దావోస్ పెట్టుబడుల విషయంలో తెలుగుదేశం, ఎల్లోమీడియాలు కలిసికట్టుగా ప్రజలను మోసం చేస్తూ దొరికిపోయారు. దావోస్‌కు వెళ్తే పెట్టుబడులు వస్తాయనేది మిథ్య అని ముఖ్యమంత్రి చంద్రబాబు.. తను చెప్పే మాటలన్నీ మిథ్యేనని తేల్చేశారు. దావోస్ నుంచి పెట్టుబడులు తీసుకు రాలేక పోయినందుకు కారణాలు విశ్లేషించుకుని తప్పులను సరిదిద్దుకోవల్సిన చంద్రబాబు, ఈ ఏడు నెలల్లోనే రాష్ట్రానికి నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని చెప్పి పారిశ్రామికవేత్తలను, ఆశ్చర్యపరిచారు!!. తమకు ఎవరికి కనపడకుండా ఎప్పుడు ఈ పెట్టుబడులు వచ్చి ఉద్యోగాలు వచ్చేశాయో తెలియక జనం విస్తుపోవాల్సి వస్తోంది ఇప్పుడు..
పోనీ.. నాలుగు లక్షల కోట్ల రూపాయల మొత్తానికి కట్టుబడి ఉన్నారా అంటే అలా చేయలేదు. మరుసటి రోజు టీడీపీ జాకీ మీడియా ఆంధ్రజ్యోతిలో ఏడు నెలల కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని ప్రభుత్వం ప్రకటించిందని రాశారు. అంటే ఇది కూడా చంద్రబాబు ప్రకటనగానే చూడాలి!. రెండు రోజుల్లోనే రెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెంచేశారు. అంతేకాదు.. నాలుగు లక్షల ఉద్యోగాలు కూడా వచ్చేశాయని బోగస్ వార్తలు రాసేశారు. దీనిని బట్టే టీడీపీ, ఎల్లో మీడియా ఎంత బాహాటంగా ప్రజలను చీట్ చేస్తోందో అర్దం అవుతోందని పలువురు మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.నిజంగానే ఈ ఏడు నెలల కాలంలో ఆ స్థాయిలో పెట్టుబడులు వచ్చి ఉంటే,ఇంకా కోట్లు ఖర్చు చేసి దావోస్ వెళ్లవలసిన అవసరం ఏమి ఉంటుంది? చంద్రబాబు తన మీడియా సమావేశంలోకాని, గవర్నర్ ప్రసంగంలో కాని మరో మాట చెప్పారు. ఏపీ బ్రాండ్ కు ఊపు వచ్చిందని, దావోస్ లో అది స్పష్టంగా కనిపించిందని తెలిపారు.
ఏపీ బ్రాండ్ ఏమిటి? రెడ్ బుక్ బ్రాండా?లేక చేసిన హామీలు అమలులో వైఫల్యం చెందిన బ్రాండా? దావోస్ కు వెళ్తే పెట్టుబడులు రావని, పెట్టుబడులు వస్తాయని ఎవరైనా అనుకుంటే అది నెగిటివ్ ఆలోచన అట.మీడియా ఆ భావన నుంచి బయటకు రావాలని కూడా ఆయన హితబోద చెబుతున్నారు. దావోస్ లో నెట్ వర్క్ కోసం వెళ్లారట. దావోస్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రాకపోయినా, ఆ కంపెనీల సీఈవోలు ఏపీకి భవిష్యత్తులో వస్తారట. అంటే చంద్రబాబు ,మంత్రి లోకేష్ లు దావోస్ లో చేసిన ప్రకటనలను పారిశ్రామికవేత్లలు నమ్మలేదని ఒప్పుకున్నట్లే కదా!. ఇంతకుముందు పలుమార్లు దావోస్ వెళ్లారు కదా!ఆ రోజుల్లో ఏమని ప్రచారం చేశారు.తాను కాబట్టి దావోస్ వెళ్లి పెట్టుబడులు సాధించుకుని వస్తున్నానని చెప్పేవారా? కాదా?వాటిలో ఎన్ని వచ్చాయి?ఎన్ని రాలేదు?అన్నది వేరే సంగతి. కనీసం ఇన్వెస్టర్లకు కొంతైన నమ్మకం కుదిరితేనే కదా వారు MoUలు చేసుకోవడానికి ముందుకు వచ్చేది. అది కూడా లేకపోబట్టే కదా ఈసారి పెట్టుబడులు తేలేకపోయారు.
మహారాష్ట్రకు 15 లక్షల కోట్ల మేర, తెలంగాణకు 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.వాటిని మాత్రం చంద్రబాబు స్వాగతిస్తున్నారట.ఆ ఎంవోయూలే మిథ్య అయితే ఆ రాష్ట్రాలకు కూడా అదే వర్తించాలి కదా!. పైగా ఇప్పుడు దావోస్ భేటీకి ముందే పెట్టుబడులు వచ్చాయని జాకీ మీడియాతో వార్తలు రాయించడం ఆత్మ వంచన కాదా!పైగా చంద్రబాబు ఎదురుదాడి చేశారు. సింగపూర్ ప్రభుత్వంపై కేసులుపెట్టి వేధించారని ఆయన తప్పుడు ఆరోపణ చేశారు. ఎక్కడ ఎవరిపై కేసు పెట్టారో చెప్పాలి కదా!ఆయన మిత్రుడు సింగపూర్ లో మంత్రిగా ఉన్న ఈశ్వరన్ ను ఆ దేశ ప్రభుత్వం పదవినుంచి తొలగించడమే కాదు.. ఏకంగా జైలులో పెట్టింది.దానికి వైసిపి కారణమా?లేక ఆయన అవినీతి కారణమా?. అమరావతిలో కూడా సింగపూర్ ప్రభుత్వం పెట్టుబడులు పెడుతోందటూ అబద్దపు ప్రచారం చేసి ,అక్కడి ప్రైవేటు కంపెనీలు కొన్నిటికి వందల ఎకరాల భూములు కట్టబెట్టింది అవాస్తవమా?. కాని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్దగా లేదని భావించిన సింగపూర్ కంపెనీలు జారుకున్నాయి. మళ్లీ ఇప్పుడు అధికారంలోకి వచ్చారు కదా!. మళ్లీ పిలిచి వారికి భూములు ఇస్తామని ఎందుకు చెప్పడం లేదు?వారు పెట్టిన దారుణమైన షరతులకు అంగీకరిస్తామని కూడా చంద్రబాబు ధైర్యంగా చెప్పగలరా?.
జగన్ టైంలో రాష్ట్ర ఇమేజీ కోల్పోయిందట. ఇప్పుడు పునరుద్దరిస్తున్నారట. జగన్ పోర్టులు కట్టి, మెడికల్ కాలేజీలు కట్టి, ఊరూరా సచివాలయ, ఆస్పత్రుల ,రైతు భరోసా కేంద్రాల భవనాలు నిర్మిస్తే ఏపీ ఇమేజీ దెబ్బతిందా?లేక ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడమే కాక,కొత్తగా జగన్ టైమ్ లో వచ్చిన మెడికల్ కాలేజీలు,సీట్లు తమకుఅక్కర్లేదని కేంద్రానికి లేఖ రాయడం వల్ల ఇమేజీ పోయిందా?జగన్ ప్రభుత్వపరంగా నిర్మించిన పోర్టులను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు సన్నద్దం అవడం వల్ల రాష్ట్రానికి నష్టం రావడం లేదా?. ఏపీ బ్రాండ్ సత్తా అంటూ కొన్ని పెట్టుబడులను ఎల్లో మీడియా ఉదహరించింది. గ్రీన్ హైడ్రోజన్ హబ్ కోసం 1.85 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేశాయట.వీటిలో మెజార్టీ పెట్టుబడులు జగన్ టైమ్ లో వచ్చినవి కాదా?. అయినా నిస్సిగ్గుగా కూటమి అధికారంలోకి వచ్చాక పెట్టుబడి వచ్చిందని ప్రచారం చేసుకుంటున్నారు.
NTPC సంస్థ జగన్ టైమ్ లోనే రెన్యుబుల్ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడికి ఒప్పందం చేసుకున్నది నిజం కాదా? ఇక ఆర్సెనర్ మిట్టలో స్టీల్ ప్లాంట్ ద్వారా 1.35 లక్షల కోట్లు వచ్చేసినట్లు చెబుతున్నారు.ఇంతకన్నా పచ్చి అబద్దం ఉందా?అసలు ఇంతవరకు ఎమ్.ఓ.యు అయినా కుదిరిందా?చంద్రబాబు కోరినట్లు ఆ కంపెనీకి ఇనుప ఖనిజం రవాణాకు సంబంధించిన ఆదేశాలను కేంద్రం ఇచ్చిందా?బిపిసిఎల్ కంపెనీ ప్రతిపాదన కూడా వైఎస్సార్సీపీ హయాంలోనే వచ్చింది. అయినా ఇప్పుడు కూడా రావడం మంచిదే.కాని అసలు మొదలే కాకముందే 95 వేల కోట్లు వచ్చేసినట్లు కలరింగ్ ఇవ్వడం ఏమిటి?.
ఒకవైపు ప్రభుత్వపరంగా ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ, మరోవైపు ప్రైవేటు రంగంలో రాని ఉద్యోగాలు వచ్చేసినట్లు ప్రచారం చేస్తే ఏపీ ప్రజలకు ఏమి లాభం జరుగుతుంంది. ఇప్పటికే సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేమని చేతులెత్తేసిన చంద్రబాబు ప్రభుత్వం, పెట్టుబడుల విషయంలోను తమ వైఫల్యాలను జగన్ ప్రభుత్వంపై నెట్టేసి కాలక్షేపం చేస్తోంది. మైక్రోసాప్ట్ భాగస్వామి బిల్ గేట్స్ తో సమావేశం గురించి ఒక ఆసక్తికరమైన విశ్లేషణ వచ్చింది. పదేళ్ల క్రితం కూడా బిల్ గేట్స్ తో భేటీ అయినప్పుడు ఏ అంశాలు మాట్లాడారో,దాదాపు అలాంటి వాటినే ఇప్పుడు కూడా మాట్లాడుకున్నారట. మైక్రోసాప్ట్ డేటా సెంటర్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని అప్పుడు కోరారు. ఇప్పుడు మళ్లీ కోరారు.అంటే చంద్రబాబు ఎప్పుడో కోరినా మైక్రోసాఫ్ట్ ఎందుకు ఏపీకి రాలేదు?. హైదరాబాద్ లో తనను చూసే వచ్చిందని చెప్పారు కదా?ఇప్పుడు ఎందుకు తేలేకపోయారు?.
బిల్ గేట్స్‌ను ఏపీలో ఐటీ సలహామండలికి నాయకత్వం వహించాలని, లేదా సభ్యుడిగా ఉండాలని కోరారట. దానికి గేట్స్ స్పందించలేదట!. అయినా ఏపీ గురించే వారిద్దరూ మాట్లాడుకున్నట్లు, అంతర్జాతీయ స్థాయిలో ఏదో చేద్దామని అనుకున్నట్లు కబుర్లు చెప్పుకున్నారట. డ్రోన్ ల ద్వారా వ్యవసాయం ఇప్పటికే జరుగుతుంటే దాని గురించి చర్చించుకున్నారట.ఆరోగ్య రంగంలో ఏదో చేస్తారట. అసలు ఏమి చేస్తారో చెప్పకుండా ఏదేదో మాట్లాడుకుంటే ఎవరైనా నమ్ముతారా?. చివరికి జగన్ టైమ్ లో నిర్మించిన విశాఖ ఐటీ ఐకానిక్ భవనాన్ని, జగన్ ప్రభుత్వం చేపట్టిన పోర్టులను చూపించి అదేదో తమ ఘనతగా చెప్పుకోవడం మినహా తాము సాధించింది ఏమిటన్నది మాత్రం చంద్రబాబు,లోకేష్ లు చెప్పుకోలేకపోయారు. కాకపోతే రెండు రోజులలోనే నాలుగు లక్షల కోట్ల నుంచి ఆరు లక్షల కోట్లకు పెట్టుబడులను పెంచేసి కాగితాలపై రాసేసుకున్న ఘనత మాత్రం కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.
Comments
Please login to add a commentAdd a comment