదారి పట్టినట్టు ఆరోపణలు వచ్చాయి. వీటిలో ఇప్పటి వరకూ రూ.10 కోట్లు గుర్తించారు. పరిశ్రమల శాఖ కమిషనరేట్‌లో పనిచేస్తున్న అధికారి ఇండస్ట్రీస్ డెరైక్టర్ పేరుతో షాడో అకౌంట్ తెరిచారు.దారిమళ్లిన రాయితీలు ఇదే అకౌంట్‌కు రావడంతో విజిలెన్స్ విభాగం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. అధికార పార్టీలోని కొంతమంది ముడుపులు తీసుకుని, అడ్డగోలుగా రాయితీలు ఇచ్చినట్టు విమర్శలొచ్చాయి. ఫలితంగా ప్రభుత్వాధినేతకు రూ.కోట్లను పారిశ్రామిక వేత్తలు ముట్టజెప్పినట్టు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో లేని పరిశ్రమలకు, అర్హతలేని యూనిట్లకు రాయితీలు ఇవ్వడం విచారణలో వెలుగుచూసింది. దీనిపై గురువారం లోక్‌సత్తా పార్టీ నేతలు సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ తంతు వెనుక పరిశ్రమల శాఖలో పనిచేస్తున్న ఉన్నతాధికారులకు ప్రమేయం ఉందని, సీబీఐ విచారణ జరపాలని కోరారు. ఈ నేపథ్యంలో రావత్ బదిలీ కావడం, ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టడం గమనార్హం. ఇదిలా ఉంటే, పరిశ్రమల శాఖ డెరైక్టర్ కార్తికేయ మిశ్రాను ఈ గోల్‌మాల్‌పై సీఎస్ శుక్రవారం వివరణ కోరినట్టు సమాచారం. -
పేద దళిత రైతుల నోట్లో సర్కారు మన్ను
♦ పరిశ్రమల కోసం అసైన్డ్ భూములు కారు చౌకగా కొట్టేసే వ్యూహం ♦ ప్రాథమిక విలువ చెల్లించడానికి జీవో 155 జారీ సాక్షి, హైదరాబాద్: పేదలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వం పారిశ్రామిక వర్గాల ప్రయోజనాలకు పెద్దపీటవేస్తోంది. పేద దళితులకు చెందిన అసైన్డ్ భూములను లాక్కునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వారి నోట్లో మట్టి కొట్టి పారిశ్రామికవేత్తలకు ఆ భూములు కట్టబెట్టడానికి తాజాగా ఓ జీవో తెచ్చింది. పేదల నుంచి భూములు గుంజుకోవడానికి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ)ని పెద్ద దళారీగా వినియోగించుకుంటోంది. బలవంతపు సేకరణవల్ల భూమి కోల్పోయే వారికి న్యాయమైన పరిహారం కూడా ఇవ్వకుండా ప్రాథమిక (బేసిక్) విలువ ఇచ్చి సరిపెట్టాలని చూస్తోంది. అసైన్డ్, పేదలు అనుభవిస్తూ ఉన్న (ఆక్రమిత ప్రభుత్వ) భూముల సేకరణకు ఏపీఐఐసీ ప్రాథమిక విలువ మాత్రం చెల్లిస్తే సరిపోతుందంటూ తాజాగా సర్కారు జీవో 155 జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విధానం (2015-20)లో భాగంగా 10 లక్షల ఎకరాలతో ల్యాండ్‌బ్యాంకు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. నామమాత్రపు పరిహారంతో పేదల నుంచి భూములు లాక్కునేందుకు ఈ జీవో జారీ చేసిందనే విషయం తెలుస్తోంది. ప్రజావసరాల కోసం అసైన్డ్ భూములను సేకరించినా అసైనీలకు న్యాయమైన పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ చట్టం చెబుతోంది. మార్కెట్ విలువ ప్రకారమే అసైన్డ్ భూములకు పరిహారం చెల్లించాలని గతంలో జారీ చేసిన జీవో 571లో కూడా స్పష్టంగా ఉంది. ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న వారి నుంచి ఆ భూమిని సేకరించినా మార్కెట్ విలువ ప్రకారమే అనుభవదారులకు పరిహారం చెల్లించాలని ఆ జీవోలో ఉంది. అయినా దీనికి విరుద్ధంగా అసైన్డ్, ప్రభుత్వ ఆక్రమిత భూముల సేకరణకు ప్రాథమిక విలువ మాత్రమే ఏపీఐఐసీ చెల్లిస్తుందని ఈనెల 19న ప్రభుత్వం జీవో 155 జారీ చేసింది. నష్టపోయేది పేద దళితులే.. బేసిక్ విలువ అనే ముద్దుపేరుతో బిక్ష వేసి అసైనీలు, అనుభవదారుల నుంచి భూమిని ఏపీఐఐసీ బలవంతంగానైనా సేకరించవచ్చంటూ ప్రభుత్వం ఇచ్చిన జీవో అత్యంత దుర్మార్గమైనదని రెవెన్యూ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. న్యాయబద్ధమైన పరిహారం చెల్లించాలనే కేంద్ర చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా ఈ ఉత్తర్వు ఉందని రెవెన్యూ శాఖలో రిటైరైన ఒక ఐఏఎస్ అధికారి చెప్పారు. ‘‘బహిరంగ మార్కెట్ విలువపై గిరిజన ప్రాంతాల్లో అయితే 1.5 రెట్లు, షెడ్యూలేతర ప్రాంతాల్లో అయితే 1.25 రెట్లు అధికంగా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వ భూసేకరణ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన చట్టం చెబుతోంది. అంటే.. ఉదాహరణకు ఎకరా మార్కెట్ విలువ రూ. లక్ష ఉంటే గిరిజన ప్రాంతాల్లో రూ. 2.50 లక్షలు, గిరిజనేతర ప్రాంతాల్లో రూ. 2.25 లక్షలు పరిహారం చెల్లించాలి. దీనికి అదనంగా 12 శాతం కూడా ఇవ్వాలి. పైగా కేంద్ర ప్రభుత్వం చేసిన ఎల్ఏఆర్ఆర్ చట్టం ప్రకారం చేయాల్సిన నష్ట పరిహారం పునరావాస ప్యాకేజీలను తగ్గించి రాష్ట్రం పైప్యాకేజీలు అమల్లోకి తెచ్చింది. బేసిక్ విలువ అనేది రిజిస్ట్రేషన్ శాఖ ఫీజుల వసూలు కోసం నిర్ణయించిన మార్కెట్ ధర. ఇది వాస్తవంగా బహిరంగ మార్కెట్ విలువలో పదో వంతు మాత్రమే ఉంటుంది. అందువల్ల బేసిక్ విలువ చెల్లించి పేదలకు చెందిన అసైన్డ్, వారు అనుభవిస్తున్న భూములు లాక్కోవడమంటే వారి కడుపు కొట్టడమే. అసైన్డ్ భూములున్న వారిలో పేద దళితులే ఎక్కువ. అందువల్ల ఈ జీవో ప్రకారం భూములు లాక్కుంటే ఎక్కువగా నష్టపోయేది ఆ దళితులే’’ అని ఆ రిటైర్డు ఐఏఎస్ అధికారి వివరించారు. పెపైచ్చు జీవో 571కి సవరణలు చేసేందుకు ప్రభుత్వం డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏడాది క్రితం నియమించింది. ఆ ఉప సంఘం నివేదిక ఇంకా సమర్పించక ముందే జీవో 571కి సవరణ చేస్తూ జీవో 155ను జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనదని అధికారవర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఎందుకివ్వాలి? ఏ సంస్థ అయినా తమ వ్యాపార ప్రయోజనాల కోసమే పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నాయి. వ్యాపారమో, పారిశ్రామిక కార్యకలాపాల కోసమో వచ్చే సంస్థలకు నామమాత్రపు ధరకో లేదా ఉచితంగా భూములు ఎందుకు ఇవ్వాలి? పెపైచ్చు పారిశ్రామిక సంస్థలకు అప్పనంగా కట్టబెట్టేందుకు పేదల నుంచి అసైన్డు భూములు ఎందుకు లాక్కోవాలి? ఏపీఐఐసీని ఇందుకు పెద్ద దళారీగా పెట్టి పది లక్షల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఏమిటి? ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ పెద్దల స్వప్రయోజనాలు లేకపోతే పేదల పొట్టకొట్టేలా పది లక్షల ఎకరాల ల్యాండ్ బ్యాంకు ప్రతిపాదన ఎందుకు? అని రాజకీయ, అధికార వర్గాలు గట్టిగా ప్రశ్నిస్తున్నాయి. ఎవరి ప్రయోజనాల కోసం? మార్కెట్ విలువ చెల్లించి సేకరించిన భూములను పారిశ్రామిక సంస్థలు తీసుకుంటే వాటికి భారమవుతుందని ఏపీఐఐసీ భావించింది. అందువల్ల బేసిక్ విలువకే అసైన్డ్, పేదల భూములను వారికి ఇవ్వాలని ఏపీఐఐసీ ప్రభుత్వానికి ప్రతిపాదన చేసింది. ఆ ప్రతిపాదనను ప్రభుత్వం ఆమోదించింది. అంటే ప్రభుత్వానికి పేదల ప్రయోజనాలు ముఖ్యమా? పారిశ్రామిక సంస్థలకు లబ్ధి చేకూర్చడం ప్రాధాన్యమా? అని విపక్షాలతోపాటు అధికార వర్గాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. పేదల భూములు లాక్కుని పారిశ్రామిక సంస్థలకు కారుచౌకగానో లేక ఉచితంగానో భూములు కట్టబెట్టాలని కుట్ర పన్నడం దారుణమని ఆ వర్గాలు విమర్శిస్తున్నాయి. ఇలా భూములు కట్టబెట్టడం వెనుక ప్రభుత్వ పెద్దల స్వార్థం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు, ప్రజల ఆస్తులకు గండిపడేలా టీడీపీ సర్కారు గత కొంతకాలంగా తీసుకున్న నిర్ణయాలు ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతున్నాయి. పారిశ్రామిక సంస్థలకు మేలు చేకూర్చే భూముల గరిష్ట లీజు పరిమితిని 33 ఏళ్ల నుంచి 99 ఏళ్లకు పెంచుతూ తీసుకున్న నిర్ణయం ఇందుకు నిదర్శనం. లీజు పెంపుతో పాటు పారిశ్రామిక సంస్థలకు కేటాయించిన భూములు విక్రయించుకునేలా పూర్తి యాజమాన్య హక్కు కల్పిస్తూ జీవో ఇవ్వడం మరో నిదర్శనం. అమ్మో.. పరిశ్రమల శాఖ ప్రభుత్వం అస్మదీయులకు ప్రజాధనాన్ని దోచిపెట్టేందుకు, భూములు కట్టబెట్టేందుకు అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ఆ మేరకే ఉత్తర్వులు మీద ఉత్తర్వులు జారీ చేస్తోంది. వీటిపై ఎవరైనా కోర్టుకు వెళితే.. భవిష్యత్‌లో ప్రభుత్వాలు విచారణకు ఆదేశించినా ఇబ్బందులు తప్పవని ఉన్నతాధికారులు భయపడుతున్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకునే పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయారు. ఆ స్థానంలో నియమించేందుకు ఇద్దరు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులను సంప్రదించగా.. అక్కడ నియమిస్తే తాము సైతం దీర్ఘకాలిక సెలవుపై వెళ్తామని స్పష్టీకరించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. -
డ్వామా పీడీగా రవీందర్
సాక్షి, సంగారెడ్డి: జిల్లా గ్రామీణ నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) ప్రాజెక్టు డెరైక్టర్‌గా పి. రవీందర్ నియమితులయ్యారు. పరిశ్రమల శాఖ ప్రధాన కార్యాలయంలో డిప్యూటీ డెరైక్టర్‌గా పనిచేస్తున్న ఆయన్ను డిప్యుటేషన్‌పై డ్వామా పీడీగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఏడాది పాటు ఆయన ఈ పోస్టులో పనిచేస్తారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వరంగల్ జిల్లా మొగిలపల్లి మండలం రంగాపూర్ ఆయన స్వగ్రామం. గతంలో ఆయన కరీంనగర్ డీఆర్డీఏ పీడీగా డిప్యూటేషన్‌పై 2008-11 మధ్య కాలంలో దాదాపు మూడున్నరేళ్లు పనిచేశారు. అంతకు ముందు నిజామాబాద్ డీఆర్డీఏ పీడీగా, కరీంనగర్ డీఆర్డీఏ అదనపు పీడీగా, కర్నూలు జిల్లా స్టెట్కూరు సీఈఓగా డిప్యుటేషన్‌పై పనిచేశారు. పరిశ్రమల శాఖలో అసిస్టెంట్ డెరైక్టర్‌గా నియామకం పొందిన రవిందర్ .. ఆయన తన సర్వీసులో పదేళ్లకు పైగా వేర్వేరు ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్లపై పనిచేశారు. ఈ వారాంతంలోగా ఆయన డ్వామా పీడీగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలున్నాయి. డ్వామా పీడీగా పనిచేసిన శ్రీధర్ ఇటీవల ఆకస్మిక బదిలీపై వెళ్లిపోవడంతో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ ఇన్చార్జి పీడీగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే